మహా కవి కాళిదాస కృత అభిఙ్ఞాన శాకున్తలమ్ సంస్కృత నాటక రచనలలో ఒక అపూర్వ కళాకృతి. మహోన్నతమైన రచన. గెటే పండితుడు ఈ నాటకాన్ని చదివి ఆనందం పట్ట లేక, నృత్యం చేసాడుట ! (ఇక్కడ చూడండి)
మానవ జీవితంలో సుఖ దు:ఖాలు, కష్ట సుఖాలు, హిత అహితాలు, కలిమి లేములు, మంచి చెడ్డలు, స్నేహ విరోధాలు, చీకటి వెలుగులు, విషాద వినోదాలూ .. ఇలా చెప్ప లేనన్ని
ద్వంద్వాలు తారస పడుతూనే ఉంటాయి. నిత్య నైమిత్తిక జీవితంలో వాటికి తుల్య ప్రాధాన్యమిచ్చి
జీవనయానం సాగించాలి. ఈ అర్ధాన్ని బోధించే చక్కని శ్లోకం ఒకటి అభిఙ్ఞాన శాకున్తమ్ నాటకంలో చతుర్ధాంకంలో ఉన్నది. చూడండి...
సందర్భం క్లప్తంగా:
దుష్యంత మహారాజు కణ్వాశ్రమంలో శకున్తలను గాంధర్వవిధిని వివాహం చేసుకుని, ఆమెకు తన నామాంకితమైన అంగుళీయకాన్ని బహూకరించి, త్వరలో రాజలాంఛనాలతో రాచనగరుకి రప్పించుకుంటానని మాట యిచ్చి, రాజధానికి వెళ్ళి పోయాడు.
రాజునే తలుచుకుంటూ పరాకు పడిన శకుంతల ఆశ్రమానికి ముక్కోపి ముని దుర్వాసుడు రావడం గమనించనే లేదు. అతిథి సేవలో లోపం కలిగింది. ముని కోపించి,ఎవనిని తలుచుకుంటూ తన రాకను గమనించ లేదో, ఆతడు ఆమెను మరిచి పోవుగాక ! అని శాపమిచ్చాడు. పాపం. కడు ముద్దరాలు శకుంతల ఆ సంగతీ గమనించ లేదు. చెలికత్తె ప్రియంవద ముని రాకను, శాపమిచ్చిన వైనాన్నీ గమనించి, మునిని వేడుకుని ప్రసన్నుని చేసుకుంది. ముని శాపవిమోచన మార్గాన్ని ప్రసాదించాడు. అభిఙ్ఞాన దర్శనం చేత శాపం తొలిగి పోగలదని చెప్పాడు. దుష్యంతుడిచ్చిన అంగుళి శకుంతల వద్ద ఉన్నది కనుక, అప్పటికి చెలికత్తె ప్రియం వద స్తిమిత పడింది. తర్వాత శకుంతల అత్తవారింటికి ఇరువురు కణ్వ శిష్యులు, చెలికత్తెలు అనసూయ ప్రియంవదలు, గౌతమి వెంటరాగా బయలు దేరడం, నదిని పడవలో దాటుతూ ఉండగా నదీ జలాలలో అంగుళి జారి పోవడం, దుష్యంతుడు అభిఙ్ఞానం ( గుర్తు) లేనందు వలన ఆమె ఎవరో గుర్తు రాక తిరస్కరించడం జరిగింది.
అత్తవారింటికి బయలు దేరిన శకుంతలకు ఎరురు కానున్న కష్టాలను, అనంతర కాలంలో అవి తొలిగి పోయి ఆమెకు కలగనున్న శుభాలను స్ఫురింప చేసే ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన శ్లోకం చతుర్ధాంకంలోనే కాళిదాసు రచించాడు. చూడండి:
నాల్గవ అంకంలో కణ్వ శిష్యుడు నిద్ర లేచి, ఒక వంక అస్తమిస్తున్న చంద్రుడిని, ఒక వంక ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ ప్రభాత వేళని వర్ణిస్తూ చెప్పిన శ్లోకం ఇది.
యాత్యేకతో2స్త శిఖరం పతిరోషధీనా
మావిష్కృ తో2రుణ పురస్సర ఏకతో2ర్క:
తేజో ద్వయస్య యుగపద్వ్యసనోదయాభ్యామ్
లోకో నియమ్యత ఇవాత్మదశాన్తరేషు.
ఒక వేపు చంద్రుడు అస్తగిరికి పోతున్నాడు.
ఒక వేపు దినకరుడు అనూరుడు రధసారధిగా రధం నడుపుతూ ఉండగా ఉదయిస్తున్నాడు.
ఆహా! రెండు దివ్య తేజస్సులు ఒకే సమయంలో వ్యసనోదయములు పొందుతున్నవి కదా.
ఒక తేజస్సు అంతర్హితమవుతూ ఉంటే, ఒక తేజస్సు ప్రవర్ధమానవవుతున్నది. ఏక కాలంలో కనిపిస్తున్న ఈ సూర్య చంద్రుల ఉదయాస్తమయాలు లోకంలో ప్రాణులకి సంభవించే సుఖదు:ఖాలని గుర్తునకు తెచ్చేదిలాగ ఉన్నది కదా !
ఇదీ ఈ శ్లోక భావం.
కష్ట సుఖాలు కావడి కుండలు. అందు చేత కష్టం వస్తే క్రుంగి పోనూ కూడదు. సుఖం వస్తే పొంగి పోనూ కూడదు.
ఒక గొప్ప జీవిత సత్యాన్ని ఆవిష్కరించిన ఈ శ్లోకానికి కందుకూరి వీరేశలింగము గారి అనువాదం కూడ చూడండి:
ఒక దెస నస్త శైలమున కోషధినాధుడు పోవుచున్న వాఁ
డొక దెస భాస్కరుం డుదయ మొందె ననూరు పురస్సరంబుగా
నొక సమయంబునందె వ్యసనోదయముల్ గనె రెండు తేజముల్,
ప్రకట సుఖంబు దు:ఖమును బ్రాణులకిట్లని తెల్పు కైవడిన్
మూల శ్లోక హృదయాన్ని అనువాద రచన ఎంత గొప్పగా వ్యక్తం చేసిందో కదూ !
ఇప్పటికి స్వస్తి.
1 కామెంట్:
కాళిదాసు నాటకాల్లో శ్రేష్టమైనది అభిజ్ఞాన శాకుంతలము. అందులో చతుర్తాన్కము ఉత్తమమైనది. మేఘ సందేశ కావ్యము అభిజ్ఞాన శాకుంతల నాటకము చదివి ముగ్ధులు కాని వారు ఉండరు. "You will be transported to another world- a magical world. అందు వల్ల Goethe కవి ఆనందించి నర్తించాదంటే ఆశ్చర్యము లేదు. కాని కొందరి అభిప్రాయము లో నాటకీయత రీత్యా భాసుడు కాళిదాసు కన్నా గొప్ప నాటక కర్త అని. కవి గా మాత్రం కాళిదాసుకి అగ్ర పీఠం ఇస్తారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి