14, మార్చి 2016, సోమవారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... Day 07 ( 4 -3-2016)

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... Day 07   ( 4 -3-2016)

కొడైకెనాల్ టూరిజమ్ వారి హొటల్ లో బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి, లగేజీలను బస్ డిక్కీలో పెట్టించుకుని
8.30. ని.లకు తిరుచ్చికి బయలు దేరాము. తిరుచనా పల్లినే తిరుచ్చి అంటారు. బస్సు ఏకథాటిగా
పరుగులు తీసి మధ్యాహ్నం 3 గంటలవుతూ ఉండగా తిరుచ్చి చేరింది.
తిరుచ్చిని ఆనుకుని శ్రీరంగ పట్టణం ఉంది. ఇక్కడ  ఉభయ కావేరుల మధ్య శ్రీరంగనాథ స్వామి రంగనాయకి
 అమ్మ వారితో కలసి స్వయంభువుగా వెలిసాడంటారు. 108 వైఫ్ణవ దివ్య క్షేత్రాలలో శ్రీరంగం చాలా ప్రసిద్ధ
మయినది. 7 ప్రాకారాలతో,21 గోపురాలతో విరాజిల్లుతూ ఉంటుంది. రాజ గోపురం ఎత్తు 236 అడుగులు.
భగవద్రామానుజుల వారి వైష్ణవ మత ప్రచారానికి ఈ శ్రీరంగం పట్టు కొమ్మగా నిలిచింది.
దీనికి సంబంధించిన వొక స్థల పురాణం ఉంది. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత విభీషణుడు శ్రీ రాముని విడిచి
వెళ్ళ డానికి మనస్కరించక రాముని ఎడబాటు సహించ లేక పోయాడుట. అప్పుడు  రామచంద్రుడు
అతనిని ఓదార్చి, ఇక్ష్వాకు వంశంలో తరతరుగా కొలువ బడుతూ ఉన్న రంగనాథుని ప్రతిమను తనకు
మారుగా సేవించు కొమ్మని యిచ్చేడుట.
అది తీసుకుని  విభీషణుడు లంకకు వెళ్తూ ఉభయ కావేరుల మధ్య ఉండే ఈ ప్రాంతానికి చేరుకొనే సరికి
సంధ్యా సమయ మయిందిట. సంధ్య వార్చు కునే నిమిత్తం దానిని చూస్తూ ఉండమని అక్కడ తారసపడిన
వొక బాలుని కోరేడుట. వినాయకుడే బాలుని రూపంలో వచ్చేడు. చూస్తాను కానీ నేను ముమ్మారు పిలిస్తే
 వెంటనే వచ్చి దీనిని తీసు కోవాలి. లేదంటే ఇక్కడే పెట్టి వెళ్ళి పోతానని బాలుడు చెప్పాడుట.
విభీషణుడు అందుకు అంగీకరించాడు. నది దగ్గరకి సంధ్య వార్చడం కోసం వెళ్ళాడు. కాసేపటికి బాలుడు
ముమ్మారు రమ్మని  పిలిచేడు. నది హోరులో విభీషణుడికి బాలుని పిలుపు అంద లేదు. దానితో బాలుడు
 శ్రీరంగని మూర్తిని అక్కడ ఉంచి మాయమై పోయాడుట. అలా ఉభయ కావేరుల మధ్య వెలసిన శ్రీరంగ
 నాథుడు భక్తుల పూజలు అందుకుంటూ  ఈ ప్రముఖ వైష్ణవ ఆలయంలో కొలువై ఉన్నాడు.

రంగనాథుని దర్శనమయ్యేక, కొంత దూరంలో ఉన్న జంబుకేశ్వర స్వామిని దర్శించు కున్నాము, తర్వాత
మరో రెండు మూడు కి.మీ దూరంలో ఉన్నవినాయక గుడినీ, వినాయక గుడి ఉండే రాక్
 టెంపుల్ నీ చూడడానికి వెళ్ళాము. వినాయక గుడి చాలా పెద్దది. రద్దీ బాగానే ఉంది.
మా ఆవిడా, రాధగారూ వాళ్ళూ అక్కడ ఉండే గజరాజుకి అక్కడ కొన్న గరిక తినిపించేరు.వో చిన్న షాపులో
 కాఫీలు త్రాగేము. భారీ ఏనుగు చూడ ముచ్చటగా ఉంది. రాక్ టెంపుల్ చూడాలంటే చాలా మెట్లు ఎక్కాలి
 కనుక, అంత ప్రయాసకు  ఓర్చుకో లేక, అందరం కిందనే గడిపేసాము. మాలో ఢిల్లీ నుండి వొంటరిగా
వచ్చిన డాక్టరమ్మ ఒకామె ( ఆవిడా మా లాగే సీనియరు సిటిజనే) పట్టుదలగా వెళ్ళి మెట్లు ఎక్కి గుడిని
 చూసి వచ్చింది. తర్వాత అందరం తిరుచ్చి లోని టూరిజమ్ వారి హొటల్ కి చేరు కున్నాము. నిజానికి
 దేవాలయాల దర్శనాలు మరి లేనట్టే. చివరి రోజయిన రేపు నేరుగా చెన్నైటూరిజమ్ వారి ఆఫీసు వద్దకు
బయలుదేరిన చోటుకి చేరు కోవడమే. పేకేజీలో లేకపోయినా, దారిలో వొక మంచి అమ్మ వారి ఆలయాన్ని
 చూపిస్తానని గైడు చెప్పాడు. అయితే అంతా సహకరించి ఉదయం 6.30కే బయలుదేరాలని కోరేడు.
అలాగే, చెన్నై చేరు కోగానే తక్కిన ఫార్మాలిటీస్ వేగిరం పూర్తి చేయిస్తానని చెప్పాడు. సీనియర్ సిటిజన్ లకు
 టిక్కెట్ మొత్తంలో 20 శాతం రిఫండు ఉంటుందనీ, అయితే దానికి ఏదో ఒక ఫొటో, జనన తేదీ ఉండే
ప్రభుత్వ గుర్తింపు కార్డు జెరాక్స్ ప్రతి ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. అంతే కాకుండా,
తిరుచ్చి టూరిజమ్ వారి హొటల్లో శాఖాహార భోజనం దొరకదని చెప్పి, బయట  మంచి హొటల్
నుండి ఎవరికి కావలసిన ఆహార పదార్ధాలు వారికి టూరిజమ్ వారి ఖర్చుతో వారి వారి రూములకే
పంపిస్తానని చెప్పాడు. నేను చపాతీ, ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పేను.
హొటల్ రూముకి చేరు కున్నాక, వేడి నీళ్ళతో స్నానం చేసి, బట్టలు మార్చుకుని మా ఆధార్ కార్డుల
జెరాక్సు కాపీలు తెచ్చుకోడానికి బయటకి వెళ్ళేను. ఈ హొటలు తిరుచ్చిప్రధాన బస్  స్టేషనుకి అతి
 సమీపంలో బాగా రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంది. జెరాక్సు కాపీలు తెచ్చుకుని హొటలుకి వచ్చే సరికి
మా గైడు పంపించిన వ్యక్తి  చపాతీ, ఫ్రైడ్ రైసు పేకట్లు తెచ్చి అందించేడు.
వాటిని తిని అంత వరకూ జరిగిన మా యాత్రను మననం చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రకు
ఉపక్రమించేము.

రేపటి రోజుతో ముగిసే మా ఎనిమిది రోజుల తమిళనాడు యాత్రలో చివరి రోజు నాటి విశేషాలు
తెలుసుకునే ముందు కాస్త విరామం. శలవ్.









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి