మన పూర్వ కవులు మన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దు కోడానికి ఎన్ని గొప్ప విషయాలనో మంచి మంచి శ్లోకాలలో చెప్పారు.
మంచి మాట అనే టపాలో వీలున్నప్పుడల్లా మీతో పంచుకోవాలనే ప్రయత్నంతో ...
చూడండి ...
సింహ: శిశురపి మదమలిన కపోల భిత్తిషు గజేషు
ప్రకృతిరియం సత్త్వవతాం న ఖలు వయస్తేజసాం హేతు:
విదిలింప వుఱుకు సింగపుఁ
గొదమయు మద మలిన గండ కుంజరములపై
నిది బలశాలికి నైజము
గద ! తేజోనిధికి వయసు కారణమగునే ?
సింహం పిల్ల కూడ రెచ్చ గొడితే ఊరు కోదు. మద గజం మీదనయినా పడి తన సత్తా చాటుతుంది. ఇది బలవంతునికి నైజ గుణం కదా ! తేజోవంతునికి వయసుతో పని లేదు.
ప్రకృతిలో సకల చరాచరాలూ ఈ లక్షణాన్నే కలిగి ఉంటాయి. చూడండి ...
ఛిన్నోZపి రోహతి తరు: క్షీణోప్యుపచీయతే పునశ్చంద్ర:
ఇతి విమృశన్తస్సన్త: సన్తప్యన్తే నవిప్లుతాలోకే
ఖండితంబయ్యు భూజంబు వెండి మొలచు
క్షీణుఁడయ్యును నభివృద్ధిఁజెందు సోముఁ
డివ్విధమున విచారించి యొడలుఁదెగిన
జనములనుఁదాప మొందరు సాధు జనులు.
చెట్టుని చూడండి. నరికినా తిరిగి చిగురిస్తుంది. చంద్రుడూ అంతే కదా? కృష్ణ పక్షంలో కళలు క్షీణించినా, తిరిగి శుక్ల పక్షంలో పుంజుకుని, పూర్ణిమ నాటికి నిండే జాబిల్లిగా అవతరిస్తాడు. ఇలాగే సాధు జనులు ఓటమిని , ఆపదని, గాయాలను సరకుగొనరు. తిరిగి లేచి తమ ప్రతాపం చూపెడతారు.
ఇదే విషయం ఒక మంచి పోలికతో చెబుతున్నాడు కవి ...
యథా కందుక పాతే నోత్పతత్యార్య: పతన్నపి
తథా త్వనార్య: పతతి మృత్పిండ పతనం యథా
కందుకము వోలె సుజనుడు
గ్రిందంబడి మగుడ మీఁదికిన్నెగయుఁజుమీ !
మందుడు మృత్పిండము వలె
గ్రిందబడి యడగి యుండుఁగృపణత్వమునన్
బంతి నేలకేసి కొడితే ఎలా తిరిగి మీదికి లేస్తుందో, సజ్జనుడు కూడ ఒక వేళ ఓటమి పాలయినా, తిరిగి పుంజుకుని లేస్తాడు.
తెలివి తక్కు వాడు మాత్రం నేల కేసి కొట్టిన మట్టి ముద్ద లాగా మరింక పైకి లేవడు.
ఐతే, మరో విషయం ...దైవానుగ్రహం లేనిదే మనం ఏదీ సాధించ లేం. అలాగే, దైవానుగ్రహం ఉన్నప్పటికీ మానవప్రయత్పం చేయక తప్పదు.
గజేంద్రోపాఖ్యానం కథలో కరి రాజు వేల యేండ్లు మొసలితో పోరాడిన పిదప కానీ హరి కరుణించ లేదు కదా ? మానవ ప్రయత్నం చేయ వలసిన ఆవశ్యకతని ఆ కథ మనకి తెలుపుతోంది ...
నదైవమేవ సంచిత్య త్యజేదుద్యోగమాత్మన:
అనుద్యోగేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి
దైవం మీద భారం వేసి. మన ప్రయత్నం మనం చేయకుండా ఉండడం తగదు. ప్రయత్నం చేయనిదే తిలలనుండి తైలం రాదు కదా?
ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ:
దైవేన దేయమితి కాపురుషా వదంతి
దైవం నిహత్య కురు పౌరుషమాత్మ శక్త్యా
యత్నే కృతే యది న సిద్ధ్యతి కోZత్ర దోష: ?
ప్రయత్నం చేసే వాడికే విజయం వరిస్తుంది. అన్నీ దేవుడే యిస్తాడు కదా అని, ఏ పనీ, ఏ ప్రయత్నమూ చేయకుండా ఉండండం నీచుల లక్షణం. ఒక వేళ నీ ప్రయత్నం నీవు చేసినా, విజయం లభించ లేదనుకో, దాని వలన నీ తప్పేమీ లేదు. దైవానుగ్రహం అంతే అనుకోవాలి.
యథాహ్యేకేన చక్రేణ నరథస్య గతిర్భవేత్
ఏవం పురుష కారేణ వినా దైవం నసిద్ధ్యతి
ఒకే ఒక చక్రంతో రథం నడవదు కదా ? అలాగే, దైవానుగ్రహం లేక పోతే, మానవ ప్రయత్నం సిద్ధించదు.
దైవం అనుకూలించక పోతే, మనం ఏమీ చేయ లేం ...
కాకతాళీయవత్ ప్రాప్తం దృష్ట్వాZపి నిథి మగ్రత:
న స్వయం దైవమాదత్తే పురుషార్ధ మపేక్షతే
దైవానుగ్రహం లేక పోతే, ఎదురుగా ఉన్న నిధి కూడా మన కంట పడదు.
అందు వలన దైవానుగ్రహాన్ని అపేక్షిస్తూ, మానవ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం మనం చేయనిదే ఏదీ మనలకు తనంతట తాను చేకూరదు.
ఏదీ తనంత తానై నీదరికి రాదూ ... శోధించి సాధించాలి .. అదియే ధీర గుణం ... అని సినిమా కవి చెప్ప లేదూ !
ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాణి, నమనో రధై:
నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా :
కోరిక ఉంటే చాలదు. అది నెర వేర్చుకునే ప్రయత్నమూ చేయాలి. కేవలం మనోరధంతోటే పనులు చేకూరవు. నిద్రిస్తున్న సింహం నోటి లోకి ఆహారంగా జంతువులు వాటంతట అవి వచ్చి పడవు కదా? ఎంత మృగరాజయినా తన ఆహారసముపార్జనకు వేటాడి తీర వలసినదే కదా !
ఒక్కోసారి మన ప్రయతం ఫలించకకూ పోవచ్చు ...
యదశక్యం న తచ్ఛక్యం, యచ్ఛక్యం శక్యమేవతత్
నోదకే శకటం యాతి నచ నౌర్గచ్ఛతి స్థలే
ఏది చేయడానికి సాధ్య పడదో, అది జరగమన్నా జరగదు. జరిగేది జరుగకా మానదు.
నీటి మీద బండినీ, నేల మీద నౌకనీ నడప లేం కదా !!
ఎట్టుగఁబాటు పడ్డ నొకయించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు, నిబద్ధి; సురావళిఁగూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్కడలిఁగవ్వము సేసి మధించిరంతయున్
వెట్టియెఁగాక యే మనుభవించిరి వారమృతంబు భాస్కరా !
ప్రాప్తం అంటూ లేక పోతే, ఎంత చేసినా మనకి ప్రయోజనం సిద్ధించదు. అది నిజం. మంధర పర్వతాన్ని పెకలించి, కవ్వంగా చేసుకుని, వాసుకిని తాడుగా చేసుకుని, రాక్షసులు కూడా దేవతలతో పాటు అమృతం కోసం సాగర మథనం చేయ లేదూ !...పాపం, వారి చాకిరీ అంతా వెట్టి చాకిరీ అయిందే తప్ప వారికి అమృతం దక్క లేదు కదా ?
అలాగని, నిరాశతో ఏ పనీ చేయకుండా ఉండడం తగదు. వేమన చెప్ప లేదూ ? ...
పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు
పట్టెనేని బిగియ పట్ట వలెను
పట్టి విడుచుకన్నఁబడి చచ్చుటయె మేలు
విశ్వదాభిరామ వినుర వేమ.
ఇది అనంతం. కనుక, ఇప్పటికి స్వస్తి.
1 కామెంట్:
చాలా మంచి పద్యాలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి