31, మార్చి 2010, బుధవారం

ఆశ ... దోశ ... అప్పడం ... వడ ....


అశ అనేది ఉండడం ఎవరికయినా సహజమే. కాని, అత్యాశ మాత్రం పనికి రాదు.
దురాశ దుఃఖానికి చేటు అని మన పెద్దలు చెప్పనే చెప్పారు

ఇచ్ఛతి శతీ సహస్రం సహస్రీ లక్షమీహతే
లక్షాధిపస్తథా రాజ్యం రాజ్యస్థ: స్వర్గమీహతే

వంద కలవాడు వేయి కావాలని కోరుకుంటాడు. వేయి కలవాడు లక్ష కావాలని అభిలషిస్తాడు. లక్షాధికారి
రాజ్యం (అధికారం) కావాలని ఉవ్విళ్ళూరుతాడు. పోనీ, అంతటితో ఊరుకుంటాడా అంటే, ఉహూఁ .... ప్రభుత్వం సిద్ధించిన పిమ్మట స్వర్గం ప్రాప్తించాలని కలలు కంటాడు. ఆశకి అంతు లేదు కదా ?

భాగవతంలో వామన చరిత్రలో పోతన గారి పద్యం ఒకటి చూడండి ...


ఆశాపాశము దాఁగడున్నిడుపు , లేదంతంబు రాజేంద్ర! వా
రాశి ప్రావృ త మేదినీ వలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసింబొందిరి గాక వైన్య గయ భూకాంతాదులున్నర్ధ కా
మాశన్ బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులంజూచిరే ?

మహా సామ్రాజ్యం చేకూరినప్పటికీ వైన్యుడు, గయుడు మొదలయిన పూర్వ రాజులు ఖేద పడ లేదా ?అర్ధకామాశను విడువ గలిగారా?

పసిడి కంకణం మీద పేరాశతో పులి నోటికి చిక్కిన బాపడి కథ చిన్నప్పుడు చదువుకో లేదూ ?

రాజ్య కాంక్షతో అయిన వారినే చంపిన దుర్మార్గులు చరిత్రలో ఎందరు లేరు? అశ ఎంత చెడ్డది ?

అలాంటి వారి గురించి ధూర్జటి చెప్పిన పద్యం కూడా చూడండి ...

ఒకరింజంపి సదస్థులై బ్రతుక తా మొక్కొక్కరూహింతురే
లొకొ ? తామెన్నడుఁజావరో ? తమకు బోవో సంపదల్ ? పుత్ర మి
త్ర కళత్రాదుల తోడ నిత్య సుఖమందంగందురో ? ఉన్న వా
రికి లేదో మృతి ? యెన్నడుం కట కటా ! శ్రీ కాళ హస్తీశ్వరా !

బంగరు లేడి లోకంలో ఉండడం దుర్లభం అని తెలిసి కూడా సీతా దేవి దానిని కోరడం , రాముడు ఆమెను విడిచి తెస్తానని వెళ్ళడం ఏం చోద్యం !

కనకమృగము భువిని కద్దు , లేదనకయె , తరుణి విడిచి చనియె దాశరధియు
తెలివి లేని వాడు దేవుడెట్లాయెరా , విశ్వదాభి రామ వినుర వేమ.

వేమన పద్యమే మరొకటి ...

నీళ్ళ లోన మీను నెరమాంసమాశించి . గాలమందు చిక్కు కరణి భువిని
ఆశ దగిలి నరుడు నీలాగు చెడి పోవు విశ్వదాభిరామ వినుర వేమ,

నీళ్ళలో చేప గాలానికి కట్టిన ఎరకి ఆశ పడి గాలానికి చిక్కి ఛస్తోంది. ఆశ కి తగిలిన మానవుడూ అలాగే నశిస్తాడు సుమా.

ఆశయా బద్ధతే లోకే ... అన్నారు పెద్దలు. అత్యాశ కూడదని చెప్పడమే లక్ష్యం.

1 కామెంట్‌:

చిన్నమయ్య చెప్పారు...

ఎంత చక్కగా చెప్పేరు? "తత:కిం" అని శంకరులవారన్నట్టు - ఆశకి అంతు లేదు. కానీ, ఆశే మనిషిని నడిపిస్తుంది. ఆశలు కలిగిన మనిషిని గమ్యం వైపు ఎగిరే పక్షితో పోలిస్తే, ఒక రెక్క వివేకం, మరో రెక్క వైరాగ్యం అవుతాయి. రెండు రెక్కలూ సమంగా వున్నప్పుడే కదా - ఎగరడం!

కామెంట్‌ను పోస్ట్ చేయండి