23, ఏప్రిల్ 2011, శనివారం

ఓసింతేనా?!


ఈ పద్యం చూడండి:

హరి కుమారుడై యొప్పునాతడు హరి
హరికి దక్షిణ నేత్రమౌ నాతడు హరి
హరికి శిరము తోడ వరలు నాతడు హరి
హరికి వామాక్షమౌ యొప్పునాతడు హరి

హరికి ( శ్రీ మహా విష్ణువునకు) కొడుకు హరి.

హరికి కుడి కన్ను హరి.

హరికి శిరస్సుతో ఒప్పువాడు హరి.

హరికి ఎడమ కన్ను హరి.

ఏమిటో అంతా గోలగా ఉంది. కదూ. అబ్బే మరేమీ లేదు.


హరి అనే పదానికి విష్ణువు అనే అర్ధమే కాక, కోతి, సూర్యుడు,సింహము, చంద్రుడు అనే యితర అర్ధాలు కూడా ఉన్నాయి. వీటినే నానార్ధాలు అంటారు. వాటి సాయంతో ఇప్పుడు పద్యానికి అర్ధం చూడండి:

ఇప్పుడు చూడండి:

మొదటి పాదంలో తొలి పదం హరికి సూర్యుడు అనీ, పాదం చివర గల హరి అనే పదానికి కోతి అనీ అర్ధం చెప్పుకోవాలి.


ఇప్పుడా పాదానికి హరి కొడుకు హరి. అంటే, సూర్యుని కొడుకు కోతి ( సుగ్రీవుడు ) అనే అర్ధం వస్తుంది. సుగ్రీవుడు సూర్య తనయుడే కదా.

రెండవ పాదం. హరి కుడి కన్ను హరిట. ఈ పాదంలో చివర గల హరి అనే పదానికి సూర్యుడు అని అర్ధం చెప్పాలి.

ఇప్పుడా పాదానికి శ్రీహరికి కుడి కన్ను సూర్యుడు అని అర్ధం వస్తుంది. నిజమే కదా.

మూడవ పాదం లో చివర గల హరి శబ్దానికి సింహం అని అర్ధం చెప్పాలి.

ఇప్పుడా పాదానికి హరికి తలతో ఒప్పు వాడు సింహం అని అర్ధం వస్తుంది.


సింహం తలతో తిరిగే వాడు. నరసింహావతారం. హరి నారసింహుడు అని అర్ధం వస్తుంది.

నాలుగవ పాదంలో చివర గల హరి అనే పదానికి చంద్రుడు అని చెప్పుకోండి.

ఇప్పుడా పాదానికి హరికి ఎడమ కన్ను చంద్రుడు అని అర్ధం సిద్ధిస్తుంది. నిజమే కదా.

అబ్బచ్చా, యిదా అర్ధం ! అనుకుంటున్నారా? ఇలాంటి తమాషాలు మన కవులు చాలా చేసారండోయ్.

స్వస్తి.