2, డిసెంబర్ 2010, గురువారం

దెబ్బల రాజ్యం లో దబ్బఱ నీతులు















అమాయక గిరిజనులను మైదాన ప్రాంత వ్యాపారులు దోపిడీ చేయడంలో అనేక విధాలయిన మెళకువలు
చూపుతూ ఉంటారు. వాటికి చెందిన ఒక దోపిడీ విధానమే అడ్డకి పడ్డ అనేది.

మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకటి రోజులలో తరుచుగా వినిపించే ఈ మాటకి అర్ధం నాకు తెలిసేది కాదు. మా నాన్న గారు చెప్పిన దాని ప్రకారం, అమాయక గిరిజనులకి మైదాన ప్రాంతీయులు అడ్డ ( వెనుకటి కొలమానం. అడ్డ, తవ్వ, సేరు, కుంచం మొదలయినవి. నాలుగు అడ్డలు ఒక కుంచం అనే వారు) తో వారికి కావలసిన ధాన్యమో, బియ్యమో కొలిచి అప్పుగా ఇచ్చే వారుట. కొంత కాలానికి ఆ అడ్డెడు అప్పుకి వారు తీర్చ వలసిన బాకీని చక్ర వడ్డీతో లెక్క కట్టి, దొంగ లెక్కలు వేసి ఇబ్బడి ముబ్బడిగా పెంచి, అధిక మొత్తంలో బాకీ పడినట్టుగా తేల్చి చెప్పే వారుట. అంత బాకీ చెల్లించ లేని గిరిజనులు తాము తీసుకున్న అడ్డెడు అప్పు నిమిత్తం తమ ఇంటిలో ఉండే ఏ ఆవు పెయ్యనో ( దానినే పడ్డ అనే వారు) ఇచ్చేసే వారుట. ఇదీ అడ్డకి పడ్డ కథ. ఇది దోపిడీకి పరాకాష్ఠ .

అఙ్ఞానం, అమాయకత్వం ఉండే చోట కుటిల వ్యాపారులు తమ మోసపు వ్యాపారపు మెళకువ లన్నీ చూపెడుతూ ఉంటారు.

గ్రామాలలో చిల్లర వ్యాపారులు దినుసులను అమ్మడమే కాక, కొనడం కూడ చేస్తూ ఉంటారు.
ఆ దినుసలను వారు కుంచంతో కొలుస్తూ ఉంటారు. తాము రైతు వారీ నుండి దినుసులను కొనవలసి వచ్చి నప్పుడు ‘‘ పెద్దమ్మీ, కుంచం పట్రా ’’ అని ఇంట్లోకి కేక వేసే వారుట. ఇంట్లో రెండు సైజుల కుంచాలు ఉంటాయిట. ఒకటి పెద్దదీ, రెండోది చిన్నదీనూ. వ్యాపారులు రైతు వారీ నుండి తాము దినుసులు కొనడానికి పెద్దమ్మాయిని కుంచం తెమ్మని కేకెయ్యడంలో కిటుకు, ఇంట్లో ఉన్న పెద్ద కుంచం తెమ్మని అనడం, తమకి కొలతకు ఎక్కువగా దినుసులు రావడం కోసం ఇంట్లోంచి పెద్ద రకం కుంచం తెమ్మని సంకేతం, అదే, తాము అమ్మ వలసిన దినుసుల కొలతకి చిన్న సైజు కుంచమయితే, తమకి లాభం కనుక, ’’ చిన్నమ్మాయ్, కుంచం తే ‘‘ అని, చిన్న కుంచం తెమ్మని సంకేతాన్ని పంపే వారని మా నాన్న గారు చెబుతూ ఉండే వారు.

కుటిల వ్యాపారులు ఎన్ని రకాలుగా మోసం చేస్తూ ఉంటారో తెలియ జేస్తూ ఒక కవి ఈ శ్లోకం వ్రాసేడు. చూడండి:

తులేన కించిత్ తులయా చ కించత్, మానేన కించిత్ శపథేన కించిత్
కించిచ్చ కించిచ్చ హర త్యశేషవ, వణిక్సమో నాస్తి ప్రశస్త చోర:

అసలు త్రాసు లోనే కొంత తిరకాసు ఉంటుంది. తక్కెడ సరిగా ఉండదు. ఎప్పుడు తూచినా, ఆ తక్కెడ అమ్మే వాడికే లాభదాయకంగా తప్పుడు తయారీతో ఉంటుంది. ( సరుకులు వేసే తక్కెడ క్రింద అయిస్కాంతం ముక్క పెట్టడంలాంటి గిమ్ముక్కులు కూడానూ)

ఇక, తూచడంలో కొంత మోసం. దుకాణంలో తూకం సరి పోయి నట్టుగానే అనిపిస్తుంది. ఇంటికి పోయి కొలుచు కుంటే, ఎంతో కొంత తరుగు కనిపిస్తుంది. అదెలా జరిగిందో తెలియక జుట్టు పీక్కోవడమే . ఆ కిటుకు మనకి తెలీనంత ఒడుపుగా చేసే వ్యాపారులుంటారు.

ఇక, కొల మానంలో మరి కొంత మోసం, తన నిజాయితీని నిరూపించుకుంటూ వేసే ఒట్ల తో కొంత, యిలాగ కొంచెం కొంచెంగానే కాజేసి, చివరికి ఏమీ మిగల కుండా చేసే వ్యాపారిని మించిన చోరాగ్రేసరుడు మరొకడు ఉండ బోడని కవి ఈ శ్లోకంలో చెబుతున్నాడు.


టక్కు టమార గజ కర్ణ గోకర్ణ విద్యలు తెలిస్తేనా కదా, అంతంత కూడ బెట్ట గలిగేది?

త్రాసు, తూచడం గురించి చెబుతున్నాను కనుక, మీకు రెండు పిల్లులు, ఒక కోతి కథ గుర్తు చేయడం సమంజసం.

రెండుపిల్లులకు ఒక రొట్టె ముక్క దొరికింది. దానిని పంచు కోవడంలో వాటికి తగాదా వచ్చింది. తగవు ఎటూ తేలక, అవి తగువు తీర్చమని ఒక కోతి దగ్గరకి వెళ్ళాయి.

ఆ కోతి సరేనని ఆ రొట్టె ముక్కని రెండు సమాన భాగాలుగా చేసి. ఇచ్చే మిషతో ఒక త్రాసులో రొట్టె ముక్కలు వేస్తుంది. ఒక సారి అందులో ముక్క పెద్దదయి పోయిందనీ, మరొక తూరి ఇందులో ముక్క చాల లేదనీ కబుర్లు చెబుతూ, ఆ రొట్టె ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా త్రుంచి నోట్లో వేసు కోవడం మొదలు పెట్టింది.

వెర్రి పిల్జలులకు జరుగుతున్న దేమిటో అవగతమయే లోపల ఆ కోతి మొత్తం రొట్టెను చప్పరించీసి, త్రేన్చిందిట.

జెల్ల కొడితే, దెబ్బ తినే వాడు తేరుకోక ముందే జెల్ల కొట్టీవాలి అనేది కుటిల వ్యాపారపు నీతి.

దెబ్బల రాజ్యంలో ఇలాంటి నీతులకి విలువ ఎక్కువ మరి.

మరో విషయం -


కథా మంజరిలో ఇది నా 199 వ టపా. మరి , నా 200 వ టపా రేపే విడుదల !

3 కామెంట్‌లు:

కథా మంజరి చెప్పారు...

M.V.Ramanarao మీకు ఒక బ్లాగుకు లింక్‌ను పంపారు:

read debbalarajyam--Ithink conditions have changed now .through political movements,Govt.measures and education.

కథా మంజరి చెప్పారు...

రమణా రావు గారూ, మీరన్నది నిజమే. ఉద్యమాల వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల, విద్యాభి వృద్ధి బాగా జరగడం వల్ల శ్లోకంలో చెప్పిన కవి కాలం నాటి దోపిడీ , ఆ రకం వంచనలు తగ్గి ఉండ వచ్చు.

కానీ, కొత్త కొత్త రూపాలలో మోసాలు పెచ్చు పెరిగాయే కానీ తగ్గు ముఖం పట్ట లేదు.

దెబ్బల రాజ్యం వంచనా శిల్పంతో అలరారుతూ, నాలుకలు సాచుతూనే ఉంది.

అజ్ఞాత చెప్పారు...

massachusetts college of pharmacy boston ma http://exclusiverx.com/products/xenical.htm PemDeespedhep 4335301 pharmacy fragrance distributors

కామెంట్‌ను పోస్ట్ చేయండి