27, అక్టోబర్ 2014, సోమవారం

అనుకోని అతిథితో అర క్షణం సేపు !

ఇవాళ మా ఇంటికి వో అనుకోని అపురూప మయిన అతిథి రావడం జరిగింది. ఆ అతిథితో  కాస్సేపు జనాంతికంగా సాగిన సంభాషణ సారం మీ ముందు ఉంచుతున్నాను.
అతిథి :  ‘‘ బావున్నారా ? ! ’’
నేను : ‘‘ ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ! నన్ను నేనే నమ్మ లేక పోతున్నా ననుకో !
నా కళ్ళు నిజమే చెబుతున్నాయా ! ఎప్పుడో, చిన్నప్పుడు  పల్లెటూర్లో మా యింటి నడి వాకిలిలో  మీరంతా పిల్లా పీచూతో సమావేశ మవుతూ ఉండే వారు కదూ !  అప్పుడు మురిపెంగా మిమ్మల్ని చూసే వాళ్ళం ! తరువాత చూడ్డమే అరుదయి పోయింది ... ఎలా ఉన్నారు ? ’’
అతిథి : ‘‘ ఎందుకులే, చెప్పు కుంటే కడుపు తరుక్కు పోతుంది. ఎందుకో తెలీదు కానీ,  మేం పిట్టల్లా రాలి పోతున్నాం ! మా కుటుంబాలకు  కుటుంబాలే కూలి పోతున్నాయి. ఆ దేవుడికి మా మీద దయ లేదు ! అక్కడా అక్కడా ఒకటీ అరా మిగిలేం.’’
నేను: ( బాధగా ) అవును .. నేనూ విన్నాను,  అంతర్జాలంలో ఆ వివరాలు చదివేను కూడా
అతిథి : ‘‘  ఏం రాసేరేం ? ’’
నేను: అంతర్జాలం నుండి నేను సేకరించిన కథనం ఇలా ఉంది చూడు ...

