ఓపిక లేని వారు దీనిని దాట వేయ వచ్చును.!
ముందుగానే విన్నవించు కుంటున్నాను. ఇది ఏ వర్గాన్నీ కించ పరచడానికి వ్రాస్తున్నది కాదు. పంచతంత్రంలో ఒక శ్లోకం ఉంది. అందులో పురోహితులూ, సన్యాసులూ తప్పకుండా నరకానికి పోయే అవకాశం గురించిన ప్రస్తావన ఉంది.
చూడండి:
నరకాయ తే మతి శ్చేత్,
పౌరోహిత్యం సమాచర
వర్షం యావత్ కిమన్యేన
మఠచింతాం దినత్రయమ్.
ఈ శ్లోకంలో కచ్చితంగా ఎవరు నరకానికి పోతారో బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు శ్లోక కర్త.
వారెవయ్యా, అంటే,
నీకు నరకానికి పోవాలని కోరిక ఉంటే ఒక యేడాది పాటు పౌరోహిత్యం చెయ్యి !
అంతకాలం ఓపిక లేదనుకుంటే దానికీ ఓ మార్గం ఉంది.
ఒక మూడు రోజులు మఠం గురించి ఆలోచించు. మూడు రోజుల పాటు మఠ ప్రవేశం చేసి చూడు. అంతే, నీకు నరకం తథ్యం !
పౌరోహిత్యం చేసే వాళ్ళూ, సన్యాసులూ తప్పులు చేసే అవకాశం పుష్కలంగా ఉంది కనుక, వారు తప్పకుండా నరకానికి పోవలసిన వారే అని దీని భావం.
నాకున్న ఒకటి రెండు అనుభవాలు ఆలోచిస్తే, కనీసం, నాకు అది నిజమే అనిస్తుంది.
నేను ఉద్యోగ రీత్యా పని చేసే ఒక ఊరిలో ఒక పురోహితుడు ఉదయాన్నే, నాతో పాటు గంగయ్య హొటల్ లో పెసరట్టూ ఉప్మా లు తృప్తిగా తిని, వేడి వేడి కాఫీ కులాసాగా సేవించి, ఆతర్వాత, అవి అరిగే వరకూ వీధరుగుల మీద చీట్ల పేకలో తరించి, ప్రొద్దు తిరిగి, మధ్యాహ్నంఏ మూడింటికో తద్దినం పెట్టడానికి తీరికగా బయలు దేరే వాడు. అంత వరకూ, తద్దినం పెట్ట వలసిన ఇంటి యజమాని, వారి బంధుగణం ఉదయం నుండీ అభోజనంతో ఆకలితో నకనకలాడి పోతూ. నీరసాలు ముంచు కొచ్చి, ఇతని కోసం ఎదురు చూపులు చూస్తూ శోష వచ్చి పడి పోయే స్థితికి చేరు కునే వారు...
ఓ సారి మా మామ గారి ఇంట్లో ఒక భోక్త తీరా భోజనానికి కూర్చున్నాక, తిన లేక తిన లేక నాలుగు ముద్దలు నోట పెట్టుకని భళ్ళున అక్కడే వమనం చేసుకున్నాడుట. కారణం మరేమీ కాదు, డబ్బు కక్కుర్తితో అప్పటికే వేరొక చోట ఆ వ్యక్తి భోక్తగా వెళ్ళి కడుపు నిండా తిని రావడమేనని తెలిసింది.
నేను ఓ కుగ్రామంలో పని చేసే రోజులలో ఒక బ్రాహ్మణ కుటుంబీకులు ఇంట్లో పితృకార్యం చేస్తూ సాయంత్రం ఐదయినా, పిలిచిన భోక్తలు ప్రక్క ఊరి నుండి ఎంతకీ రాక పోవడంతోదిగాలు పడి పోయి, చివరకి పెళ్ళయిన బ్రహ్మచారిగా ఆ ఊళ్ళో ఒంటరిగా ఒక గది తీసుకుని ఉంటున్న నన్ను భోక్తగా రమ్మని బ్రతిమాలేరు. అప్పటికే నేను మధ్యాహ్న భోజనం కానిచ్చి, ఏదో పుస్తకం చదువుతూ ఓ కునుకు తీస్తున్నాను. నా భోజనం అయిపోయింది కదా, నేనెలా పనికి వస్తాను ? అనడిగేను. ఆ కుగ్రామంలో మరొక బ్రాహ్మణ నలుసు లేక పోవడం చేత, పాపమో,పుణ్యమో తమ ఇంటికి వచ్చి భోక్తగా తమ తల్లి గారి ప్రసాదం తిని వెళ్ళమని కన్నీళ్ళతో వేడుకున్నారు. నాకిక తప్పింది కాదు.ఆ రోజు నేను వారింటి పితృకార్యంలో నిష్ఠగా పాల్లొన లేదు. వారి బలవంతం చేతనే కావచ్చు, తిండి తినీసి, వారింటికి భోక్తగా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఆచారం మంట కలపేను. ఆ కారణం చేత నాకు నరకం తప్పదని నేను ఇప్పటికే నిర్ణయానికొచ్చీసేను.
ఇప్పుడు చెప్పండి, నిష్ఠగా, శుచిగా, చిత్త శుద్ధితో చేయాల్సిన పురోహిత కార్యాలు మొక్కుబడిగా, అశ్రద్ధగా,తూతూ మంత్రంగా, పిండి కొద్దీ రొట్టె, యావత్ తైలం, తావద్వాఖ్యానమ్ లాగా , ఇచ్చే డబ్బు కొద్దీ చేయించే వారూ నరకానికి పోతారంటే, పోరూ మరి !
అలాగే, నిత్యానంద స్వాముల వంటి వారు మన వెర్రిభారతంలో వేలూ, లక్షలూనూ. వాళ్ళందరూ నరకానికి కాక పోతే, స్వర్గానికి పోతారా ! ఆలోచించండి.
అందుకే, శ్లోక కర్త అథమపక్షం ఓ ఏడాది పాటు పౌరోహిత్యం చేసిన వారూ, కనీసం ఓ మూడు రోజుల పాటు సన్యాసిగా ఉండే వారు సైతం నరకానికి పోవసిందే అని ఢంకా బజాయించి చెబుతున్నాడు ...
తప్పులు చేసే పురోహితులూ, సన్యాసులే కాదు, తాము స్వీకరించిన వృత్తిని ప్రేమించని వారూ, త్రికరణ శుద్ధిగా మెలగని వారూ,తమ వృత్తిని ద్వేషించే వారూ,వృత్తికి న్యాయం చేయని వారూ,న్యాయ మార్గంలో వృత్తి బాధ్యతలు నిర్వహించని వారూ .... వీళ్ళంతా వెళ్ళేది నరకానికే కదా ?!
సరే, అదలా ఉంచితే, నాకు నరక లోకపు బెర్తు ఖాయం అని తేలి పోయింది.
ఏం చేస్తాం చెప్పండి. అయితే, నాకు తోడుగా అక్కడ నాకంటె ముందుగానో, కాస్తంత అటూ యిటూ గానో, మిత్రుడు భీమ్ పాపాల శర్మ , కవితా కరవాలాలతో చెండాడే కుకవులూ, భార్యలను ఏడిపించుకుని తినే భర్తలూ, భర్తలను కాల్చుకు తినే భార్యలూ, రేగింగు వీరులూ, కల్తీ మందులూ వస్తువులూ విక్రయించే వ్యాపారులూ, అధిక వడ్డీలు గుంజే అధమాధములూ, ప్రజా సేవ పేరిట ప్రజా కంటకులైన నాయకమ్మన్యులూ ( రాజ్యాంతే నరకం ధృవమ్ కదా ) , పసి పిల్లలను గొడ్డుల్లా బాది పైశాచికానందం పొందే టీచర్లూ, క్షుద్ర సాహితీ సమరాంగణ సార్వ భౌములూ, నాలాగా చేతికొచ్చిన బ్లాగులు పెట్టి బాధించే బ్లాగు పిశాచులూ, హత్యలూ, దోపిడీలూ చేసే వాళ్ళూ, రాంగ్ కాల్స్ చేస్తూ విసిగించే ఫోనాసురులూ ... ... మరింక చెప్ప లేను ... ఇలా చాలా మంది వచ్చి చేరుతారనే నిబ్బరంతో నరక లోక యాత్రకు రెడీ అయి పోతున్నాను, మరి ... నరక లోకపు జాగిలమ్ములు మబ్బు చాటున ఖణేళ్ మన్నాయ్ !!
. మనకి స్వర్గమో, నరకమో ఇతమిత్థంగా ఇంకా తేలని స్థితిలో, ఎదుటి వాడికి నరకం ఖాయమని తేలి పోయేక , మనకి ఆనందం వెయ్యదూ?!
* * * * * * * * *
కళ్ళు తెరిచి చూద్దును కదా, నాకు తెలీని వేరే ఏదో లోకంలో ఉన్నాను. అక్కడంతా గలీజుగా ఉంది. నానా కంగాళీగానూ ఉంది. ఆర్తుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. వికటాట్ట హాసాలు కర్ణభేరి బ్రద్దలయ్యే లాగున ప్రతిధ్వనిస్తున్నాయి.సలసల క్రాగే నూనె బాణళుల నుండి వచ్చే ధూమం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొత్తానికి అక్కడ నానా బీభత్సంగానూ ఉంది. (ఐతే, ఒకటి, అదెంత భీకరంగా ఉన్నప్పటికీ హైదరాబాదంత గలీజుగా మాత్రం లేదనిపించడం విషయాంతరం)
కాస్త తమాయించుకుని, ‘‘ నేనిప్పుడెక్కడ ఉన్నాను?‘‘ అనడిగేను.
ప్రక్కనున్న రాక్షసాకారి వికటంగా నవ్వి, ’’ నరకంలో నయ్యా.‘‘ అని బదులిచ్చేడు.
’’ నరకం లోనా ! నన్నిక్కడి కెందుకు తెచ్చేరు? నేనేం పాపం చేసానని?‘‘ అనడిగేను గాభరాగా.
నాప్రశ్నకి వాడు జవాబు చెప్పే లోగానే, మరో ప్రక్క నుండి,’’ నరకానికి రాకేం చేస్తావురా,త్రాష్ఠుడా ! ‘‘ అనే మాటలు వినిపించేయి.
ఉలిక్కిపడి, అటు చూసేను. అక్కడ నా కథ లోని ప్రథాన పాత్రలలో ఒకడైన సర్వేశ్వర శాస్త్రులు కనిపించేడు. మనిషి కొంచె వడిలేడు. పూర్వపు నిగారింపు లేదు. దబ్బ పండులా ఎలా ఉండే వాడు ! పప్పూ. ఆవు నెయ్యీ, గోంగూర, ఆవకాయ పచ్చడీ, కంది గుండా, నువ్వుల నూనె, అప్పడాలూ, ఒడియాలూ, నాలుగు రకాల కూరలూ, పచ్చళ్ళూ, గారెలూ, నూలు పచ్చడీ, నువ్వులుండలూ, ముక్కల పులుసూ ....ఇవేవీ భోజనంలో అమరడం లేదు కాబోలు. కొంచెం జాలేసింది.
‘‘ మహానుభావా! మీరేమిటి ఇక్కడ ? క్రమాంతస్వాధ్యాయులూ, జటా,ఘనా,పనస తిరగేసీ మరగేసీ కూడా ఒప్ప చెప్పగల సమర్ధులూ,నిప్పును నీళ్ళతో కడిగే వంశీయులూ, ఇక్కడకి దయ చేసారేం?’’ అనడిగేను.
శాస్త్రుల వారి ముఖం మరింత దీనంగా తయారయింది.‘‘ నుదుటి రాత నాయనా ! నుదుటి రాత. ఆ వెంకన్న పంతులుగాడూ, వాడి మనుషులూ లేరూ, వాళ్ళ వల్ల వొచ్చింది నాకీ అరిష్టం. వాడు పెట్టిన పేచీయే కదా, నాచేత పాపం చేయించింది? అందుకే నన్నిక్కడికి లాక్కొచ్చేరు ...’’
‘‘ మరి ఆయనో ? ... ఆయనా ఇక్కడే ఉన్నారా? ...’’ అడిగేను, సంశయంగా.
‘‘ వాడి శ్రాద్ధం, ఉండకేం చేస్తాడూ ! అదిగో, ఆమూల అఘోరిస్తున్నాడు , మాష చక్రాలు (గారెలు) ఇక్కడ దొరక్క విలవిలలాడి పోతున్నాడు.’’
‘‘ఇంకా ఎవరెవరొచ్చేరో ...?’’
‘‘అంతా వచ్చేం నాయనా. బుచ్చి వెంకూ, చయనులూ, సొట్ట జగ్గడూ. బుచ్చబ్బాయీ, సూరిపంతులూ .. ఒహరనేమిటి? అంతా ఇక్కడే ఉన్నాం.’’
‘‘ గౌరీపతి రాలేదో? ...’’
‘‘ నీ పిండం కాకులకు పెట్టా. ఇలాంటి సందేహాలొస్తున్నాయేఁవిటయ్యా, నీకూ ..... గౌరీపతి గాడు రాకేం? మహా రాజు మొగుడిలా వచ్చేడు ... అడిగో ఆ ప్రక్కన జంద్యాలు వొడుకుతూ కూచున్నాడు, చూడు ...’’ అటు చూసేను. నిజఁవే. ఇంద్రుడూ వగైరాలు వెండివో, బంగారానివో జంద్యాలు వేసుకుంటారు కానీ , నూలు జంద్యాలు వేసుకోరు కదా? ఈ గౌరీపతి ఇక్కడ కూడా తాళం బిళ్ళ త్రిప్పుతూ నూలు జంద్యాలు వొడకడం ఎందుకో? నంగిరితనం. జడ్డితనం కాక పోతే, అనిపించింది.
నేనింకా ఏదో అడగబోయే లోగా శాస్త్రి గారే ఖంగున అడిగేరు: ‘‘ ఇక్కడి కొచ్చేటప్పుడు, చేతులూపుకుంటూ రాక పోతే, కాసిన్ని మాష చక్రాలు పట్టుకుని రాక పోయూఁవూ? నీ మొహం యీడ్చ. నోరు ఝలాయించి పోతోంది. ...’’ అన్నారు బాధగా.
‘‘ నాకో బీడీ కట్టయినా తెచ్చి ఉండాల్సింది ..’’ మరో ప్రక్క నుండి వెంకన్న పంతులు గొంతు పీలగా వినిపించింది.
మాట మార్చడానికి, ‘‘ అయితే, అంతా ఇక్కడకే చేరారన్న మాట ! ...’’ అన్నాను.
‘‘అఘోరిచావులే. యేళ్ళు ఎత్తికెట్టి కాల్చ. నీ పుట్టువు బూజు కాను. మేఁవే కాదు, అదిగో ఆ ప్రక్కన చూడు, మీ గురజాడా, వాడెవడూ? తల చెడిన ముండలకి మళ్ళీ పెళ్ళిళ్ళని , అదనీ ఇదనీ మన ఆచారాలని మంట కలిపేడు, వాడు, వీరేశలింగం కాబోలు వాడి పేరు ...వాడూ చాలా కాలమై ఇక్కడే ఉన్నాడు. వాళ్ళే అనేఁవిటి ? మీ కార్లమాక్స్ గాడూ, మావో గాడూ , వాళ్ళంతా ఆ సలసల మరిగే నూనెలో ఎలా వేగుతున్నారో చూడు !’’ అన్నారు అంతా ఉక్రోషంగా ముక్త కంఠంతో.
గాభరాగా అటు చూసేను. అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళెవరూ లేరు. వీరప్పన్ లాంటి వాళ్ళెవరో కనిపిస్తున్నారు.
నన్నిక్కడికి తీసుకొచ్చిన యమ దూతలలో ఒకడు నా ప్రక్కలో పొడిచి, గుసగుసగా అన్నాడు: ‘‘ వాళ్ళెవరూ ఇక్కడ లేరు. అంతా హాయిగా స్వర్గంలో ఉన్నారు. ఈ ముసిలాయనకి తద్దినం బోయినాలు లేక, మతి భ్రమించి అలా మాట్లాడుతున్నాడు ....’’ అని.
రెండో భటుడు దానికి కొనసాగింపుగా చెప్పేడు: ’’ శాస్త్రి గారి భార్యా, రమణా, పరమేశూ కూడా అక్కడే ఉన్నారు ... నువ్వీయన మాటలు పట్టించు కోకు ... పద,నీ ఎంట్రీ ఇక్కడ రికార్డు చేయించాలి ...’’ అని.
‘‘మరి, మా తెల్లావో?’’ అడిగేను ఆత్రతగా.
ఈ సారి ఇద్దరు భటులూ ఏక కంఠంతో చెప్పారు: ‘‘ దానికేం ! అది కూడా అక్కడే నిక్షేపంగా ఉంది. ఇప్పుడు అసలక్కడ స్వర్గ లోకపు కేంటిన్ లో ఆ తల్లి క్షీరంతోనే కదా, అక్కడ ఇంద్రాదులకు కాఫీలూ గట్రా కాచేది !’’
నేను హమ్మయ్య ! అని ఊపిరి పీల్చుకున్నాను. ఇంతలో అక్కడికి వచ్చిన పురోహిత వర్గమంతా అక్కసు వెళ్ళ గ్రక్కుతూ గబగబా తలో మాటా అనడం మొదలెట్టేరు.
‘‘ మా మీద కథ రాస్తాడూ? అప్రాచ్యపు వెధవ. సలసలా మరిగే నూనె బాణలిలో పడెయ్యండి.‘‘
‘‘ వొళ్ళంతా శూలాలు గుచ్చండి’’
‘‘ కక్కకట్టుకి కొరత వెయ్యండి, తిక్క కుదురుతుంది’’
‘‘ వైతరణి నీళ్ళు బిందెల కొద్దీ త్రాగించండి.’’
‘‘ తెలుగు టీవీ ఛానెళ్ళు రాత్రీ పగలూ విడవకుండా చూపించండి.త్రాష్ఠుడు, కళ్ళు పేలిపోయి ఛస్తాడు.’’
‘‘ దిన పత్రికలలో నానా చెత్తా ఆచివరి నుండి, ఈ చివరి వరకూ అక్షరం విడవకుండా చదివించండి.’’
‘‘ కథా మంజరి బ్లాగు టపాలన్నీ కంఠోపాఠం చెయ్యమనండి.’’
నాకు నరక లోకంలో అమలు కావలసిన శిక్షలను వాళ్ళంతా అలా ఖరారు చేస్తూ ఉంటే నాకు వొళ్ళు కంపరమెత్తి పోయింది. వజవజ వణికి పోయేను.
యమభటులిద్దరూ నా భుజం మీద చరిచి, నాకు ధైర్యం చెబుతూ వాళ్ళతో ఇలా అన్నారు.’’ అబ్బే, అంత సీన్ లేదు లెండి. వీరిని ఆ కథ రాసినందుకు కాక, వేరే కారణం చేత ఇక్కడికి తీసుకుని వచ్చేం. ఇక్కడ అట్టే సేపు ఉంచం. ఇక్కడి రికార్డులలో వీరి పేరూ వివరాలూ మరో తూరి నమోదు చేసి, ఒక పేము బెత్తం దెబ్బ శిక్షతో సరి పుచ్చి, నేరుగా స్వర్గానికి బదిలీ చేస్తాం. అక్కడ కొలువు తీరి ఉన్న గురజాడ, చా.సో, విశ్వనాథ సత్యనారాయణ, దేవుల పల్లి , నండూరి, కవిత్రయం వారూ , పోతన ... ఓ ... ఇలా కోట్ల సంఖ్యలో ఉన్న మహానుభావులను చూసి తరిస్తూ, వారిని సేవించుకుంటూ , వారి దీవెనలు అందుకుంటూ అక్కడే ఉంటారు .......’’
‘‘ మరి మేఁవో ?!’’ ఏడుపు గొంతులతో ఒకేసారి అరిచినట్టుగా అన్నారంతా.
‘‘ మీరిక్కడే ఉండాలి. మీరిందాక చెప్పిన శిక్షలతో పాటు, అలాంటివే కొన్ని వేల వేల శిక్షలు మీకింకా అమలు పరచ వలసి ఉంది. వాటిలో మొదటి శిక్ష కథా మంజరి బ్లాగు టపాలన్నీ అక్షరం పొ్ల్లు పోకుండా కంఠోపాఠం చేసి గడగడా వొప్పగించడం!‘‘
‘‘ ఆఁ!!!‘‘ అంటూ, అంతా నోళ్ళు వెళ్ళ బెట్టీసేరు.
* * * * * * * * * *
గమనిక: : ఇందులోనివన్నీ నా కథలోని పాత్రలు ! ఆ కథ రాసినందుకు కినిసిన కొందరు అప్పట్లో నన్ను ‘‘ నరకానికి పోతావ్ రా! నా కొడకా ! ‘‘ అని ప్రేమగా శపించేరు. అంచేత నా నరక లోక యాత్ర ఖాయమై పోయింది.
మరిన్నీ, ఇంత లేసి టపాలు పెట్టి విసిగించే వ్యక్తికి నరక లోకం లో తప్ప స్వర్గంలో బెర్తు దొరుకుతుందా చెప్పండి ?!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి