25, జనవరి 2010, సోమవారం

ప్రతి పద్య చమత్కారం

ప్రతి పద్యం లొ చమత్కారం చూపిస్తూ, మొత్తం ప్రబంధం రచించిన కవి చేమకూర వేంకట కవి. ఆ కవి వ్రాసిన విజయ విలాసం ఆద్యంత రమణీయం. ఈ ప్రబంధానికి శ్రీ తాపీ ధర్మా రావు రచించిన హృదయోల్లాస వ్యాఖ్య చదివి తీరాల్సిన గ్రంధం.
చేమ కూర కవి గారి పద్య చమత్కారానికి ఒక ఉదాహరణ చూదామా ?

పున్నమ రేలఁ దత్పురము పొంతనె పో శిఖరాళి దాఁకి వి
చ్ఛిన్న గతిన్ సుధారసము చింది యిం దిగవాఱ నంతనుం
డి న్నెల న్నగిల్లు; నది నిక్కము గాదనిరేని యా పదా
ర్వన్నె పసిండి మేడలకు రాఁబని ేమిట సౌధనామముల్ ?


ఇది ఇంద్ర ప్రస్ఠ పుర వర్ణన . అక్కడి మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయని కవి వర్ణన చేస్తున్నాడు.
అక్కడి మేడలన్నీ జాళువా మేలి పసిడి సోయగపు సౌధాలేనట. వాటికి సౌధాలు అనే పేరు రావడానికి కవి చమత్కారంగా హేతువులు చూపుతున్నాడు.
పున్నమి రాత్రులలో చంద్రుడు అటు వేపు వస్తూ ఆ మేడల శిఖరాలు తగులు కొని గాయ పడ్డాడుట. అతను సుధాకరుడు కదా? అతని లోని సుధ అంతా ఆ మేడల మీద కారి పోయింది. సుధ అంటే అమృతం అనే అర్ధమే కాక సున్నం అనే అర్ధం కూడా ఉంది . కనుక, ఆ మేడలకు సౌధాలు అని పేరు కలిగిందని కవి గారి చమత్కారం. నమ్మకం కుదరడం లేదా? తన లోని సుధ అంతా కారి పోవడం వల్లనే కదా , చంద్రుడు అప్పటి నుండి ( పున్నమి నాటి నుండి ) క్ష్క్షీణించి పోతున్నాడు ? అంటాడు కవి.
అసలింతకీ సౌధము అంటే సున్నం తో కట్ట బడినది. కాని, సౌధానికి గల నానార్ధాలను చక్కగా వినియోగించుకుని కవి గారు ఎంత చమత్కారమయిన పద్యాన్ని రచించారో చూసారా?
ఆ పట్టణం లో మేడలు అంత యెత్తుగా ఉన్నాయని భావం.

1 కామెంట్‌:

www.apuroopam.blogspot.com చెప్పారు...

మనకున్న కావ్యాలలో విజయ విలాసం విశిష్టమైనది. దానిలో మీరు పరిచయం చేయదగ్గ పద్యాలు ఇంకా చాలాచాలా ఉన్నాయి. పరిచయం చేయండి. విజయనిలాస కర్తకు నా జోహార్లు ఇవిగో---

జంకేమి లేక పలికెద
ఇంకేదియు సాటిరాని ఇంపగు కావ్యం
శృంగారపు రస శిఖరం
వెంకటకవి చేమకూర విజయ విలాసం
-----పంతుల గోపాల కృష్ణ

కామెంట్‌ను పోస్ట్ చేయండి