దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు, ప్రియ వక్తృత్వంబు కాణాచి, వి
ద్యా వైదుష్యము దిక్కు, ధర్మమునకున్ దార్కాణ, మర్యాదకున్
ఠా, వౌచిత్యము జీవగఱ్ఱ, హితశిష్ట వ్రాత సంతోషణ
శ్రీ వజ్రాంగి, యజాత శత్రుడు మహీభృన్మాత్రుడే చూడగన్.
దేవ బ్రాహ్మణుల పట్ల అమిత భక్తి శ్రద్ధలు కలవాడు. ప్రియమైన మాటలు పలుకుతాడు. విద్యా వైదుష్యాలకు గతి. ధర్మానికి అతడే ఉదాహరణ ప్రాయుడు. మర్యాద ,ఔచిత్యాలు ఎరిగిన వాడు. మంచి వారినీ, సజ్జనులనూ కాపాడే వాడు, శత్రువులంటూ ఎవరూ లేని వాడు. లోకంలో సాధారణ రాజులలాంటి వాడు కాదు.
ఆవలబోయిన వెన్క నాడుటెన్నడు లేదు
మొగము ముందఱ నంట మొదలె లేదు
మనవి చెప్పిన చేయ కునికి యెన్నడు లేదు
కొదవగా నడుపుట మొదలె లేదు
చనవిచ్చి చౌక చేసినది యెన్నడు లేదు
పదరి హెచ్చించుట మొదలె లేదు
మెచ్చినచో కొంచె మిచ్చుటెన్నడు లేదు
మొక మిచ్చకపు మెచ్చు మొదలె లేదు.
మఱియుఁ దొల్లిటి రాజుల మహిమ లెన్ని
యితఁడె పో సార్వ భౌముఁడత్ప్రతిముఁడనఁగ
బ్రజలఁబాలించె సకల దిగ్భాసమాన
కీర్తి విసరుండు, పాండ వాగ్రేసరుండు
ఎదుట ఒక మాట, వెనుక ఒక మాట అనే దుర్లక్షణం లేదు. కాస్త ముఖం చాటు కాగానే ఆడిపోసుకోడం లేదు. అలాగని ముఖం మీదనే ఫెడీల్మనేలా కటువుగా పలకడం కూడా లేదు.
మనవి చేసుకుంటే, సహాయం చేయక పోవడం ఎప్పుడూ లేదు. అలాగని ఎంతో కొంత ఇచ్చి, చేతులు దులుపు కోవడం కూడ లేదు. ఇచ్చెనా, ఏనుగు పాడి అన్నట్టుగా, ఇవ్వడంలో ఎప్పుడూ తక్కువ చేయడు.
ముందు బాగా చనువు ఇవ్వడం. ఆతరువాత చులకనగా చూడడం ఎన్నడూ లేదు. అలాగే, ఊరికే పొగడ్తలతో ముంచెత్తడం కూడా చేయడు.
మెచ్చు కుంటే ఏదో కొంచెం ఇచ్చి పొమ్మనే రకం కాదు. అలాగని ముఖ ప్రీతి మాటలాడడం, ఇచ్చకాలు పలకడం అసలే లేదు.
వెనుకటి రాజుల గొప్పతనాలు ఎటువంటివో ఆలోచిస్తే, ధర్మ రాజు మాత్రమే చక్రవర్తి అని అర్ధమౌతుంది.
ఎంత లెస్సగ నున్న నంత వేడుక కాని,
ప్రజలకల్మి కసూయ పడుట లేదు
తనుఁగొల్వ వలె నందఱను ప్రియంబె కాని
మానిసి వెగటించుకైనను లేదు
నిచ్చ వేడిన నర్ధి కిచ్చు చిత్తమె కాని
మునుపింత యిచ్చితి ననుట లేదు
రేవగల్ ధర్మ మార్జించు దృష్టియె కాని,
న్యాయంబు దప్పిన నడక లేదు
కలడె యిటువంటి రాజు లోకమున నెందు !
జలధి వలయిత వసుమతీ చక్రమెల్ల
యేల వలె శాశ్వతముగాఁగ నీఘనుండె
యేల వలె నన్యు లన నృపాలుఁడలరె
తన పాలనలో ఉన్న ప్రజలు ఎంత సంపన్నులయితే, ధర్మ రాజు అంతగా సంతోషించే వాడు. అంతే కాని, తన ఏలుబడిలో ఉండే వారికి ఇంత సంపదా ? అని అసూయ పడే వాడు కాదు. అందరూ తన పాలనలో తనని సేవిస్తూ ఉండాలనే రాచరికపు వేడుకే తప్ప, మనుషులంటే ద్వేషం ఎప్పుడూ లేదు. అడిగిన వాడికి అడిగింది ఇవ్వడమే కాని, లోగడ ఇంత ఇచ్చేను కదా, మళ్ళీ అడుగుతావేం !అంటూ కసురు కోవడం లేదు. రాత్రీ పగలూ ధర్మ బద్ధంగా ఉండాలనే ఆలోచనే తప్ప ఎన్నడూ న్యాయ మార్గాన్ని తప్పి ఎఱుగడు.
లోకంలో ఎక్కడయినా ఇంత గొప్ప రాజు ఉన్నాడా? సముద్ర వేలా సర్యంత మయిన ఈ భూమండలాన్ని ఈ ఘనుడైన ధర్మ రాజే శాశ్వతంగా పాలించాలి. వేఱొక ప్రభువు మన కేల? అని ప్రజలు అనుకునే లాగున ధర్మజుడు ఒప్పుతున్నాడు.
కోపమొకింత లేదు, బుధ కోటికిఁగొంగు పసిండి, సత్య మా
రూపము, తారతమ్యము లెఱుంగు స్వతంత్రుడు, నూతన ప్రియా
టోపము లేని నిశ్చలుఁడిటుల్ కృత లక్షణుఁడై చెలంగగా
ద్వాపర లక్షణుండనఁగ వచ్చునొకో యల ధర్మ నందనున్
కోపం ఇసుమంతయినా లేదు. పండిత వర్గానికి కొంగు బంగారం. సత్యమే ఆకారంగా రూపు దాల్చిన వాడు. మంచి చెడ్డలు, బాగోగులు బాగా తెలిసిన వాడు. ఎవరో చెబితే చెప్పుడు మాటలు తలకెక్కించు కోకుండా స్వతంత్రమైన భావాలు కలవాడు.నూతన ప్రయాడంబరాలు లేని వాడు.రాజానో బహు వల్లభా: కదా? కొత్త రుచుల కోసం వెంపర్లాడే వాడు కాదు.ధృడ చిత్తం కలవాడు. ఇన్ని కృత లక్షణాలు కల ధర్మ రాజుని ద్వాపర లక్షణాలు కల వాడని అనడం ఏమి సబవు? కృత యుగంలో వ్యక్తులకు ఉండే లక్షణాలు అన్నీ సంతరించుకున్న వాడని చమత్కారం.
చూడండి. ధర్మ రాజు ఎన్ని గొప్ప సల్లక్షణాలు కల వాడో ! అందులో అన్నో, కొన్నో మంచి లక్షణాలు మనమూ అలవరుచు కోడానికి ప్రయత్నించి చూస్తే పోయేదేముంది చెప్పండి?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి