28, నవంబర్ 2014, శుక్రవారం

లక్ష చీపుళ్ళనోము ...


‘‘ అన్నయ్య గారూ ! మీరు వెంటనే వొక సారి మా ఇంటికి రాగలరా ? !
 ప్లీజ్ ...’’ఉదయాన్నే మా తింగరి బుచ్చి భార్య నుండి ఫోను. వీడు మళ్ళీ ఏం పీకల మీదకి తెచ్చాడో తెలియదు. ఆలస్యం చేయకుండా వెంటనే స్కూటరు తీసుకుని బయలుదేరి వెళ్ళాను.  వీధి గుమ్మం గేటు దగ్గరే నా కోసం నిరీక్షిస్తూ ఆత్రుతగా నిలబడి ఉంది తింగరి బుచ్చి భార్య. స్కూటరు ఆపి, స్టాండు వేసి
‘‘ ఏమయిందమ్మా !’’ డిగేను.
‘‘ అన్నీ చెబుతాను ... ఇదిగో, ఈ వీధరుగు మీదే కూర్చుని మాట్టాడు కుందాం.. ఇక్కడే కుర్చీ వేస్తాను. ఇంట్లో ఎక్కడా అంగుళం ఖాళీ లేదు ...’’ అంటూ నా జవాబు కోసం ఎదురు డకుండా ఇంట్లోకి వెళ్ళి ఓ కుర్చీ తెచ్చి వీధి గుమ్మంలోనే వేసింది.
ఇంట్లో ఖాళీ లేక పోవడమేఁవిటి ! నాకేం అర్ధం కాలేదు. సరే ఎలాగూ ఆవిడే చెబుతుంది కదా అని ఊరుకుని విన సాగాను. ఆవిడ మధ్య మధ్య  పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ గద్గద కంఠంతో చెప్ప సాగింది.
‘‘ ఏం చెప్పమంటా రన్నయ్యా ! ఈయనికి రాను రాను తిక్క ముదిరి పోతోంది. అదేదో లక్ష చీపుళ్ళ నోము చేస్తానంటూ తయారయి పోయేరు !  ...మగాళ్ళకి నోము లేఁవిటండీ ...
 చోద్యం ! అదీ కాక, ఈ చీపుళ్ళ నోమేఁవిటని అడిగితే, ఈ లక్ష చీపుళ్ళ నోముని ఆడవాళ్ళూ మగవాళ్ళూ పిల్లా పెద్దా ముసలీ ముతకా అనే తేడా లేకుండా అందరూ చేయ వచ్చునంటూ ఏదేదో చెబుతున్నారు ’’
    ఆవిడ ఇలా చెబుతూ ఉండగానే మా తింగర బుచ్చి వచ్చేడు. వస్తూనే నన్ను చూసి, ‘‘వచ్చేరా ! అసలు నేనే మిమ్మల్ని కలవాలను కుంటున్నాను ..’’ అంటూ ఇంట్లోకి దారి తీసాడు. నేనూ అతని వెనుకే వెళ్ళాను. ఆవిడ చెప్పింది నిజమే ! ఎక్కడా మసలడానికి జాగా లేదు. ఇల్లంతా చీపుళ్ళ గుట్టలు.
‘‘ ఇవేమిటి! ’’ అడిగేను తెల్ల బోయి.
‘‘ ఏముందండీ ... లక్ష చీపుళ్ళ నోము తల పెట్టాను. వాటి కోసమే ఇవి ! ’’ అన్నాడు గర్వంగా.
తింగరి బుచ్చి భార్య కల్పించుకుని అంది : ‘‘ ఏడిసినట్టుంది. నిన్న ఉదయం మా చిన్నవాడు ‘‘ అమ్మా ! వేగిరం రా ! నాన్న ఏం తెచ్చారో చూడు ’’ అనివీధిలోంచి అరిస్తే, ఎంగిలి కంచాలు కడుగుతున్న దానిని  వాటిని అలానే వదిలేసి చేతులు కడుక్కుని సంతోషంగా బయటి కొచ్చి చూసేను. ఏం తెచ్చారూ ! నా తలకాయ్ ! ఏ నాలుగు బర్నర్ల గ్యాస్ స్టవ్వో, ఎల్.సీ.డీ టీవీయో నా ముచ్చట తీర్చడానికి వేయించు కొచ్చేరు కాబోలని గంపెడాశతో చూస్తే, ఇవిగో ! ఈ చీపుళ్ళ కట్టలు తెచ్చి పడేసారు. వీటిని కొనడానికి, లక్ష చీపుళ్ళ నోము చెయ్యడానికీ ఆఫీసులో లోను కూడా పెట్టారుట ! నా ఖర్మ కాక పోతే ఈయనకీ తింగరి పనులేఁవిటి చెప్పండన్నయ్యా! ’’ అంటూ కళ్ళొత్తుకుంది. భార్య మీద అగ్గి రాముడై పోయేడు తింగరి బుచ్చి. ‘‘ నోర్మయ్ ! పరమ పవిత్ర మయిన చీపుర్లనేమయినా అంటే కళ్ళు పోతాయ్. అసలు చీపురంటే ఏఁవనుకున్నావ్ ? లోకంలో చీపురంత పరమ పవిత్ర మయిన వస్తువు మరొకటి లేదు. ప్రతి కొంప లోనూ ఈశాన్య మూల దేవుడి మందిరం, తలుపు వార చీపురు కట్టా ఉండి తీర వలసిందే. చీపురు, చీపురు కట్ట, చీకిలి,ఘాటము, తిరు కట్టె, సొరక, మార్జని, శతముఖి, శోధని, సమూహని, సమ్మార్జకము, సమ్మార్జని ... ఇన్ని పేర్లున్నాయి చీపురికి. చీపురు పట్టి ఊడ్చే వాడిని ఖలపువు, బహుకరుడు, సమ్మార్జకుడు అంటారు తెలుసా ! చీపురు పట్టి ఊడ్చే చెత్తను అవకరము, చెదారము, తుక్కు, తక్కుడు, పెంట అని కూడా పిలుస్తారు. చీపురుకి చేదోడు వాదోడుగా ఉండే నేస్తం - చేట ! చేటని ప్రస్ఫోటనము, పలిక, మొరము, శూర్పము,సూర్పము అంటారు. అదే చిన్న చేటయితే, మొంటె, మొరిటె అని పిలుస్తారు.ఇప్పుడీ పదాలన్నీ నిఘంటువుల్లో చచ్చి పడున్నాయి కానీ, చీపురు, చేట అనే పదాలు తెలియని వారుండరు. చీపుళ్ళలో చాలా రకాలు ఉన్నాయి. రెల్లు  పుల్లల  చీపురు , కొండ చీపురు, ప్లాస్టిక్ పుల్లల చీపురు లాంటివన్నమాట ...
      ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణ దేవరాయలంతటి వాడు ‘‘గృహ సమ్మార్జనమో ... ’’అనే  పద్యంలో సమ్మార్జని పదం వాడేడే. దేవాలయం ఊడవడం, కడగడం మొదలయిన పనులు భక్తులు చేయాలి.  ఇక, ‘‘ ఊరెయ్యది ? ’’ అనడిగితే
‘‘ చీపురు పలి ..’’ అని చెబుతాడు అడిదం సూర కవి. చూసేవా ! చీపురు అనే పేరుతో  వో పల్లె కూడా ఉత్తరాంధ్రలో ఉందన్నమాట ! అసలు నన్నడిగితే,  ఈ చీపురు పల్లిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఏలిన వారు తక్షణం తీర్చి దిద్దాలని ప్రతిపాదిస్తున్నాను. కన్యా శుల్కంలో గిరీశాన్ని వాయించడానికి పూట కూళ్ళమ్మ మధుర వాణి ఇంట్లోకి  చీపురు కట్ట పట్టుకుని దూకుడుగా రావడం గుర్తు లేదూ ! ఆకతాయీల పని పట్టడానికి ఆడంగులకి చీపురు కట్ట వంటి మహత్తరమయిన ఆయుధంమరొకటి లేదు ...’’
   మా తింగరి బుచ్చి ఇచ్చిన ఉపన్యాసం విన్నాక, నాకు నోట రాలేదు. కాంచెం తేరుకుని, ‘‘ సరే ఈ లక్ష చీపుళ్ళ నోమేఁవిటి !’’ అడిగేను అసహనంగా.
    వాడు చెప్పే లోగానే వాళ్ళావిడ కలగ జేసుకుని అంది : ‘‘ ఈ లక్ష చీపుళ్ళ నోము నోచి, అందరికీ తలో చీపురూ వాయినంగా ఇస్తారుట ! దేశభక్తి చాటుకోడానికి అదో విధానమట. అసలు చీపురు పట్టని చేయంటూ ఉండ కూడదుట !  చీపురు పట్టని చేతులను నరికి పారెయ్యాలంటూ వీరంగం ఎత్తు తున్నారు కూడా. ఈ తిక్క రోజుకో గొడవ తెచ్చి పెడుతోంది. ఉదయాన్నే లక్ష చీపుళ్ళ నోములో తొలి వాయనం కాస్త తీసుకోండని కాలనీలో వో పెద్దాయనకి ఇవ్వ బోతే తీసుకో లేదుట. పైపెచ్చు, ‘‘ నేను చీపురు పార్టీ కాదూ, నాది కాంగ్రెసూ. కాడెద్దుల కాలం నుండి మాది ఆ పార్టీయే .. పొమ్మని కసురు కున్నాట్ట. ఇది ఆ చీపురు కాదయ్యా అని ఎంత చెప్పినా వినిపించుకో లేదుట. దాంతో అతనితో ఈయన నానా గొడవా పడి దెబ్బలాడి వచ్చేరు. అలాగే వో కాలనీ ఆయన నాకు వక్ఖ చీపురయితే చాలదూ, వో ఫది పంపించండి అంటూ కబురెట్టాడు. నిన్నటి నుండీ ఈ చీపుర్ల తగూలే. ఏం చేయాలో తోచక ఛస్తున్నాను అన్నయ్యా !  మరో సంగతి. నిన్నరాత్రి పొద్దోయే వరకూ మేలుకుని ఇంట్లో చిత్తు కాగితాలూ, చెత్తా చెదారం  పోగు చేసి, వీధిలో మాఇంటి ముందే వెదజల్లారు. ‘‘ ఏఁవిటీ ఈ ఓఘాయిత్యం  పనీ ! ’’ అని నేనడగితే ‘‘ రేప్పొద్దున్నే నేను చీపురు పట్టి ఊడవాలంటే ఈ చెత్త ఉండక పోతే ఎలా ? అని నామీద నోరు చేసుకున్నారు. ‘‘ అదేదో తెల్లారికట్టే లేచి అఘోరించండి.  ఇంటి ముందు ఇలా చెత్త ఎవరయినా చూస్తే బాగోదు’’ అని చెప్పాను. ఉదయాన్నే మా పెద్దాడి చేతికి డిజటల్ కెమేరా ఇచ్చి ఫొటోలు తియ్యమని ఆర్డరేసి వీధిలోకి వెళ్ళే సరికి, అప్పటికే ఎవరో దాన్నంతా ఊడ్చి తగలడ్డారుట. దాంతో ‘‘నా చెత్త ఊడవడానికి మీరెవరంటూ చిందులేసి అందరినీ నానా కూతలూ కూస్తూ తిట్టి పోసారు ...నా చెత్త నా ఇంటి ముందు తిరిగి తెచ్చి పోస్తారా ? ఛస్తారా ? !’’ అంటూ ఒకటే చిందు లేసారు.
   ఆవిడ చెప్పినదంతా  వింటూ ఉంటే, నాకు మతి పోతోంది. ఇక లాభం లేదని చెప్పి,
 మా తింగరి బుచ్చికి వో క్లాసు పీకాలని నిశ్చయించుకుని ఇలా అన్నాను :
 ‘‘ బావుందయ్యా ! నీ నోమూ  బాగుంది. నీ ఆశయమూ బాగుంది .. కానీ నా అభిప్రాయం కూడా చెబుతాను విను .. చెత్తా చెదారం ఊడవడానికి పారి శుధ్య పనివారల  ఉద్యోగాలంటూ ఉండి ఏడిశాయి కదా. వాళ్ళు తమ విధులు సక్రమంగా చేస్తున్నారో లేదో పట్టించు కోకుండా   సూటూ బూటూ వేసుకుని, రంగు రంగుల చీరలు కట్టుకుని, వయ్యారాలు వొలకబోస్తూ,నాజూగ్గా చీపుర్లు పట్టుకుని ఫొటోలకు ఫోజులిస్తూ చెత్తను ఊడుస్తున్నట్టు ఫొటోలు దిగడం,  పత్రికల్లో ఫొటోలు చూసి మురియడం ఏం బాగుంది చెప్పు.  పారిశుద్యానికి పెద్ద పీట వేస్తూ, చాలినంత గా పని  వాళ్ళను   నియమించి,  వారికి మంచి వేతనాలూ. పారితోషికాలూ  నాగా లేకుండా ఇస్తూ చక్కని  పర్యవేక్షణతో వారి చేత కొరడా ఝుళిపించి మరీ పని చేయించాలి. మనింటి చెత్తను ఎవరూ చూడకుండా పక్కింటి వేపు పడేసే అల్ప బుద్ధులను అదమాయించాలి. వీలయితే  భారీగా  ఫైన్లు వేసి శిక్షించాలి.  అంతే కాదు చెత్తా చెదారాన్ని రీ సైక్లింగ్ చేసే యంత్రాలను ఎంత డబ్బు ఖర్చయినా వెనుకాడకుండా గ్రామ గ్రామానికీ బడ్జెట్ లోనే నిధులు కేటాయించి, అందించాలి. ఈ పనితో పాటూ రాజకీయ నాయకులనూ, ప్రజలనూ ఉత్తేజ పరచి, సంఘటితం చేసి స్ఫూర్తి దాయక మయిన ప్రబోధాలతో ఈ పనిలో భాస్వాములయ్యే లాగున చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏదో మొక్కుబడిగా వో రోజో, రెండ్రోజులో చేస్తే మనమూ, మన చెత్తా చెదారం అంతా క్షేమం. ... ఉదాత్తమయిన ఆశయాలకి చిత్త శుద్ధీ, ఉన్నతమయిన కార్యాచరణా అవసరం ! ...’’ అన్నాను.
   నా ఉపన్యాసమంతా సరిగా విన్నాడో లేదో తెలియదు.  ‘‘ సరే, నా నోములో తొలి వాయినం చీపురు మీరు పుచ్చు కోవాలి ..’’ అంటూ నా చేతిలో వో చీపురు పెట్టి, నా కాళ్ళకి దండం పెట్టాడు. మరింక  చేసేదేమీ లేక,  చీపురు అందుకున్న చేత్తోనే మా తింగరి బుచ్చిని దీవించి, ఇంటికి బయలు రేరాను ...

తా.క :  సరదాగా అనే లేబిల్ క్రింద ఇదంతా రాసేను కానీ నిజానికి ఇదంతా సరదాగా వ్రాసినది మాత్రం కాదు !