20, ఏప్రిల్ 2011, బుధవారం

ముఖే ముఖే సరస్వతీ ...


ఒక చక్కని దత్తపదిని చూదామా?

పృచ్ఛకుడు అవధానిగారిని పాలు, పెరుగు,నేయి, నూనె అనే పదాలను ఇచ్చి, భారతార్ధంలో పద్యం చెప్పమని కోరాడు.

అవధానిగారి పూరణ చూడండి:

పాలు పంచడు రారాజు పాండవులకు
పెరుగుచున్నది వానిలో దురితము గన
నే యిలను గల్గ దిట్టి యహితము వాని
నూనె మూర్ఖత తప్పదు యుద్ధమింక !

పృచ్ఛకుడు కోరిన నాలుగు పదాలూ పద్యం నాలుగు చరణాలలో మొదటి పదాలుగానే వచ్చేయి కదా?

ఇక భావం చూడండి:

రారాజు ( దుర్యోధనుడు) పాండవులకు పాలు పంచడు. రాజ్య భాగం ఇవ్వడు. ఐదూళ్ళు కాదు కదా, సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వనని తెగేసి చెప్పనే చెప్పాడు కదా?

వానిలో ( ఆ దుర్యోధననునిలో) దురితము నానాటికీ పెరుగుతోంది. దుర్మార్గం ఎక్కువవుతోంది.

ఇలాంటి అహితము ( చెడ్డ నడవడిక) లోకంలో ఎక్కడయినా చూసామా ? (కన నేయిలను?) లేదు కదా !

వానిన్ (మూర్ఖత) ఊనెన్ = వానినూనె మూర్ఖత = వాడిని మూర్ఖత్వం పట్టుకుంది. ఒట్టి మూర్ఖపు ముండాకొడుకయ్యేడు.

యుద్ధం ఇంక తప్పదు

పాలు, పెరుగు, నేయి నూనె అనే పదాలను అవధాని గారు దుర్యోధనుడు పాండవులకు రాజ్యం పాలు పంచడు అనీ,

వాడిలో నానాటికీ అహంకారం పెరుగు తోందనీ,

ఎక్కడయినా ఇలాంటి దుశ్చేష్టితం లోకంలో చూసామా (కన నేయిలన్) అనీ,

ఆ దుర్యోధనుడి మనసులో మూర్ఖత్వం చోటు చేసుకుందనీ (వాని నూనె మూర్ఖత) అనీ

అందు వలన కురు పాండవ సంగ్రామం తప్పదనీ ఎంత చక్కని పద్యం చెప్పాడో చూసారా?



స్వస్తి.

4 కామెంట్‌లు:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కమనీయం చెప్పారు...

పంజోరా కి ,ముఖేముఖే సరస్వతి చదివాను .బాగుంది. చింతావారి పద్యంలో ఆఖరి పాదం అం కొంచెం సరిదిద్దాలి.నూనెదను చంప శాత్రవ సేన అంటే సరిపోతుంది. రమణారావు.ముద్దు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పాలు పంచక కౌరవుల్ ప్రబలు చుండ
పెరుగ కుండునె క్రోధమ్ము? పిరికి వాఁడ
నే? యిలను పౌరుషము చూపి,యెలమి కినుక
నూనెదను చంపగనుశత్రు సేన నికను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రమణారావు గారికి ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి