ధన్యవాదాలు You tube
చంద్రబింబపు ముఖమూ
గండుకోకిల స్వరమూ
పండూ వెన్నెలలోlన
పవ్వాళించేనమ్మా...చెలియా
చుక్కల్లా రేడమ్మా ...సఖియా
ఆ తోటలో నొకటి ...అనే ఈ పాట నేను
చాలా చిన్నప్పుడు విన్నాను. అనంతపురం జిల్లా ఉరవ కొండలో మా మాతామహులు (
ముసిలి డాక్టరు గారు) ఉండే రోజులలో మా అమ్మ ( కీ.శే. పార్వతమ్మ) తో పాటు
ఉరవ కొండ వెళ్ళే వాడిని. వెళ్ళి నప్పుడల్లా నాలుగయిదు నెలలకు తక్కువ ( అంత
కంటె ఎక్కువ రోజులేనేమో ?) కాకుండా అక్కడ ఉండే వాళ్ళం.
మా తాత గారింట్లో ఒక గ్రాం ఫోను ఉండేది. దాని మీద కుక్క కూర్చున్న బొమ్మ నాకెంతో ఇష్టంగా ఉండేది.
అందులో మా అమ్మ తరుచుగా ... తరచుగా ఏమిటి, ఆ ఊళ్ళో ఉన్నన్ని రోజులూ కూడా ఈ ఆ తోటలో నొకటి ...
అనే
పాట ఎంతో ఇష్టంగా వింటూ ఉండేది. అమ్మకి ఆ పాటంటే ఎంత ఇష్టమో చెప్ప లేను.
అమ్మంటే ఇష్టం కనుక నాకూ ఆ పాటంటే ఇష్టంగా ఉండేది. చాలా రోజుల పాటు ఆ
పాటంతా నాకు కంఠతా ఉండేది. కాని, క్రమేపీ మరిచి పోయాను.
అమ్మ
పోయాక, ఆ పాట కూడా, ఒక్క - ఆ తోటలో నొకటి ... అనే ముక్క తప్ప, నా స్మృతి
పథం లోనుండి జారి పోయింది. చాలా కాలం విచార పడ్డాను. అయితే, ఆ పాట బాల
సరస్వతి పాడినట్టుగా గుర్తుంది. మళ్ళీ చాలా ఏళ్ళకి అంతర్జాలం వారి ధర్మమా
అని, అమ్మకి నచ్చిన ఈ పాట విన గలిగేను. ఈ పాట నాకు అందించడానికి నాలుగేళ్ళ క్రితం మిత్రులు చాలా మంది సహకరించారు కూడా ! వారందరికీ అప్పుడే ధన్యవాదాలు తెల్పు కున్నాను. ఈ పాట నా బ్లాగు గాడ్జెట్ లో అమ్మకి నచ్చిన పాట అని, లింకు కూడా ఇచ్చాను, చూడండి. దాని కథా కమామీషూ మరోసారి మీతో పంచు కోవాలని ఇదంతా రాస్తున్నాను. అందరికీ తెలిసిన రామాయణమే మళ్ళీ చెప్పాలా అని అడిగితే విశ్వనాథ వారు అన్నట్టు, రోజూ తిన్న అన్నమే తినడం లేదూ ! ఎవరి రుచులు వారివి. రుచికర మయిన పాయసాన్ని జీవిత కాలంలో ఏ ఒక్క సారో వో గ్లాసుడు తాగి ఊరు కోం కదా ! దొరికి నప్పుడల్లా తాగాలనే ఉంటుంది. అలాగే, యిదీనూ ! మంచి పుస్తకాలు పున్ముద్రణలు వేయడం లేదూ ... అలాగే నచ్చిన బ్లాగు టపాలను మళ్ళీ మళ్ళీ పెట్టడంలో తప్పేమీ లేదనుకుంటాను ...
ఈ పాట సాహిత్యాన్ని చూస్తున్నా, పాట వింటున్నా, నాకు మా అమ్మను చూస్తున్నట్టే ఉంది.
దాదాపు ఏభై ఏళ్ళ క్రిందట, తడికెల ప్రహరీతో, ఆ మిద్దె ఇంటి మీదకి ఏపుగా అల్లుకున్న
సన్న
జాజి పూ పొదలతో ఒక వింత గుబాళింపుతో కలగలిసిన నా బాల్యపు ఆనవాళ్ళు
పోల్చుకో గలుగుతున్నాను. చిన్న చిన్న గ్రామ ఫోను ముల్లులు మారుస్తూ, పదే
పదే దాని కీ త్రిప్పుతూ, పరవశంగా ఆ గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, దానితో
గొంతు కలిపి , సన్నగా మా అమ్మ పాడిన పాట నాకు వినిపిస్తున్నట్టే ఉంది.
సాహిత్యం ఇది:
ఆ తోటలోనొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడెవరే,
అందగాడెవరే, అందగాడెవరే!
మన్మథుండనీ చెలియా
మనసు ఘోషించేనే
మరలీ వచ్చెదమన్నా మరపూ రాకున్నాడే
ఆ ఆలయములోని అందగాడెవరే,
అందగాడెవరే, అందగాడెవరే!
మన్మథుండనీ చెలియా
మనసు ఘోషించేనే
మరలీ వచ్చెదమన్నా మరపూ రాకున్నాడే
మరపు రాకున్నాడే II ఆ తోటలో నొకటి II
చంద్రబింబపు ముఖమూ
గండుకోకిల స్వరమూ
పండూ వెన్నెలలోlన
పవ్వాళించేనమ్మా...చెలియా
చుక్కల్లా రేడమ్మా ...సఖియా
చుక్కల్ల రేడమ్మా ... సఖియా
మరుని శరముల చేత మనసు నిలువక నేను
మల్లె మొల్ల మొగలి మాలతి మందార
మాలికను వాని మెడలోన వైచి నానే
మధురామూర్తి మేల్కొని మందహాసముచేయ
మకర కర్ణిక మెరసెనే , చెలియ
మది వెన్న చిల్కినదే , సఖియా
మెరపూ లోనా నేను మైమరచి వెంటనె
పేరేమిటని వాని ప్ర శ్నించినానే'--
మధురామూర్తి మేల్కొని మందహాసముచేయ
మకర కర్ణిక మెరసెనే , చెలియ
మది వెన్న చిల్కినదే , సఖియా
మెరపూ లోనా నేను మైమరచి వెంటనె
పేరేమిటని వాని ప్ర శ్నించినానే'--
పేరేమిటని వాని ప్రశ్నించినానే
మాయాదేవీ సుతునని మధురామూర్తీ పలికె
సిద్ధార్థుడే నాకు సిద్ధించెనే, చెలియా!
మది కోర్కె నెరవేరె, సఖియా!
ఆ తోటలో నొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడితడే...
సిద్ధార్థుడే నాకు సిద్ధించెనే, చెలియా!
మది కోర్కె నెరవేరె, సఖియా!
ఆ తోటలో నొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడితడే...
(ఈ పాట రచయిత 'సాలూరి సన్యాసిరాజు)
ఈ విడ మా అమ్మ , పార్వతమ్మ
నాకు తెలుసులే, నీకిష్టమైన ఈ పాట వింటూ నీలో నువ్వే కమ్మని కంఠంతో పాడుకుంటున్నావు కదూ అమ్మా ?!
* *
* *
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి