28, జులై 2010, బుధవారం

కోపం తన్నుకొస్తోందా ; పది లెక్క పెట్టండి ....


సహసా విదధీత న క్రియా, మవివేక: పరమాపదాం పదం
వృణుతేహి విమృశ్యకారిణమ్ , గుణలుబ్ధా: స్వయమేవ సంపద:

ఈ శ్లోకం ఏం చెబుతోందంటే , ఏ పనీ తొందర పడి చేయ కూడదు. తొందర పాటు , అవివేకమే అన్ని అనర్ధాలకూ మూలం. చక్కగా ఆలోచించి చేసిన పనికి
ఏ ఆటంకాలూ రావు. అట్టి వానిని సంపదలు తమంతట తామే వచ్చి చేరుతాయి. లక్ష్మి గుణ లుబ్ధ కదా ? అంటే మంచి గుణాలపట్ల ప్రీతి కలది కదా !

ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఓ కథ ప్రచారంలో ఉంది.
అదేమిటంటే ...
కిరాతార్జునీయమ్ కావ్యం రచించిన భారవి గురించిన కథ. భారవికి ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నా, అతని తండ్రి మాత్రం ఎప్పుడూ అతని గొప్పతనాన్ని అతని ఎదుట పొగుడుతూ ఒక్క మంచి మాట కూడా అనే వాడు కాదుట ! దీనితో భారవికి కోపం వచ్చి , తండ్రిని అంతం చేయాలనుకున్నాడుట. ఆలోచించి ఓ రాత్రి ఇంట్లో అటక మీదికి ఎక్కి , ప్రక్కనే ఓ బండ రాయి పెట్టుకుని అదను కోసం చూస్తూ కూర్చున్నాడుట. ఇంతలో తల్లిదండ్రుల సంభాషణ అతని చెవిని పడింది.

తల్లి : ‘‘ మన భారవిని లోకమంతా అంత గొప్ప కవి అని పొగుడుతూ ఉంటే, మీరు మాత్రం ఒక్కసారీ మెచ్చు కోవడం లేదు ! వాడెంత బాధ పడుతున్నాడో తెలుసా ? ...’’

తండ్రి : ‘‘ అమాయకురాలా ! మన భారవి నిజంగా చాలా గొప్ప కవి. అతని కవిత్వం మహాద్భుతం. అందరూ పొగుడుతున్నట్టుగా తండ్రినయిన నేను పొగడ కూడదు. అది వాడికి క్షేమకరం కాదు.అందుకే పొగడడం లేదు. తండ్రి పొగడ్త బిడ్డలకి ఆయుక్షీణం అంటారు. అంతే కానీ వాడన్నా , వాడి కవిత్వమన్నా నాకెంత ఇష్టమో తెలుసా ? ...’’

దీనితో భారవి గుండె బరువెక్కింది. కిందకి దిగి వచ్చి, తన అపరాధాన్ని మన్నించమని తండ్రిని వేడుకుని, తనకి తగిన శిక్ష వేయమని కోరేడు.

పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని తండ్రి ఎంత చెప్పినా విన లేదు. దానితో తండ్రి భారవిని ఒక యేడాది పాటు అత్త వారింటిలో గడపి రమ్మని శాసించాడు.

శిక్ష వేయమంటే తండ్రి వరమిచ్చాడనుకుంటూ పొంగి పోతూ భారవి భార్యా పిల్లలతో పాటు అత్త వారింటికి చేరాడు.

తొలి రోజులు బాగానే గడిచాయి. అత్త వారింట భారవికి మంచి మర్యాదలే జరిగాయి. కాని రోజులు గడిచే కొద్దీ అతనికి ఆ ఇంట గౌరవాదరాలు తగ్గి పోయాయి. అంతా చాలా హేయంగా చూడ సాగారు. భారవికి భరించ లేనంత అవమానంగా ఉంది. కానీ ఏడాది శిక్షాకాలం గడపాలి కనుక, పంటి బిగువున కాలం గడపసాగేడు.

ఇలా ఉండగా అతని భార్య శుక్రవారం వరలక్ష్మి నోము నోచుకుంటాననీ, దానికి ఏర్పాట్ల కోసం కొంత డబ్బు ఇమ్మనీ అడిగింది.

భారవి దగ్గర చిల్లి గవ్వ లేదు. ఆలోచించి, తను వ్రాసిన కిరాతార్జునీయమ్ కావ్యం లోని ఒక శ్లోకం ఉన్న తాటాకును తీసి భార్యకు ఇచ్చి ఏ ధనవంతుని దగ్గరయినా దానిని కుదువ పెట్టి డబ్బు తెచ్చుకో మని చెప్పాడు. ఆమె దానిని ఓ ధనవంతుని ఇంట కుదువ పెట్టి అతడిచ్చిన పైకంతో నోము నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంది.

ఇలా ఉండగా, ఆ ధనవంతుడు ఆమె ఇచ్చిన శ్లోకం వ్రాసి ఉన్న తాటాకుని ఎక్కడ పెడదామా అని ఆలోచించి , చివరకి తన కత్తి ఒరలో దానిని కత్తితో పాటు భద్రంగా ఉంచి , గూట్లో పెట్టాడు. ఆ తర్వాత అతను వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళి పోయి, చాలా ఏళ్ళకి ఇంటికి వచ్చేడు.




వస్తూనే తన రాకతో భార్యకి విభ్రమం కలిగించాలనే చిలిపి ఆలోచనతో ఇంటి వెనుక వేపు ద్వారం లోనుండి ఇంట్లోకి ప్రవేశించాడు.
అక్కడ తమ పడక గదిలో భార్యతో పాటు మరో యువకుడు కూడా సన్నిహితంగా ఉండడం గమనించి, కోపంతో ఊగి పోయాడు. భార్యనీ , ఆ యువకుడినీ చంపెయ్యాలని అనుకుని క్రోధంతో గూటి లోనుండి కత్తిని తీసాడు. సర్రున కత్తి లాగుతూ ఉంటే దానితో పాటు ఓ తాటాకు కూడా బయట పడింది. దాని సంగతే అతను మరిచి పోయాడు. ఏమిటా అని ఆసక్తిగా చదివాడు.

అదే, మీద చెప్పిన శ్లోకం !

ఒక్కక్షణం తటపటాయించేడు. ఇంతలో భార్య లేచి, భర్తని చూసి ఆనందంతో పలకరిస్తూ ఆ యువకుడిని పరిచయం చేసింది. ఆ యువకుడు వారి కుమారుడే. ఆ ధనవంతుడు విదేశాలకు వెళ్ళే సమయంలో అతని భార్య నెల తప్పింది. ఆ తర్వాత ఆ కొడుకు పుట్టాడు. క్రోథావేశంలో ఆ సంగతి కూడా విస్మరించి నందుకు ఆ ధనవంతుడు చాలా సిగ్గు పడ్డాడు.

పెను ప్రమాదం నుండి తన భార్యనీ , కుమారుడినీ కాపాడినందుకు , తను క్రోథావేశంతో నేరం చేయకుండా రక్షించినందుకు అతనికి ఆ శ్లోక రచయిత భారవి పట్ల అపారమయిన గౌరవాదరాలు కలిగి, మరుచటి దినమే ఆ మహా కవిని దర్శించుకుని గొప్ప కానుకలు సమర్పించుకున్నాడు.
భారవి శిక్షా కాలం కూడా ఆ దినంతో ముగియడంతో అతను ఆ అపూర్వ ధన రాసులతో, భార్యా బిడ్డలతో తిరిగి తన తల్లిదండ్రుల చెంతకు ఆనందంగా చేరాడు.

చక్కగా ఆలోచించి చేసే పనికి ఏ ఆటంకమూ రాదు. వేయి విధాలుగా ఆలోచించి కార్యాలు చేయని వాడు గొప్ప ఆపదల పాలవుతాడు. ఆలోచించి చేసే వాడిని లక్ష్మి వరిస్తంది. అని ఈ శ్లోకార్ధం నిత్య సత్యం కదూ !

అందుకే కదా, కోపం తన్నుకొస్తూ ఉంటే , పది అంకెలు లెక్క పెట్టమని మని పెద్దలు చెప్పారు ....
రెడీ ... ఒన్ ... టూ ... త్రీ ... ఫోర్ ....!!

3 కామెంట్‌లు:

Narayana చెప్పారు...

బాగుందండీ.. అమలు చేద్దాం!

ranjani చెప్పారు...

ధన్యవాదములు.
ఈ ఇతివృత్తం తో ఆకాశవాణి హైదరాబాదు నుండి ఓ నాటిక
ప్రసారం అయ్యింది . టైటిలు "అర్థ గౌరవం" అని జ్ఞాపకం.
( నిర్వహణ: YS నిర్మల & సహకారం: M దక్షిణామూర్తి )

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చక్కని విషయాలు చెప్పుతూ మళ్ళీ నన్నెక్కడికో తీసుకు పోగలుగుతున్నావు మిత్రమా!
సామాజిక స్పృహ కల కవివి. ఏది సమాజానికవసరమో అదే వెప్పి నీ సత్తా రుజువు చేసుకొంటున్న నీకు నా అభునందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి