సరదాకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సరదాకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, నవంబర్ 2014, శుక్రవారం

లక్ష చీపుళ్ళనోము ...


‘‘ అన్నయ్య గారూ ! మీరు వెంటనే వొక సారి మా ఇంటికి రాగలరా ? !
 ప్లీజ్ ...’’ఉదయాన్నే మా తింగరి బుచ్చి భార్య నుండి ఫోను. వీడు మళ్ళీ ఏం పీకల మీదకి తెచ్చాడో తెలియదు. ఆలస్యం చేయకుండా వెంటనే స్కూటరు తీసుకుని బయలుదేరి వెళ్ళాను.  వీధి గుమ్మం గేటు దగ్గరే నా కోసం నిరీక్షిస్తూ ఆత్రుతగా నిలబడి ఉంది తింగరి బుచ్చి భార్య. స్కూటరు ఆపి, స్టాండు వేసి
‘‘ ఏమయిందమ్మా !’’ డిగేను.
‘‘ అన్నీ చెబుతాను ... ఇదిగో, ఈ వీధరుగు మీదే కూర్చుని మాట్టాడు కుందాం.. ఇక్కడే కుర్చీ వేస్తాను. ఇంట్లో ఎక్కడా అంగుళం ఖాళీ లేదు ...’’ అంటూ నా జవాబు కోసం ఎదురు డకుండా ఇంట్లోకి వెళ్ళి ఓ కుర్చీ తెచ్చి వీధి గుమ్మంలోనే వేసింది.
ఇంట్లో ఖాళీ లేక పోవడమేఁవిటి ! నాకేం అర్ధం కాలేదు. సరే ఎలాగూ ఆవిడే చెబుతుంది కదా అని ఊరుకుని విన సాగాను. ఆవిడ మధ్య మధ్య  పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ గద్గద కంఠంతో చెప్ప సాగింది.
‘‘ ఏం చెప్పమంటా రన్నయ్యా ! ఈయనికి రాను రాను తిక్క ముదిరి పోతోంది. అదేదో లక్ష చీపుళ్ళ నోము చేస్తానంటూ తయారయి పోయేరు !  ...మగాళ్ళకి నోము లేఁవిటండీ ...
 చోద్యం ! అదీ కాక, ఈ చీపుళ్ళ నోమేఁవిటని అడిగితే, ఈ లక్ష చీపుళ్ళ నోముని ఆడవాళ్ళూ మగవాళ్ళూ పిల్లా పెద్దా ముసలీ ముతకా అనే తేడా లేకుండా అందరూ చేయ వచ్చునంటూ ఏదేదో చెబుతున్నారు ’’
    ఆవిడ ఇలా చెబుతూ ఉండగానే మా తింగర బుచ్చి వచ్చేడు. వస్తూనే నన్ను చూసి, ‘‘వచ్చేరా ! అసలు నేనే మిమ్మల్ని కలవాలను కుంటున్నాను ..’’ అంటూ ఇంట్లోకి దారి తీసాడు. నేనూ అతని వెనుకే వెళ్ళాను. ఆవిడ చెప్పింది నిజమే ! ఎక్కడా మసలడానికి జాగా లేదు. ఇల్లంతా చీపుళ్ళ గుట్టలు.
‘‘ ఇవేమిటి! ’’ అడిగేను తెల్ల బోయి.
‘‘ ఏముందండీ ... లక్ష చీపుళ్ళ నోము తల పెట్టాను. వాటి కోసమే ఇవి ! ’’ అన్నాడు గర్వంగా.
తింగరి బుచ్చి భార్య కల్పించుకుని అంది : ‘‘ ఏడిసినట్టుంది. నిన్న ఉదయం మా చిన్నవాడు ‘‘ అమ్మా ! వేగిరం రా ! నాన్న ఏం తెచ్చారో చూడు ’’ అనివీధిలోంచి అరిస్తే, ఎంగిలి కంచాలు కడుగుతున్న దానిని  వాటిని అలానే వదిలేసి చేతులు కడుక్కుని సంతోషంగా బయటి కొచ్చి చూసేను. ఏం తెచ్చారూ ! నా తలకాయ్ ! ఏ నాలుగు బర్నర్ల గ్యాస్ స్టవ్వో, ఎల్.సీ.డీ టీవీయో నా ముచ్చట తీర్చడానికి వేయించు కొచ్చేరు కాబోలని గంపెడాశతో చూస్తే, ఇవిగో ! ఈ చీపుళ్ళ కట్టలు తెచ్చి పడేసారు. వీటిని కొనడానికి, లక్ష చీపుళ్ళ నోము చెయ్యడానికీ ఆఫీసులో లోను కూడా పెట్టారుట ! నా ఖర్మ కాక పోతే ఈయనకీ తింగరి పనులేఁవిటి చెప్పండన్నయ్యా! ’’ అంటూ కళ్ళొత్తుకుంది. భార్య మీద అగ్గి రాముడై పోయేడు తింగరి బుచ్చి. ‘‘ నోర్మయ్ ! పరమ పవిత్ర మయిన చీపుర్లనేమయినా అంటే కళ్ళు పోతాయ్. అసలు చీపురంటే ఏఁవనుకున్నావ్ ? లోకంలో చీపురంత పరమ పవిత్ర మయిన వస్తువు మరొకటి లేదు. ప్రతి కొంప లోనూ ఈశాన్య మూల దేవుడి మందిరం, తలుపు వార చీపురు కట్టా ఉండి తీర వలసిందే. చీపురు, చీపురు కట్ట, చీకిలి,ఘాటము, తిరు కట్టె, సొరక, మార్జని, శతముఖి, శోధని, సమూహని, సమ్మార్జకము, సమ్మార్జని ... ఇన్ని పేర్లున్నాయి చీపురికి. చీపురు పట్టి ఊడ్చే వాడిని ఖలపువు, బహుకరుడు, సమ్మార్జకుడు అంటారు తెలుసా ! చీపురు పట్టి ఊడ్చే చెత్తను అవకరము, చెదారము, తుక్కు, తక్కుడు, పెంట అని కూడా పిలుస్తారు. చీపురుకి చేదోడు వాదోడుగా ఉండే నేస్తం - చేట ! చేటని ప్రస్ఫోటనము, పలిక, మొరము, శూర్పము,సూర్పము అంటారు. అదే చిన్న చేటయితే, మొంటె, మొరిటె అని పిలుస్తారు.ఇప్పుడీ పదాలన్నీ నిఘంటువుల్లో చచ్చి పడున్నాయి కానీ, చీపురు, చేట అనే పదాలు తెలియని వారుండరు. చీపుళ్ళలో చాలా రకాలు ఉన్నాయి. రెల్లు  పుల్లల  చీపురు , కొండ చీపురు, ప్లాస్టిక్ పుల్లల చీపురు లాంటివన్నమాట ...
      ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణ దేవరాయలంతటి వాడు ‘‘గృహ సమ్మార్జనమో ... ’’అనే  పద్యంలో సమ్మార్జని పదం వాడేడే. దేవాలయం ఊడవడం, కడగడం మొదలయిన పనులు భక్తులు చేయాలి.  ఇక, ‘‘ ఊరెయ్యది ? ’’ అనడిగితే
‘‘ చీపురు పలి ..’’ అని చెబుతాడు అడిదం సూర కవి. చూసేవా ! చీపురు అనే పేరుతో  వో పల్లె కూడా ఉత్తరాంధ్రలో ఉందన్నమాట ! అసలు నన్నడిగితే,  ఈ చీపురు పల్లిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఏలిన వారు తక్షణం తీర్చి దిద్దాలని ప్రతిపాదిస్తున్నాను. కన్యా శుల్కంలో గిరీశాన్ని వాయించడానికి పూట కూళ్ళమ్మ మధుర వాణి ఇంట్లోకి  చీపురు కట్ట పట్టుకుని దూకుడుగా రావడం గుర్తు లేదూ ! ఆకతాయీల పని పట్టడానికి ఆడంగులకి చీపురు కట్ట వంటి మహత్తరమయిన ఆయుధంమరొకటి లేదు ...’’
   మా తింగరి బుచ్చి ఇచ్చిన ఉపన్యాసం విన్నాక, నాకు నోట రాలేదు. కాంచెం తేరుకుని, ‘‘ సరే ఈ లక్ష చీపుళ్ళ నోమేఁవిటి !’’ అడిగేను అసహనంగా.
    వాడు చెప్పే లోగానే వాళ్ళావిడ కలగ జేసుకుని అంది : ‘‘ ఈ లక్ష చీపుళ్ళ నోము నోచి, అందరికీ తలో చీపురూ వాయినంగా ఇస్తారుట ! దేశభక్తి చాటుకోడానికి అదో విధానమట. అసలు చీపురు పట్టని చేయంటూ ఉండ కూడదుట !  చీపురు పట్టని చేతులను నరికి పారెయ్యాలంటూ వీరంగం ఎత్తు తున్నారు కూడా. ఈ తిక్క రోజుకో గొడవ తెచ్చి పెడుతోంది. ఉదయాన్నే లక్ష చీపుళ్ళ నోములో తొలి వాయనం కాస్త తీసుకోండని కాలనీలో వో పెద్దాయనకి ఇవ్వ బోతే తీసుకో లేదుట. పైపెచ్చు, ‘‘ నేను చీపురు పార్టీ కాదూ, నాది కాంగ్రెసూ. కాడెద్దుల కాలం నుండి మాది ఆ పార్టీయే .. పొమ్మని కసురు కున్నాట్ట. ఇది ఆ చీపురు కాదయ్యా అని ఎంత చెప్పినా వినిపించుకో లేదుట. దాంతో అతనితో ఈయన నానా గొడవా పడి దెబ్బలాడి వచ్చేరు. అలాగే వో కాలనీ ఆయన నాకు వక్ఖ చీపురయితే చాలదూ, వో ఫది పంపించండి అంటూ కబురెట్టాడు. నిన్నటి నుండీ ఈ చీపుర్ల తగూలే. ఏం చేయాలో తోచక ఛస్తున్నాను అన్నయ్యా !  మరో సంగతి. నిన్నరాత్రి పొద్దోయే వరకూ మేలుకుని ఇంట్లో చిత్తు కాగితాలూ, చెత్తా చెదారం  పోగు చేసి, వీధిలో మాఇంటి ముందే వెదజల్లారు. ‘‘ ఏఁవిటీ ఈ ఓఘాయిత్యం  పనీ ! ’’ అని నేనడగితే ‘‘ రేప్పొద్దున్నే నేను చీపురు పట్టి ఊడవాలంటే ఈ చెత్త ఉండక పోతే ఎలా ? అని నామీద నోరు చేసుకున్నారు. ‘‘ అదేదో తెల్లారికట్టే లేచి అఘోరించండి.  ఇంటి ముందు ఇలా చెత్త ఎవరయినా చూస్తే బాగోదు’’ అని చెప్పాను. ఉదయాన్నే మా పెద్దాడి చేతికి డిజటల్ కెమేరా ఇచ్చి ఫొటోలు తియ్యమని ఆర్డరేసి వీధిలోకి వెళ్ళే సరికి, అప్పటికే ఎవరో దాన్నంతా ఊడ్చి తగలడ్డారుట. దాంతో ‘‘నా చెత్త ఊడవడానికి మీరెవరంటూ చిందులేసి అందరినీ నానా కూతలూ కూస్తూ తిట్టి పోసారు ...నా చెత్త నా ఇంటి ముందు తిరిగి తెచ్చి పోస్తారా ? ఛస్తారా ? !’’ అంటూ ఒకటే చిందు లేసారు.
   ఆవిడ చెప్పినదంతా  వింటూ ఉంటే, నాకు మతి పోతోంది. ఇక లాభం లేదని చెప్పి,
 మా తింగరి బుచ్చికి వో క్లాసు పీకాలని నిశ్చయించుకుని ఇలా అన్నాను :
 ‘‘ బావుందయ్యా ! నీ నోమూ  బాగుంది. నీ ఆశయమూ బాగుంది .. కానీ నా అభిప్రాయం కూడా చెబుతాను విను .. చెత్తా చెదారం ఊడవడానికి పారి శుధ్య పనివారల  ఉద్యోగాలంటూ ఉండి ఏడిశాయి కదా. వాళ్ళు తమ విధులు సక్రమంగా చేస్తున్నారో లేదో పట్టించు కోకుండా   సూటూ బూటూ వేసుకుని, రంగు రంగుల చీరలు కట్టుకుని, వయ్యారాలు వొలకబోస్తూ,నాజూగ్గా చీపుర్లు పట్టుకుని ఫొటోలకు ఫోజులిస్తూ చెత్తను ఊడుస్తున్నట్టు ఫొటోలు దిగడం,  పత్రికల్లో ఫొటోలు చూసి మురియడం ఏం బాగుంది చెప్పు.  పారిశుద్యానికి పెద్ద పీట వేస్తూ, చాలినంత గా పని  వాళ్ళను   నియమించి,  వారికి మంచి వేతనాలూ. పారితోషికాలూ  నాగా లేకుండా ఇస్తూ చక్కని  పర్యవేక్షణతో వారి చేత కొరడా ఝుళిపించి మరీ పని చేయించాలి. మనింటి చెత్తను ఎవరూ చూడకుండా పక్కింటి వేపు పడేసే అల్ప బుద్ధులను అదమాయించాలి. వీలయితే  భారీగా  ఫైన్లు వేసి శిక్షించాలి.  అంతే కాదు చెత్తా చెదారాన్ని రీ సైక్లింగ్ చేసే యంత్రాలను ఎంత డబ్బు ఖర్చయినా వెనుకాడకుండా గ్రామ గ్రామానికీ బడ్జెట్ లోనే నిధులు కేటాయించి, అందించాలి. ఈ పనితో పాటూ రాజకీయ నాయకులనూ, ప్రజలనూ ఉత్తేజ పరచి, సంఘటితం చేసి స్ఫూర్తి దాయక మయిన ప్రబోధాలతో ఈ పనిలో భాస్వాములయ్యే లాగున చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏదో మొక్కుబడిగా వో రోజో, రెండ్రోజులో చేస్తే మనమూ, మన చెత్తా చెదారం అంతా క్షేమం. ... ఉదాత్తమయిన ఆశయాలకి చిత్త శుద్ధీ, ఉన్నతమయిన కార్యాచరణా అవసరం ! ...’’ అన్నాను.
   నా ఉపన్యాసమంతా సరిగా విన్నాడో లేదో తెలియదు.  ‘‘ సరే, నా నోములో తొలి వాయినం చీపురు మీరు పుచ్చు కోవాలి ..’’ అంటూ నా చేతిలో వో చీపురు పెట్టి, నా కాళ్ళకి దండం పెట్టాడు. మరింక  చేసేదేమీ లేక,  చీపురు అందుకున్న చేత్తోనే మా తింగరి బుచ్చిని దీవించి, ఇంటికి బయలు రేరాను ...

తా.క :  సరదాగా అనే లేబిల్ క్రింద ఇదంతా రాసేను కానీ నిజానికి ఇదంతా సరదాగా వ్రాసినది మాత్రం కాదు !


5, అక్టోబర్ 2014, ఆదివారం

ఏ గట్టు మీద చూసినా , ఒట్లే !!


జీవితంలో ఒక్క సారయినా ఒట్టు పెట్టు కోని మనిషంటూ ఉంటాడని అనుకోను. అలాగే, ఒట్టు పెట్టు కున్నంత తేలిగ్గానే ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసే వాళ్ళకీ కొదవు లేదు.
ఒట్టు గురించి చెప్పు కునేటప్పుడు మొదటిగా చెప్పుకో వలసిన దేవుడు కాణిపాక వినాయకుడు .స్వామి సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధుడు కదా ! స్వామి ఎదుట ఆడిన మాట తప్పడానికి ఎవరూ సాహసించరని భక్తుల విశ్వాసం.
ఒట్టు అనే పదానికి నిఘంటువులు కలుగు,ఉంచు,రగుల్చు,కాల్చు,పెట్టు ,త్రాగు అనే అర్ధాలతో పాటు ఆన, శపథము,మొత్తము అనే అర్ధాలను ఇచ్చాయి. ఒట్టు పెట్టడమంటే శపించడం అనే అర్ధంతో పాటు నిషేధించడం అనే అర్ధం కూడా ఉంది.
ఘోర మైన ఒట్టు పెట్టుకుని, జీవితాంతం తను  పెట్టుకున్న ఒట్టుకి కట్టు బడిన వారిలో మొదట చెప్పుకో తగిన వాడు భారతంలో భీష్ముడు. శంతన మహారాజు దాశరాజు కుమార్తె సత్యవతిని చూసి, ఆమెను వివాహమాడాలను కున్నాడు. తన బిడ్డకు పుట్టబోయే వారికి సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత ఉండదు కనుక శంతనుడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేయడానికి దాశరాజు ససేమిరా కుదరదన్నాడు.  తండ్రి మనో గతం తెలుసుకున్న భీష్ముడు  ( అప్పటికతని పేరు దేవ వ్రతుడు ) శంతనుని పెద్ద కొడుకైన తాను రాజ్యాన్ని ఆశించననీ, సత్యవతి పుత్రులే రాజ్యాన్ని పాలిస్తారనీ శపథం చేసాడు.
అప్పటికీ దాశరాజు  తన కుమార్తెను శంతనుడికివ్వడానికి ఒప్పు కోలేదు. దేవ వ్రతుడు రాజ్యం వొదులు కున్నా అతనికి పుట్టబోయే వాళ్ళు రాజ్యం వొదులు కోరని నమ్మక మేమిటని అతని సందేహం. దానితో దేవవ్రతుడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి పోతానని భీషణమైన ప్రతిన చేసాడు. ఘోరమయిన ఒట్టు పెట్టాడు. అప్పటి నుండీ అతడు భీష్ముడయ్యేడు !
భీష్ముడు పెట్టిన ఒట్టు ఇలా ఉంది :
వినుఁడు ప్రసిద్ధులైన పృధివీపతు లిందఱు నే గురుప్రయో
జనమునఁజేసితిన్ సమయసంస్థితి యీ లలితాంగి కుద్భవిం
చిన తనయుండ రాజ్యమును జేయఁగ నర్హుఁడు వాఁడ మాకు నె
ల్లను బతి , వాఁడ కౌరవకులస్థితికారుఁడుదార సంపదన్ !

‘‘ఇక్కడ సమావేశమయిన రాజు లందరూ వినండి ! నేను మా తండ్రిగారి కోరిక నెరవేర్చడం కోసం స్థిరమైన ప్రతిఙ్ఞ చేస్తున్నాను.ఈ దాశరాజు కుమార్తె సత్యవతికి మా తండ్రి గారి వలన పుట్టబోయే వాడేరాజ్యాధికారం పొందుతాడు. అతడే మాకందరికీ ప్రభువు. అతడే కురువంశ ఉద్ధారకుడవుతాడు ! ’’
ఇదీ భీష్ముడి ఒట్టు ...

అలాగే మహా భారత కథలో ఇలాంటి భీషణమైన ఒట్లు పెట్టిన వారిలో భీము
డొకడు ! భీముడు పెట్టిన ఒట్లు (శపథాలు) లో రెండు చాలా ప్రసిద్ధమైనవి.
వాటిని చూదాం :
కురువృద్ధుల్ గురు వృద్ధ బాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో
ద్ధుకుఁడై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కర లీలన్ వధియించి,  తద్విపుల వక్షశ్శైలరక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి సూచు చుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్ !

‘‘ఈ కురు వంశపు పెద్దలు, గురువులు, వృద్దులు , బంధువులు చాల మంది చూస్తూ ఉండగానే ఈ దుష్ట దుశ్శాసనుడు మదంతో, కండ కావరంతో ద్రౌపదిని ఇలా అవమానించాడు ... దుర్యోధనుడు చూస్తూ ఉండగానే రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో వీడిని లోక భీకరమైన రీతిలో వధిస్తాను ! వీడి వక్ష స్థలం అనే పర్వతం లోని రక్త ప్రవాహం అనే సెలయేటిని భయంకరాకారంతో త్రాగుతాను ! ’’
అంటూ ఒట్టు పెట్టుకున్నాడు భీముడు, అంతే కాక, తరువాతి వచనంలో ‘‘ నేనలా చేయక పోతే, నేను తండ్రి తాత మార్గానికి తప్పిన వాడినే అవుతాను ! ’’ అని కూడా మరో ఒట్టు పెట్టు కున్నాడు !
భీముడు చేసిన  మరో శపథం ( పెట్టిన ఒట్టు ) :
ద్రౌపది తనకి కీచకుడి చేతిలో జరిగిన భంగపాటుని ఒంటరిగా భీముడిని కలుసుకుని విలపిస్తూ చెప్పుకుంది. భీముడు భార్యను ఓదారుస్తూ, కీచకుడినీ అతని కుమారులనూ కూడా వధిస్తానని ఒట్టు పెట్టాడు. విరాట సర్వం లోని ఈ పద్యం కూడా చాలా ప్రసిద్ధం !
చూడండి :
అవనీ చక్రము సంచలింపఁగ, దివం బల్లాడ, నాశాచయం
బవధూతంబుగ గోత్రశైల నికరం బాకంపముం బొంద, న
ర్ణవముల్ ఘూర్జన మొందఁ గ్రోధము గృతార్ధత్వంబు నొందించి, చి
త్రవధ ప్రౌఢి వహించి సూతునకు రౌద్రంబేర్పడం జూపుదున్ !

‘‘ భూమండలం కంపించే విధంగా, ఆకాశం అల్లల్లాడి పోయే లాగా, దిక్కులు పిక్కటిల్లేలా, కుల పర్వతాలు వణికి పోయే తెరగున, సముద్రాలు కల్లోలమై పోయేటట్లు, నా క్రోధం సఫల మయచ్యే విధంగా చిత్రవధ చేసే నా నేర్పుని చూపిస్తూ ఆ కీచకుడిని అంతం చేస్తాను ! ’’

ఇక, గయోపాఖ్యానంలో అర్జుడు పెట్టిన ఒట్టు పద్యం కూడా జనాలకి చిర పరిచితమే ..

నదిలో అర్ఘ్య ప్రదానం చేస్తున్న శ్రీకృష్ణుని చేతిలో గయుని నిష్ఠీవనం ( ఉమ్మి ) పడింది! కృష్ణుడు ఆగ్రహంతో ఊగి పోయి, గయుని వధిస్తానని శపధం చేసాడు. గయుడు పరువెత్తి పోయ అర్జునుని శరణు వేడాడు. అప్పుడు అర్జునుడు ఒట్టు పెట్టి మరీ అతనికి అభయ మిచ్చాడు.
పద్యం చూడండి :
నిటలాక్షుండిపు డెత్తి వచ్చినను రానీ ! యన్నదమ్ముల్నను
న్విటతాటంబున బాసి పోయినను పోనీ ! కృష్ణఁడే వచ్చి,
ద్దిటు పార్ధా ! యననీ ! మఱేమయిన గానీ, లోకముల్బెగిలం
బటు దర్పంబున నిల్చి యీ గయుని ప్రాణంబేను రక్షించెదన్ !

‘‘ ఆశివుడే నామీద దండెత్తి రానీ ! అన్నదమ్ములు నా మీద కినుకతో నన్ను విడిచి పోతే పోనీ ! సాక్షాత్తు శ్రీకృష్ణడే వచ్చి, ‘‘అర్జునా ! వద్దు గయుని కాపాడ వద్దు ’’ అననీ !ఇంకేమయినా కానీ, లోకాలు అదిరిపోయేలాగున నిలబడతాను. ఈ గయుని కాపాడుతాను ! ’’

ఇక, మనందరికీ ‘‘ఆవు పులి ’’  కథ తెలిసిందే కదా ! అనంతామాత్యుడు భోజరాజీయంలో గోవ్యాఘ్ర సంవాదం అనే ఘట్టంలో ఈ కథ రసరమ్యంగా చెప్పాడు
తనని చంపి తినెయ్యడానికి సిద్ధపడిన పులిని ఆవుఎన్నో విధాలుగా బ్రతిమాలుకుంది. ఇంటి దగ్గర ఉన్న ఒక్కగా నొక్క చిన్నారి కొడుక్కి పాలిచ్చి వెంటనే వచ్చేస్తాను. అప్పుడు నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకో ! అని వేడుకుంది. ఎన్ని చెప్పినా పులి విన లేదు. అప్పుడు ఆవు చాలా ఒట్లు పెట్టి, పులికి నమ్మకం కలిగించింది.

ఆ ఒట్లు ఏమిటంటే ...
‘‘ ఓ పులి రాజా ! నేను నీకు మాట ఇస్తున్నాను. ఒట్టు పెడుతున్నాను. నేను ఇంటికి పోయి, తిరిగి నీ దగ్గరకి రాక పోతే ...
1. పరాయి ఆడదాని పొందు కోరిన యతి ఏ గతికి పోతాడో, నేనూ అదే గతికి పోతాను ! ఒట్టు !
2.మధ్యవర్తిగా ఉంటూ, పక్షపాత బుద్ధితో తగవు చెప్పే వాడు పోయే నరకానికే నేనూ పోతాను !
3.నమ్మి ఎవరయినా తన ధనం దాచుకుంటే తిరిగి ఇవ్వకుండా మోసం చేసే వాడు పోయే గతికి నేనూ పోతాను !
4.శుభ కార్యాలు జరిగే చోట వాటిని పాడు చేసే వాడు పోయే చోటికే నేనూ పోతాను
5. మిత్రుడిలా చేరి, శత్రువులా వ్యవహరించే వాడు పోయే దుర్గతికే నేనూ పోతాను
6.ఆవులకి గడ్డి వేయకుండా అవి మలమలమాడుతూ ఉంటే, తాను మాత్రం కడుపు నిండా తినే వాడు ఏ గతికి పోతాడో, నేనూ అదే గతికి పోతాను
7.పశువులను ఏ తప్పూ లేకుండా దండించే వాడు పోయే చోటుకే నేనూ పోతాను.
8.పరస్త్రీల పొందు ఆశించే వాడు పోయే గతికే నేనూ పోతాను.
9.జీతం తీసుకుంటూ ప్రభువుల పని చేయని పాతకుడు పోయే చోటికే నేనూ పోతాను.
10.దుర్భాషలు పలికి పెద్దలను బాధ పెట్టే పాతకుడు పోయే గతికే నేనూ పోతాను.
11.తల్లి దండ్రులను ఎదిరించే నీచుడు పోయే నరకానికే నేనూ పోతాను.
12.హా యిగా మేస్తున్న పశువులను అదిలించే వాడు పోయే చోటికే నేనూ పోతాను.
13.మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించి వేసే నీచుడికి ఏ గతి పడుతుందో అది నాకూ  అదే పడుతుంది.
14.డబ్బు కోసం తన కన్న కూతురిని  ముసలాడికి ఇచ్చి  పెళ్ళి చేసే వాడు
ఏ నరకాన పడతాడో నేనూ అక్కడే పడతాను
15. ఏ తప్పూ చేయని భార్యని విడిచి పెట్టే వాడు పోయే నరకానికే నేనూ పోతాను.
16.తన వాళ్ళంతా తిండీ తిప్పలూ లేకుండా దరిద్రంతో బాధ పడుతూ ఉంటే, తాను దుబారా ఖర్చు చేసే వాడు ఏగతికి పోతాడో, నేనూ అక్కడికే పోతాను.
17.ఇస్తానన్న దానం ఇవ్వని వాడూ, అందు కోసం  చాలా సార్లు దాన గ్రహీతను త్రిప్పే వాడూ పోయే చోటికే నేనూ పోతాను. ’’
    ఇలా ఆవు ఎన్నో ఒట్లు పెట్టుకుంటే కానీ, పులి దానిని విడువ లేదు. ఇంటికి పోయిన ఆవు బిడ్డకి పాలిచ్చి మాట నాలుపు కుందే కానీ,  ఆ ఒట్లన్నీ తీసి గట్టు మీద పెట్టెయ్య లేదు ! ( గో మాతల నైజం ఇప్పటికీ ఇంతే కదా ! )
ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి అంతూ పొంతూ ఉండదు.
కనుక, ఇక ప్రస్తుత కాలానికి వద్దాం ...
ఏలిన వారు పదవిని స్వీకరిస్తూనే చట్ట సభల సాక్షిగా ఎన్నో ఒట్లు పెడతారు. వాటిలో చాలా వాటిని మరునాడే మరచి పోయే వాళ్ళే ఎక్కువ !
నాతిచరామి ! అంటూ పెళ్ళిలో ఒట్లు పెట్టే మొగుళ్ళు ఎంత మంది ఆ ఒట్లు తరువాతి కాలంలో గుర్తుంచు కుంటున్నారో ఆలోచించాలి.
నాయకులు చట్ట సభల్లోనూ, వేదికల మీదా, పిల్లకాయలు బళ్ళలోనూ చాలా ఒట్లు పెడుతూనే ఉంటారు. వాటిలో సగం నిలుపుకున్నా బాగుండేది.
మామూలు జనం కూడా అయిన దానికీ కాని దానికీ కూడా ఒట్టు పెట్టి చెబుతూ ఉంటారు. నీ మీద ఒట్టు ! పిల్లల మీద ఒట్టు ! అంటూ ...కానీ సాయంత్రానికి పరగడుపే !
పండుగలకీ, పబ్బాలకీ, నూతన సంవత్సరారంభ దినాన ... ఇలా ప్రత్యేక దినాలలో ఒట్లు పెట్టుకునే వాళ్ళ సంఖ్య కి లెక్క లేదు ! ఏవేవో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ, స్వగతంగానో, బహిరంగంగారో ఒట్లు పెట్టు కుంటూ ఉంటారు !
అవన్నీ తూఛ్ ... అయి పోడానికి చాలా మందికి ఎక్కువ సమయం పట్టదు !
అమ్మ తోడు ! సరస్వతి తోడు ! అనేవి యాదాలాపం మాటలుగా మిగిలి పోతున్నాయి !
మన సినిమాల వాళ్ళు కూడా ఈ ఒట్లమీద చాలానే సనిమాలు తీసారు. పెళ్ళి నాటి ప్రమాణాలు ... వాగ్గానం ...  మంగమ్మ శపథం, చాణక్య శపథం ... ఇలా ... ఎన్నో !  చేతిలో చెయ్యేసి చెప్పు బావా ! అని కోరుకునే హీరోయిన్ కి చేతిలో చెయ్యేసి మరీ ఒట్టు పెట్టిన హీరో తరువాత ఏం చేస్తాడో వెండి తెర మీద చూడాలి. నాకయితే గుర్తు లేదు.
లోగడ అయితే ఒట్టు పెడితే జనాలు నమ్మే వారు. గుడిలో దీపం ఆర్పి ఒట్టు పెట్టి నిజం చెబితే నమ్మే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరూ ఎవరినీ, దేన్నీ నమ్మరు. అలా నమ్మ లేనంతగా దిగజారి పోయేం !

అందు చేతనే, ఏ గట్టు మీద చూడండి ... అసంఖ్యాకంగా ఒట్లు 
కనిపిస్తాయి !
 ఇప్పటికి స్వస్తి.

24, సెప్టెంబర్ 2014, బుధవారం

మా వెటకారపు వెంకటేశ్వర్లు మీకు తెలుసా ? !


మా వెటకారపు వెంకటేశ్వర్లుని మీకు పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందు కంటే, వాడికి మామ్మూలుగా మాట్లాడడం తెలీదు. మాట మాటకీ ఏదో వెటకారం దొర్లాల్సిందే.

వాడి ఆహార్యం లోనూ, అహారపు టలవాట్ల లోనూ కూ డా వెటకారమే.
గొట్టాం ఫేంట్ల ఫేషను పోయేక , వాడు గొట్టాం పేంట్ల ట్టించుకుని మరీ తిరుగుతాడు.
ఏనుగు చెవుల కాలర్లు పోయేక , వాడు ఏనుగు చెవుల కాలర్లున్న పర్టులు కుట్టించుకుని తిరుగుతాడు.
అలా కుట్టడానికి  నసుగుతూ ఏ టైలరయినా, ‘‘ ఇప్పుడవి ఫేషను కాదండీ! ’’ అంటే, ‘‘నీకు చేత కాక పోతే చెప్పు, మరొకడితో కుట్టించు కుంటాను ’’అని దబాయిస్తాడు.
ఇక భోజనం చేసే విషయంలో కూడా, పంక్తిలో కూచుంటాడా. ముందుగాపెరుగు తే, కలుపు కుంటానంటాడు. ఆ తరువాతే కూరా, పులుసూ. పప్పూనూ.
అప్పడాలో డజను వేయించుకుని, అరచేత్తో వాటిని  ముక్కలయ్యేలా చిదిపి. నవ్వుతూ ‘‘ ఈ చప్పుడు విన్నారూ ? ’’ అంటాడు.
వాడి  వెటకారాల సెగ వాడి పెళ్ళానికి కూడా బాగా తగిలింది.
కాళ్ళకి రెండు రకాల చెప్పు లేసుకోమని సలహా ఇస్తాడు. ఒకటి హైహీల్సూ, మరొకటి మామూలుదీ. అలాగయితే ఎత్తు పల్లాలున్న చోట బ్యాలెన్సు సరిపోతుందంటాడు !
కుడి పైట వేసుకుని తిరగమంటాడు. పువ్వులు కొప్పులో కాదు, చెవిలో పెట్టుకుంటేనే ఆడవాళ్ళకి అందం అంటాడు.
ఈ తిక్క మనిషితో వేగ లేక ఆవిడ కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి పోయింది కూడానూ.
అలాగని వాడికి పిచ్చేమీ కాదు.  లోకంలో అందరూ నడిచే దారిలో నడిస్తే మన విలువేంటని వాడి వాదన. ( దీనికే మారు పేరు పిచ్చి కాబోలు )

ఇక వాడి మాట తీరు ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలు చెబుతాను :
 ‘‘ ఏఁవండీ ఈ నెల జీతాలు అందేయా ? ’’ అని సమోద్యోగి ఎవడయినా అడగడం పాపం, ‘‘నా జీతమే అందింది. నీజీతమే నాకు అంద లేదింకా ’’అంటాడు.
‘‘ మీ పిల్లలేం చదువుతున్నారండీ ’’ అని ఎవరయినా అమాయక చక్రవర్తి అడిగితే, టక్కున ‘‘ పుస్తకాలు’’ అని ముక్త సరిగా జవాబిస్తాడు.
‘‘అది కాదు ! .. ... ఏం చదువుతున్నారూ ? ’’ అని రెట్టించి అడిగితే, ‘‘ క్లాసు పుస్తకాలు .. అప్పుడప్పుడు  నవలలూ, వార పత్రికలూనూ ’’ అని వాడి నుండి జవాబొస్తుంది.
‘‘ఏఁవండీ .. ఫలానా సినిమా చూసారా ? ఎలా ఉంది ?’’ అనడిగితే, ‘‘ తెలుగులోనే ఉంది ’’ అని జవాబు చెబుతాడు
‘‘ ఇవాళ మీ ఇంట్లో కూరేం చేసారూ ’’ అని ముచ్చట పడి అడిగితే ‘‘ తిన్నాం !’’ అంటాడు ముక్తసరిగా.

కూరల కోసం, కిరాణా సామాన్ల కోసం బజారు కెళ్తూ, ‘‘ ఏమేవ్ ! అలా ఆకాశానికెళ్తా కానీ, వో బస్తాడు డబ్బులు నాముఖాన తగలెయ్యి ! ’’ అని పెళ్ళాన్ని కేకేస్తాడు.
అదేఁవిటండీ చోద్యం ! అని ఆవిడ విస్తుపోతే ..
‘‘ అన్ని ధరలూ ఆకాశాన్నంటుతున్నాయిట కదే ... అందుకే మరి బజారంతా అక్కడే ఉంటుంది కాబోలునే ’’ అంటాడు.
బయటికి వెళ్ళేటప్పుడు కూడా, ‘‘ ఏఁవే, అలా తిరిగొస్తాను కానీ, తలుపు తీసుకుని ఏడువ్ .. ఏదొంగ వెధవయినా చొరబడాలి కదా ’’ అంటాడే తప్ప, తలుపు వేసు కొమ్మని జాగ్రత్తలు  మాత్రం  తిన్నగా చెప్పడు !
పెళ్ళాం ఎప్పుడయినా వాడితో  ‘‘ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమాటండీ ! వెళ్దాం ! ’’ అని ముచ్చట పడి  అడిగితే,  వెళ్దాం కానీ,  పక్కకింటి ముస్లిం స్నేహితురాలి నడిగి బురఖా తెమ్మంటాడు.
ఎందుకండీ అంటే ‘‘ కుటుంబ సమేతంగా చూడతగిన తెలుగు సినిమాకెళ్తున్నాం కదా, ,, హాల్లో ఎవరయినా గుర్తు పడితే బావుండదు !’’ అని వెటకారాలు పోతాడు.
‘‘ పిచ్చాసుపత్రి నంబరు డైరీలో ఉందో లేదో చూసుకోవే, పనికొచ్చేలా ఉంది ’’  అంటాడోసారి.
‘‘ఎందుకండీ ?’’ సందేహంగా అడుగుతుంది భార్య.
‘‘ యువ కవి వొహడు ఉదయాన్నే తన కవితల పుస్తకంతెచ్చి చదవమని ఒకటే నస ...చదవాలి ..  తరవాత నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఏఁవిటో’’ అని నిట్టూరుస్తాడు.
‘‘ నా రచనలు కాస్త చదివి పెడతారూ ?’’ అని ఏ అర్భకుడయినా అడిగితే,
‘‘ చదవను ! కానీ  ( ప్రక్కన ) పెడతాను.’’ అంటాడు దురుసుగా.

‘‘ పెళ్ళి కెళ్ళొచ్చేరుగా ! ఎలా జరిగిందేఁవిటి ’’
‘‘సవ్యంగానే జరిగిందనుకుంటున్నాను .... ఎందుకంటే, పెళ్ళి కొడుకు  పెళ్ళి కూతురు మెడలోనే మంగళ సూత్రం కట్టేడు ’’
వీడి వెటకారాలు మామ్మూలుగా తెలిసిన వాళ్ళతోనే కాదు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా అందరితోనూ ఇలాగే మాట్లాడుతాడు !
ఓ సారి  తెలిసిన డాక్టరు దగ్గరి కెళ్ళాడు. ఆయనతో మన వాడికి కొంచెం ఎక్కువ చనువు కూడా ఉంది లెండి
‘‘ఏఁవయ్యా డాక్టరూ !  వారం నుండీ వొకటే జలుబు !  నువ్వే వైద్యం చెయ్యలి ... చెప్పు, పీ.ఎఫ్ లోను పెట్టమంటావా ? పొలం అమ్మమంటావా ’’ అనడిగేడు.
 ( దానితో తిక్క రేగిన ఆ డాక్టరు వాడి జబ్బ అందుకుని నెల్లాళ్ళ వరకూ తగ్గకుండా ఉండేలా వో ఇంజక్షను పొడిచీసేడనుకోండి ! )

ఇదీ మనవాడి వెటకారపు గోల.

కొస మెరుపు :
‘‘ నీ పద్దతి మార్చుకోవయ్యా ... యిదేం బాలేదు .. ఇంతకీ ఇలా వెటకారంగానూ, పిచ్చ పిచ్చగానూ మాట్లాడడం నీకు చిన్నప్పటి నుండీ ఉందా ? ఈ మధ్య మొదలయిందా ? ’’ అనడిగేను, జాలిగా, వాడిని సంప్కరించే సదుద్ధేశంతో.

 వాడు దీనంగా ముఖం పెట్టి అన్నాడు :  ‘‘ మొదటి నుండీ లేదండీ ! ... మీ కథా మంజరి బ్లాగు టపాలు చదివిన తరువాత నుండీ నండీ ... ’’ అన్నాడు వినయంగా.

ఈ సందర్భంగా నాకు మన కవుల  చమక్కు సంభాషణలు కొన్ని గుర్తుకొస్తున్నాయి.
పనిలో పనిగా అవి కూడా చూదాం !
‘‘ ఏఁవండీ ఎక్కడికి బయలు దేరారూ ... ఊరికా ! ’’
‘‘ అవును. ఊరికే.’’
***       *****     ****    ****   ****   *****   ****   ****
‘‘ ఈ రోడ్డెక్కడికి పోతుందీ ? ’’
‘‘ ఎక్కడికీ పోదు ! నాచిన్నప్పటి నుండీ చూస్తున్నాను . ఇక్కడే ఉంది !‘’
***   ****     *****     *****     *****    *****   ****
రామయ్య గారిల్లెక్కడండీ ?’’
‘‘ ఆయనకేం పనీ ! పైగా పెద్ద మనిషి కూడానూ !’’
****                 ******                      *****                       *****
సర్వరూ! ఈ కాఫీలో బొద్దింక పడి నట్టుంది చూడూ ... కాఫీకే డబ్బులిస్తాను. బొద్దింకకు ఇవ్వను సుమీ.’’

*******              *******                      *******                  ******
‘‘నా కవిత్వంలో మరి కొిన్ని నిప్పులు కక్కమంటారా  టారా ? ’’ యువ కవి అడిగేడు.
‘‘ వద్దు. నీ కవిత్వాన్నే నిప్పుల్లో కుక్కు’’ మహా కవి సలహా.

20, సెప్టెంబర్ 2014, శనివారం

మా వారు బడుద్ధాయ్ ... కాదు !బయటికి అన కూడదు కానీ, మా వారొట్టి బడుద్ధాయ్. ఎవరితోనూ ఈ మాట అనబోకండి, కొంపలంటు కుంటాయ్, ఈ మాట నేను ఊరికే అనడం లేదు. దానికి మా సాంసారిక జీవితంలో చాలా తార్కాణాలున్నాయి. ( నిజానికి  ప్రతి బడుద్ధాయి మగ మహా రాజు విషయంలో నూ సరిగ్గా యివే కాక పోయినా, ఇలాంటివే కొన్ని ఉదాహరణలు  ఉంటాయని నా మనో నిఃశ్చయం. )

        సరదాగా వో చల్లని సాయంత్రం వేళ శ్రీ వారిని వెట బెట్టుకుని చీరల షాపుకి వెళ్తానా !  అక్కడ మొదలవుతుంది మా శ్రీ వారి నాగినీ డాన్సు. ఆ షాపంతా చక్కా ఏ. సీ హాలే అయినా ,మా వారు ఊరికే చెమట్లు పట్టి పోతూ ఉంటారు.
    నిముషానికోసారి అయిందా ? తొందరగా తెముల్చూ, యిక వెళ్దాం ... అంటూ ఒకటే నస. ( మనం ఖాతరు చెయ్యమనుకోండి )
    షాపు వాడు చూపించిన ప్రతి చీరా, ‘‘ ఇది చాలా బావుంది, కొనెయ్ ’’ అంటూ తెగ తొందర చేస్తూ ఉంటారు. ( మానవుడు పాపం, ఫీలవుతాడు కదా, అని ఓ చిరు నవ్వు పారేసి, ఆ చీరని చూపించిన వాడి ముఖాన కొడతాం.) 
‘‘ ఈ చీర చూసావూ, నీకిది బాగా నప్పుతుందే ... నువ్వు కడితే  దీనందం రెట్టింపవుతుంది ! ’’ అని మనల్ని ఉబ్బేయడానికి  ప్రయత్నిస్తారు.
వ   అలాంటి వాటికి పడతామా మనం !  పోయినేడు మా మరిది పెళ్ళికి ఏ రంగు చీరలు  మార్చి కట్టు కున్నానో టక్కున చెప్ప మనండి, చూదాం ! చెప్ప లేరు ! అలాంటిది  నన్ను ఉబ్బేసి షాపింగు త్వరగా తెమల్చడానికి కాక పోతే, చీరల సెలక్షను ఈయనకేం తెలుసూ !
         ‘‘మొత్తానికి ఉండేవి ఏడు రంగులే కదా, ఏ రంగు ఎంచు కోవాలో తేల్చు కోడానికి ఇంత సేపా ! ’’ అంటూ విసుక్కు పోతారు.
        ఏడిసినట్టుంది !  ఉన్న రంగులు ఏడే కానీ , వాటి కాంబి నేషను కోకొల్లలని ఈ పురుష సింహం ఎప్పుడు తెలుసు కుంటుందో  కదా !
     ‘‘ మా మగాళ్ళయితే క్షణంలో ఏం కావాలో ఇట్టే తేల్చేస్తాం. నా బట్టల సెలక్షనయితే అర నిముషం పట్టదు !’’ అంటారు, గర్వంగా
‘  ‘ అందుకే ఏడిసినట్టుంటాయి ’  స్వగతంలో అనుకుని, 
     ‘‘ మీ కోసం అయితే ఫేంటూ , చొక్కా మీరే కానక్కర లేదు ... మన బుజ్జి ముండ కూడా అర క్షణంలో ఎంచి పారేస్తుంది ... ఎప్పుడూ ఆ ముదురు నీలం రంగు ఫేంటూ, ఆ చారల  చొక్కా గుడ్డలే కదా ! ’’ అని నవ్వుతాం. 
     ‘‘ సరి సరి ...  తొందరగా కానీ ... చూడు, ఎన్ని చీరలు తీయించి ్ుప్ప వేయించావో ...’’ అని     విసుక్కుంటారు.

       ఏదీ ఇంకా చూపించాల్సిన చీరలు వాడి వెనకాల ఉన్న అరల్లో ఒకటీ రెండూ మిగిలి పోయేయి కదా, అవి కూడా చూడొద్దూ ! వచ్చి ఇంకా రెండు గంటలేగా అయిందీ ?!      ఈ పాయింటు అర్ధం చేసుకో లేక, సిగరెట్టు కంపు కొట్టే నోటిని నా చెవి దగ్గర ఉంచి,     ‘‘ అన్నీ తీయించి అక్కర లేదని పడేస్తున్నావు ! వాడేమయినా అనుకుంటాడేమోనే’’ అంటూ  తెగ ఫీలయి పోతూ ఉంటారు. జాలి గుండె మనిషి పాపం.
           మనం వారి ఎత్తులకీ , జిత్తులకీ లొంగక పోయే సరికి, ‘‘ చంటిది నిద్ర లేచి  అమ్మని ఏం ఇబ్బంది పెడుతోందో , ఏమో !’’ అని ఓ కొత్త  పల్లవి ఎత్తుకుని బెదిరింపులకు దిగుతారు !                    మనం ఏమన్నా తక్కువ తిన్నామా ! ‘‘ లేవదు గాక లేవదు! లేచినా ఇంతో టి మీ అమ్మ గారేమీ కంది పోరు లెండి. ఆపాటి మనవరాలిని చూసుకో లేరూ ! మరీ అంత సుకుమారి రాజ కుమారా  ఆవిడా?!’’  అంటూ, దీర్ఘాలు తీస్తూ హాశ్చర్యం నటిస్తాం. అంతే ! దాంతో వారి నోరు మరి పెగలదు.
                      ఇవ్విధంబున దశ విధాలా, కొండొకచో మరి కొన్ని విధాలా  మా బడుద్ధాయి గారిని నాన బెట్టి,      ఉతికి , ఆరవేసి, ఇస్త్రీ చేశాక  కనికరించి ఉన్న వాటిలో ఖరీదయిన చీరలు ఫదో , పాతికో 
   కొంటాం.                    అప్పటికే సగం కను గుడ్లు తేలేసిన శ్రీ వారు కిమ్మనకుండా బిల్లు పే ,స్తారు.

                      అప్పుడు మన కనిపిస్తుందీ,  అయ్యో ! ఇంత మంచి మనిషినా, పట్టుకుని బడుద్ధాయి అనీ అదనీ ఇదనీ వాగేను. కళ్ళు పోవూ !

                        మా ఆయనంత మంచాయన లోకంలో మళ్ళీ మా ఆయనే కదా !

ఇదండీ ...చీరల చిరు కథ.  చీర పద్యాలు పుస్తకానికి రెండో ముద్రణ జరిగేటప్పుడు  దీనిని నిరభ్యంతరంగా ముందు మాటగా కాక పోయినా, వెనుక మాటగా వేసుకోడానికి నాకు ఎలాంటి అభ్యంతరమున్నూ లేదు. ( మనకి లేక పోయిననూ వారికి ఉండే ఉండ వచ్చునని  ఎందుకో తోచు చున్నది.)


తాజా కలం :  భార్యల దృష్టిలో బడుద్ధాయి   కాని మగాడు ఉండేమో. !
‘‘ మీకేం తెలియదు ! మీరూరు కోండి !’’ అని  ఒక్ఖ సారయినా పెళ్ళాం చేత అనిపించు కోని వారికిది వర్తించదని వినయ పూర్వకంగా మనవి చేస్తున్నాను .
. ( అలాంటి వారెవరయినా ఉంటే గింటే )

 ( ఈ టపాలో ఉపయోగించుకున్న కార్టూనులు గీసిన  వ్యంగ్య చిత్రకారులకి ధన్యవాదాలు,)