10, అక్టోబర్ 2015, శనివారం

మనం మేకలం కాదు కదా ?ఈ శ్లోకం చూడండి:

ఏకస్య కర్మ సంవీక్ష్య, కరోత్యన్యో2పి గర్హితమ్
గతాను గతికో లోక: నలోక: పారమార్ధిక:

ఎవడయినా ఒక పని చేస్తే, వాణ్ణి చూసి, అది గర్హించ తగినిదే అయినా, మరొకడున్నూ అదే పని చేస్తాడు !

లోకం గతానుగతికమైనది. అంతే తప్ప పరమార్ధం ఏమిటా అని, ఆలోచించేది కాదు. ఇదీ శ్లోకార్ధం.

మనలో చాలా మంది ( నాకేమీ మినహాయింపు నిచ్చు కోవడం లేదు) చాలా తరుచుగా తలకాయని ఇంట్లో ఏ చిలక్కొయ్యకో తగిలించి కానీ బయటకి రాం కదా.

అసలు దానితో పని పడుతుందని కూడా ఎంచేతో అనుకోం కూడా. మరీ విరివిగా వాడేస్తే పదును తగ్గి పోతుందని మనకి లోలోపల భయం కాబోలు !

ఒకడు చేసే దానిలో ఔచిత్యం ఉందో లేదో ఆలోచించే తీరికా మనకి ఉండదు. భేషుగ్గా వాడు నడచిన దారిలోనే నడిస్తే ఓ పనై పోతుందని నమ్ముతాం. కొత్తదీ, సమస్యాత్మక మయినదీ, క్లిష్ట మయినదీ, శ్రమతో కూడు కున్నదీ అయిన త్రోవన వెళ్ళడానికి సుతరామూ మనం చాలా వరకు ఇష్ట పడం.
చక్కని రాజ మార్గ ముండగా ... అనుకుంటూ ఆ త్రోవనే గుడ్డిగా పోవడానికే యిష్ట పడతాం.

అనుసరణ తప్పేమీ కాదు. మేలు బంతి లాంటి ఒరవడిని అనుసరిస్తూ పోవడం అభిలషణీయమే.
పెద్దలు చూపిప బాటలో పయనించడం సముచితమే. కాని, అంధానుకరణ, అంధానుసరణ తప్పేమొ కాస్త ఆలోచించాలి.

ఒక మేక పోయి గోతిలో పడితే మిగతా మేకలు కూడా దానినే అనుసరిస్తూ పోయి అదే గోతిలో పడతాయంటారు.

మనం మేకలం కాదు కదా ?

లోకం గతాను గతికం అనడానికి ఎన్నో ఉదాహరణలు చూపించ వచ్చును.

నా వరకు, ఒక ప్రాక్టికల్ జోక్ చెబుతాను.

ఒక పుణ్య క్షేత్రానికి మేము వెళ్ళి నప్పుడు, అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి. చిన్నవీ, పెద్దవీనూ.

నాకెందుకో చప్పున మీది శ్లోకం గుర్తుకు వచ్చింది. సరే, ప్రాక్టికల్ గా ఆ శ్లోకం లో ఎంత వాస్తవం ఉందో చూదామన్న చిలిపి ఊహ వచ్చింది, (అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి లెండి.)

వెంటనే కిందకి వంగి, ఒక చిన్న పాటి రాయిని ఎంచి, మరీ తీసి, కళ్ళకి అచ్చం మూడు సార్లు అద్దు కున్నాను. తర్వాత, దాన్ని మూడు పర్యాయాలు ముద్దు కూడా పెట్టు కున్నాను. ఆ పిమ్మట దానిని భద్రంగా, భక్తిగా, నా చేతి సంచీలో ఉంచి, ముందుకు సాగేను.

కొంత దూరం వెళ్ళి, వెనక్కి తిరిగి చూసేను.

అంత వరకూ ఆ దారమ్మట మామూలుగా నడుస్తున్న వాళ్ళలో చాలా మంది నాలాగే కిందకి వంగడం, ఓ రాయిని తీయడం, దానిని మూడు సార్లు కళ్ళకి అద్దు కోవడం, మూడు సార్లు ముద్దు
పెట్టు కోవడం, తర్వాత, దానిని వారి జేబులోనో, బేగ్ లోనో, భద్రంగా ఉంచి ముందుకి కదలడం !

(అచ్చం, నేను చేసినట్టుగానే !) ... ఇదీ వరస !

అక్కడ ఆ రోజున నేను తప్ప నా ముందు నడిచిన వారెవరూ అలా చేయ లేదు.

నా తరవాత వచ్చిన వారిలో చాలా మంది మాత్రం నాలాగే చేసారు !

ఇప్పుడు చెప్పండి, గతాను గతికో లోక: కదూ ?
స్వస్తి.