5, ఫిబ్రవరి 2010, శుక్రవారం
చదరంగం - వడ్ల గింజల లెక్క !
చదరంగం గళ్ళలో , మొదటి గడిలో ఒక వడ్ల గింజను ఉంచి, తర్వాతి గళ్ళలో రెట్టింపు చేసుకుంటూ పోతే, మొత్తం చదరంగం గళ్ళలో ఎన్ని వడ్ల గింజలు పెడతామో తెలుసా ! అనే లెక్క గురించి మనకి తెలిసిందే కదా ? పావులూరి మల్లన సార సంగ్రహ గణితం లో పద్య రూపంలో యీ లెక్కనీ, దాని జవాబునీ యిచ్చాడు . చూదామా ...
మొదలొకట నిల్పి, దానిం
గదియఁగఁదుది దాక రెట్టిగా గూడినచో
విదితముగ బల్కు మాకుం
జదరంగపు టిండ్ల కైన సంకలితమొగిన్
ఇదీ లెక్క. దీనికి జవాబు :
శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియన్నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మ జాస్య కుం
జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తరమగు రెట్టి రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధికిన్
ఇందులో కవి అంకెలకి బదులుగా కొన్ని సంకేత పదాలు ఉపయోగించాడు. వాటి అర్ధాలు తెలుసుకుని వరుసగా అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది . ఐతే, అంకెలను వెనుక నుంచి, అంటే, కుడి నుండి ఎడమకు వేసుకుంటూ వెళ్ళాలి.
పద్యంలోని సంకేత పదాలకి సరైన అంకెలు ...
శరములు = సాయకములు = ఐదు
శశి =చంద్రుడు = తుహినకరుడు = ఒకటి
షట్కము = ఆరు
వియత్తు = గగనము = సున్న
వేదములు = నాలుగు
పద్మజాస్యుడు = నాలుగు ముఖములు గల వాడు =బ్రహ్మ = నాలుగు
రంధ్రములు = నవ రంధ్రములు = తొమ్మిది
అగ్నులు = మూడు
నగములు = భూ ధరములు = గిరులు = ఏడు
తర్కములు = ఆరు
కుంజరములు = అష్ట దిక్కులలో ఉండే ఏనుగులు = ఎనిమిది.
ఈ సంకేత పదాల అర్ధాలను అనుసరించి వెనుక నుండి అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది !
ముందు మీరు ప్రయత్నించండి.
లేదా,
జవాబు తెలుసు కోవాలంటే క్రింది తెలుపు భాగాన్ని డ్రాగ్ చేసి చూడాల్సిందే.మరి మీ యిష్టం !
18446744073709551615
5 కామెంట్లు:
(2 to the power of 64) - 1 కు కూడా ఇదే విలువ.
అంకానా వామతో గతిః.
చాలా బాగుంది. ధన్యవాదాలు.
Thanks a lot.
i was looking for this meaning.
Thanks to Ranjani garu for the pointer.
ధన్యవాదాలు. చాలా పాత టపాని సైతం చూసి, స్పందన తెలియ జేసినందుకు. మీకూ, రంజని గారికీ కూడా.
wow.
చాలా సార్లు ఈ పనికిమాలిన బ్లాగులు చదవడం మానివేయాలనిపిస్తుంది. కానీ ఇలాంటి ఆమూల్యమైన వివరణలు గలిగిన టపాలు చూసినప్పుడు, ఇలాంటి టపా ఒకదానిని కోసం వంద చెత్తవి చదివినా పర్వాలేదనిపిస్తుంది.
ధన్యవాదములు.
అన్నట్టు నేను గణితశాస్త్రజ్ఞుడిని కావడం చేత ఈ టపా ఇంకా బాగా నచ్చింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి