7, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఆట పాటల మేటి


ఆట పాటల మేటి, హరి కథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు విజయ నగర ప్రభువులు ఇచ్చిన ఒక సమస్యను ఈ విధంగా పూరించారు. చూడండి:

సానుల యొద్ద నిచ్చకము సల్పుచు లొంగుచునుంట కర్షమౌ
దానము సేయ కుంటకు వృధా దినముల్సరి పుచ్చుకుంటకున్
ఙ్ఞానియు జాణయైన తన నాథుని గన్గొను నప్డు కు
న్మానము ప్రేమ లజ్జయును మాటికి బోరగ బ్రీతి మీరెడున్.

నారాయణ దాసు గారి గురించి ఇక్కడ క్లిక్ చేసి చూడండి.

దాసు గారి జీవిత చరిత్ర నా యెరుక చదవడం ఒక గొప్ప అనుభూతి కలిగిస్తుంది.
హరి కథనే కాదు, అవసర పడితే గిరి కథ కూడ చెప్పటల దిట్ట దాసు గారు.

దాసు గారు గజ్జె కట్టి, విజయ నగరంలో గుమ్చీ అరుగు మీద, మూడు కోవెళ్ళ దగ్గర గొంతెత్తి
శంభో నినాదం చేసారంటే, మైకులు లేని ఆ రోజులలో ఊరు ఊరంతా మారు మ్రోగి పోయేదని చెబుతారు.

నేను తెలుగు పండితునిగా నియామకపు ఉత్తర్వులు అందుకుని తొలి సారిగా ఉద్యోగ జీవితంలో నిడగల్లు అనే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాయనయ్యాను. ఆ ఊరు మా స్వగ్రామం పార్వతీ పురానికి కేవలం 8 కి,మీ. దూరంలో ఉంది. బస్సు దిగేక 4 మైళ్ళు నడిచి వెళ్ళాలి. ఇప్పుడు బస్సు సౌకర్యం వచ్చిందనుకోండి. చెప్పొచ్చేదేమిటంటే, ఆ నిడగల్లు గ్రామానికి దాసు గారు జన్మించిన అజ్జాడ అగ్రహారం చాలా దగ్గర. దాసు గారి జన్మస్థలాన్ని ఒకటికి రెండు సార్లు దర్శించుకునే అదృష్టం నాకు లభించింది. అంతే కాదు, విజయనగరంలో
ఐదేళ్ళ పాటు మహా రాజా ప్రభుత్వ సంస్కృత కలాశాలలో చదువుకునే రోజులలో నిత్యం దాసు గారి దివ్య గళంతో పునీతమైన గుమ్చీని, మూడు కోవెళ్ళని దాటుకుంటూ వెళ్ళే వాడిని.
అను నిత్యం నేనూ, మా మిత్రులూ అక్కడికి రాగానే దాసు గారిని తలుచుకుంటూ పరవశించి పోయే వాళ్ళం.

అప్పటి మా మిత్రులలో మంగిపూడి వేంకట రమణ మూర్తి దాసు గారి పరోక్ష శిష్య సరంపరలో ఒకడిగా హరి కథలు నేర్చుకుని, హరిదాసుగా మంచి పేరే సంపాదించుకున్నాడు.

ఈ సందర్భంగా నారాయణ దాసు గారి గురించి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలను ఓ సారి గుర్తు చేసుకుందాం:

1.
ఎవరీ ముగ్ధ మనోఙ్ఞ దర్శనుఁడెవండీ శారదా మూర్తి ! యీ
నవ శృంగార రసావతారుడెవరన్నా ! శ్రీమదజ్జాడయే
యవునా ! ఆ దరహాస!మానడకతీ!రాఠీవి!యాదర్ప! మా
కవితా దీప్తి! యనన్య సాధ్యములురా! కైమోడ్పులందింపరా!

2.
పండించె నీ కాలి గండ పెండెరము రం
గారు ముంగారు బంగారు పంట
నర్తించె నీ కీర్తి నవనవస్ఫూర్తి యా
సేతు శీతాచలక్ష్మాతలాన
జోహారులందె నీ సాహిత్య నందిని
కదలించి సహృదయ హృదయములను
గంభీరమయ్యె నీ శంభో నినాదంబు
దిగ్దిగంతాల బ్రతి ధ్వనించి

కాంతు లీనెను రాజ సభాంతరాల
నీ జయశ్రీ దృగంత నీరాజనాల
యక్షగాన కళా మహాధ్యక్ష పదవి
అక్షరంబయ్యె నీ పట్ల నాది భట్ల !

3.
చిఱు తాళముల జత చే ధరించిన చాలు
లయ తాళములు శుభోదయము పలుకు
కాలి గజ్జె లొకింత ఘల్లుమన్నను చాలు
భరతమ్ము నీ ముందు శిరసు వంచు
వీణతంత్రులు ముని వ్రేళ్ళు సోకిన చాలు
సంగీత వాహిని పొంగి పొరలు
గంటంబుఁబూని క్రీగంటఁగాంచిన చాలు
కవిత నీ యెదుట సాక్షాత్కరించు

నేటి కథకులందు నీ పేరు చెప్పక
గజ్జె కట్టు వాడు కాన రాడు
తెలుగు వెలుగు దేశ దేశాన నింపిన
హరి కథా పితా మహా ! నమోస్తు !

4.
ఎవడురా! యచట తెండింకొక్క గ్లాసంచు
అమృత రక్షకులకు నాఙ్ఞ యొసఁగి
సుధ కంటె మా హరి కథ లెస్స యని బృహ
స్పతి తోడ నర్మ భాషణము నెఱపి
ఏవమ్మ వాణి ! యేదీ వీణ ! సరి క్రొత్త
తీవలా ! యని గిరాందేవి నడిగి
ఆగవే రంభ ! ఆ హస్త మట్టుల గాదు
త్రిప్పి పట్టు మటంచు తప్పు దిద్ది

ఏమయా ! క్రొత్త సంగతు లేమటంచు
బ్రహ్మమానస పుత్రుని పలుకరించి
ఆది భట్ల నారాయణాఖ్యము మహస్సు
తిరుగునిందందు స్వర్గ మందిరములందు !

ఆ దివ్య మహస్సుకి నమోవాకములర్పిస్తూ ....

స్వస్తి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి