నైవ వ్యాకరణఙ్ఞ మేతి పితరం న భ్రాతరం తార్కికం,
దూరాత్సంకుచితేవ గచ్ఛతి పునశ్శుండాల వచ్ఛాంధసాత్,
మీమాంసానిపుణం నపుంసక ఇతి ఙ్ఞాత్వా నిరస్యాదరాత్,
కావ్యాలంకరణఙ్ఞ మేవ కవితాకన్యా వృణీతే స్వయమ్
కవితా కన్యకు వెలకట్టగల రసఙ్ఞు లెవరు ?
కవితా కన్యకు ప్రియు లెవరు ?
వ్యాకరణ వేత్తలా ? తార్కికులా ? ఛాందసులా ? మీమాంసకులా ? కావ్యాలంకరణ వేత్తలా ?
ఎవరినామె వరిస్తుంది? ఎందు చేత? ఇవీ ప్రశ్నలు. ఇవిగో జవాబులు:
కవితా కన్యకు వ్యాకరణవేత్త తండ్రివంటి వాడు. అతడామె గుణ దోషములను విచారించి, చక్కగా తీర్చి దిద్దుతాడు. తండ్రిలాంటి వ్యాకరణవేత్తను కవితా కన్య అభిలషించే ప్రశ్నే లేదు.
ఇక తార్కికుడో ? అతడామెకు సోదరతుల్యుడు. ఆమె అతనిని అంగీకరించదు. ఛాందసుడు - అంటే వేదవేత్త. లౌకిక ఙ్ఞాన శూన్యుడు. వేదాధ్యయన జడుడు. కనుక ఆమె అతనిని అంగీకరించదు. మత్త గజంనుండి దూరంగా జరిగి పోయినట్టుగా ఆమె అతనిని సమీపించదు.
మీమాంసా నిపుణుడో ? అతడు నపుంసకుడని తలచి వానినుండి దూరంగా జరిగి పోతుంది.
వైయాకరణులు , తార్కికులు , ఛాందసులు , మీమాంసకులు ... వీళ్ళందరూ కవిత్వ విషయంలో ఏకపక్షంగా ఉండే వాళ్ళే. వాళ్ళ శాస్త్రం ప్రకారం ఆమె గుణగణాలను మదింపు చేసే వారే. ఎవరికీ కవితా రసాన్ని ఆస్వాదించే లక్షణం లేదు. లక్ష్య లక్షణ యుక్తంగా ఉందా లేదా అనే తప్ప, వారెవరూ రసాస్వాదనా దృష్టి పరులు కాజాలరు.
అందు చేత కవితా కన్య వారిని అనాదరిస్తుంది. వారి నుండి దూరంగా తొలిగి పోతుంది.
మరి, ఎవరినయ్యా ఆమె వరిస్తుంది ?
కావ్యాలంకరణవేత్తను మాత్రమే ఆమె వరిస్తుంది. అలంకార శాస్త్రఙ్ఞులు మాత్రమే కవితకు వెలకట్టి రసాస్వాదన చేయగల వారు. వారు రసఙ్ఞులు. అందు వల్ల వారే కవితా కన్యకు ప్రియులు.
రసఙ్ఞత ప్రసక్తి ఎలాగూ వచ్చింది కనుక, ఈ పద్యం కూడా చూదాం ...
చదువది యెంత గల్గిన రసఙ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు; గుణసంయుతు లెవ్వరు మెచ్చరెచ్చటన్
పదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చునుటయ్య భాస్కరా !
ఎంత చదువుకున్నా , రసఙ్ఞత ఉండాలయ్యా. అది లేనప్పుడు ఎంత చదువుకున్నా ఆ చదువు వ్యర్ధం .రసాప్వాదన చేసే మనసు ఉండాలి. లేనప్పుడు ఎంత చదివీ ఏం లాభం ? నలపాకంలాగ ఎంత మంచి కూర ఘుమఘుమలాడేలా చెయ్యి, కాని దానికి రుచిని తెచ్చే ఉప్పు వెయ్యడం మానీసేవనుకో, ఆ కూరకి మరి రుచేం ఉంటుంది చెప్పు ?
ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా
విలిఖితాని సహే చతురానన !
అరసికేషు కవిత్వ నివేదనం
శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ !!
ఓ బ్రహ్మ దేవుడా ! ఎన్ని కష్టాలయినా నా నుదుటన రాయి. భరిస్తాను. కాని, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం ముమ్మాటికీ రాయవద్దయ్యా.
అని కవిగారు వేడుకోవడం తెలిసినదే కదా ?
కొయ్య బొమ్మలె మెచ్చు కళ్ళకు
కోమలులు సౌరెక్కునా? ... ... ... అని గురజాడ తృణీకరించినదీ ఇలాంటి అరసికులనే.
అరసికులలో మరో రకం జాత్యంధకారులు. వీరు కులాన్నిబట్టి కవితకు వెలకడతారు.
నా కవితా వధూటి వదనంబు నెగాదిగఁజూచి, రూపు, రే
ఖా కమనీయ వైఖరులు గాంచి, ‘భళీ!భళి!’ యన్న వాడె, ‘మీ
దే కుల’ మన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచి పోవు చో
బాకున గ్రుమ్మినట్లగును పార్ధివ చంద్ర వచింప సిగ్గగున్
నా కవిత్వాన్ని చదివి బాగుందని మెచ్చుకుంటూనే, నా కులం ఏదని అడిగి తెలుసుకుని, చివాలున లేచిపోయి నన్నూ, నా కవిత్వాన్నీ అనాదరించే వారూ ఉన్నారు. అప్పుడు నా గుండెలో బాకు దించినంతగా బాధ కలుగుతుంది. అని బాధతో పలికాడు కవి జాషువా.
అరసికులను మరింత ఘాటుగా తిట్టిన కవి గారూ ఉన్నారు. చూడండి ...
నక్కలు బొక్కలు వెదుకును
అక్కరతో నూరపంది అగడిత వెదకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్
ఎంత ఉక్రోషపడితే ఇంత ఘాటయిన తిట్టు వస్తంది చెప్పండి ?
రస సిద్ధి కల కవులకీ, అల్ప కవులకీ తేడా ఎప్పుడూ ఉంటుంది.
శ్లోకం చెబుతే భోజుడు తగిన కానుకలు ఇస్తాడు కదా అనే దురాశతో ఓ కవి శ్లోకం రాయాలని ప్రయత్నించి కొంత వరకూ ఏదో గిలికి, ఆపైన చేత కాక డీలా పడ్డాడు. వాడి అవస్థ చూసి, కాళిదాసు జాలి పడి తక్కినది పూర్తి చేసి ఇచ్చేడు.. ఇంకే ముంది !! ఆ పిల్ల కాకి ... కాదు కాదు ... ఆ పిల్ల కవి దానిని రాజు గారికి వినిపించాడు. చూడండి ...
భోజనం దేహి రాజేంద్ర !
ఘృత సూప సమన్వితమ్.
ఇంత వరకూ కవిగారి పైత్యం. ఓ రాజా నాకు నెయ్యీ ,పప్పుతో మంచి భోజనాన్ని ఇవ్వవయ్యా అని దీని అర్ధం
మాహిషం చ శరచ్చంద్ర
చంద్రికా ధవళమం దధి:
ఇది కాళిదాస పూరణ.
శరత్కాలపు వెన్నెల లాంటి తెల్లని గేదె పాలతో చేసిన గడ్డ పెరుగుతో భోజనం సమకూర్చవయ్యా అని పూర్తి చేసాడు కాళిదాసు. అప్పటికి కదా, పిల్ల కవి గారి కపిత్వం కవిత్వం అయి శోభించింది. భోజుడు కవితా రసగుణగ్రహణ పారీణుడు కనుక, ఈ శ్లోకంలో కాళి దాసు చేయి పడిందని పోల్చుకుని, కవికి తిని బతకమని ( మరెప్పుడూ కవిత్వం జోలికి వెళ్ళ వద్దని హెచ్చరించే ఉంటాడు, బహుశా) కొంత ధనమిచ్చి, కాళిదాసుకి గొప్ప సత్కారం చేసాడు.
జయన్తి తే సుకృతినో:
రస సిద్ధా: కవీశ్వరా:
నాస్తి తేషాంయశ: కాయే
జరామరణజం భయమ్
రస సిద్ధులయిన కవులు పుణ్యాత్ములు. వారికి జరామరణ భయాలు లేవు. వారు యశ:కాయులు. వారికి జయము కలుగు గాక !
స్వస్తి.
1 కామెంట్:
మిత్రమా! ఎంత అద్భుతంగా వ్రాసావయ్యా! ప్రజా బాహుళ్యానికి ఉపయోగ పడేలాగ ఏవై ప్రఖ్యాత పత్రికలకు ఇటువంటి వ్యాసాలు నీవు పంపినట్లైతే ప్రయోజన బాహుళ్యం ఉంటుందని నా అభిప్రాయం. తప్పక పంపించే ప్రయత్నం చేయ గలవు.అభినందన పూర్వక ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి