అంతర్జాలంలోో ఎందుకో వెతుకుతూ ఉంటే ఈ ఆడియో కంట పడింది. మనిషిని ఫొటో చూసి వెంటనే గుర్తు పట్ట లేక పోయేను. తంపెళ్ళ మహదేవ రావు అని పేరు చూసి తటాలున పోల్చు కున్నాను.
పార్వతీపురంలో మా చిన్నప్పుడు మా ఇంటికి అతి సమీపంలోనే వీరి కుటుంబం ఉండేది. పెద్దాయనను తంపెళ్ళ మాష్టారు అనే వారు. సంగీతం టీచరు. నాకయితే వారు తెలీదు. నా చిన్నప్పటికే పోయేరను కుంటాను. నా చిన్నప్పటికే వారి కుటుంబం పార్వతీపురం విడిచి వెళ్ళి పోయినట్టు గుర్తు. కానీ ఈ తంపెళ్ళ మహదేవరావూ, వీరి తమ్ముడు తంపెళ్ళ సూర్య నారాయణ గారూ మా ఊరు తరుచుగా వస్తూ ఉండే వారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజులలో వచ్చే వారు.
అలా వచ్చి నప్పుడు తెలిసిన మా కుటుంబాలలో అందరినీ పలకరించడానికి ఇళ్ళకు వచ్చే వారు.
నాకు బాగా గుర్తు, మహదేవరావు ఇలా ఓ సారి పండుగకు మా ఊరు వచ్చి నప్పుడు మా మేనత్త గారి ఇంటి చావిడీలో మా కోసం, మా వీధి వారి కోసం గాత్ర కచేరీ చేసేరు. అప్పటికే వారు ప్రసిద్ధులు. మా తాత గారి మాట కాదనలేక ఆ కచేరీ చేసారు. వీరి తమ్ముడు సూర్య నారాయణ మూర్తి మంచి వయొలనిష్టు. ఆ రోజుల లోనే రాష్ట్రపతి అవార్డు గ్రహీత.
మహ దేవరావుని, సూర్య నారాయణనీ చూసి నలభై ఏళ్ళవుతోంది. ఇంకా ఎక్కువే నేమో. వారి గురించిన వివరాలేమీ తెలియదు.
కాదు ... కాదు ... మహదేవరావుని మాత్రం 72 లో ఓసారి చూసాను. ఎందుకో మా ఊరు వచ్చేరు. పెద్ద భత్వోద్యోగి.ఇంటెలిజెన్స్ అనుకుంటాను ... ఏమో ... కానీ ఆ ఏడాది భోగీ నాటి రాత్రి మాతో ఆయన పేకాట కూడా ఆడేరు ... అమ్మకి నచ్చిన మంచి పాట ఇక్కడ చూడండి..
సరే, ఇంతకీ నేను చెప్పే దేమిటంటే అంతర్జాలం వల్ల గత కాలపు మధుర స్మృతులు ఎన్ని నెమరు వేసుకో వచ్చునో కదా ...అందుకే అంతర్జాలమా ! నీకు జోహోర్లు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి