జీవితంలో ఒక్క సారయినా ఒట్టు పెట్టు కోని
మనిషంటూ ఉంటాడని అనుకోను. అలాగే, ఒట్టు పెట్టు కున్నంత తేలిగ్గానే ఒట్టు తీసి
గట్టు మీద పెట్టేసే వాళ్ళకీ కొదవు లేదు.
ఒట్టు గురించి చెప్పు కునేటప్పుడు
మొదటిగా చెప్పుకో వలసిన దేవుడు కాణిపాక వినాయకుడు .స్వామి సత్య ప్రమాణాల దేవుడిగా
ప్రసిద్ధుడు కదా ! స్వామి ఎదుట ఆడిన మాట తప్పడానికి ఎవరూ సాహసించరని భక్తుల
విశ్వాసం.
ఒట్టు అనే పదానికి నిఘంటువులు
కలుగు,ఉంచు,రగుల్చు,కాల్చు,పెట్టు ,త్రాగు అనే అర్ధాలతో పాటు ఆన, శపథము,మొత్తము
అనే అర్ధాలను ఇచ్చాయి. ఒట్టు పెట్టడమంటే శపించడం అనే అర్ధంతో పాటు నిషేధించడం అనే
అర్ధం కూడా ఉంది.
ఘోర మైన ఒట్టు పెట్టుకుని, జీవితాంతం
తను పెట్టుకున్న ఒట్టుకి కట్టు బడిన
వారిలో మొదట చెప్పుకో తగిన వాడు భారతంలో భీష్ముడు. శంతన మహారాజు దాశరాజు కుమార్తె
సత్యవతిని చూసి, ఆమెను వివాహమాడాలను కున్నాడు. తన బిడ్డకు పుట్టబోయే వారికి
సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత ఉండదు కనుక శంతనుడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి
చేయడానికి దాశరాజు ససేమిరా కుదరదన్నాడు.
తండ్రి మనో గతం తెలుసుకున్న భీష్ముడు
( అప్పటికతని పేరు దేవ వ్రతుడు ) శంతనుని పెద్ద కొడుకైన తాను రాజ్యాన్ని
ఆశించననీ, సత్యవతి పుత్రులే రాజ్యాన్ని పాలిస్తారనీ శపథం చేసాడు.
అప్పటికీ దాశరాజు తన కుమార్తెను శంతనుడికివ్వడానికి ఒప్పు
కోలేదు. దేవ వ్రతుడు రాజ్యం వొదులు కున్నా అతనికి పుట్టబోయే వాళ్ళు రాజ్యం వొదులు
కోరని నమ్మక మేమిటని అతని సందేహం. దానితో దేవవ్రతుడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి
పోతానని భీషణమైన ప్రతిన చేసాడు. ఘోరమయిన ఒట్టు పెట్టాడు. అప్పటి నుండీ అతడు
భీష్ముడయ్యేడు !
భీష్ముడు పెట్టిన ఒట్టు ఇలా ఉంది :
వినుఁడు ప్రసిద్ధులైన పృధివీపతు లిందఱు
నే గురుప్రయో
జనమునఁజేసితిన్ సమయసంస్థితి యీ లలితాంగి
కుద్భవిం
చిన తనయుండ రాజ్యమును జేయఁగ నర్హుఁడు
వాఁడ మాకు నె
ల్లను బతి , వాఁడ
కౌరవకులస్థితికారుఁడుదార సంపదన్ !
‘‘ఇక్కడ సమావేశమయిన రాజు లందరూ వినండి ! నేను మా
తండ్రిగారి కోరిక నెరవేర్చడం కోసం స్థిరమైన ప్రతిఙ్ఞ చేస్తున్నాను.ఈ దాశరాజు
కుమార్తె సత్యవతికి మా తండ్రి గారి వలన పుట్టబోయే వాడేరాజ్యాధికారం పొందుతాడు.
అతడే మాకందరికీ ప్రభువు. అతడే కురువంశ ఉద్ధారకుడవుతాడు ! ’’
ఇదీ భీష్ముడి ఒట్టు ...
అలాగే మహా భారత కథలో ఇలాంటి భీషణమైన
ఒట్లు పెట్టిన వారిలో భీము
డొకడు ! భీముడు పెట్టిన ఒట్లు (శపథాలు)
లో రెండు చాలా ప్రసిద్ధమైనవి.
వాటిని చూదాం :
కురువృద్ధుల్ గురు వృద్ధ బాంధవు లనేకుల్
సూచుచుండన్ మదో
ద్ధుకుఁడై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్
దుశ్శాసనున్ లోకభీ
కర లీలన్ వధియించి, తద్విపుల వక్షశ్శైలరక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి సూచు చుండ నని
నాస్వాదింతు నుగ్రాకృతిన్ !
‘‘ఈ కురు వంశపు పెద్దలు, గురువులు, వృద్దులు ,
బంధువులు చాల మంది చూస్తూ ఉండగానే ఈ దుష్ట దుశ్శాసనుడు మదంతో, కండ కావరంతో ద్రౌపదిని
ఇలా అవమానించాడు ... దుర్యోధనుడు చూస్తూ ఉండగానే రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో
వీడిని లోక భీకరమైన రీతిలో వధిస్తాను ! వీడి వక్ష స్థలం అనే పర్వతం లోని రక్త
ప్రవాహం అనే సెలయేటిని భయంకరాకారంతో త్రాగుతాను ! ’’
అంటూ ఒట్టు పెట్టుకున్నాడు భీముడు, అంతే
కాక, తరువాతి వచనంలో ‘‘ నేనలా చేయక పోతే, నేను
తండ్రి తాత మార్గానికి తప్పిన వాడినే అవుతాను ! ’’ అని కూడా మరో ఒట్టు పెట్టు కున్నాడు !
భీముడు చేసిన
మరో శపథం ( పెట్టిన ఒట్టు ) :
ద్రౌపది తనకి కీచకుడి చేతిలో జరిగిన
భంగపాటుని ఒంటరిగా భీముడిని కలుసుకుని విలపిస్తూ చెప్పుకుంది. భీముడు భార్యను
ఓదారుస్తూ, కీచకుడినీ అతని కుమారులనూ కూడా వధిస్తానని ఒట్టు పెట్టాడు. విరాట సర్వం
లోని ఈ పద్యం కూడా చాలా ప్రసిద్ధం !
చూడండి :
అవనీ చక్రము సంచలింపఁగ, దివం బల్లాడ, నాశాచయం
బవధూతంబుగ గోత్రశైల నికరం బాకంపముం బొంద,
న
ర్ణవముల్ ఘూర్జన మొందఁ గ్రోధము
గృతార్ధత్వంబు నొందించి, చి
త్రవధ ప్రౌఢి వహించి సూతునకు
రౌద్రంబేర్పడం జూపుదున్ !
‘‘ భూమండలం కంపించే విధంగా, ఆకాశం అల్లల్లాడి పోయే
లాగా, దిక్కులు పిక్కటిల్లేలా, కుల పర్వతాలు వణికి పోయే తెరగున, సముద్రాలు
కల్లోలమై పోయేటట్లు, నా క్రోధం సఫల మయచ్యే విధంగా చిత్రవధ చేసే నా నేర్పుని
చూపిస్తూ ఆ కీచకుడిని అంతం చేస్తాను ! ’’
ఇక, గయోపాఖ్యానంలో అర్జుడు పెట్టిన ఒట్టు
పద్యం కూడా జనాలకి చిర పరిచితమే ..
నదిలో అర్ఘ్య ప్రదానం చేస్తున్న
శ్రీకృష్ణుని చేతిలో గయుని నిష్ఠీవనం ( ఉమ్మి ) పడింది! కృష్ణుడు ఆగ్రహంతో ఊగి
పోయి, గయుని వధిస్తానని శపధం చేసాడు. గయుడు పరువెత్తి పోయ అర్జునుని శరణు వేడాడు.
అప్పుడు అర్జునుడు ఒట్టు పెట్టి మరీ అతనికి అభయ మిచ్చాడు.
పద్యం చూడండి :
నిటలాక్షుండిపు డెత్తి వచ్చినను రానీ ! యన్నదమ్ముల్నను
న్విటతాటంబున బాసి పోయినను పోనీ !
కృష్ణఁడే వచ్చి, ‘వ
ద్దిటు పార్ధా ! ’యననీ
! మఱేమయిన గానీ, లోకముల్బెగిలం
బటు దర్పంబున నిల్చి యీ గయుని ప్రాణంబేను
రక్షించెదన్ !
‘‘ ఆశివుడే నామీద దండెత్తి రానీ ! అన్నదమ్ములు నా
మీద కినుకతో నన్ను విడిచి పోతే పోనీ ! సాక్షాత్తు శ్రీకృష్ణడే వచ్చి, ‘‘అర్జునా ! వద్దు గయుని కాపాడ వద్దు ’’ అననీ !ఇంకేమయినా కానీ, లోకాలు అదిరిపోయేలాగున
నిలబడతాను. ఈ గయుని కాపాడుతాను ! ’’
ఇక, మనందరికీ ‘‘ఆవు
– పులి ’’ కథ తెలిసిందే
కదా ! అనంతామాత్యుడు భోజరాజీయంలో గోవ్యాఘ్ర సంవాదం అనే ఘట్టంలో ఈ కథ రసరమ్యంగా
చెప్పాడు
తనని చంపి
తినెయ్యడానికి సిద్ధపడిన పులిని ఆవుఎన్నో విధాలుగా బ్రతిమాలుకుంది. ఇంటి దగ్గర
ఉన్న ఒక్కగా నొక్క చిన్నారి కొడుక్కి పాలిచ్చి వెంటనే వచ్చేస్తాను. అప్పుడు నన్ను
చంపి తిని నీ ఆకలి తీర్చుకో ! అని వేడుకుంది. ఎన్ని చెప్పినా పులి విన లేదు.
అప్పుడు ఆవు చాలా ఒట్లు పెట్టి, పులికి నమ్మకం కలిగించింది.
ఆ ఒట్లు
ఏమిటంటే ...
‘‘ ఓ పులి రాజా ! నేను నీకు మాట
ఇస్తున్నాను. ఒట్టు పెడుతున్నాను. నేను ఇంటికి పోయి, తిరిగి నీ దగ్గరకి రాక పోతే
...
1. పరాయి
ఆడదాని పొందు కోరిన యతి ఏ గతికి పోతాడో, నేనూ అదే గతికి పోతాను ! ఒట్టు !
2.మధ్యవర్తిగా
ఉంటూ, పక్షపాత బుద్ధితో తగవు చెప్పే వాడు పోయే నరకానికే నేనూ పోతాను !
3.నమ్మి
ఎవరయినా తన ధనం దాచుకుంటే తిరిగి ఇవ్వకుండా మోసం చేసే వాడు పోయే గతికి నేనూ పోతాను
!
4.శుభ
కార్యాలు జరిగే చోట వాటిని పాడు చేసే వాడు పోయే చోటికే నేనూ పోతాను
5.
మిత్రుడిలా చేరి, శత్రువులా వ్యవహరించే వాడు పోయే దుర్గతికే నేనూ పోతాను
6.ఆవులకి
గడ్డి వేయకుండా అవి మలమలమాడుతూ ఉంటే, తాను మాత్రం కడుపు నిండా తినే వాడు ఏ గతికి
పోతాడో, నేనూ అదే గతికి పోతాను
7.పశువులను ఏ
తప్పూ లేకుండా దండించే వాడు పోయే చోటుకే నేనూ పోతాను.
8.పరస్త్రీల
పొందు ఆశించే వాడు పోయే గతికే నేనూ పోతాను.
9.జీతం
తీసుకుంటూ ప్రభువుల పని చేయని పాతకుడు పోయే చోటికే నేనూ పోతాను.
10.దుర్భాషలు
పలికి పెద్దలను బాధ పెట్టే పాతకుడు పోయే గతికే నేనూ పోతాను.
11.తల్లి
దండ్రులను ఎదిరించే నీచుడు పోయే నరకానికే నేనూ పోతాను.
12.హా యిగా
మేస్తున్న పశువులను అదిలించే వాడు పోయే చోటికే నేనూ పోతాను.
13.మిట్ట
మధ్యాహ్నం వేళ ఆకలితో వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించి వేసే నీచుడికి ఏ
గతి పడుతుందో అది నాకూ అదే పడుతుంది.
14.డబ్బు
కోసం తన కన్న కూతురిని ముసలాడికి ఇచ్చి పెళ్ళి చేసే వాడు
ఏ నరకాన
పడతాడో నేనూ అక్కడే పడతాను
15. ఏ తప్పూ
చేయని భార్యని విడిచి పెట్టే వాడు పోయే నరకానికే నేనూ పోతాను.
