27, జనవరి 2010, బుధవారం

మహా కవి కాళి దాసు - నాలుగు శ్లోక రత్నాలు ...






మహా కవి కాళి దాసు రచించిన అభిఙ్హ్ఞాన శాకున్తలం మహోన్నతమైన నాటకం.గీర్వాణ భాషలో విరచితమయిన ఆ నాటకాన్ని చదివి గెటే పండితుడు ఆనందం పట్ట లేక, నాట్యం చేసాడుట .
కావ్యేషు నాటకం రమ్యం
నాటకేషు శకున్తలా
తత్రాపి చతుర్ధోంక:
తత్ర శ్లోక చతుష్టయమ్
అని కదా, పెద్దలు అంటారు. కావ్య రచనలలో కెల్లా సమాహార కళ అయిన నాటకమే రమణీయ మయినది. అందులోను కాళిదాసు రచించిన శాకున్తలమ్ మరీ రమణీయం. ఆ నాటకంలోను, నాలుగో అంకం, అందునా, మరీ ముఖ్యంగా నాలుగు శ్లోకాలూ బహు రమణీయాలని చెప్తూ ఉంటారు...


ఆ మనోహర మయిన నాలుగు శ్లోకాలనూ, మరో సారి మీతో పంచుకునే భాగ్యాన్ని నాకు కలుగ జేయండి ..
వీటికి శ్రీ కందుకూరి వీరేశ లింగం పంతులు గారు రచించిన యథానువాద తెలుగు నాటకం నుండి తెలుగు సేత పద్యాలను కూడ ప్రతి శ్లోకం క్రింద యిస్తున్నాను... అవధరించండి ...
శకుంతల అత్తవారింటికి, దుష్యంతుని వద్దకు బయలు దేరుతూ ఉంటే, కణ్వ మహా ముని ఆమెకు అత్త వారింట ఎలా ప్రవర్తించాలో బోధించే ఘట్టం ...

యాస్యత్యద్య శకున్తలేతి హృదయం సంస్ప ష్ట ముత్కంఠయా
కణ్ఠస్తంభిత బాష్ప వృత్తి కలుషశ్చిన్తా జడం దర్శనమ్
వైక్లబ్యం మమ తావదీదృశ మహా స్నేహాదరణ్యౌకస:
పీడ్యంతే గృహిణ: కథం నుతనయా విశ్లేష దుఃఖైర్నవైః


కందుకూరి వారి అనువాదం ...

కొందలమందె డెందము శకుంతల తానిపుడేగు నంచయో,
క్రందుగ బాష్ప రోధమున కంఠమునుంజెడె, దృష్టి మాంద్యముం
బొందె, నొకింత పెంచిన తపోధనులే యిటు కుంద, నెంతగాఁ
గుందుదురో తమంతగను కూఁతులఁబాయు గృహస్థలక్కటా.

శకుంతల అత్త వారింటికి వెళ్తున్నదని నా మనసు కలవరపాటు చెందుతోంది. కన్నీటితో చూపు మందగించింది. కంఠం రుద్ధమై పోయింది. కొంత కాలం పెంచిన ప్రేమతో మా వంటి తపోధనులే ఇంత బాధ పడుతూ ఉంటే, కన్న బిడ్డలను అత్త వారింటికి పంపించే టప్పుడు గృహస్థులు ఎంత విచారిస్తారో కదా ?

2. పాతుం నప్రధమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషుయా
నా దత్తే ప్రియమణ్డనాపి భవతాం స్నేహేన యా పల్లవమ్
ఆద్యేవ: కుసుమ ప్రసూతి సమయే యస్యా భవత్యుత్సవ:
సేయం యాతి శకున్తలా పతి గృహం సర్వైరను
ఙ్హ్ఞాయతాం

ఎవతె జలంబు మీకిడక యెన్నడుఁద్రాగదు తాను ముందుగా
నెవరితె ప్రేమచేఁజిదుమ దీప్సిత భూషణమయ్యు, మీ చిగు
ళ్ళెవతకు మీరు తొల్త ననలెత్తుట పండువుగాగ నుండు నా
ప్రవిమల గాత్రి యేగుఁబతి సజ్జకు
నందరనుజ్ఞ నీయరే.

తపో వనం లోని లతలను, వృక్షాలను సంబోధిస్తూ చెప్పినది:

ఎవతె మీకు నీరు పెట్టనిదే తాను ఎన్నడూ త్రాగ లేదో, ఎవతె అలంకారార్ధం కోసం కూడా మీ చిగుళ్ళను త్రుంచేది కాదో, తొలిసారిగా విచ్చు కున్న మీ పూలను చూసి ఎవతె సంబర పడేదో, అట్టి సుకుమారి శకుంతల నేడు పతి గృహానికి పయన మవుతున్నది. దయతో అనుమతించండి.


