7, మే 2010, శుక్రవారం

పలుకే బంగారం !!










సమ్యగ్భాషణం వ్యక్తికి భూషణం. మంచిగా మాట్లాడితే అందరూ మిత్రులే. కఠినోక్తుల వల్ల మనకి అంతా శత్రువులవడం తథ్యం.

ఈ చిన్న కంద పద్యంలో కవి ఆ విషయాన్ని ఎంత చక్కగా వివరించాడో చూడండి ...

కాకేమి తన్నుఁదిట్టెనె ?
కోకిల ధనమేమి తన్నుఁగో కొమ్మనెనే !
లోకము పగయగు బరుసని
వాకున ,జుట్టమగు మధుర వాక్యము కలిమిన్ !

పాపం, కాకి నిన్నేమీ తిట్ట లేదు కదా ? అదంటే అసహ్యించుకుంటావేం ? ఊరికే కాకి గోల ! అంటూ విసుక్కుంటావు. మరి, కాకిలాగా నల్లగానే ఉంటుంది కదా, కోకిల - అది నీకేమీ పెట్టుపోతలు జరిపించడం లేదు కదా ? దాని గొంతువిని మెచ్చుకుంటావు ?

మధురంగా పలకడం చేతనే కదా కోకిలని యిష్ట పడుతున్నావు ?

అందు చేత, మంచిగా మాట్లాడడం వల్ల అందరి ప్రేమనూ పొందవచ్చును. రుస రుసలాడుతూ ఉంటే ఎవరూ హర్షించరు. సరి కదా, చీదరించుకుని, దూరంగా జరిగి పోతారు ....

బద్దె భూపాలుడు సుమతీ శతకంలో ఇతరుల మనసు బాధించకుండా మాటలాడదగునని చెప్పాడు కదా ?

ఎప్పటి కెయ్యది ప్రస్తుత,
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపకఁదానొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !

ఎప్పుడేది మాట్లాడాలో అప్పుడది మాట్లాడాలి. ఇతరులు మనసులు బాధించ కూడదు. అలా లౌక్యంగా వ్వహరించే వాడు ధన్యుడయ్యా అంటాడు కవి.

అలా అని ఇతరుల మెప్పు కోసం వారికి నచ్చుతుందని చెప్పి నానా చెత్తా పలకమని కాదు ...
పరుషంగా కాక, కాస్త సౌమ్యంగా మాట్లాడమని కవి బోధిస్తున్నాడు...

అయితే , కొందరున్నారు ... ఎంత మంచిగా చెప్పు ... వినరు. తల కెక్కించు కోరు. వాళ్ళకి తెలీదు. చెబితే వినరు.


భర్తృహరి ఎలా వాపోయాడో చూడండి ...

బోద్ధారో మత్సరగ్రస్తా: ప్రభవ: స్మయ దూషితా:
అబోధో పహతశ్చాన్యే జీర్ణమంగే సుభాషితమ్

బాగా తెలిసిన వారికి మదం, మాత్సర్యం జాస్తి. చెబితే వినరు. ప్రభువులా - వారసలే గర్విష్ఠులు. వారికి చెప్ప లేం. ఇక ఇతరులంటారా, వారికి చెప్పినా అర్ధం కాదు. అందుల్ల నాలుగు మంచి మాటలు చెబుదామన్నా నోరు దాటి బయటకి రావడం లేదు.

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం కూడా చూడండి ...

బోద్ధలగు వారు మత్సర పూర్ణమతులు
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న
నితర మనుజులబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు.




సనాతన ధర్మం చెప్పినది చూడండి ...

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మస్సనాతన:

సత్యాన్నే పలకాలి.ప్రియ వచనలాలే పలకాలి. సత్యమయినా, అప్రియాన్ని పలకవద్దు. ప్రియమైన దయినప్పటికీ అసత్యం పలక వద్దు. ఇది సనాతన ధర్మం.

అయితే, తనకి తెలిసిన మంచిని చెప్పక పోవడం కూడ పాపహేతువేనని నన్నయ గారు ...

తనయెఱిఁగిన యర్ధంబొరుఁ
డనఘా ! యిది యెట్లు సెప్పు మని యడిగినఁజె
ప్పని వాడును, సత్యము సె
ప్పని వాడును ఘోర నరక కంపమునఁబడున్.

తనకి తెలిసిన విషయాన్ని, నాకది చెప్పవయ్యా, అని ఎవరయినా కోరితే, తనెరిగిన దానిని చెప్పని వాడూ, సత్యము పలుకని వాడూ పెను నరకంలో పడతాడని నన్నయ్య గారు మహా భారతంలో చక్కగా హెచ్చరించారు ...

ప్రియ భాషణముల గురించి ఎలాగూ చెప్పుకుంటున్నాం కనుక ఇది కూడా చూడండి ...

అనుదిన సంతోషణములు,
జనిత శ్రమ తాప దు:ఖ సంశోషణముల్
తనయులు సంభాషణములు,
జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్

పోతన గారు భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో చెప్పిన పద్యమిది.

కొడుకుల ముద్దు మాటలు జనకులకు నిత్యం ఆనందాన్ని కలిగిస్తూ. విచారాలని పోగొడుతూ ఉంటాయి. పిల్లకాయల పలుకులు వారి చెవులకి మంచి అలంకారాలు ...

సభలో సభారంజకంగా మాట్లాడలంటే ఎలాంటివి మాట్లాడాలో కవి చౌడప్ప తన మార్కు పద్యంలో చెప్పాడు. గమనించండి...

పది నీతులు పది బూతులు
పది శృంగారములు కల్గు పద్యములు సభన్
చదివిన వాడే యధికుడు
కదరయ్యా కుంద వరపు కవి చౌడప్పా !

ఆ రోజులలో సభలలో అలాంటి మాటలు గౌరవ ప్రదాలే కాబోలు.

నీతులూ బూతులూ లోకఖ్యాతులని కూడా సెలవిచ్చాడు మరి ...

నీతులకేమి యొకించుక
బూతాడక నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కుంద వరపు కవి చౌడప్పా !

ఐతే, నాకు చక్కగా మాట్లాడడం చాతనవును కదా అని ఎక్కడ పడితే అక్కడ మెప్పించేలా మాట్లాడడం అంత సుళువేమీ కాదు . అదే చెబుతున్నాడు చౌడప్ప ... మరో పద్యంలో ...

నేరుతునని మాట్లాడగ
వారిజు భవునంత వాని వశమా ? తంజా
వూరి రఘు నాధ నాయుని
గారెదెరుగ కుంద వరపు కవి చౌడస్సా .

నాకు బాగా మాట్లాడడం చాతనవునని విర్రవీగుతూ తంజావూరి ప్రభువులు రఘునాథ రాయుని ఎదుట
మాట్లాడడం బ్రహ్మ దేవుడికి కూడా సాధ్యం కాదు సుమీ ! అని కుండ బద్దల కొట్టినట్టుగా చెబుతున్నాడు కవి...

మాట్లాడడం సుళువే కానీ, మాట మీద నిలబడడమే కష్టం పోతన గారు చెప్ప లేదూ ?...

బ్రతు వచ్చు గాక బహు బంధనములైన
వచ్చు గాక లేమి వచ్చుగాక !
జీవ ధనము లైన చెడు గాక పడు గాక
మాట తిరుగ లేరు మాన ధనులు !

కష్టాలు రానీ, దరిద్రం కలగనీ ఏమైనా కానీ మాన ధనులు మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు ....

మంచి వాడు ఎప్పుడూ మంచి మాటలే పలుకుతాడు. కఠినంగా మాట్లాడడు. ఒక వేళ ఎప్పుడినా అతను కఠినంగా పలికినా మేలే జరుగుతుంది తప్ప - కీడు కాదు. చూడండి భాస్కర శతకంలో కవి ...

పలుమరు సజ్జనుండు ప్రియ భాషలె పల్కు , కఠోర వాక్యముల్
పలుకఁడొకానొకప్పుడవి పల్కినఁగీడునుఁగాదు ; నిక్కమే
చలువకు వచ్చి మేఘుఁడొకజాడను దా వడగండ్ల రాల్చినన్
శిలలగునోటు ! వేగిరమె శీతల నీరముఁగాక భాస్కరా !

సజ్జనుడు సదా మంచి మాటలే పలుకుతాడు. ఎప్పుడూ కఠినంగా పలుకడు. ఒక వేళ ఎప్పుడయినా అతని నోటి వెంట కఠినోక్తులు వచ్చినా , దాని వలన మనకి కీడు కలుగదు. మంచే జరుగుతుంది.
ఎలాగంటే, లోకానికి చల్లదనాన్ని ఇవ్వడం కోసం మేఘుడు వచ్చి, వర్షం కురిపిస్తాడు. ఒక్కోసారి వడగళ్ళూ కురిపిస్తాడు. అయితే అవి రాళ్ళలాగా ఉండి పోతాయా ? వెంటే చల్లని నీటిగా కరిగి పోదూ ?

మంచి మాటల గురించి సుమతీ శతకంలోంచి మరో మంచి మాట ...

మాటకుఁబ్రాణము సత్యము
కోటకుఁబ్రాణము సుభట కోటి ధరిత్రిన్
బోటికిఁబ్రాణము మానము
చీటికిఁబ్రాణంబువ్రాలు సిద్ధము సుమతీ !

మాటకి సత్యాన్ని పలకడమే ప్రాణం. కోటకి మంచి భటులు ప్రాణం. శీలమే పడతికి ప్రాణం ( ఆ మాట కొస్తే మగవాడికి కాదా ఏమిటి?) ఇక, సంతకమే చీటీకి ( ఉత్తరం వగైరాలకి ...) అతి ముఖ్యం అంటున్నాడు కవి ...

మాట్లాడకుండా ఉండడం కూడా కొండొకచో శోభిస్తుంది సుమా !

ఎలాగంటే ....

మూర్ఖో2పి శోభతే తావత్సభాయాం వస్త్రవేష్టిత:
తావచ్చ శోభతే మూర్ఖో యావత్కించిన్నభాషతే.


మూర్ఖుడు - అంటే చదువు సంధ్యలు లేని శుంఠ కూడా చక్కని బట్టలు వేసుకుని సభలలో రాణించ గలడు.
ఎంత వరకయ్యా అంటే ..... నోరు విప్పనంత వరకూ !!

మరి ఇప్పటికి స్వస్తి.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి