30, డిసెంబర్ 2009, బుధవారం

సరదా సరదా సిగరెట్టు ...
సిగరెట్లు త్రాగడం మానెయ్యడం చాలా సులభం ! నేను చాలా పర్యాయాలు మానేసాను ! ఇది ఆంగ్ల మేధావి చతురోక్తిసరే, అదలా ఉంచి మన వాళ్ళు పొగాకు గురించీ, ధూమ పానం గురించీ పద్యాలలో ఏం చెప్పారో చూదాం ... ...

ఖగపతి యమృతము తేగా
భుగ భుగమని పొంగి చుక్క భూమిని పడగా
పొగ చెట్టై జన్మించెను
పొగ తాగని వాడు దున్న పోతై పుట్టున్ !

ఇతి గిరీశమ్ ఉవాచ. బృహన్నారదీయం నాలుగో ఆశ్వాశంలో ఉంది, వెతుక్కోండి ...

ఇక మరో చక్కని పద్యం ...
భుగ భుగమని పొగలెగయగ
నగణితముగ నాజ్యధారలాహుతి కాగా
నిగమాది మంత్రయుతముగ
పొగతాగని వాడు దున్న పోతై పుట్టున్ !


ఓరి! వీడి అసాధ్యం కూలా ! ... మహా మునులు యాగం చేస్తూ వ్రేల్చిన ఆజ్య ధారలు పొగలై మీదికెగసివర్షుకాభ్రుములవుతున్నాయా !
ఋణానందలహరిలో ముళ్ళ పూడి వారి ఋణ సిద్ధాంతం గుర్తుకొస్తోందా ?

పరే, మరో కవి గారి పద్యాన్ని కూడా చూదాం ... ఇది మాత్రం ధూమపాన దురలవాటుని ఖండిస్తూ చెప్పినదేనండోయ్!

పదపడి ధూమపానమున ప్రాప్తము తా నొనగూడు చేటులున్
మొదలు ధనంబు వోవుట, నపుంసకుడౌట, విదాహమౌటయున్
వెదకుచు జాతి హీనులను వేడుట, తిక్కట చొక్కుటల్, రుచుల్
వదలుట, కంపుగొట్టుట, కళల్ తొలగించుట, రిమ్మ పట్టుటల్
పెదవులు నల్లనై చెడుట, పెద్దకు లొంగుట,బట్ట కాలుటల్ !!


డబ్బు పోతుంది, నీరసం కమ్ముకొస్తుంది, దాహం వేస్తుంది, పిగరెట్ ముక్క కోసం ప్రతీ అడ్డ గాడిదనీ అడుక్కో వలసివస్తుంది, కలవరపాటు కలుగుతుంది, నాలుక్కి రుచీపచీ తెలియదు, నోరూ ఊరూ కంపు కొడుతూ ఉంటుంది, ప్రేత కళముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది, రిమ్మ పడుతుంది, పెదవులు నల్లగా వికారంగా తయారవుతాయిఆత్మన్యూనతాభావం ఎక్కువవుతుంది, ఏమరు పాటు వల్ల బట్ట కూడా కాలుతుంది ...
ఇన్ని అనర్ధాలున్న కంపు సిగరెట్టు తాగక పోతేనేం?
శ్రీ.శ్రీ గారు సిగెరెట్ మీద పాట రాస్తూ ...‘‘ సరదా సరదా సిగరెట్టూ ...కంపు గొట్టు సిగరెట్టూ ...’’ అంటూ చివర్లో దీన్నికాల్చకోయి నాపై ఒట్టూ ! అన లేదూ?
స్మోకింగ్ కిల్ల్స్