30, డిసెంబర్ 2009, బుధవారం

హరి హరీ !!


ఈ పద్యం ఓ సారి చూస్తారూ ?

హరి కుమారుడై యొప్పు నాతడు హరి !
హరికి దక్షిణ నేత్రమౌ నాతడు హరి !
హరికి శిరము తోడ వరలు నాతడు హరి !

హరికి వామాక్షమై యొప్పు నాతడు హరి !

హరికి గల నానార్ధాలను ఉపయోగించకుని కవి ఈ చమత్కార పద్యాన్ని మన ముందుంచాడంతే !

హరి అంటే విష్ణువు , కోతి , సూర్యుడు , సింహము , చంద్రుడు అనే అర్ధాలను కవి ఇక్కడ వాడుకున్నాడు...
ఇప్పుడు పద్యంలో కవి గారి గోల ఏమిటో ఇట్టే తెలిసి పోతోంది కదూ?
మొదటి పాదంలో వరుసగా హరి అనే పదాలకి సూర్యుడు , కోతి అని అర్దాలు చెప్పుకుంటే, వాక్యార్ధం సూర్యుని కొడుకు సుగ్రీవుడని తెలుస్తోంది.. కోతి కదా?
అలాగే రెండో పాదంలో వరుసగా శ్రీ మహా విష్ణువునీ, సూర్యుడినీ చెప్పుకుందాం, వాక్యార్ధం శ్రీహరికి కుడి కన్ను సూర్యుడే కదా!
మూడో పాదంలో రెండో హరి అనే పదానికి సింహం అని అర్ధం చెప్పుకుంటే నరసింహావతారం గుర్తొచ్చి, అర్ధం అవగతమౌతుంది.
నాలుగో పాదంలో రెండో హరి పదానికి చంద్రుడు అని అర్ధం చెప్పుకుంటే విష్ణువు ఎడమ కన్ను చంద్రుడే కదా !

ఈ పాటి దానికి ఇంత వివరణ కావాలా ! ఏదో నా చాదస్తం కాక పోతే, మరీనూ !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి