ఆధునిక కవి కూడా కొడితే కొట్టాలిరా, సిక్సు కొట్టాలీ ... అని తెగేసి చెప్పాడు.
ఈ శ్లోకం చూడండి:
దధతో యుధ్యమానస్య, పఠత: పులకో2థ చేత్
ఆత్మనశ్చ పరేషాం చ , తద్దానం సౌరుషమ్ స్మృతమ్ .
దానమంటూ చేస్తే ఎలా చేయాలయ్యా, అంటే, ఇచ్చే వాడికీ, పుచ్చుకునే వాడికీ, ఇతరులకీ కూడా ఆ దాన వైభోగం చూసి గగుర్పాటు కలగాలి ! ఇంకోలా చెప్పాలంటే తల దిమ్మెత్తి పోవాలి దానం చేడమంటే ఇలాగుండాలి అని ఒక మేలు బంతిలాగ ఉండాలంతే. కుర్రకారు భాషలో చెప్పాలంటే కెవ్వున కేక పెట్టించాలన్న మాట.
అలాగే, యుద్ధం చేస్తే ఆ రణనైపుణ్యం తనకీ, శత్రువుకీ, చూసే వారికీ కూడా ఆశ్చరానందాలను కలిగించేలా ఉండాలి.
అలాగే, దేనినయినా చదివితే చదువరులకు మైమరుపు కలిగించాలి.
అలా ఉండని ఆ దానమూ, ఆ పౌరుషమూ, ఆ పఠనమూ ఒట్టి దండగ మాలి పనులు.
ముందుగా ఒళ్ళు జలదరించే దాన విశేషం గురించి చూదాం ...
వామనుడు రాక్షస రాజు బలి చక్రవర్తిని కేవలం మూడడుగు నేల దానమడిగాడు. సరే ఇస్తానని ఇవ్వడానికి సిద్ధ పడ్డాడు బలి. రాక్షస గురువు శుక్రాచార్యుడు అడ్డు తగిలాడు. అడిగింది ఎవరను కున్నావ్? అడిగింది ఏమిటనుకున్నావ్? అంటూ హెచ్చరించాడు.
మహా దాత బలి వెనక్కి తగ్గ లేదు. ఇలా అన్నాడు. భాగవతంలో పోతన వ్రాసిన గొప్ప పద్యాలలో ఇదొకటి.
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ దనువుపై నంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జములపైఁగపోల తటిపైఁబాలిండ్ల పై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిందగుట, మీదై నాకరంబుంట మే
ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే ? కాయంబు నాపాయమే !?
ప్రియ సతి లక్ష్మీ దేవి శరీర భాగాలను నూతన మర్యాదతో తాకిన ఆ చేయి ఇప్పుడు దానం స్వీకరించడానికి క్రింద ఉంది. దానమిచ్చే నా చేయి ఇప్పుడు మీద ఉంది. ఇంత కంటె భాగ్యం వేరే ఏముంది? ఈ రాజ్యాలూ గీజ్యాలూ ఎల్ల కాలం ఉండి పోతాయా ? దేహం నశించ కుండా శాశ్వతంగా నిలిచి పోతుందా?
ఎంత గొప్ప దానశీలత్వమో కదూ ! దానం అంటే అలా ఉండాలి.
వచ్చిన వాడు ఇంద్రుడని తెలిసినా , సహజ కవచ కుండలాలను ఇచ్చిన కర్ణుడూ. తన శరీర భాగాన్నే కోసి ఇచ్చిన శిబి, తన వెన్నెముకను ఒక మహత్తర దేవ కార్యం కోసం అర్పించిన దధీచి, చాలా దినాలు క్షుద్బాధను అనుభవించి, తరువాత క్షుధార్తుడయిన తనకు లభించిన ఓగిరాన్ని కూడా అర్ధికి ఇచ్చి వేసిన రంతి దేవుడూ .... వీళ్ళూ దాతలంటే. దానం చేయడమంటే అలాగుండాలి.
ఇక యుద్ధం సంగతి చూదాం.
శ్రీనాథుడు చెప్ప లేదూ?
ఎవ్వనితో నెచ్చోటన్
చివ్వకు చేసాచ వలదు. చే సాచినచో
నివ్వల నవ్వల నెవ్వరు
నవ్వక యుండంగ పగ సనన్ తీర్పదగున్
ఎవరితోనూ ఎక్కడా కూడా యుద్ధానికి తలపడనే వద్దు. ఒక వేళ యుద్ధం చేయవలసిన అక్కర పడితే మాత్రం పగ వాడి అంతు చూడనిదే వదల వద్దు సుమా ! చుట్టు ప్రక్కల ఎవరికీ పరిహాస పాత్రమయ్యే లాగున మాత్రం రణం చేయ వద్దు.
యుద్ధ రంగంలో పగవారికి వెన్ను చూపడం కన్నా హీనం మరొకటి లేదు.
ఉత్తర కుమారుని యుద్ధ ప్రాగల్భ్యం తెలిసినదే కదా ?
యుద్ధం చేయకుండా మగిడి వచ్చిన ఖడ్గ తిక్కనను చూసి, రోసి, అతని తల్లి, భార్య వానికి పౌరుషం కలిగించేలాగున ప్రవర్తించారుట. తానమాడడానికి మరుగు, పసుపు ముద్ద సిద్ధం చేసి అవమానించారుట. భోనాల వేళ విరిగిన పాలు పోసారుట. ఎన్నడూ లేని ఈ అనాదరణకి విస్తు పోయి ఖిన్నుడయిన తిక్కనకు తల్లి సమాధానం చూడండి:
పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెందున్?
ముగురాడవార మైతిమి !
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్ ?!
అసదృశముగ నరివీరుల
మసి పుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్
గసవున్ మేయగఁబోయిన
పసులున్ విరిగినవి తిక్క ! పాలున్ విరిగెన్.
యుద్ధంలో పగ వారితో పోరాడ కుండా వారికి వెన్ను చూపి పారి వచ్చిన వాడికి మగతనం ఉండదు కదా నాయనా ! వీరత్వం ఉన్న వారు అలాంటి పందలను మెచ్చుకోరు. ఇప్పుడు ఇంట్లో నీతో కలిపి ముగ్గురం ఆడువారమైనాము కదా ?
ఆడుదానివలె తడికె చాటున ఆ పసుపు రాసుకుని తానమాడి రావయ్యా అని వెటకారం.
పగ వారిని వీరోచితంగా ఉక్కడగించి రానట్టి పిరికి పందని చూసి, పశువుల మనసులు విరిగి పోయాయి. అవి ఇచ్చిన పాలు కూడా విరిగి పోయాయి. ఈవేళకి విరిగిన పాలతో భోజనం కానిద్దూ ! అని అవహేళన.
ఇక, పఠనయోగ్యాలయిన గ్రంథాల గురించి.
మంచి పుస్తకం చదివితే, చదవడం పూర్తయాక కూడా అది మనల్ని వెంటాడి వేధించాలి. ఆలోచింప చేయాలి. అలజడి కలిగించాలి. ఆహా !అనిపించాలి. కానప్పుడు కాల హరణం తప్ప ప్రయోజనం ఉండదు.
అదండీ సంగతి !
స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి