ప్రియురాలి సొగసు చూడ తరమా ? అపురూప లావణ్యవతి. ముగ్ధ మోహన రూపం. ఒప్పుల కుప్ప. ఒయ్యారి భామ.
లోకోత్తర సౌందర్యం. బాపూ బొమ్మ....
ప్రియుడు ప్రియురాలి సౌందర్యం చూసి పరవశించి పోయాడు. ‘నిన్ను చూడకుండాఒక్క క్షణం నేనుండ లేను ’ అనడాలూ, ‘నువ్వు నాకు లభించడం నా అదృష్టం’ అనడాలూ, ‘ దేవ కన్యలు కూడా నీ కాలి గోటికి సరిపోరు ’ అని పొగడడాలూ, ‘అచ్చం బాపూ బొమ్మలా ఉన్నావు సుమా !’’ అని మురిసిపోవడాలూ, సినిమాలూ, షికార్లూ, పార్కులూ, షాపింగులూ,రెండు స్గ్రాలతో ఒకే కొబ్బరి బొండమో, కూల్ డ్రింకో తాగడాలూ ... కను రెప్పలు బరువుగా వాలి పోవడాలూ, ఛాతీలు గర్వంతో పెరిగి పోవడాలూ , కలల విహారాలు చెయ్యడాలూ, బేంకు బేలన్సు తరిగి పోవడాలూ ...
అన్నీ అయ్యేక ప్రియుడుకి ప్రియురాలి అసలు స్వరూపం తెలిసి వచ్చింది. ఇలా వాపోతున్నాడు:
ఈ చాటు పద్యం చూడండి:
పల్లవము బూని సకియ మేనెల్ల జేసి
సద్మగర్భుడు లాదీసి వా గుడిచ్చి
మూ విసర్జించి యప్పుడప్పూవు బోడి
డెంద మొనరించె సందేహమందనేల ?
ఆ బ్రహ్మ దేవుడు ఈమె శరీరాన్ని లేత చిగురాకులతో తయారు చేసాడు. అందుకే అంత మృదుత్వం ! అంత సౌకుమార్యం !
అంత వరకూ బాగుంది. కానీ అక్కడే పాడు బ్రహ్మ దేవుడు పెద్ద కిరికిరీ చేసాడు ...
అదేమంటే ...
పల్లవము అనే పదంలో ‘‘ లా ’’ తీసేసాడు. దానితో ‘‘ ల్ల’’ అనే అక్షరం ఎగిరి పోయింది.
తర్వాత వా గుడిచ్చాడుట ! ‘‘ వ’’ కి గుడి ఇస్తే ‘‘ వి ’’ అయింది !
అక్కడితో ఊరుకోకుండా ‘‘ ము’’ అనే అక్షరాన్ని విడిచి పెట్టాడుట !
సరే, మరి ఇప్పుడు ఇన్ని తీసి వేతలూ, కలపడాలూ, జరిగేక, ‘‘ పల్లవము ’’ అనే పదంలో మిగిలినదేమిటీ ?!
‘‘ పవి’’ అనే పదం మిగిలింది ! ‘‘ పవి ’’అంటే ఇంద్రుని వజ్రాయుధం !
ప్రియురాలి తనువూ, మనసూ అంత కఠినం అన్నమాట !
6 కామెంట్‌లు:
ఆహ..!!
అందుకే పెళ్ళి చేసుకోడం బెటర్ :)
పద్యం చమత్కారం గానే ఉంది.కాని ఆడవాళ్ళు ఒప్పుకోరు.అందరు ప్రియురాళ్ళు కఠినంగా ఉండరు.కోమలహృదయలు కూడా ఉంటారు.సరే.బాపు చిత్రాల ప్రదర్శన చూసాను.కొన్ని పోస్టర్లు ఆర్డర్ చేసాము,--రమణారావు.ముద్దు
సూపర్ మాష్టారు.
ఆర్యా! నమస్తే.
ఆ సుకవి చెప్పిన పద్యమే యదార్థమైతే జగాన మగపుంగవులు ఆడవారిపై రెచ్చిపోవడం సాధ్యమయేది కాదు.పాపం ఆ కవి పొందిన ఎటువంటి ఘోరానుభూతి ఈ పద్యం అతని చేత వ్రాయించి ఉంటుందో!
ఐతే పద్యంలో చమత్కారం పద విన్యాసం అద్భుతం అనక తప్పదు. ఇంతకీ ఆ కవి ఎవరండి?
ఇంతటి సాహితీ విలువగల పద్యాన్ని అందించినందుకు ధన్యవాదములు. ఇంకాఇంకా ఇలాంటి పద్యాలు మీ కథామంజరిద్వారా అందజేస్తారని ఆశిస్తున్నాను.
భలే! ఒప్పుకోను కానీ, భలే!
కామెంట్‌ను పోస్ట్ చేయండి