15, ఆగస్టు 2010, ఆదివారం

అమ్మా, నీకు వందనం


స్వాతంత్ర్యం వచ్చినా
సమ భావం కలగ లేదు
ఇంటి లోని గొడవలు
ఇంకా చల్లార లేదు

మధు మాసం వచ్చినా
మల్లెలు వికసించ లేదు
భానూదయ మయెను కాని
మనుషులు మేల్కొన లేదు

కత్తి వైరము కాల్చండని
నుడివిన కవి దేశము
కత్తులపై నడయాడుట
నమ్మ లేని సత్యము

ప్రతి మనిషీ ప్రక్క వాని
పచ్చ దనం ఓర్చ లేడు
ఏ గుండె ఎదుటి వాని
దరహాసము శ్లాఘించదు

పదవి మీద వ్యామోహం
ప్రతి వాడూ వీడ లేడు
నాయకమ్మన్యులు అంతా
చేయబోరు సమన్యాయం !

అయినా మన పవిత్ర దేశం
ఎన్ని ఆటు పోటులనో తిన్నది.
అంతు లేని అవరోధాలను
శాంతంగా అధిగమించినది

కమ్ముకున్న ఈ చీకటి
కడ వరకూ ఉండ బోదు
చిమ్మిన ఈ ద్వేషానలం
వమ్మయి పోవక తీరదు

అద్యతన భావి లోన
అగ్ర గామిగా మన దేశం
విరాజిల్ల బోతున్నది.
అగ్ర రాజ్యాలు సైతం
విస్తు పోయే రోజున్నది !

అందుకే, అందాం
అందరమూ గళమెత్తి
భరత మాతా నీకు జయము !!
వందేమాతరమ్!!!


విజయ నగరం నుండి శ్రీ భాట్టం శ్రీరామ మూర్తిగారు బహుజన అనే ఓ వార పత్రిక నడిపేవారు. అందులో 1970 ఆగష్టు 15 వ తేదీ సంచికలో అప్పట్లో భాషా ప్రవీణ విద్యార్ధిగా ప్రాచ్య కళాశాలలో చదువుకొంటున్న నేను రాసిన కవిత యిది.


అసంఖ్య బ్లాగులో పెట్టిన ఈ క్రింది టపా (ఇక్కడ నొక్కండి) నన్ను అమితంగా ఆకర్షించింది. అందుకే, వారికి నా ధన్యవాదాలతో ...








3 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు .

SRRao చెప్పారు...

మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

- శిరాకదంబం

Radha చెప్పారు...

స్వాతంత్ర్యదినోత్సవం గురించి చక్కని భావాలతో కవితను వెలువరించిన పంజోరా గారూ
మీకు నా వందనం

కామెంట్‌ను పోస్ట్ చేయండి