మరో మారు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మరో మారు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, నవంబర్ 2015, సోమవారం

పూల బాసలు !


తెల తెలవారుతూ ఉంటే, నిద్ర లేచి, కళ్ళు నులుముకుంటూ, బద్ధకంగా బాల్కనీ లోకో, పెరట్లోకో వెళ్ళి చూస్తే .... నిన్న మొగ్గ తొడిగిన కొమ్మకి అందమైన పువ్వొకటి కనిపించిందనుకోండి ! ఓహ్! ఆ ఆనందం అంతా ఇంతా కాదు. నవ జాత శిశువుని చూసి, పరవశించి పోయే తల్లి మనసు ఎలా ప్రఫుల్లమవుతుందో, అలా , పరవశించి పోతాం కదూ? ... ఆ పూల చెట్టు మీ చేత్తో నాటి, దోహదం చేసినదయితే, ఆ ఆనందం ద్విగుణీకృతం అవుతుంది.
ఆ వికసిత పుష్పానికి అన్ని రంగులు అద్ది, అన్ని సొగసులు దిద్ది, అన్ని నయగారాలు కూర్చి, అంత సౌకుమార్యాన్ని చేర్చి, అందాలు పేర్చి అందించిన ఆ అదృశ్య హస్తం ఎవ్వరిదా అని విస్తు పోతాం!
పూలు పలకరిస్తాయి. పూలు ఊసులు చెబుతాయి. కొన గోటితో త్రుంచ బోతే విలపిస్తాయి. తల్లి కొమ్మనుండి, తండ్రి రెమ్మ నుండి , నిర్దయగా వేరు చేయ బోతే, వద్దని వేడుకుంటాయి. దీనంగా అర్ధిస్తాయి.

అలాంటి పువ్వులను గురించి కొన్ని కబుర్లు ఇవాళ చెప్పుకుందామా?

అలరు, కుసుమము, నన, విరి, పుష్పము, పూవు, ప్రసవము, ప్రసూనము, ఫల్యము, లతాంతము, సుమము, సూనము, సౌమనస్యము ...వీటన్నింటికీ పువ్వు అనే అర్ధం

( ఇంకా ఉన్నాయి లెండి !)

పూలలో ఉండే మకరందాన్ని తుమ్మెదలు స్వీకరిస్తాయి. అందుకే కవి ‘ పూల కంచాలలో రోలంబులకు, రేపటి భోజనము సిద్ధ పరచి పరచి ... ’ ఆ దేవ దేవుడు ఎంత అలసి పోయాడో అని బెంగ పడతాడు.

విరహతాపాన్ని పెంచి, స్త్రీపురుషులను ఏకశయ్యానువర్తులుగా చేసే మన్మథుడికి కుసుమాయుధుడు, పుష్పబాణుడు, అలరు విల్తుడు ... ఇలాంటి పేర్లు ఉన్నాయి. పూల బాణాలు ధరించిన వాడు అని వాటి అర్ధం,

మదనుడు పంచ బాణుడు. ఐదు రకాల పూలను బాణాలుగా ఉపయోగించే వాడు. ఆ అయిదు రకాలూ ఏమిటో తెలుసా?

అరవిందము, అశోకము , చూతము , నవ మల్లిక, నీలోత్పలం.
సరే, పూలు పలకరిస్తాయి అనుకున్నాం కదూ? ... చూడండి :

పూల బాసలు తెలుసు యెంకికీ, తోట
పూల మనసు తెలుసు యెంకికీ!
పూల మొక్కల నీటి జాలుగని నిలుసు
పూలన్ని నీ పాటె
ఆలించె నంటాది !

పూల బాసలు తెలుసు యెంకికీ ...అని, నండూరి వెంకట సుబ్బారావు గారు ఎంకి పాటల (కొత్త పాటల) లో పూల బాసల గురించి చెప్పారు.

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపంలో తనని త్రుంచబోయిన వాని గుండె కరిగి పోయేలా విలపిస్తూ తన గోడు చెప్పుకున్నది. మా ప్రాణము తీతువా ! అని బావురుమన్నాయి. తల్లి ఒడిలో చిగురుటాకుల శయ్య మీద హాయిగా నిదురించే మమ్ము చిదిమి, అమ్ముకుంటావా? మనసు లేని నీ పూజ లెందుకోయి ? అని అడిగాయిట, పూలు...
మా ఆయువు నాలుగు గడియలే కదా, ఆయువు కలిగినంత దాక మా తీవ తల్లి చేతులలో హాయిగా ఊయలలూగుతూ మురిసి పోతూ ఉంటాము. ఆయువు తీరాక ఆ తల్లి పాదాల చెంతనే రాలి పోతాము

మా పూల సువాసనలతో గాలి పరిమళిస్తుంది. తుమ్మెదలకు తేనెల విందు చేస్తాము. మీ వంటి వారి కన్నులకు కనువిందు చేసి హాయిని కలిగిస్తాము. అలాంటి మమ్మలని చిదిమి వేయడం తగునా ? తల్లీ బిడ్డలని వేరు చేస్తావా ?

మమ్ములను త్రుంచడం వల్ల నీ చేతులు మా రక్తధారలతో తడిసి పోతాయి. అలాంటి నెత్తురు పూజని పరమేశ్వరుడు స్వీకరించడు సుమా!

నువ్వే కాదయ్యా, మీ ఆడువారూ మాకు హాని చేయడంలో ఏమీ తక్కువ తిన లేదు ...

ఊలు దారాలతో గొంతుకురిబిగించి,
గుండె లోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి,
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట ! దయ లేని వారు మీ ఆడువారు !

మా నెత్తురులతో చేసిన అత్తరులను మీ కంపు గొట్టు దేహాల మీద అలము కుని శయ్యల మీద వెద జల్లు కుని రాత్రంతా దొర్లుతారు. సిగ్గు లేదూ?

మా వెల లేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి, నశించి పోయె , మా
యౌవన మెల్ల కొల్ల గొని ఆ పయి చీపురు తోడ చిమ్మి, మ
మ్మావల పార బోతురు గదా ! నరజాతికి నీతి యున్నదా?

అని పూలు చీవాట్లు పెట్టాయి ....

గౌతమీ కోకిల బిరుదాంకితులు వేదుల సత్య నారాయణ శాస్త్రి గారి కాంక్ష కవితా ఖండికలో పూల మనోభావాలు ఎలా ప్రతి ఫలించాయో, చూడండి ... మచ్చుకి ఒకటి రెండు పద్యాలు ...

పేదల రక్త మాంసములఁబెంపు వహించి, దయా సుధా రసా
స్వాద దరిద్రు లైన ధనవంతుల పెద్దరికమ్ముకై మతో
న్మాదము పెంచు దేవునికి మారుగ నిల్చిన రాతి బొమ్మలం
దూదర వోవు పాడు బ్రతుకొక్క నిమేషము సైప నాయెదన్

పేదల రక్తమాంసాలతో బలిసి, దయ ఒక్కింత కూడ లేకుండా, మతోన్మాదాన్ని ఎక్కువ చేస్తూ, దేవుడి పేరుతో నిలబెట్టిన రాతి బొమ్మల మెడలలో పూజకై నిలిచి, వాడి పోయే ఆ పాడు బ్రతుకు నాకు వద్దు.

కానుకనై ధరాధిపుల కాళ్ళ కడం బొరలాడి వాడి పో
లేను, ధరా పరాగపటలీ మలినమ్మగు ద్వార తోరణా
స్థానము నందురింబడఁగ జాలను, దోసిట పేరి ఘోర కా
రా నరకమ్ము నందుసురు రాల్పగ లేను నిమేష రక్తికై

మీ క్షణికానందం కోసం - రాజుల కాళ్ళ దగ్గర కానకనై పొర్లి వాడి పోవడం నాకు సమ్మతం కాదు.
ధూళి ధూసరితమైన ద్వారాలకు తోరణాన్నయి ఉరి వేసు కోవడం నాకు నచ్చదు.
మీ చేతుల కారాగారంలో మ్రగ్గి పోలేను.

మరి పువ్వు ఏమి కోరుకుంటున్నది? ... చూడండి ...

నీచపు దాస్య వృత్తి మన నేరని శూరత మాతృ దేశ సే
వా చరణమ్ము నందసువు లర్పణఁజేసిన పార్ధివ
శ్రీ చెలువారు చోటఁ దదసృగృచులన్ వికసించి, వాసనల్
వీచుచు, రాలి పోవగ వలెం దదుదాత్త సమాధి మృత్తికన్

దేశం దాస్యంలో మ్రగ్గి పోవడం సహించ లేక, ధేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వారి పార్ధివ శరీరాలు ఉండే సమాధుల మీద వాసనలు వెదజల్లుతూ వికసించి, అక్కడే, ఆ పవిత్రమైన మట్టి లోనే వాడి వత్తలై పోవడం నాకు చాలా ఇష్టం ...

ఎంత గొప్ప భావనో కదూ , యిది?

మరి కొన్ని పూల ముచ్చట్లు చూడండి ...

పూల కయ్యాలు:

అరణపు కవి నంది తిమ్మన గారి పారిజాతాపహరణం లో పారిజాతపుష్పం కోసం ఎంత రచ్చ అయి పోయిందో మీకు తెలిసినదే కదా!

తగవుల మారి నారదుడు ఒకే ఒక్క పారిజాతం తెచ్చి ,శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. దానినతడు దేవేరి రుక్మిణికి ఇచ్చాడు. ఆ సంగతి సత్యభామకి తెలిసి పోయింది. ఇంకేముంది ! ఆవిడ అలగడం, పతి నుదుటున తన్నడం, అతడామెను బుజ్జగించి, దేవేంద్రుని ఎదిరించి మొత్తం పారిజాతవృక్షాన్నే దేవ లోకం నుండి పెకలించుకుని వచ్చి సత్య ఇంటిలో పెరటి చెట్టుగా నాటడం ... చక చకా జరిగి పోయాయ్ ...

ఆ పారిజాతం మహిమ ( నారదుని మాటల్లోనే ) ఎలాంటిదంటే,

పరిమళము సెడదు, వాడదు
పరువము దప్పదు పరాగభర భరితంబై
నిరతము జగదేక మనో
హరమగు నీకుసుమ రాజమంబుజ వదనా.

ఆ పువ్వుని తనకివ్వక తన సవతి రుక్మిణికి యిచ్చినందుకు కోపించి, ఒళ్ళూ మీదా కానక అలక పానుపు మీద పరుండి, అనునయించ బోయిన మగని కాలితో తన్నిందిట సత్య.

జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునం
దొలగంద్రోచె లతాంగి; యట్లయగు ; నాధల్నేరముల్సేయఁబే
రలుకం జెందిన  కాంత లుచిత వ్యాపారమల్నేర్తురే ?

తన తప్పు సైరింపుమని ఆమె పాదాల కడ తల పెట్టిన నాధుని తలని సత్య ఎడమ పాదంతో తన్నిందిట ! ప్రియ నాధులు తప్పులు చేస్తే, అలక చెందిన ఆడువారు ఉచితానుచితాలు చూడరు కదా ? ... అని, కవి సమర్ధన.

ఈ పద్యం చూడండి:

నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబుఁదెచ్చె, నో
మల్లియ లార ! మీ పొదల మాటున లేడు గదమ్మ తెల్పరే ?

భాగవతంలో పోతన గారి పద్యం ఎంత మనోహరమైనదో చూడండి.

నల్లని వాడు. పద్మాల వంటి కళ్ళు కల వాడు. దయా పూరితములైన చూపుల వాడు, తల మీద నెమలి పింఛం ధరించిన వాడు, నవ్వులు చిందించే ముఖంకలిగిన వాడు, చెలుల మాన ధనాన్ని దోచుకుని పోయాడు. ఓ మల్లియలారా ! ఆ తుంటరి మీ పొదల మాటున కాని ఉన్నాడా, చెప్పరూ ? ... ... అని గోపికలు పూలతో చేసే సంభాషణ ప్రసిద్ధమే కదా.

పూలు కూడా ఊసులాడుతాయని దీని వలన తెలుస్తోంది కదూ?

మహా భారతంలో మరో పూల కయ్యం మీకు తెలిసినదే కదా?

ద్రౌపది ముచ్చట పడిందని, భీముడు సౌగంధికాపహరణం చేయడం, ఆ క్రమంలో హనుమతో చిన్న పాటి కయ్యం, తర్వాత ఆ పువ్వుల కోసం కాపలాదారులతో చేసిన యుద్ధం ... అదో పెద్ద కథ. పూల కధ.

మరొకటి రెండు పూల ముచ్చట్లు .....

పూల చెండుతో ఫ్రియుడొకటంటే, పేము కర్రతో తా రెండనే గడుగ్గాయలూ ...

రాచరికపు రోజులలో గడసరి విటులతో పుష్ప లావికల సరసోక్తులూ ...

చెప్పాలంటే చాలా ఉన్నాయి ....

చెవిలో పువ్వు పెట్టడం ... వంటి నానుడులూ ...

పువ్వులమ్మిన చోటనే కట్టెలమ్మడం వంటి సామెతలూ ...

ఇలా చెప్పుకుంటే పూల బాసలు అనంతం కదూ!

పువ్వులనీ, పసి బిడ్డల బోసి నవ్వులనీ, ఇంద్రధనుస్సులనీ, పురి విప్పిన నెమలి పింఛాలనీ,
చిగురించిన కొమ్మలనీ, రెమ్మలనీ, తలిరాకు తల్పాన మెరిసి పోయే తుహినకణాలనీ, చంద్ర కిరణాలనీ , కోకిలల గొంతులనీ, పిట్టల కువకువలనీ, అందమైన వేకువలనీ, చల్లని సాయంత్రాలనీ, జలపాతాలనీ, ... ఇలా ఎన్నో అందాలని ప్రసాదించిన ఆ దయామయుడికి నమోవాకములతో ..

ఇప్పటికి స్వస్తి.

`

9, ఏప్రిల్ 2015, గురువారం

అన్న దాతా, సుఖీ భవ అనబడు తిండి గోల


వస్తూనే అన్నాడు కోనేటి రావు: ‘‘ హబ్బ! ఘుమఘుమలాడి పోతోంది, అక్కయ్య గారు పకోడీలు వేయిస్తున్నట్టున్నారు ..’’ అని. సరిగ్గా సమయానికే వస్తాడు కోనేటి రావు.
‘‘ పకోడీలు కావయ్యా, బజ్జీలు ...’’ అన్నాను.
‘‘ ఏవో ఒకటి, అక్కయ్య గారూ, వేగిరం తెండి , నోరూరి పోతోంది’’ వంట గది లోకి చూస్తూ కేకేసాడు.
అతను మా యింట్లో ఉన్నప్పుడు నేను వేరే ఎవరి యింట్లోనో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు.
ఆహార ప్రియుల తీరు ఇలాగే ఉంటుంది. ఇవాళ మన కథామంజరిలో అంతా తిండి గోలే. ఇక చదవండి:
పంక్తిభేదే పృథక్పాకే, పాకభేదే తథా2కృతే,
నిత్యం చ గేహకలహే, భవితా వసతి స్తవ.
ఒకే పంక్తిలో కూర్చున్న వారికి భేదంగా వడ్డించే చోట లక్ష్మీ దేవి నిలువదట ! అంటే, అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి కంచాల్లోనూ అనే సామెత ఉంది చూసారూ ? అలాగన్న మాట.
వడ్డించే వాడు మన వాడయితే, కడ పంక్తిని కూర్చున్నా ఫరవా లేదంటారు. అయితే, ఒకే వరసలో కూర్చున్న వారికి వడ్డన విషయంలో భేదం చూప కూడదు. అందరకీ ఒకేలా వడ్డించాలి. ఒకరికి కొంచెం ఎక్కువా, కొందరకి కొంచెం తక్కువా, కొందరకి కొసరి కొసరి, కొందరకి విదిలించి నట్టుగానూ వడ్డించ కూడదన్న మాట. అలా చేస్తే ఇంట లక్ష్మి ఉండదంటున్నాడు శ్లోక కర్త.
అలాగే, వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కునే చోట కూడా ధనం ఉండదు. ఉమ్మడి కుటుంబంగా అంతా కలిసి ఒకే పొయ్యి మీద వండుకుని తినాలి. వేరు పడి పోయి, ఒకే ఇంట వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కోవడం మొదలెడితే ఆ యింట లచ్చి తల్లి ఉండదు.
అసలే వండు కోని ఇంట కూడా ఆ తల్లి ఉండదుట.
అలాగే, నిత్యం కలహాలతో నిండి ఉండే ఇంట కూడా లక్ష్మీ దేవి ఉండదు.
అంటే, పంక్తి వడ్డనలో భేదం పాటించే వారింట, వేరు వేరు పొయ్యలు పెట్టుకుని ఒకే ఇంట వండుకునే వారింట, అసలే వండు కోని వారింట, నిత్యం కలహాలతో కాపురం చేసే వారింట పెద్దమ్మ (దరిద్ర దేవత) తిష్ఠ వేస్తుంది. చిన్నమ్మ లక్ష్మి అక్కడి నుండి తొలగి పోతుంది అని దీని భావం.
లక్షాధికారైన లవణమన్నమె కాని, మెఱుగు బంగారమ్ము మ్రింగ బోడు.
అయితే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.
ఆదరాబాదరాగా తిన కూడదు. నోట్లో కుక్కుకుంటూ ఏదో ఇవేళ్టికి భోజనం అయిందనిపించ కూడదు.
నింపాదిగా, శ్రద్ధగా భోజనం చేయాలి.
భుంజానో న బహు భ్రూయాత్, న నిందేదపి కంచన
జుగుప్పసితకథాం నైవ, శ్రుణుయాదపి వా వదేత్.
భోజనం చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడ కూడదు. ఇతరులను తిడుతూ నిందా ప్రసంగాలు చేయ కూడదు. అసహ్య కరమయిన కథనాలు చేయ కూడదు. విననూ కూడదు.
చరక సంహిత ఏమి చెబుతున్నదో చూడండి:
ఉష్ణ మశ్నీయాత్, స్నిగ్ధ మశ్నీయాత్, మాత్రావ
దశ్నీయాత్, జీర్ణే2శ్నీయాత్, వీర్యా2విరుద్ధ మశ్నీయాత్
ఇష్టే దేశే2శ్నీయాత్, నాతిద్రుత మశ్నీయాత్, నా2తి
విలంబిత మశ్నీయాత్, అజల్పన్నహసన్ తన్మనా భుంజీత,
ఆత్మానమభిసమీక్ష్య భుంజీత.
వేడి పదార్ధాలనే తినాలి.
చమురు గల ఆహారాన్ని తినాలి. ( అలాగని ఎక్కువ నూనె పదార్ధాలూ పనికి రావు సుమా )
మితంగా భుజించాలి.
ముందు తిన్నది జీర్ణమయిన తరువాతనే తిరిగి ఆహారం తీసు కోవాలి.
ఒకదానికొకటి పొసగని పదార్ధాలు ఏక కాలంతో తినరాదు.
మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించే చోట, శుచిగా ఉండే చోట తినాలి. తినే చోట గలీజుగా ఉండ కూడదు.
త్వర త్వరగా మ్రింగ కూడదు. మెక్కడం చేయ కూడదు.
అలాగని అతి నెమ్మదిగా కూడా తిన వద్దు.
అతిగా మాటలాడుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ భోజనం చేయ కూడదు.
ఏకాగ్ర చిత్తంతో తినాలి.
ఏ పదార్ధం ఎంత అవసరమో, హితమో తెలుసుకుని అంతే తినాలి.
ఇలా తింటే నూరేళ్ళు బ్రతకొచ్చని శ్లోకంలో కవి భరోసా ఇస్తున్నాడు.
అలాగే ఒంటిపిల్లి రాకాసిలా ఒక్కరే కూచుని తినడం మంచిది కాదు.
ఏకఏవ నభుంజీత, యదిచ్ఛేత్సిద్ధి మాత్మన:
ద్విత్రిభి ర్బహుభి స్సార్ధం, భోజనం తు దివానిశమ్,
పగలు కానీ రాత్రి కానీ, ఒంటరిగా తిన కూడదు. ఇద్దరో, ముగ్గురో సహ పంక్తిని కూర్చుని భుజిస్తూ ఉండగా తినాలి. అలా చేస్తే ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి.
ఇప్పుడంటే గేదె బోయినాలు ( బఫేలు) వచ్చేయి కానీ వెనుకటి రోజులలో నేల మీద అరిటాకులో, విస్తళ్ళో వేసి వడ్డంచే వారు. వడ్డిస్తున్నాం, కాళ్ళు కడుక్కుని రండి. అనడం అలవాటు.
విందు భోజనాలకు పిలుస్తూ దేవతార్చనకు మా యింటికి దయ చేయండి అనే వారు. మా ఊళ్ళో అయితే, శుభాశుభ కార్యాలకు భోజనాలకి వెళ్తూ , శుభ కార్యాలకయితే పట్టు పంచెలు, దినకర్మలలాంటి వాటికయితే నూలు పంచెలు కట్టుకుని, చెంబులతో నీళ్ళు పట్టుకుని బయలు దేరే వారు.
ఇక, పెళ్ళిళ్ళలో భోజనాల తంతు సంగతి చెప్పే పని లేదు. మడి కట్టు కోండి అని ఊళ్ళో అతిథులందరకీ మరో మారు గుర్తు చేయాలి. ( ఊళ్ళో సగోత్రీతకులనే భోజనాలకు పిలిచే వారు మరి) ఇదిగో వస్తున్నాం అంటూ ఎంతకీ వచ్చే వారు కారు. వాళ్ళ కోసం విస్తళ్ళ ముందు మిగతా బంధువులు పడిగాపులు పడే వారు. అంతా వచ్చేరనుకుంటే ఒక పెద్దమనిషి నదికో, ఏటికో స్నానానికని వెళ్ళి, ఎంతకీ వచ్చే వాడు కాడు. ఏం అనడానికి లేదు. మగ పెళ్ళి వారంతా భోజనాలు ముగిప్తే కానీ, ఆడ పెళ్ళి వారు బోయినాలకు కూచోడానికి లేదు. అలకలూ, దెప్పి పొడవడాలూ కూడా ఒక్కోసారి విందు భోజనాలలో చోటు చేసుకునేవి.
కాళ్ళకూరి నారాయణ రావు గారి వర విక్రయం నాటకంలో విందు భోజనాలకు పిలిస్తే బెట్టు చేసి బాధించే వారి గురించి ఒక చక్కని పద్యం ఉంది. చూడండి:

పిలిచిన పలుకక బిగదన్ను కొని లోన
ముసుఁగు పెట్టెడు శుద్ధ మూర్ఖుఁడొకడు
ఇదె వత్తు మీ వెన్కనే మీరు పొండని
చుట్ట ముట్టించెడు శుంఠ యొకడు
ఒగిఁదనకై వేచి యుంద్రో లేదో చూత
మని జాగు సల్పెడి యల్పుఁడొకడు
ముందు వచ్చినఁబర్వు ముక్కలౌననుకొని
కడను రాఁజూచు ముష్కరుఁడొకండు
కుడి యింటను హాయిగా కూరుచుండి
వత్తు, రానని చెప్పని వాచి యొకఁడు
వచ్చి, కోపించి పోవు నిర్భాగ్యుఁడొకడు
ఆరు వేల్వారి విందుల తీరు లివ్వి.
పిలిస్తే పలుకడు. బిగదన్నుకొని ముసుగు పెట్టుకుని పడుకునే మూర్ఖుడు ఒకడు.
ఇదిగిదిగో, వచ్చేస్తున్నా, మీ వెనకే వస్తున్నా, మీరు వెళ్ళండి అని చెప్పి అప్పుడు తీరిగ్గా చుట్ట ముట్టించే శుంఠ మరొకడు.
తన రాక కోసం విందుకు పిలిచిన వారు వేచి చూస్తారో, చూడరో చూద్దాం అని కావాలని ఆలస్యం చేసే అల్పుడు ఒకడు.
ముందుగా వచ్చేస్తే ఎక్కడ తమ పరవు ముక్కలై పోతుందో అని అందరి కంటె చివరగా రావాలని అనుకునే దుష్టుడొకడు.
హాయిగా నట్టింట కూర్చుని, వస్తాననీ, రాననీ కూడా చెప్ప కుండా తాత్సారం చేసే వాడొకడు.

ఒహ వేళ వచ్చినా, ఏదో విషయంలో అలక వహించి, కోపం తెచ్చుకుని అగ్గిరాముడై పోయి చిందులు తొక్కుతూ తిరిగి వెళ్ళి పోయే నిర్భాగ్యుడు మరొకడు.
ఆరు వేల నియ్యోగుల యింట విందు భోజనాల తంతు ఇలా ఏడుస్తుంది.
( వర విక్రయం - కాళ్ళ కూరి నారాయణ రావు)
పెళ్ళిళ్ళలో ఈ బ్యాచ్ ఉంది చూసారూ, వీళ్ళు కూడా ఎంతకీ భోజనాలకి లేవరు.
వడ్డన కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఆకులో ఎక్కడ కూరలు వడ్డించాలి, ఎక్కడ పచ్చళ్ళు వెయ్యాలి, అన్నది తెలిసిన వారే వడ్డనకు పూను కోవాలి. ఆ రోజు వండిన వాటి నన్నింటినీ కొంచెం కొంచెంగానయినా విస్తట్లో ముందుగా వడ్డించాలి. పులుసు, నెయ్యి, పెరుగు కూడా అభిగారం చెయ్యాలి. ( ఇవి ఉన్నాయి సుమండీ అని తెలియ జెప్పే లాగున కొంచెం కొంచెం వడ్డించాలి.) ఓ మూల ఉప్పుతో సహా అన్నీ విస్తట్లో పడ్డాయని ధృవీకరించుకున్నాక, గృహ యజమాని ఇహ ఔపోసన పట్టండి అంటూ వేడుకునే వాడు. భోజనాలు పూర్తయాక, అన్న దాతా సుఖీ భవ అని దీవిస్తూ కొందరు గొంతెత్తి చక్కని పద్యాలు రాగ యుక్తంగా చదివే వారు. పద్యం చదవడం పూర్తయేక, అంతా ఒక్క సారిగా గోవిందా ! గోవింద! అని , గోవింద నామస్మరణ చేసి, లేచే వారు. అయితే,అందరి భోజనాలు పూర్తయి లేస్తే తప్ప పంక్తి లోనుండి లేవ కూడదు. అది అమర్యాద అలా ఉండేవి వెనుకటి రోజుల్లో పెళ్ళి భోజనాలు.
ఇప్పటి గేదె బోయినాలకి ఆ బాధ లేదు. కానీ, ఒకర్నొకరు రాసుకుంటూ, చేతిలో ప్లేటు పట్టుకుని క్యూలో మన వంతు వచ్చే వరకూ నిరీక్షించడం కొంత ఇబ్బందికరం. ఏదో వడ్డించుకుని తింటున్నామంటే, ఎవడు అజాగ్రత్తగా చేయి తగిలిస్తాడో, బట్టలు ఖరాబవుతాయో అనే టెన్షను లోలోపల పట్టి పీడిస్తూ ఉంటే తినడం మొదలెడతాం. మధ్యలో ఏ పదార్ధమో కావాలంటే, మళ్ళీ ఆ ఎంగిలి ప్లేటుతో క్యూ మధ్య చొరబడ వలసిందే.
ఎవరు తింటున్నారో తెలియదు. ఏం తింటున్నారో తెలియదు. అసలు తింటున్న వాళ్ళంతా బంధువులో కారో కూడా తెలియదు. అంతా దొమ్మీ లాగున తిండి సంత. కాలానుగుణమయిన మార్పులను ఇష్టం ఉన్నా , లేక పోయినా ఆమోదించక తప్పదు.
ఈ సందర్భంగా మందు బాబులకు ఓ శుభ వార్త. ఓ అశుభ వార్త.
కిం తు మద్యం స్వభావేన, యథైవా2న్నం తథా స్మృతమ్
ఆయుక్తియుక్తం రోగాయ, యుక్తాయుక్తం యథామృతమ్
మద్యం కూడా మంచిదే (మరక మంచిదే కదా?)
స్వభావరీత్యా మద్యం దోషభూయిష్ఠం కాదు.
తగినంత మోతాదులో తీసుకుంటే అది అమృతంలా పని చేస్తుంది.
మోతాదు మించితే మాత్రం అదే విషతుల్యమవుతుంది సుమా ! అంటున్నాడు శ్లోక కర్త.
తిండి కలిగితె కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్ !!
అంటాడు గురజాడ.
ఈ తిండి టపాసందర్భంగా బరంపురంలో సహపంక్తి భోజనాల గురించి తలచు కుందాం.
అలాగే, నాయక రాజుల కాలం నాటి తంజావూరు భోజన సత్రం వైభవ ప్రాభవాల గురించి స్మరించు కుందాం.
దేవాలయాల్లో జరిగే ఉచితాన్నదానాల గురించి చెప్పుకుందాం.
మాయా బజార్ సినిమాలో ఘటోత్కచుడి వివాహ భోజనంబు ... గుర్తుకు తెచ్చుకుందాం
ఇక,.
భోజ రాజుని కవిత్వంతో మెప్పించి బహుమానం పొందాలనుకున్న ఒక అల్ప కవి -
భోజనం దేహి రాజేంద్ర ! ఘృత సూప సమన్వితమ్
అని తొలి పాదం రాసేక , ఇహ దానిని ఎలా పూర్తి చేయాలో తెలీక జుట్టు పీక్కుంటూ ఉండగా కాళిదాసు పోనీ పాపం, అని రెండో పాదం ఇలా పూర్తి చేసి ఇచ్చాడుట.
మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం ధధి:
ఓ రాజా, నెయ్యీ, పప్పూ కూడిన భోజనం ఇయ్యవయ్యా అని మొదటి పాదానికి కవితా రసం లేని రసహీనమయిన అర్ధమయితే,
నిండు కవిత్వం తొణికిసలాడే కాళిదాసు పూరణ రెండో పాదం.
నిండు వెన్నెల వంటి తెల్లనయిన గేదె పెరుగుతో అన్నం పెట్టవయ్యా.
వెనుకటి రోజులలో ఓ దొర గారికీ ఓ ఛాందస పండితునికి భలే దోస్తీ ఉండేది.
ఒక సారి, పండితుని ఇంట ఏదో శుభ కార్యానికి దొర గారు ఫుల్ సూటూ, టై, హేటూ, బూటూతో వెళ్ళాడు. పండితుని ఇంట పెట్టిన బూరెల రుచి చూసి వాటిని ఓ పట్టు పట్టాడు. కానీ అతడిని ఓ సందేహం పీడించ సాగింది . ఇక ఊరుకో లేక. పండితుడిని అడిగాడు: ఇవి చాలా రుచిగా ఉన్నాయి సుమా. ఇంతకీ ఈ (పూర్ణం) ముద్ద దీని లో ఎలా పెట్టారో చెప్పండి. అని.
పండితుడు నవ్వి, అది సరే కానీ, ముందు నువ్వీ సూట్ లోరి ఎలా దూరేవో కాస్త చెబుదూ అని అమాయకంగా అడిగేడుట.
ఓ ఆసామీ డాక్టరు దగ్గరకి చ్చేడు.
‘‘ నవ్వింక సిగరెట్లు తాగడం తగ్గించాలోయ్. లేక పోతే ఛస్తావ్ ! పోనీ, భోజనం ముందొకటీ, తర్వాత ఒకటీ చొప్పున లిమిట్ చేసుకో ’’ అని డాక్టరు సలహా ఇచ్చేడు.
కొన్నాళ్ళు పోయేక ఆ ఆసామీ పిప్పళ్ళ బస్తాలా తయారై ఆప సోపాలు పడుతూ డాక్టరు దగ్గరకి మళ్ళీ వచ్చేడు.
‘‘నా సలహా పాటించావా ? ఇప్పుడెలా ఉంది ?’’ అడిగేడు డాక్టరు.
‘‘ ఏం చెప్పమంటారు డాక్టరు గారూ, రోజుకి ఇరవైసార్లు తిండి తిన లేక ఛస్తున్నననుకోండి’’ అన్నాడుట ఆ ఆసామీ.
ఇదిలా ఉంచితే, తిండితో లింక్ ఉన్న మరికొన్నింటిని కూడా చూదాం
తిండికి తిమ్మ రాజు. పనికి పోతరాజు.
తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.
తినగ తినగ వేము తీయనుండు.
అన్నమో రామచంద్రా !
అమ్మ పెట్టా పెట్టదు. అడుక్కుని తినానివ్వదు.
వండుకునే వాడికి ఒకటే కూరయితే అడుక్కునే వాడికి చెప్పలేనన్ని.
ఇక,
తిండి అంటే అన్నం తినడమే కాదు.
లంచాలు తినడం, బుర్ర తినడం, సమయం తినడం, క్రికెట్ లో ఓవర్లు తినడం, దేశాన్ని తినెయ్యడం...కాల్చుకు తినడం, వేధించుకు తినడం, చూపులతో కొరుక్కు తినడం ... ... ఓ, ఇలా చాలా తినడాలు ఉన్నాయి లెండి.
మా ఆవిడ పెట్టిన బజ్జీలు కడుపారా తిని, కాఫీ ఊదుకుంటూ సేవించి, లేచాడు కోనేటి రావు.
‘‘ ఇహ వెళ్తానయ్యా, అక్కయ్యగారివాళ భలే రుచికరమయిన టిఫిను పెట్టారు. అన్నదాతా సుఖీ భవ ! ... కాదు కాదు ... టిఫిన్ దాతా సుఖీ భవ అనాలి కాబోలు ...’’ అంటూ వెళ్ళి పోయాడు.
మళ్ళీ రేపు ఉదయం మా ఆవిడ స్టవ్ వెలిగించిన శబ్దం చెవిని పడి కానీ రాడు.
తిండి గురించి కొంత చెప్పుకున్నాం. ఈ సారి పస్తుల గురించి చెప్పుకుందాం.
స్వస్తి.