7, ఫిబ్రవరి 2010, ఆదివారం
అధికారాంతమునందు చూడవలె ....
ఒక చక్కని శ్లోకం చూదామా?
ప్రాప్య ప్రమాణ పదవీం కోనామూస్తే తులేవ లేపస్తే
వయసి గరిష్ఠ మధస్తాత్ లఘుతరముచ్ఛైస్తరాం కురుషే
ఈ శ్లోకంలో కవి అన్నిటినీ తూచే త్రాసుని ఏమని నిందిస్తున్నాడో చూడండి ...
ఓ త్రాసా ! నీ కెంత గర్వం ! తూచే పదవిని పొందాను కదా అనే గర్వం తల కెక్కి గురుతరమయిన వాటిని ( బరువైన వాటిని ) క్రిందికి నొక్కి వేస్తున్నావు ... తేలికయిన వాటి నేమో మీదికి ఎత్తుతున్నవు కదా !
త్రాసు చేసే పని అదే కదా ? బరవు ఉన్న తక్కెడ క్రిందికీ, తేలిక వస్తవులున్న తక్కెడ మీదికీ లేవడం సహజమే కదా ...
అల్పులకి అధికారం వస్తే ... సమర్ధులని అణగ ద్రొక్కి , అసమర్ధులని అందలాలెక్కిస్తారని కవి యిందులో భంగ్యంతరంగా చెబుతున్నాడన్నమాట !
ఎలాగూ సందర్భం వచ్చింది కనుక, నీచులకి భాగ్యవాశాత్తు అధికారం దొరికితే ఎలా ఉంటుందో చక్కని పద్యం ఒకటి చూడండి మరి ...
విధి సంకల్పముచే నొకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ , చూపు తక్కువ , సదా భాషల్ దురూక్తుల్, మనో
వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధి కారాంతమునందు చూడ వలె నయ్యంగారి సౌభాగ్యముల్ !
నీచుడికి అధికారం వస్తే, వాడికి (మంచి ) మాటలేవీ వినబడవు. ఆ విషయంలో బధిరుడవుతాడు, చూపు మందగిస్తుంది.. అంటే మంచిని గ్రహించడు. ఎప్పుడూ చెడ్డ మాటలే మాట్లాడుతూ, చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు ...
ఐతే, ఆ అధికారం పోయాక చూడాలయ్యా, ఆ అయ్య గారి వాలకం ! అని కవి దెప్పి పొడుస్తన్నాడు.
లంచ గొండులూ, కఠినాత్ములూ, పరుషంగా మాట్లాడే వారూ, పెద్ద హోదాలో ఉన్నంత కాలం విర్ర వీగడం , పదవీ విరమణ చేసాక నాగు పాము కాస్త మంటి బొక్కడం లాగా మారిపోవడం మనకి తెలిసిందే కదా !
మహా కవి కాళి దాసు శాకున్తలం లో అధికారం ఎలాంటిదో వివరిస్తూ చెప్పిన గొప్ప శ్లోకం ఉంది ...
ఔత్సుక్య మాత్ర మవసాదయతి ప్రతిష్ఠా
క్లిశ్నాతి లబ్ధ పరిపాలన వృత్తిరేనం
నాతి శ్రమాపనయనాయ న చ శ్రమాయ
రాజ్యం స్వహస్త ధృత దండమివాత పత్రమ్
రాచరికం సకల సంపదలతో, విలాసాలతో, భోగ భాగ్యాలతో, గౌరవ మర్యాదలతో కూడినదే అయినా, అది తన చేతితో పట్టుకున్న ఆత పత్రంలాగా సుఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది కాని, అంత సుఖకరం కాదు ...
అధికారంలో ఉండే ప్రభువు ఎంత జాగురూకుడై ఉండాలో, సుపరిపాలన ఎలా చేయాలో నారదుడు ధర్మ రాజుకి వివరించే గొప్ప పద్యాలు మహాభారతంలో ఉన్నాయి ...
సభా పర్వంలో నారదుడు పాండవులకి చెప్పిన రాజనీతి ధర్మాలు సర్వ కాలాలలోనూ. సకల దేశాలలోనూ ప్రభువులకి చక్కని మార్గదర్శకాలని చెప్పాలి.
మచ్చుకి ఒక్క పద్యం ...
కడుఁజనువాఁడునై పురుషకారియు దక్షుఁడు నైన మంత్రి పెం
పడరగ రాజ పుత్త్రుల మహా ధనవంతులఁజేసి, వారితో
నొడబడి పక్షమేర్పడఁగ నుండడుగా , ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె ! జగన్నుత ! గర్వము దుర్విమోహమున్.
ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలి, సమర్ధుడు అయిన మంత్రి - ఇతర రాజకుమారులని మహో ధనవంతులుగా చేసి, వారితో చేతులు కలిపి, నీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడేట్లు చేయడం లేదు కదా ! ఎందుకంటే, ధనం ఎలాంటి వారికయినా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది కదా !
అధికారం కోసం వెంపర్లాడే మన రాజకీయ నాయకమ్మన్యులు ఇలాంటి రాజనీతి ధర్మాలని ఆకళింపు చేసుకోవాలి. కాని, అది, పేరాశ కదూ !
3 కామెంట్లు:
మీ పోస్ట్ బాగుంది. త్రాసు మీద వ్రాసిన భావం చాలా బాగుంది ఎప్పుడూ వినలేదు.ఈ క్షణ భంగురమైన జీవితం లో అధికారం కోసం, ధనము కోసం ఎందుకు కొట్టుకు చస్తారో అర్ధం కాదు. చిత్రంగా ఉంటుంది. ఆ సంపాయించినది కుడా వారు తిన లేరు.
"అనువు గాని వానికి అధికారమిచ్చిన" అని ఒక పద్యం చిన్నప్పుడు చదివినట్టు గుర్తుంది. దానిని గూడా వీటిలో కలిపితే ఇంకా బాగుంటుంది.
బలివేయరు గుఱ్ఱములను,
బలివేయరు వ్యాఘ్రములను, వసుధను కరులన్
బలివేయరు. నజముల నిల
బలివేతురు. దుర్బలుండె బలి యగుగాదే!.
నమస్కారములు
చక్కని పద్యం చెప్పారు. చాలా బాగుందని నేను తమ అనుమతి లేకుండానే ఈ శ్లోకాన్ని " ఆంధ్రాఫోక్స్ .నెట్ " లో " " మీకు తెలుసా " శీర్షిక లొ ఉంచాను మీ ఎడ్రస్స్ కి మెయిల్ చేస్తే నాకు రిటర్న్ వచ్చింది. అందుకని ఇక్కడ మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఆమోదించ గలరు మరొకసారి మన్నించ ప్రార్ధన సెలవు రాజేశ్వరి
కామెంట్‌ను పోస్ట్ చేయండి