‘‘పిచ్చుకలు మన చిన్ననాటి నేస్తాలు. పదిహేను, ఇరవై యేళ్ళ క్రితం వరకూ పిచ్చుకలు లేని చోటంటూ కనపడేది కాదు. ముఖ్యంగా భారత దేశ గ్రామాల్లో అవి దాదాపు పెంపుడు పక్షులుగా కనపడుతుండేవి. పొద్దున లేచింది మొదలు దైనందిన జీవితంలో మనుషులు చేరే ప్రతి చోటా పిచ్చుకలూ చేరి తమ కార్యకలాపాల్లో మునిగితేలుతుండేవి. ఇంటి చూరులో, కిటికీ తలుపులపైనా, స్కూలు గది గోడలపైనా, చెట్ల కొమ్మల చివర్లలో, బట్టలు ఆరేసుకునే దండేలపైనా, పొట్ట పోసుకున్న వరి చేలల్లో, బిళ్లంగోడు ఆడే తుమ్మ తోపుల్లో, ఎండాకాలపు సీతమ్మ చెట్లపైనా, గుళ్ళు గోపురాలపైనా ఎక్కడికెళ్ళినా పలకరిస్తుండేవి.
పరిశీలనా పరులకి పిచ్చుకల జీవనం ఆసక్తిగా ఉండేది. స్నేహం చేయడం, జంట కట్టడం, సందర్భానికి తగినట్లు కిచ కిచచప్పుళ్లు మార్చడం, ఆడ మగ పిచుకలు ఊసులాడుకోవడం, చిన్న చిన్న పురుగుల్ని ముక్కున పట్టి పిల్ల పిచ్చుకల నోట్లోకి నెట్టడం, నిపుణులైన ఆర్కిటెక్చర్ ఇంజనీర్లలా ఒక్కో పుల్లా, పీచూ తెచ్చి గూళ్లు అల్లడంఎన్నని? పరిసరాల్ని మర్చిపోయేలా చేసేవి. ఒక్కో మనిషీ పెరిగి పెద్దయ్యే క్రమంలో వివిధ సందర్భాల్లో పిచ్చుకలతో అనుభవం కొండ గుర్తులుగా ఉండేవి.
ఇప్పుడు పిచ్చుకలు దాదాపు కనుమరుగైనాయి. ప్రకృతినంతటినీ అదుపులోకి తెచ్చుకున్న మనిషి అవసరాలకు మించి ప్రకృతి వనరుల్ని ఖర్చు చేసేస్తున్నాడు. ఇతర పశు, పక్షు జాతులకి ప్రకృతిని దూరం చేస్తున్నాడు. భూ వాతావరణాన్ని తోటి జీవజాలానికి పనికి రాకుండా చేస్తున్నాడు. పరిమితికి మించి వనరుల్ని తవ్వి తీస్తూ వాతావరణ వ్యవస్ధని అస్తవ్యస్తం చేయడంతో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి పిచ్చుకలకి మరణ శాసనంగా మారింది. మారుమూల ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోయిన సెల్ టవర్లు పిచ్చుకలు అంతరించిపోవడానికి కారనమని పరిశోధనలు చెబుతున్నాయి. టవర్ల నుండి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల ధాటికి సున్నిత ప్రాణులైన పిచ్చుకలు చనిపోతున్నాయని ఆ పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రపంచం మొత్తం మీద పిచ్చుకల సంఖ్య ఎనభై శాతం పడిపోయిందని ఆర్నితాలిజిస్టులు సర్వే చేసి లెక్కతేల్చారు. పిచ్చుకల దైన్యానికి ఇక్కడ మనిషికారణంగా జనరలైజ్ చెయ్యడం కూడా సరికాదేమో. ఎందుకంటే మనుషుల్లో తొంభై శాతం మంది పశు పక్ష్యాదులకు స్నేహ శీలురే. భూములూ, కంపెనీలు అదుపులో పెట్టుకున్న కొద్ది మందే భూ వినాశనానికీ, వాతావరణ విధ్వంసానికీ కారణం అవుతున్నారు. వీరి లాభాపేక్ష మెజారిటీ ప్రజలతో పాటు ఇతర జీవ జాలానికి కూడా ప్రాణాంతకంగా మారింది.
ఈ నేపధ్యంలోనే 2012, మార్చి 20 తేదీని ప్రపంచ పిచ్చుకల రోజుగా ప్రకటించారు. ఎన్ని రోజులుప్రకటించినా పర్యావరణాన్ని విధ్వంసం చేసే ఆర్ధిక దోపిడీ విధానాలు అంతం అయ్యేవరకూ ఈ పరిస్ధితి కొనసాగుతూనె ఉంటుంది. మనిషి సుఖ జీవనానికి పశు, పక్ష్యాదులు కూడా దోహదం చేస్తున్నాయన్న స్పృహ లాభాపేక్ష కు ఉండదు. ఏం చేసయినా, శ్రామికుల సుఖ సంతోషాల్నీ ప్రాణాల్నీ కబళించయినా, పశు పక్ష్యాదుల వాటాని లాక్కునయినా లాభ శాతం పెంచుకోవాలని చూసే పెట్టుబడిదారీ వ్యవస్ధకు తనకు తాను మరణ శాసనం లిఖించుకుంటోదన్న సృహ కూడా ఉండదు. మేల్కోవలసిందే శ్రామికులే. ’’

అతిథి: ‘‘ ఇంత  చక్కని సమాచారాన్ని అందించిన వారికి నీతో పాటూ మేము కూడా ఋణ పడి ఉంటాము. సరే ... మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకునేందుకు వచ్చేను. ఇక్కడ మీ జనావాసాల మధ్య ఈ మధ్య వో సెల్ టవరు కట్టేరు. పూర్తయిన ఆ టవరుని ఏమయిందో, ఏమో నాలుగు రోజులకే  తొలిగించి వేసారు కదూ ... ఇక్కడి వాళ్ళంతా అంగీకరించక పోవడంతోనే దానిని తొలగించారని చెబుతున్నారు.  అందుకే మీకు ధన్యవాదాలు చెప్పు కుందామని ఇలా వచ్చేను. మరి వెళ్తాను ...’’
నేను : ‘‘ అదేం, వచ్చి అర క్షణం కాలేదు ..కాస్సేపు ఉండ రాదూ ; ...’’
నా మాటలు ఇంకా పూర్తి కానే లేదు, మా  ఇంటి కొచ్చిన అపురూప అతిథి తుర్రున ఎగిరి పోయింది !
మా చిన్నప్పుడు మా పల్లెలో మా ఇంటి నడి వాకిలిలో మా నాయనమ్మ కట్టిన వరి కంకుల మీద గుంపులు గుంపులుగా వచ్చి సందడి చేసేవి. మా రైతులు బళ్ళతో ధాన్యాన్ని తోలు కొచ్చి, మా వీధిలో మా ఇంటి ముందు  నిల బెట్టే వారు. మా ఇంట్లో ముత్తయిదువులు ఎద్దులకి పసుపు కుంకుమలు పూసి, హారతి ఒచ్చి పూజలు చేసాక, ధాన్యం బస్తాలను ఇంట్లోకి తెచ్చి, గాదె గదిలో కుమ్మరించే వారు . ధాన్యం బస్తాలతో పాటు ఆనప కాయలూ, బీర కాయలూ వంటి కూరలు కూడా  తెచ్చే వారు. ధాన్యం బస్తాలన్నీ ఇంట్లో చేరాక, పెరట్లో నుయ్యి దగ్గరకి వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కునే వారు రైతులు . నలుగు రయిదుగురు ఉండే వారనుకుంటాను. ఒక ప్రక్క ధాన్యం బస్తాలు ఇంట్లోకి పెరుగుతూ ఉండగానే ఇంట్లో మా నాయనమ్మా , వాళ్ళూ రైతుల కోసం వేడి వేడి అన్నం, సాంబారూ  ( పప్పు పులుసునీ ) వండి సిద్ధం చేసే వారు. పెరటి వాకిలి గచ్చు మీద విస్తరాకులు వేసి వడ్డించే వారు. ఆ వంటని మా రైతులు ఎంత ఇష్టంగా తినే వారో ! ‘ బుగతమ్మ చేతి వంట అమృతం ! ’ అంటూ మెచ్చుకునే వారు. మా నాయ నమ్మ పోయాక, మా మురళీ పిన్నీ, తర్వాత, మా ఆవిడా, కటి రెండేళ్ళు ఆ బాధ్యత కొత్తగా కాపురాని కొచ్చిన మా ఆవిడ తీసు కుని చేసేరు


ఇదంతా చెప్పడం దేనికంటే, ఇంటికి ధాన్యం బస్తాలు వచ్చిన రోజునే, పొలం నుండి రైతులు తెచ్చిన వరి కంకుల గుత్తులను మా వాళ్ళు మా ఇంటి నడి వాకిట్లో కట్టే వారు. అది మొదలు ! ఆ రోజు నుండీ పిచ్చుకలు గుంపులు గుంపులుగా వచ్చి వాలేవి.  అలా,  అప్పుడు మా ఇళ్ళలోనూ. పెరళ్ళలోనూ విరివిగా కనబడే పిచ్చుకలు ఇప్పుడు  చాలా ఏళ్ళుగా  కనబడడమే మానేసాయి. పొలాలు అమ్ము కున్నాక, మా నడి వాకిలిలో రైతులూ లేరు, ధాన్యం బస్తాలూ లేవు, వరి కంకులూ లేవు. పిచ్చుకలూ లేవు !. 
చాలా ఏళ్ళకి మా కంట పడిన అపురూప అతిథిని మీకూ చూపించాలని ముచ్చట కొద్దీ ఇంత వివరంగా రాసేను.

ఇదిగో  ! మా ఇంటి కొచ్చిన అపురూప అతిథి ఫొటో ... చూడండి ....
నిర్మాణం పూర్తయి, తిరిగి నాలుగు రోజులలోనే తొలగించిన సెల్ టవర్ అవశేషాలు యివే ... ( దీనిని తొలగించిన మరు నాడే అతిథి రావడం  జరిగింది. యాదృచ్ఛికమే కావచ్చు కానీ అదొక అందమయిన భావనకు బీజం వేసింది ) చిత్రం  చూడండి.