2, నవంబర్ 2015, సోమవారం

పూల బాసలు !


తెల తెలవారుతూ ఉంటే, నిద్ర లేచి, కళ్ళు నులుముకుంటూ, బద్ధకంగా బాల్కనీ లోకో, పెరట్లోకో వెళ్ళి చూస్తే .... నిన్న మొగ్గ తొడిగిన కొమ్మకి అందమైన పువ్వొకటి కనిపించిందనుకోండి ! ఓహ్! ఆ ఆనందం అంతా ఇంతా కాదు. నవ జాత శిశువుని చూసి, పరవశించి పోయే తల్లి మనసు ఎలా ప్రఫుల్లమవుతుందో, అలా , పరవశించి పోతాం కదూ? ... ఆ పూల చెట్టు మీ చేత్తో నాటి, దోహదం చేసినదయితే, ఆ ఆనందం ద్విగుణీకృతం అవుతుంది.
ఆ వికసిత పుష్పానికి అన్ని రంగులు అద్ది, అన్ని సొగసులు దిద్ది, అన్ని నయగారాలు కూర్చి, అంత సౌకుమార్యాన్ని చేర్చి, అందాలు పేర్చి అందించిన ఆ అదృశ్య హస్తం ఎవ్వరిదా అని విస్తు పోతాం!
పూలు పలకరిస్తాయి. పూలు ఊసులు చెబుతాయి. కొన గోటితో త్రుంచ బోతే విలపిస్తాయి. తల్లి కొమ్మనుండి, తండ్రి రెమ్మ నుండి , నిర్దయగా వేరు చేయ బోతే, వద్దని వేడుకుంటాయి. దీనంగా అర్ధిస్తాయి.

అలాంటి పువ్వులను గురించి కొన్ని కబుర్లు ఇవాళ చెప్పుకుందామా?

అలరు, కుసుమము, నన, విరి, పుష్పము, పూవు, ప్రసవము, ప్రసూనము, ఫల్యము, లతాంతము, సుమము, సూనము, సౌమనస్యము ...వీటన్నింటికీ పువ్వు అనే అర్ధం

( ఇంకా ఉన్నాయి లెండి !)

పూలలో ఉండే మకరందాన్ని తుమ్మెదలు స్వీకరిస్తాయి. అందుకే కవి ‘ పూల కంచాలలో రోలంబులకు, రేపటి భోజనము సిద్ధ పరచి పరచి ... ’ ఆ దేవ దేవుడు ఎంత అలసి పోయాడో అని బెంగ పడతాడు.

విరహతాపాన్ని పెంచి, స్త్రీపురుషులను ఏకశయ్యానువర్తులుగా చేసే మన్మథుడికి కుసుమాయుధుడు, పుష్పబాణుడు, అలరు విల్తుడు ... ఇలాంటి పేర్లు ఉన్నాయి. పూల బాణాలు ధరించిన వాడు అని వాటి అర్ధం,

మదనుడు పంచ బాణుడు. ఐదు రకాల పూలను బాణాలుగా ఉపయోగించే వాడు. ఆ అయిదు రకాలూ ఏమిటో తెలుసా?

అరవిందము, అశోకము , చూతము , నవ మల్లిక, నీలోత్పలం.
సరే, పూలు పలకరిస్తాయి అనుకున్నాం కదూ? ... చూడండి :

పూల బాసలు తెలుసు యెంకికీ, తోట
పూల మనసు తెలుసు యెంకికీ!
పూల మొక్కల నీటి జాలుగని నిలుసు
పూలన్ని నీ పాటె
ఆలించె నంటాది !

పూల బాసలు తెలుసు యెంకికీ ...అని, నండూరి వెంకట సుబ్బారావు గారు ఎంకి పాటల (కొత్త పాటల) లో పూల బాసల గురించి చెప్పారు.

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపంలో తనని త్రుంచబోయిన వాని గుండె కరిగి పోయేలా విలపిస్తూ తన గోడు చెప్పుకున్నది. మా ప్రాణము తీతువా ! అని బావురుమన్నాయి. తల్లి ఒడిలో చిగురుటాకుల శయ్య మీద హాయిగా నిదురించే మమ్ము చిదిమి, అమ్ముకుంటావా? మనసు లేని నీ పూజ లెందుకోయి ? అని అడిగాయిట, పూలు...
మా ఆయువు నాలుగు గడియలే కదా, ఆయువు కలిగినంత దాక మా తీవ తల్లి చేతులలో హాయిగా ఊయలలూగుతూ మురిసి పోతూ ఉంటాము. ఆయువు తీరాక ఆ తల్లి పాదాల చెంతనే రాలి పోతాము

మా పూల సువాసనలతో గాలి పరిమళిస్తుంది. తుమ్మెదలకు తేనెల విందు చేస్తాము. మీ వంటి వారి కన్నులకు కనువిందు చేసి హాయిని కలిగిస్తాము. అలాంటి మమ్మలని చిదిమి వేయడం తగునా ? తల్లీ బిడ్డలని వేరు చేస్తావా ?

మమ్ములను త్రుంచడం వల్ల నీ చేతులు మా రక్తధారలతో తడిసి పోతాయి. అలాంటి నెత్తురు పూజని పరమేశ్వరుడు స్వీకరించడు సుమా!

నువ్వే కాదయ్యా, మీ ఆడువారూ మాకు హాని చేయడంలో ఏమీ తక్కువ తిన లేదు ...

ఊలు దారాలతో గొంతుకురిబిగించి,
గుండె లోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి,
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట ! దయ లేని వారు మీ ఆడువారు !

మా నెత్తురులతో చేసిన అత్తరులను మీ కంపు గొట్టు దేహాల మీద అలము కుని శయ్యల మీద వెద జల్లు కుని రాత్రంతా దొర్లుతారు. సిగ్గు లేదూ?

మా వెల లేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి, నశించి పోయె , మా
యౌవన మెల్ల కొల్ల గొని ఆ పయి చీపురు తోడ చిమ్మి, మ
మ్మావల పార బోతురు గదా ! నరజాతికి నీతి యున్నదా?

అని పూలు చీవాట్లు పెట్టాయి ....

గౌతమీ కోకిల బిరుదాంకితులు వేదుల సత్య నారాయణ శాస్త్రి గారి కాంక్ష కవితా ఖండికలో పూల మనోభావాలు ఎలా ప్రతి ఫలించాయో, చూడండి ... మచ్చుకి ఒకటి రెండు పద్యాలు ...

పేదల రక్త మాంసములఁబెంపు వహించి, దయా సుధా రసా
స్వాద దరిద్రు లైన ధనవంతుల పెద్దరికమ్ముకై మతో
న్మాదము పెంచు దేవునికి మారుగ నిల్చిన రాతి బొమ్మలం
దూదర వోవు పాడు బ్రతుకొక్క నిమేషము సైప నాయెదన్

పేదల రక్తమాంసాలతో బలిసి, దయ ఒక్కింత కూడ లేకుండా, మతోన్మాదాన్ని ఎక్కువ చేస్తూ, దేవుడి పేరుతో నిలబెట్టిన రాతి బొమ్మల మెడలలో పూజకై నిలిచి, వాడి పోయే ఆ పాడు బ్రతుకు నాకు వద్దు.

కానుకనై ధరాధిపుల కాళ్ళ కడం బొరలాడి వాడి పో
లేను, ధరా పరాగపటలీ మలినమ్మగు ద్వార తోరణా
స్థానము నందురింబడఁగ జాలను, దోసిట పేరి ఘోర కా
రా నరకమ్ము నందుసురు రాల్పగ లేను నిమేష రక్తికై

మీ క్షణికానందం కోసం - రాజుల కాళ్ళ దగ్గర కానకనై పొర్లి వాడి పోవడం నాకు సమ్మతం కాదు.
ధూళి ధూసరితమైన ద్వారాలకు తోరణాన్నయి ఉరి వేసు కోవడం నాకు నచ్చదు.
మీ చేతుల కారాగారంలో మ్రగ్గి పోలేను.

మరి పువ్వు ఏమి కోరుకుంటున్నది? ... చూడండి ...

నీచపు దాస్య వృత్తి మన నేరని శూరత మాతృ దేశ సే
వా చరణమ్ము నందసువు లర్పణఁజేసిన పార్ధివ
శ్రీ చెలువారు చోటఁ దదసృగృచులన్ వికసించి, వాసనల్
వీచుచు, రాలి పోవగ వలెం దదుదాత్త సమాధి మృత్తికన్

దేశం దాస్యంలో మ్రగ్గి పోవడం సహించ లేక, ధేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వారి పార్ధివ శరీరాలు ఉండే సమాధుల మీద వాసనలు వెదజల్లుతూ వికసించి, అక్కడే, ఆ పవిత్రమైన మట్టి లోనే వాడి వత్తలై పోవడం నాకు చాలా ఇష్టం ...

ఎంత గొప్ప భావనో కదూ , యిది?

మరి కొన్ని పూల ముచ్చట్లు చూడండి ...

పూల కయ్యాలు:

అరణపు కవి నంది తిమ్మన గారి పారిజాతాపహరణం లో పారిజాతపుష్పం కోసం ఎంత రచ్చ అయి పోయిందో మీకు తెలిసినదే కదా!

తగవుల మారి నారదుడు ఒకే ఒక్క పారిజాతం తెచ్చి ,శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. దానినతడు దేవేరి రుక్మిణికి ఇచ్చాడు. ఆ సంగతి సత్యభామకి తెలిసి పోయింది. ఇంకేముంది ! ఆవిడ అలగడం, పతి నుదుటున తన్నడం, అతడామెను బుజ్జగించి, దేవేంద్రుని ఎదిరించి మొత్తం పారిజాతవృక్షాన్నే దేవ లోకం నుండి పెకలించుకుని వచ్చి సత్య ఇంటిలో పెరటి చెట్టుగా నాటడం ... చక చకా జరిగి పోయాయ్ ...

ఆ పారిజాతం మహిమ ( నారదుని మాటల్లోనే ) ఎలాంటిదంటే,

పరిమళము సెడదు, వాడదు
పరువము దప్పదు పరాగభర భరితంబై
నిరతము జగదేక మనో
హరమగు నీకుసుమ రాజమంబుజ వదనా.

ఆ పువ్వుని తనకివ్వక తన సవతి రుక్మిణికి యిచ్చినందుకు కోపించి, ఒళ్ళూ మీదా కానక అలక పానుపు మీద పరుండి, అనునయించ బోయిన మగని కాలితో తన్నిందిట సత్య.

జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునం
దొలగంద్రోచె లతాంగి; యట్లయగు ; నాధల్నేరముల్సేయఁబే
రలుకం జెందిన  కాంత లుచిత వ్యాపారమల్నేర్తురే ?

తన తప్పు సైరింపుమని ఆమె పాదాల కడ తల పెట్టిన నాధుని తలని సత్య ఎడమ పాదంతో తన్నిందిట ! ప్రియ నాధులు తప్పులు చేస్తే, అలక చెందిన ఆడువారు ఉచితానుచితాలు చూడరు కదా ? ... అని, కవి సమర్ధన.

ఈ పద్యం చూడండి:

నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబుఁదెచ్చె, నో
మల్లియ లార ! మీ పొదల మాటున లేడు గదమ్మ తెల్పరే ?

భాగవతంలో పోతన గారి పద్యం ఎంత మనోహరమైనదో చూడండి.

నల్లని వాడు. పద్మాల వంటి కళ్ళు కల వాడు. దయా పూరితములైన చూపుల వాడు, తల మీద నెమలి పింఛం ధరించిన వాడు, నవ్వులు చిందించే ముఖంకలిగిన వాడు, చెలుల మాన ధనాన్ని దోచుకుని పోయాడు. ఓ మల్లియలారా ! ఆ తుంటరి మీ పొదల మాటున కాని ఉన్నాడా, చెప్పరూ ? ... ... అని గోపికలు పూలతో చేసే సంభాషణ ప్రసిద్ధమే కదా.

పూలు కూడా ఊసులాడుతాయని దీని వలన తెలుస్తోంది కదూ?

మహా భారతంలో మరో పూల కయ్యం మీకు తెలిసినదే కదా?

ద్రౌపది ముచ్చట పడిందని, భీముడు సౌగంధికాపహరణం చేయడం, ఆ క్రమంలో హనుమతో చిన్న పాటి కయ్యం, తర్వాత ఆ పువ్వుల కోసం కాపలాదారులతో చేసిన యుద్ధం ... అదో పెద్ద కథ. పూల కధ.

మరొకటి రెండు పూల ముచ్చట్లు .....

పూల చెండుతో ఫ్రియుడొకటంటే, పేము కర్రతో తా రెండనే గడుగ్గాయలూ ...

రాచరికపు రోజులలో గడసరి విటులతో పుష్ప లావికల సరసోక్తులూ ...

చెప్పాలంటే చాలా ఉన్నాయి ....

చెవిలో పువ్వు పెట్టడం ... వంటి నానుడులూ ...

పువ్వులమ్మిన చోటనే కట్టెలమ్మడం వంటి సామెతలూ ...

ఇలా చెప్పుకుంటే పూల బాసలు అనంతం కదూ!

పువ్వులనీ, పసి బిడ్డల బోసి నవ్వులనీ, ఇంద్రధనుస్సులనీ, పురి విప్పిన నెమలి పింఛాలనీ,
చిగురించిన కొమ్మలనీ, రెమ్మలనీ, తలిరాకు తల్పాన మెరిసి పోయే తుహినకణాలనీ, చంద్ర కిరణాలనీ , కోకిలల గొంతులనీ, పిట్టల కువకువలనీ, అందమైన వేకువలనీ, చల్లని సాయంత్రాలనీ, జలపాతాలనీ, ... ఇలా ఎన్నో అందాలని ప్రసాదించిన ఆ దయామయుడికి నమోవాకములతో ..

ఇప్పటికి స్వస్తి.

`