3. అస్మాన్ సాధు విచిన్త్య సంయమి ధనానుచ్చై: కులంచాత్మన
స్త్వయ్యస్యా: కథమప బాంధవ కృతాం స్నేహ పృవృత్తించతామ్
సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యాత్వయా
భాగ్యాయత్త మత: పరం నఖలు తద్వాచ్యం వధూబన్ధుభి:


మమ్ముల సత్తపోధనుల, మాన్య భవత్కులమున్, స్వబంధులన్
సమ్మతి వేడ కీమె యెటొ సల్పిన నీ పయి కూర్మినెంచి మా
కొమ్మని నేలు కొమ్ము పరికొమ్మలతో సమగౌరవంబుగన్
బిమ్మటిదెల్ల భాగ్యమగు , పేర్కొనరాదిది యింతి బంధువుల్.

శిష్యుల ద్వారా కణ్వుడు దుష్యంతునకు పంపిన సందేశం:

గొప్ప తపోధనులమైన మమ్ములను, శ్రేష్ఠమయిన తన కులాన్ని, బంధువులను కూడ తలచక ఈమె నీ పయి ప్రేమను చూపి నిన్ను పరిణయమాడింది. సరి, ఈమెను నీ ఇతర అంతి పుర స్త్రీలతో సమానంగా గౌరవాదరాలతో చూసుకో. అడపిల్ల బంధువులు ఇంత కన్నా ఎక్కుగా చెప్పరాదు. ఆ పిదప మా భాగ్యం ఎలా ఉంటే అలా ఉంటుంది.

4.. శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియ సఖీ వృత్తిం సపత్నీ జనే
భర్తుర్వి ప్రకృతాపి, రోషణతయా మాస్మ ప్రతీపం గమ:
భూయిష్ఠ భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
యాన్త్యేవం గృహిణీపదం యువతయో వామా: కులస్యాధయ:


4. గురులకు సేవ చేయు మనుగుంగతి జూడుము నీ సపత్నులన్
వరుడలుకన్వహించినను భర్తృ విరుద్ధవు గాకు మీసునన్
పరిజనులందుఁజూపుము కృపంగడు, బొందకు భాగ్య గర్వమున్
తిరిగిన నిట్లు, కాంతురు సతీత్వము కాంతలు, నింద్యము లొండుచోన్.

అమ్మా, శకుంతలా ! పెద్దలను సేవించుకో. నీ సవతులను ప్రేమతో చూడు. నీ భర్త కోపించినా అసూయతో అతనికి వ్యతిరేకంగా ప్రవర్తించ వద్దు సుమా ! సేవక జనులను దయతో చూడు. సంపద వలన గర్వ పడకు. ఈ విధంగా ప్రవర్తిస్తే కాంతలు గొప్ప పతివ్రతలని కొనియాడ బడుతారు. అలా కాక పోతే నిందలకు గురవుతారు సుమీ !



2 కామెంట్‌లు:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

ఆర్యా!
అద్భుతమైన శ్లోక చతుష్టయాన్ని కందుకూరివారి పద్యాలను జోడించి చక్కగా అందుబాటులోకి తెచ్చిన మీకు నా ధన్యవాదములు.

ఐతే సదరు శ్లోకములకు భావం పద్యరూపంలో తెలుగులో అందుబాటులో ఉన్నా
మీరు వచనరూపంలో భావాన్ని ఇంకా వివరంగా జోడించి ఆశ్లోకాలలో గల ప్రత్యేకతనుటంకిస్తూ ప్రచురిస్తే మాకింకా ఆనందం చేకూర్చినవారౌతారని మనవి చేస్తున్నాను.

Anonymous చెప్పారు...

జోగారావు గారూ,

మీర్రాసిన కావ్యేషు నాటకం రమ్యమ్, శ్లోకం రెండో పాదం ఓ సారి చూడండి.
"తత్ర రమ్య శకుంతలా" అనుండాలనుకుంటాను.

కావ్యేషు నాటకం రమ్యమ్
తత్ర రమ్య శకుంతలా
తత్రాపి చతుర్థోంకః,
తత్ర శ్లోక చతుష్టయమ్

-బ్రహ్మానందం

కామెంట్‌ను పోస్ట్ చేయండి