16.తన
వాళ్ళంతా తిండీ తిప్పలూ లేకుండా దరిద్రంతో బాధ పడుతూ ఉంటే, తాను దుబారా ఖర్చు చేసే
వాడు ఏగతికి పోతాడో, నేనూ అక్కడికే పోతాను.
17.ఇస్తానన్న
దానం ఇవ్వని వాడూ, అందు కోసం చాలా సార్లు
దాన గ్రహీతను త్రిప్పే వాడూ పోయే చోటికే నేనూ పోతాను. ’’
ఇలా ఆవు ఎన్నో ఒట్లు పెట్టుకుంటే కానీ, పులి
దానిని విడువ లేదు. ఇంటికి పోయిన ఆవు బిడ్డకి పాలిచ్చి మాట నాలుపు కుందే కానీ, ఆ ఒట్లన్నీ తీసి గట్టు మీద పెట్టెయ్య లేదు ! (
గో మాతల నైజం ఇప్పటికీ ఇంతే కదా ! )
ఇలా
చెప్పుకుంటూ పోతే దీనికి అంతూ పొంతూ ఉండదు.
కనుక, ఇక
ప్రస్తుత కాలానికి వద్దాం ...
ఏలిన వారు
పదవిని స్వీకరిస్తూనే చట్ట సభల సాక్షిగా ఎన్నో ఒట్లు పెడతారు. వాటిలో చాలా వాటిని
మరునాడే మరచి పోయే వాళ్ళే ఎక్కువ !
నాతిచరామి !
అంటూ పెళ్ళిలో ఒట్లు పెట్టే మొగుళ్ళు ఎంత మంది ఆ ఒట్లు తరువాతి కాలంలో గుర్తుంచు
కుంటున్నారో ఆలోచించాలి.
నాయకులు చట్ట
సభల్లోనూ, వేదికల మీదా, పిల్లకాయలు బళ్ళలోనూ చాలా ఒట్లు పెడుతూనే ఉంటారు. వాటిలో
సగం నిలుపుకున్నా బాగుండేది.
మామూలు జనం
కూడా అయిన దానికీ కాని దానికీ కూడా ఒట్టు పెట్టి చెబుతూ ఉంటారు. నీ మీద ఒట్టు !
పిల్లల మీద ఒట్టు ! అంటూ ...కానీ సాయంత్రానికి పరగడుపే !
పండుగలకీ,
పబ్బాలకీ, నూతన సంవత్సరారంభ దినాన ... ఇలా ప్రత్యేక దినాలలో ఒట్లు పెట్టుకునే
వాళ్ళ సంఖ్య కి లెక్క లేదు ! ఏవేవో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ, స్వగతంగానో,
బహిరంగంగారో ఒట్లు పెట్టు కుంటూ ఉంటారు !
అవన్నీ తూఛ్
... అయి పోడానికి చాలా మందికి ఎక్కువ సమయం పట్టదు !
అమ్మ తోడు !
సరస్వతి తోడు ! అనేవి యాదాలాపం మాటలుగా మిగిలి పోతున్నాయి !
మన సినిమాల
వాళ్ళు కూడా ఈ ఒట్లమీద చాలానే సనిమాలు తీసారు. పెళ్ళి నాటి ప్రమాణాలు ... వాగ్గానం
... మంగమ్మ శపథం, చాణక్య శపథం ... ఇలా ... ఎన్నో ! చేతిలో చెయ్యేసి
చెప్పు బావా ! అని కోరుకునే హీరోయిన్ కి చేతిలో చెయ్యేసి మరీ ఒట్టు పెట్టిన హీరో
తరువాత ఏం చేస్తాడో వెండి తెర మీద చూడాలి. నాకయితే గుర్తు లేదు.
లోగడ అయితే
ఒట్టు పెడితే జనాలు నమ్మే వారు. గుడిలో దీపం ఆర్పి ఒట్టు పెట్టి నిజం చెబితే నమ్మే
వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరూ ఎవరినీ, దేన్నీ నమ్మరు. అలా నమ్మ లేనంతగా
దిగజారి పోయేం !
అందు చేతనే,
ఏ గట్టు మీద చూడండి ... అసంఖ్యాకంగా ఒట్లు
కనిపిస్తాయి !
కనిపిస్తాయి !
ఇప్పటికి స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి