అనంత పద్మనాభుని సాక్షిగా అభిమానధనుల ఆత్మ బలిదానాలు !
పద్మనాభ యుద్ధం ! అదే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అని కొందరు చరిత్రకారులు భావిస్తారు. విభేదించే వారూ లేక పోలేదు. కాని, విభేధించే వారు కూడా ప్రాణాలను పణంగా పెట్టి, అభిమాన ధనులైన గజపతులు చేసిన ఈ యుద్ధం ప్రభువుల శౌర్యానికీ, ఆత్మాభిమానానికీ జయకేతన మెత్తిందని ముక్త కంఠంతో కీర్తిసారు !
మానధనులైన విజయ నగర ప్రభువుల వలె యుద్ధభూమిలో మృత్యువును చేజేతులా ఆహ్వానించి వీర స్వర్గమలంకరించిన క్షాత్రం చరిత్రలో అరుదుగా కనబడుతుంది !
కేవలం గంట వ్యవధి లోపల ముగిసిన ఈ పద్మనాభ యుద్ధ సన్నదధానికి ముందు చిన విజయ రామరాజు గారు చేసిన ఉత్తేజపూరిత మయిన మహోపన్యాసం వొక వీర చారిత్రక ఘట్టం ! ఆ గజపతి ప్రభువు చేసిన ఉపన్యాసం నుండి కొన్ని భాగాలు చూదాం !
అంతకు ముందు పద్మనాభ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులను క్లుప్తంగా .. ...
విజయ నగరం సంస్థానం వారు కంపెనీ వారికి బాకీ పడిన ఆరు లక్షల ఏభై వేలు వెంటనే చెల్లించాలనీ, లేక పోతే చిన విజయరామరాజు రాజ్యం విడిచి విశాఖ వెళ్ళాలనీ మద్రాసు నుండి కంపెనీ దొరవారు తెలియ జేసారు. పాత లెక్కలన్నీ సవివరంగా చూపుతూ కంపెనీయే తమకు 3,50,000 బాకీ అని పేర్కొంటూ , ఆ మొత్తాన్ని తీసి వేస్తే తాము చెల్లించ వలసినది స్వల్పమే నంటూ, అది కూడా మూడు వాయిదాలలో కట్టడానికి సిద్ధమేనంటూ విజయరామరాజు లెక్కల పత్రం కంపెనీకి పంపించేరు ! ఆ వివరణని అంగీకరించని కంపెనీ వారు 13-06-1794న విజయ నగరం కోటను ఆక్రమించు కున్నారు. చిన విజయ రామరాజు విశాఖ తరలి పోయారు.
పూసపాటి ప్రభువల పట్ల స్వామి భక్తి చాటుకుంటూ సంస్థానంలో యావన్మంది రైతులూ శిస్తులు కట్టకుండా కంపెనీ వారికి నిరసన తెలియజేస్తూ తిరుగుబాటు చేసారు ! విదేశీయుల పెత్తనం మీద రైతువారీ తిరుగుబాటు కంపెనీ వారిని నివ్వెర పరచింది.
చిన విజయ రామరాజును విశాఖలో ఉండనివ్వడం కూడా తమకు క్షేమకరం కాదని భావించి, కంపెనీ వారు కుట్ర పూరితమయిన ఆలోచనతో రాజుని విశాఖ విడిచి మచిలీ పట్నం వెంటనే వెళ్ళి పోవాలని ఆదేశించారు.
కంపెనీ వారి దురహంకారం సహించ లేక రామరాజు వారితో యుద్ధానికి సిద్ధ పడ్డారు.
రాజ బంధువులనూ, సర్దారులనూ, హితులనూ పద్మనాభంలో సమావేశ పరచి వారిని యుద్ధోన్మఖులుగా చేస్తూ ఉత్తేజ పూరిత మయినప్రసంగం చేసారు
అపజయం అనివార్యమనీ, వీర మరణం తథ్యమనీ తెలిసి కూడా దొరల వంచనకు ప్రతీకారంగా ఆత్మాభి మానాన్ని నిలుపుకుంటూ వారంతా యుద్ధ సన్నద్ధులు కావడానికి ఆ ప్రసంగం ఎంతగానో దోహద పడింది !
ఒక యోద్ధ, ఒక ఆత్మాభిమాన దురంధరుడు తన వారిని ఎలా తన ఆశయానికి అనుకూలురుగా చేసికో గలడో చెప్పడానికి ఈ మహోపన్యాసం ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తుంది
నాడు పద్మనాభంలో చిన విజయ రామరాజు చేసిన ఉత్తేజ భరిత సుదీర్ఘమయిన ఉపన్యాసం నుండి కొన్ని భాగాలు :
( శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం నుండి )
‘‘శ్రీ విజయ నగర సంస్థాన గౌరవ పరిపాలనా తత్పరులగు యోధాగ్రేసరులారా ! మన మిప్పుడు విజయ నగర గౌరవ సంరక్షణార్ధమై కంపెనీ వారితో యుద్ధం చేయ వలసి వచ్చింది ’’
‘‘మనచే పునరుద్ధరింప బడిన ఒకానొక పాశ్చాత్య వర్తక సంఘములో అడుగులకు మడుగులొత్తి చేతులార మన సామ్రాజ్య లక్ష్మిని వారి కప్పగించిన రాబోవు చరిత్రకారులు మనలను గురించి ఏమని వ్రాయుదురో యూహింపుడు.’’
‘‘ చతుర్మండల మండలేంద్ర కోటీర స్థగిత రత్నా ప్రభా విభాసిత పాద పీఠమగు విజయ నగర సామ్రాజ్య లక్ష్మిని పాశ్చాత్య వర్తకులకప్ప చెప్పి, దీనులమై బందరు లంకలలో ‘‘ నీచపు చావు చచ్చుట మేలో ’’ లేక, బహు సామంత రాజ విరాజమానయగు శ్రీ విజయ నగర రాజ్య లక్ష్మి గౌరవ సంరక్షణార్ధమై ఆత్మ ప్రాణ పరిత్యాగ మొనరించి నిమిషములో వీర స్వర్గము చూరగొని అఖండాఖండల రాజ్య లక్ష్మీ కృపావీక్షణముల కర్హుల మగుట మేలో ? బాగుగా యోజింపుడు !’’
‘‘ ఆలోచించిన మనకీ యుద్ధమున జయము సిద్ధించుట దుర్లభము.ఏలయన మొదట మన స్వకుటుంబము నందే ద్రోహులు బయలుదేరిరి. ... ... ఏది ఎట్లున్నను హీనపు చావు చచ్చుట కంటె స్వకుల మర్యాలను నిలువ బెట్టి రాచ కులము వారికి విహిత మయిన మరణమును రణ రంగమున బొందెదము గాక !
పద్మనాభ యుద్ధము చిరస్మరణీయమై యుండక పోదు ! యోధాగ్రేసరు
లారా ! ఇప్పుడు మనము చేయ వలసిన పని ఇంతకు మించి వేరొండు గోచరించుట లేదు. కావున మీ యభిప్రాయములను తెలియ జేసి వెంటనే విజయ నగర రాజ్య లక్ష్మీ గౌరవము నిలుపుటకు పూనుకొనుడు !’’
రాజ బంధువులు, సరదారులనూ ఈ ప్రసంగం కదిల్చి వేసింది. అనంత పద్మనాభ స్వామికి నివేదించ బడిన మహా ప్రసాదాన్ని చేతిలో పట్టుకుని ‘‘ విజయమో, వీర స్వర్గమో తేల్చు కోడానికి అంతా నడుం కట్టారు.
పద్మనాభ యుద్ధంలో విజయ రామ రాజు పక్షాన శ్రీయుతులు పూసపాటి విజయ గోపాల రాజు గారు, వత్సవాయి నరస రాజు గారు, నడిపిల్లి రామ భద్ర రాజు గారు, చింతలపాటి నీలాద్రి రాజు గారు, దాట్ల అప్పల రాజు గారు, దాట్ల చిన వెంకటపతి రాజు గారు, తిరుమల రాజు, కొండ్రాజు గారలు, సాగి గోపాల నరస రాజు గారు, జంపన వెంకట రామ రాజు గారు, దంతులూరి అప్పల రాజు గారు, దంతులూరి రాఘవ రాజు గారు, భూపతి పద్మనాభ రాజు గారు నిలిచారు ! ఇంకా, వేజర్ల వారు, గొట్టి ముక్కుల వారు, పెనుమత్స వారు మొదలయిన క్షత్రియ వీరులు పాల్గొని వీర మరణం చెందారు.
మృత్యువును ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నారు ! ఆత్మాభిమానం ముందు ఆత్మార్పణ తృణ ప్రాయంగా భావించారు !
పద్మనాభ యుద్ధంలో అద్భుతాలేమీ జరుగ లేదు.
అనుకున్నట్టే అయింది. ఫిరంగులు పేలాయి ! యుద్ధం అంతా కేవలం 45 నిమిషాలలో ముగిసి పోయింది.
అభిమాన ధనులు నేలకొరిగారు. చిన విజయరామరాజు ‘‘ రంగ రంగా ’’ అని ఇష్ట దైవాన్ని స్మరిస్తూ వీర స్వర్గం పొందారు.
విజయ నగరానికి కూతవేటు దూరంలో వెలసి న్నఅనంత పద్మనాభ స్వామి నాటి గజపతులు ఆత్మబలిదానాలకు సాక్షీభూతంగా నిలిచాడు.
భావి స్వాతంత్ర్య సమరాగ్ని జాజ్వల్యమానమై రగులుకోడానికి ఈ పద్మనాభ యుద్ధం వొక చిన్న పాటి నిప్పు రవ్వ కాకుండా పోలేదు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి