బ్రహ్మకి అయిదు ముఖాలుండేవి. అయితే, ఇప్పుడు నాలుగే ఉన్నాయి. కుమార స్వామికి ఆరు ముఖాలు , ఒక్కో చోట శివుడికి పంచముఖాలు , రావణుడుకి పది ముఖాలు , ఉండడం మనకి తెలుసు. ఇంకా ఎవరెవరికి ఎన్నెన్ని ముఖాలున్నాయో తెలియదు.
మనమయితే, ‘‘ ఎలా ఉందయ్యా ? ’’ అనడిగితే, నచ్చక పోతే , ‘‘ నాముఖంలా ఉంది ’’ అని చెబుతాం. కాని మీద పేర్కొన్న మహానుభావులు మాత్రం అలా అనడానికి వీలు లేదు. బ్రహ్మ ‘‘ ఏడిచినట్టుంది. నాముఖంలా ఉంది ’’ అని నాలుగు సార్లు , కుమార స్వామి ఆరు సార్లు , పంచ ముఖి శివుడు ఐదు సార్లూ , రావణబ్రహ్మ అయితే ఏకంగా పది సార్లూ అనాలి కదూ ? అన్ని ముఖాల వాళ్ళు ఆ పాటి ఆయాస పడక తప్పదు లెండి.
ఈ పరిస్థితిని గమనించి, మన కవులు చమత్కారంగా కొన్ని పద్యాలు చెప్పారు.
చూడండి ...
అంబా కుప్యతి తాతమూర్ధ్ని విలసద్గంగేయ ముత్ సృజ్యతాం ,
విద్వన్ షణ్ముఖ కా గతి: మయి చిరా దస్యా: స్థితాయా వద,
కోపావేశ వశౌ దశేషవదనై: ప్రత్యుత్తరం దత్తవాన్ ,
అంబోధి: జలధి: పయోధి రుదధి ర్వారాన్నిధి ర్వారిధి:
షణ్ముఖుడు తండ్రి శివుడితో ఇలా అన్నాడు: ‘‘ తండ్రీ ! అమ్మ కోపంగా ఉంది. నీ తల మీద ఉన్న ఆ గంగను విడిచి పెట్టు.’’
శివుడు: ‘‘కుమారా ! చిర కాలంగా నన్నే ఆశ్రయించి ఉన్న గంగను ఎలా విడిచి పెట్టేదిరా. నేను కాదు పొమ్మంటే, పాపం ఆవిడకి ఏదిరా గతి ?’’
చిన్నింటిని విడువడం కుదరదని తండ్రి చెప్పే సరికి కుమార స్వామికి కోపం ముంచు కొచ్చింది.
అతనికి ఆరు ముఖాలు కదూ ? అందు చేత ఆరు ముఖాలతోనూ ఇలా అన్నాడు:
‘‘అంబోధి. జలధి , పయోధి , ఉదధి , వారాంనిధి , వారిధి.‘‘
పై పదాలు ఆరింటికీ సముద్రమనే అర్ధం !!
అంటే , ‘ పోయి , సముద్రంలో పడమను !’ అని దీని అర్ధం.
‘వెళ్ళి గంగలో దూకు ’ అంటాం కదా, కోపంలో. అలాంటిదే ఇదీనూ.
నదీనాం సాగరో గతి: అని, నదులు చివరకు చేరేది సాగరం లోనే కదా ?
గంగకు సాగరమే గతి అని కవి ఈ విధంగా చమత్కరించాడు.
మరో పద్యం , ఆరు ముఖాల వాడి మీదే . చూడండి ...
ఓ కవి గారికి ( జంద్యాల పాపయ్య శాస్త్రి గారని గుర్తు ) అష్టావధానంలో ఇచ్చిన సమస్య ఇది:
‘‘నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !’’
ఇదీ సమస్య. ఇందులో ఆరు నీవులు ఉన్నాయి. కవి గారు కుమార స్వామి పరంగా ఇలా పూరించారు.
నీవు గజాస్యు చంక దిగనీయవు, నన్నసలెత్తు కోవు ,నీ
కా వెనకయ్య ముద్దు కొడుకయ్యె నటంచును పల్కు షణ్ముఖున్
దేవి భవాని కౌగిట గదించి ముఖంబున ముద్దిడున్ యనున్
నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !!
ఆరు ముఖాలు కలిగిన కుమార స్వామి ( షణ్ముఖుడు ) తల్లి పార్వతీ దేవితో ఇలా అంటున్నాడు:
‘‘ అమ్మా ! నీవు గజాస్యుని ( వినాయకుడిని ) చంక దిగ నీయవు. నన్ను అసలు ఎత్తుకోవు. నీకు ఆ వెనకయ్యే ( వినాయకుడే ) ముద్దు కొడుకయ్యేడు కదమ్మా ...’’
అంటూ ఏడుస్తున్న షణ్ముఖుని దేవి భవాని ( పార్వతీ దేవి) కౌగిలిలో ప్రేమతో బంధించి, ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఇలా అంది: ‘‘ లేదయ్యా !! నువ్వన్నా నాకు మద్దేనురా కన్నా ..!’’
ఇక్కడ చమత్కారం ఏమిటంటే, పార్వతి కుమార స్వామిని లాలిస్తూ , అతని ఆరు ముఖాలనీ ముద్దు పెట్టుకుంటూ నువ్వన్నా నాకు ముద్దేనురా అంది. అందుకే, నువ్వు , నువ్వు ... అంటూ ఆరు సార్లు అంది.! అదీ కవి చమత్కారం.
మన చిన్నారులకి ఏదయినా తినిపించాలన్నా, త్రాగించాలన్నా, పాపం, మన తల్లులు ఎంత అవస్థ పడతారో మనకి తెలిసినదే కదా ? ఈ ఆరు ముఖాల వాడికీ , ఆ తొండం గల వాడికీ - వాళ్ళ చిన్నప్పుడు ఏదేనా తినిపించడానికీ, త్రాగించడానికీ జగన్మాత ఎన్ని తంటాలు పడిందో కదూ ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి