ఎ.ఎన్.జగన్నాథ శర్మ గారి కొత్త పుస్తకం జగన్నాథ రధ చక్రాల్ ( నవ్య వీక్లీ మొదటి పేజీ) విశాలాంధ్ర వారి ప్రచురణగా 2011 కొత్త సంవత్సరం మొదటి రోజున వెలువడింది. ఈ సందర్భంగా విశాలాంధ్ర వారి కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో కవి శివా రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.శర్మ గారు ఈ పుస్తకాన్ని తమ అన్నా వదినలు అయలసోమయాజుల గణపతి రావు, నాగ రత్నం దపంతలకి అంకితం చేసారు.
నవ్య వార పత్రిక సంపాదకునిగా బాధ్యతలు స్వీకరించేక జగన్నాథ శర్మ గారు నవ్య వీక్లీ లో హరహర మహా దేవ ! అనే శీర్షికతో మొదలు పెట్టి ఈ మొదటి పేజీ రచనలు చేస్తున్నారు ఇది నవ్య పాఠకులను విశేషంగా అలరిస్తూ వస్తోంది. వీక్లీ చేతిలో పడగానే మొట్ట మొదట ఈ మొదటి పేజీ సంపాదక రచనను చదవనిదే మిగతా పుటల జోలికి వెళ్ళని అసంఖ్యాక పాఠక శ్రేణి తయారయింది. అద్భుతమైన శైలితో వివిధ సామాజికాంశాలను అలవోకగా తడుముతూ సానుకూల దృక్పథంతో పాఠకులను ఈ రచనలు విశేషంగా ఆకట్టు కుంటున్నాయి. జీవితం పట్ల ఒక ఆశాహ దృక్పథాన్ని ప్రోది చేస్తూ, వ్యక్తి చైతన్యాన్ని పెంపొందించేలా ఈ కథనాలు తెలుగు పత్రికా రచనలో ఒక బాధ్యతాయుతమైన పాత్రను నిర్వర్తిస్తున్నాయి. అలా వ్రాస్తున్న మొదటి పేజీ రచనల నుండి ఏర్చి కూర్చిన 92 రచనలతో ఇప్పుడీ పుస్తకం అందంగా వెలువడింది.
పుస్తకాన్ని చూడగానే కొనాలనిపించేంత అందంగా రమణ జీవి గారు భావ స్ఫోరకమైన టైటిల్ డిజైన్ చేసారు.
పుస్తకం వెనుక అట్ట మీద ప్రచురించిన పెద్దల అభిప్రాయాలు చూడండి ...
నవ్య వీక్లీ సంపాదకులుగా జగన్నాథ శర్మ గారు సాగు చేసిన ఙ్ఞాపకాల తోటగా ప్రచురణ కర్తలు
తమ అమూల్యాభిప్రాయం వెలువరిస్తే,
ప్రముఖ రచయిత ముక్తవరం పార్ధ సారధి ఇలా అంటున్నారు:
ఇవి కథలు కావు.వ్యాసాలు కావు. మ్యూజింగ్స్ కూడా కావు. నవ్య వీక్లీకి సంపాదకుడిగా ఉన్న జగన్నాథ శర్మగారు వారం వారం పాఠకులకు సమర్పించిన ఈ మొదటి పేజీ ‘ప్రోజ్ పాయెమ్స్’ ఆయన స్మృతి వల్మీకాలు. ఙ్ఞాపకాలందరికీ ఉంటాయి. కాని వాటిని ఉద్వేగ భరితంగా, గుండె గొంతుకలో అడ్డు పడినట్టు పదాలలో బంధించడం మాత్రం జగన్నాథ శర్మ గారికే సాధ్యం. ఇవి చదువుతూ ఉంటే ఒకసారి ఒళ్ళు జలదరిస్తుంది. మరోసారి మనస్సు కలుక్కుమంటుంది.. లేదా నాస్టాల్జియాతో వెన్నులో చలి పుట్టి ‘ ఇలా ఉండేదా ఆనాటి బతుకు’ అని మనకు తెలియకుండానే మౌనంగా రోదిస్తాం.కనిపించని కన్నీరూ, పంటి కింద బిగపట్టిన బాధా, చిన్ననాటి కలల జలతారు దృశ్యాలూ వీటిలో మనల్ని పలకరిస్తాయి.ఇవి శర్మ గారు మనకిచ్చిన ’ చిరు కానుకలు‘.
మరో రచయిత ఓలేటి శ్రీనివాసభాను ఏమంటున్నారో చూడండి:
పడికట్టు పదాల్లేవు. పనికి రాని ఉపన్యాసాలూ లేవు. ఆరితేరిన కథకుడు తనదైన శైలిలో రాసిన కథనాలు ఇందులో ఉన్నాయి. సంపాకీయం అంటే ఎత్తయిన శిఖరమ్మీదో, ఏకాంతంలోనో కూర్చొని రాసిన ప్రవేశికలు కావివి. కథాకథన శైలిలో ఆవిష్కరించిన అవతారికలివి. వీటిలో ఆశలున్నాయి. ఆకాంక్షలున్నాయి. ఆశయాలూ, అనుభూతులూ ఉన్నాయి. సమస్యల పట్ల సానుభూతితో స్పందించి, సానుకూలమైన పరిష్కారాన్ని అందించడం ఈ‘జగన్నాథ రధ చక్రాల’ విశిష్టత. బియ్యం గింజ మీద అక్షరాలు రాసినట్టుగా గుప్పెడు వాక్యాల్లో గుండెను కమ్ముకునే భావాలకు పటం కట్టి, సంపాదకీయాలకు సరికొత్త పట్టం కట్టిన ప్రవీణ్యం ఇందులో ఉంది. ఎప్పుడు చదివినా జీవితాన్ని ప్రతిబింబించే, మనిషికి ప్రాతినిధ్యం వహించే శాశ్వత విలువలు ఇందులో ఉన్నాయి.
శర్మ గారి ఙ్ఞాపకాల పేటికలో ఎన్ని గుప్త నిధులు ఉన్నాయో ! సూదంటురాయిలా ఆకర్షించే ఈ శీర్షికలే చెబుతాయి. మచ్చుకి కొన్ని చూడండి:
కొమ్మా లేదు ! కోకిలమ్మా లేదు !
మీసాల తాతయ్య పల్లీలు
చిగురు తొడిగిన శ్రమ
పునుకుల పున్నమ్మ
ఆకు పచ్చని ఙ్ఞాపకం
బుడ బుక్కలు
కన్నీరు కూడా వరమే
జజ్జనకరజనారే ! జనకుజన జనారే !
తూనీగ ... తూనీగ
ఙ్ఞాపకాల సన్నజాజులు
పరమ శివుడు, పిల్ల చేష్టలు
వేసవి వెన్నెల
చెట్టెక్క లేని చిన్న తనం ...
ఇలా రాస్తూ పోతే మొత్తం అన్ని శీర్షికలనూ పేర్కొనాలసి వస్తుందేమో !
జగన్నాథ శర్మ గారి గురించి ప్రత్యేకంగా వ్రాయాల్సిన పని లేదు.
13 -4 - 1956 లో విజయ నగరం జిల్లా, పార్వతీ పురంలో పుట్టిన వీరు ప్రవృత్తి రీత్యా రచయిత, వృత్తి రీత్యా పత్రికా రచయిత. దాదాపు అయిదు వందల కథలు, అయిదు నవలలు, అనేక వ్యాసాలు వ్రాసారు.
సినిమా, టీవీ రంగాలలో పనిచేసిన విశేషానుభవం ఉంది. ప్రముఖ టీవీ ఛానెళ్ళలో వీరు రాసిన టీవీ సీరియల్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ప్రస్తుతం నవ్య వార పత్రికకు సంపాదకులుగా ఉంటున్నారు . వెనుకటి తరానికి చెందిన గొప్ప సంపాదకులకు తీసిపోని విధంగా, కాలానుగుణమై మార్పులను ఆమోదిస్తూనే, నిత్యం ఏదో కొత్త దనాన్ని ప్రదర్శిస్తూ, నవ్య వార పత్రికను అటు సగటు పాఠకుల పత్రికగాను, ఇటు రచయితల పత్రికగాను తీర్చి దిద్దుతున్నారు. పురా పత్రికా రంగ వైభవాన్ని గుర్తనకు తెచ్చే లాగున దీపావళి సంచికలు ప్రచురించడం, ఒక శ్రీశ్రీ ప్రత్యేక సంచికను తీసికొని రావడం, వారం వారం నవ్య నీరాజనంతో రచయితలను పరిచయం చేయడమే కాక వారి కథలలో ఒక గొప్ప కథను పునర్ముద్రించడం - సంపాదకునిగా వీరి నిబద్ధతకు కొలబద్దలుగా చెప్పుకో వచ్చును.
ఇంతవరకూ ప్రచురితమైన వీరి పుస్తకాలు:
పాల పిట్ట కథలు (ప్రపంచ బాలల జానపదకథలకు అనుసృజన)
పేగు కాలిన వాసన (కథలు)
మహా భారతం (బాలల కోసం సరళ వ్యావహారికంలో)
రాబోయే వీరి పుస్తకాలు:
మహా భారతం ( తక్కిన సంపుటాలు )
అగ్రహారం కథలు
మా ఊరి కథలు
ఇది విశాలంధ్ర వారి ప్రచురణ. విశాలాంధ్ర వారి అన్ని బ్రాంచీలలోను దొరుకుతుంది.
192 పుటలున్న దీని వెల రు. 90 మాత్రమే.
మరెందుకాలస్యం ? మనమూ వారి ఙ్ఞాపకాల తోటలో విహరిద్దామా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి