ఎవరింట్లోనో, ఏదో వేడుక జరుగు తోంది. వెళ్ళాలి. అయితే, వట్టి చేతులతో వెళ్ళ లేం కదా? ఏదో ఒక కానుక తీసికొని వెళ్ళడం సముచితం. ఏం పట్టి కెళితే బావుంటుందో ఒకంతకి నిర్ణయానికి రాలేం. కుటుంబ సభ్యలు ఒక్కొక్కరూ ఒక్కో సలహా పారేస్తూ ఉంటారు. అదంటే యిదనీ, ఇదంటే అదనీ సూచనలు పరంపరగా వస్తూ ఉంటాయి. చివరకి విసిగి పోయి, మనకు తోచినంత నగదు కవర్లో పెట్టి ఇవ్వడానికి సిద్ధ పడి పోతూ ఉంటాం.
సమయానుకూలంగా , సమయోచితంగా ఎదుటి వారికి కానుకలు ఇవ్వడం కూడా ఒక కళ. సమయోచిత వస్త్రధారణ లాగే ఇది కూడా గొప్ప ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది. సందర్భ శుద్ధి లేని మాటలూ. ప్రవర్తనా కూడా వికటించి, హేళనలకు పాత్రములవుతాయి. చావు యింటికి పరామర్శకి బయలు దేరి, పట్టు బట్టలు కట్టుకుని వెళ్ళం కదా? తద్దినం బోయినం తిని, త్రేన్చి, అన్నదాతా సుఖీ భవ ! అని వాగడం మంచిది కాదు కదా ?
పిల్లల పుట్టిన రోజుకి ఇవ్వతగిన కానుకలు, వివాహ సందర్భంగా వధూవరులకు ఈయ తగిన కానుకలు, ప్రేమికులు పరస్పరం ఇచ్చుకో తగిన బహుమతులు, షష్టి పూర్తి సందర్భంగా ఇచ్చేవి, నూతన గృహ ప్రవేశం సందర్భంగా ఇవ్వతగినవి, పదవీ విరమణ కానుకలు ... ఇలా ఈ వింగడింపు చాలా ప్రత్యేకతలు కలిగి ఉంటుంది.
ఏతావాతా ఎవరింటి కార్యక్రమానికి వెళ్ళినా, వట్టి చేతులతో వెళ్ళ కూడదన్నది దీని సారాంశం.
ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నారు పెద్దలు. ఒక పండు, పత్రి, పువ్వు, లేదా చివరాఖరకి నీళ్ళు సమర్పించు కోవాలి తప్ప, చేతులు ఊపుకుంటూ వెళ్ళడం తగదు.
రిక్త హస్తాలతో వెళ్ళరాని తావులు ఏవో క్రింద శ్లోకంలో మనువు చెబుతున్నాడు.
అగ్నిహోత్రం గృహం క్షేత్రం, గర్భిణీం వృద్ధ బాలకౌ
రిక్తహస్తేన నోపేయాత్, రాజానం దైవతం గురుమ్.
అగ్నిహోత్రం దగ్గరకి, స్వగృహం దగ్గరకి, పుణ్యక్షేత్ర దర్శనానికి పోయి నప్పుడు, గర్భిణీలు, ముసలి వారు,పిల్లలు,
రాజు, దైవము, గురువు - వీరి వద్దకు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళ కూడదు. ఏదో ఒక కానుక తీసికొని పోచి సమర్పించాలి అని దీని భావం.
ఈ జాబితాలో స్నేహితుల ప్రస్తావన లేదు. కాని, మైత్రీబంధం కలకాలం నిలబడాలంటే చిన్న చిన్న కానుకలు ఒకరిరి కొకరు అడపాదడపా ఇచ్చుకుంటూ ఉండాలి.
బాల సఖుడు శ్రీ కృష్ణుని వద్దకు అటుకుల మూటతో వెళ్ళిన కుచేలుని కథ చూదాం ....
కుచేలుడు బహుకుటుంబీకుడు. గంపెడు సంతానం. ఎలాగో ఒకలాగ సంసారాన్ని లాగు కొస్తున్నాడు. బతుకు బండి మరి ముందుకు సాగ లేక కుయ్యో, మొర్రోమంటూ మొరాయిస్తోంది. కటిక దారిద్ర్యం యింట తాండవస్తోంది. బిడ్డలు ఆకలి బాధతో కృశించి, ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, చేతుల్లో ఆకులూ, గిన్నెలూ పట్టుకుని తల్లి వద్దకు వచ్చి అన్నం పెట్టమని అడుగుతూ ఉంటే, ఆ తల్లి విలవిల లాడి పోయింది. ఇహ లాభం లేదు. మీ బాల సఖుడు కన్నయ్య దగ్గరకి పోయి రండి .ఏమేనా ఇస్తాడు అని ఉపాయం చెప్పింది.
బాలసఖుండైన యప్పద్మ నేత్రుఁ
గాన నేఁగి దారిద్య్రాంధకార మగ్ను
లైన మనము నుద్ధరింపుము; హరి కృపా క
టాక్ష రవి దీప్తి వడసి మహాత్మ ! నీవు
స్వామీ ! కృష్ణుడు మీ బాల్య సఖుడు. ఆ మహానుభావుడిని దర్శించి రండి.అతని కృపాకటాక్షం పొంది దారిద్య్రంతో తల్లడిల్లుతున్న పిల్లలను ఉద్ధరించండి అని వేడుకుంది.
కలలో కూడా ఎన్నడూ తలచుకోని కష్టాత్ముడు కూడా ఆపద కాలం లో ఒక్క తూరి తలచుకుంటే, వాడికి సకల భోగాలూ ఇస్తాడే, అవసరపడితే తనని తానుగా సమర్పించుకుంటాడే, అట్టి మహనీయుడు నిరంతరం భక్తితో తనను సేవించే వారికి సమస్త సంపదలూ ఇవ్వకుండా ఉంటాడా ? అని బోధించింది.
సరే వెళ్తానన్నాడు కుచేలుడు. అయితే, వట్టి చేతులతో ఎలా వెళ్ళడం ? అని సంశయించేడు. దానికామె నిజమే సమా అని, అటుకులను కొన్నింటిని అతని చిరిన వస్త్రపు కొంగులో ముడి వేసింది. ఇహ వెళ్ళి రండని అంది. బయలు దేరాడు కుచేలుడు.
గోవింద దర్శనోత్సాహంతో బయలు దేరాడే కానీ కొన్ని సంశయాలు అతనిని పట్టి పీడిస్తున్నాయి.
ద్వారకా నగరంబు నేరీతి జొత్తును ? భాసురాంత:పురవాసి యైన
య ప్పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగిఁ దర్శింపఁగలనొ? తద్ద్వార పాలు
రెక్కడి విప్రుడ ? నిందేల వచ్చెద ? వని యడ్డ పెట్టిరే నపుడు వారి
కే మైనఁ బరిదాన మిచ్చి చొచ్చెద నన్న నూహింప నర్ధశూన్యుండ నేను ;
నయిన నా భాగ్య మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయఁగా నొండు గలదె ? యాతఁ
డేల నన్ను నుపేక్షించు ? నేటి మాట
లనుచు నాద్వారకాపుర మతఁడు సొచ్చి.
ద్వారక లోనికి ఎలా ప్రవేశిస్తాను ?అంతి పురంలో ఉన్న ఆ పుండరీకాక్షుని ఎలా చూడ గలను ? ద్వార పాలకులు అడ్డగిస్తే ఏందారి ? పోనీ వారికి ఏదయినా బహుమానం (లంచం) ఇద్దామంటే చేతిలో చిల్లి గవ్వ లేని కటిక దరిద్రుడిని. ఇంతకూ నా భాగదేయం ఎలా ఉందో, ఏమిటో ? అయినా, నా పిచ్చి కానీ, ఆ స్వామి నన్ను ఎందుకు ఉపేక్షిస్తాడులేఇలా అనుకుంటూ కక్ష్యాంతరాలు గడచి, కడకు కన్నయ్యను దర్శించు కున్నాడు.
కృష్ణుడు తన బాల సఖుని అత్యంత ఆదరంతో అక్కున చేర్చు కున్నాడు. గొప్ప ఆతిథ్యమిచ్చి సంభావించాడు.
సరసన కూర్చుండ బెట్టుకుని, బంగారు కలశం లోని నీళ్ళతో కుచేలుని పాదాలు కడిగాడు. ఆ నీటిని భక్తిగా తల మీద చల్లు కున్నాడు.కస్తూరి, పచ్చ కప్పురము కలిపిన మంచి గంధం బాల సఖుని మేని మీద పూసాడు.మార్గాయాసం తీరే లాగున అగరు ధూపం వేసాడు. సవినయంగా వీవెనతో విసిరాడు మణిమయ దీపాలతో నివాళులర్పించాడు. మిత్రుని సిగలో పూల దండలు ముడిచాడు. కర్పూర తాంబూలం యిచ్చాడు. గోదానం చేసాడు.ఆదర పూర్వకంగా యిలా బాల సఖుని స్వాగతించేడు.
ఆ ఆతిథ్యం స్వీకరించిన కుచేలుని శరీరం పులకించి పోయింది. కృష్ణుని పట్టపు దేవేరి కూడ కుచేలునికి వింజామరలు వీచి సేవించింది.
ఈ అద్భుత దృశ్యం చూసి అంత:పురకాంతలు విస్మయం చెంది యిలా అనుకున్నారు:
ఏమి తపంబు సేసెనొకొ ! యీ ధరణీ దివిజోత్తముండు తొల్
బామున ! యోగి విస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగ
త్స్వామి రమాధి నాథు నిజతల్పమునన్ వజియించి యున్నవాఁ
డీ మహనీయ మేర్తి కెనయే ముని పుంగవు లెంతవారలున్ ?
ఈ బ్రాహ్మణుడు ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా ! మునపటి జన్మలో ఎంతటి గొప్ప తపమాచరించాడో కదా ? యోగివంద్యుడైన పంకజనాభుని పానుపు మీద అధివసించాడు ! ఎంత లేసి ముని శ్రేష్ఠులు కూడ ఈ మహానుభావునికి సాటి రారు కదా !
తర్వాత మిత్రులిద్దరూ గురుకులం లో గడిపిన మధుర దినాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ తలపోతలతో మైమరచి పోయారు.
అంతలో శ్రీకృష్ణుడు కుచేలుని చినిగిన ఉత్తరీయంలో ముడి వేసి తెచ్చిన మూటను విప్పి, గుప్పెడు అటుకులను ఆదరంతో ఆరగించాడు.
మరో పిడికెడు అటుకులను తిన బోతూ ఉంటే రుక్మిణీ దేవి:‘‘ స్వామీ ! ఇతనికి సకల సంపదలూ అందించడానికి మీరు మొదట తిన్న పిడికెడు అటుకులు చాలును.’’ ఇక తినకండి. అంటూ వారించింది.
ఆ యింట తనకు దక్కిన మర్యాదలకు కుచేలుడు అమితానందం చెందాడు.ఇలా భావించాడు:
శ్రీనిధి యిట్లు నన్నుఁ బచరించి ఘనంబుగ విత్త మేమియు
న్నీని తెఱంగు గానఁబడె ; నెన్న ’ దరిద్రుఁడు సంపదంధుడై
కానక తన్నుఁజేరఁ‘డని కాక శ్రితార్తి హరుండు సత్కృపాం
భోనిధి సర్వ వస్తు పరిపూర్ణునిఁగా ననుఁ జేయ కుండునే ?
నా చెలికాడు శ్రీకృష్ణుడు నన్ను బాగానే సత్కరించాడు. బాగానే ఉంది. కానీ నాకు ధనమేదీ ఇవ్వాలని అతను అనుకున్నట్టుగా లేదు. దరిద్రుడనైన నేను సంపన్నుడ నైతే గర్వాంధకారంతో తనను సేవించనని తలచేడు కాబోలు ! లేక పోతే, ఆశ్రిత జనుల ఆర్తిని పోగొట్టే ఆ కృపా సముద్రుడు నన్ను ఐశ్వర్యవంతునిగా చేయ కుండా ఉంటాడా ?
ఇలా పరిపరివాధాలుగా ఆలోచిస్తూ తన ఊరు చేరుకున్న కుచేలునికి ఓ అద్భుత దృశ్యం కనిపించింది ! దరిద్రానికి నిలయమైన తన కొంప అప్పుడక్కడ లేదు. దాని స్థానంలో ఇప్పుడొక విలాస తమయిన భవనం కనిపిస్తోంది. అతని దరిద్రమంతా పటాపంచలై పోయింది.
కుచేలుని ఎదుట సూర్య చంద్రుల కాంతితో ప్రకాశించే పాలరాతి కట్టడాలూ, శుక పిక మయూరాలతో నిండిన చక్కని ఉద్యాన వనాలూ, వికసించిన తామరలతో, కలువలతో కనులు పండువు చేస్తున్న సరోవరాలూ, మణికంకణాలూ, వివిధ ఆభరణాలు ధరించిన దాస దాసీజనమూ, కలిగిన ఒక అద్భత మందిరాన్ని చూసి, ఇది ఏ పుణ్యాత్మునిదో కదా ! అని అబ్బుర పడ్డాడు. ఆ దివ్య భవంతి తనదే అని తెలుసుకుని అమితానందం చెందాడు.
ఈ సంపదలన్నీ శ్రీకృష్ణుని కృపాకటాక్షం వల్లనే సిద్ధించాయని సంతోషించాడు.
నేను నా బాల సఖుని వద్దకు అర్ధ కాంక్షతో వెళ్ళాను. ఆ మహానుభావుడు నా సంగతి తెలిసి కూడా నన్నేమీ అడుగ కుండా నాకు వీడ్కోలు పలికి పిమ్మట వీటిని నాకు సమ కూర్చాడు.
భక్తులు సమర్పించిన లేశమాత్రమయిన పదార్ధాల నయినా దానిని కోటి గుణితంగా భగవంతుడు స్వీకరించి మన్నిస్తాడని అనడానికి కుచేలుని కథ ఒక గొప్ప ఉదాహరణ అని చెప్ప వచ్చును.
ఇదీ కుచేలోపాఖ్యానం.
చివరిగా ఒక మాట.
కానుకలు తీసి కోవడమే కాదు ; ప్రతి కానుకలు ( రిటర్న్ గిఫ్ట్ లు ) ఇచ్చే సంస్కారమూ అలవరచు కోవాలి.
ప్రతి కానుక అంటే, దేవదాసు పార్వతికి ఇచ్చిన కానుక లాంటిది కాదండోయ్ !
పరికిణీ చాటున తెచ్చిన తాయిలాన్ని పార్వతి దేవదాసుకి ఇస్తే, అంతా తినేసి, ఏదో విషయంలో అలిగి చేతి కర్రతో పార్వతికి దేవదాసు ఒకటి ఇచ్చు కోవడం గుర్తుంది కదూ ! చంద్రునిలో మచ్చ లాగున పార్వతి నుదుటుటి మీద పాపం, ఆ మచ్చ అలాగే ఉండి పోయింది. ఆ అందమైన మచ్చతో మహానటి సావిత్రి ముఖారవిందం ఈ జన్మకి మరిచి పోగలమా ?
కానుకలు ఇవ్వడమూ, ప్రతి కానుకలు ఇవ్వడమూ కూడా ఓ కళ ! కదూ ?!!
ఇదండీ, కానుకల కథ !!
ఇక స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి