7, జనవరి 2011, శుక్రవారం

మీకు చేత కాదూ ?

16వ శతాబ్దికి చెందిన రఘునాథ రాయలు, అతని కుమారుడు విజయ రాఘవ నాయకుడు ( 17వ శ.) తంజావూరు ప్రభువులు. గొప్ప సాహిత్య పోషకులు. వారిరువురూ స్వయం రాజా, స్వయం కవి అన్నట్టుగా చక్కని కావ్యాలు రచించారు.
నాయక రాజుల కొలువులో కవులే కాక ముద్దు పళని, రంగాజమ్మ, రామ భద్రాంబ, మధురవాణి మొదలయిన కయిత్రులు కూడ ఉండే వారు. వారిలో రంగాజమ్మ ప్రసిద్ధురాలు. మన్నారు దాస విలాసము అనే కావ్యమే కాక, అనేక యక్షగానాలు రచించింది. విజయ రాఘవుడీమెను చేరదీసి పోషించాడు. ప్రభువు రంగాజమ్మకు దగ్గరవడం సహించ లేని రాణి వాసపు రాణులెవరో రంగాజమ్మను నిందించి ఉంటారు. దానికి రంగాజమ్మ పద్య రూపంలో ఇచ్చిన ప్రత్యుత్తరం చూడండి:

ఏ వనితల్ మముం దలప నేమి పనో? తమరాడువారు గా
రో? వలపించు నేర్పెరుఁగరో ? తమ కౌగిట లోన నుండఁగా
రావిది యేమిరా ! విజయ రాఘవ ! యంచిలు దూరి బల్మిచే
దీవర కత్తినై పెనఁగి తీసుకు వచ్చితినా ? తలోదరీ !

ఈ పద్యానికి చెందిన ఒక చక్కని ఆడియో లింక్ ఇక్కడ చూడండి. ఈ పద్యాన్ని చక్కని కంఠ మాధుర్యంతో ఆలపించిన వారికి ధన్యవాదాలు.



ఏ స్త్రీ లయినా మమ్ము ఆడి పోసు కోవడం తగదు. మీరేమి, ఆడువారు కాదా ? వలపించే నేర్పు మీకు లేదా? మీ కౌగిటిలో ఉండగా బలవంతంగా విజయ రాఘవా, రావేమిరా !, రా !అంటూ మీ అంతిపురం లోకి చొచ్చి కపటంతో ప్రభువులను తీసుకొని రాలేదు కదా ?

ఈ సందర్భంగా విజయ రాఘవుని రసికతను నుతిస్తూ చెప్పిన పద్యం కూడా చూడండి.

ఇంతీ పానుపు పై నిదె
కంతుడు కూర్చున్న వాడు కనుగొను, వహవా !
కంతుడనంగుడు నీ తెలి
వింతేనా ! విజయ రాఘవేంద్రుఁడె చెలియా !

రాణి వాసపు స్త్రీల సంభాషణ ఇది:

ఈ శయన మందిరంలో తల్పం మీద సాక్షాత్తు మన్మథుడు కూర్చుని ఉన్నాడు, చూడవే అని ఒకతె అంటున్నది.

దానికి రెండవ ఆమె ఇలా ప్రత్యుత్తరమిచ్చింది: నీ మొహం ! నీ తెలివి తేటలు ఇంతేనా ? అతడు నీవన్నట్టు కంతుడు ( మన్మధుడు) కాదే. ఎందు కంటే, కంతుడు అనంగుడే. శివ కోపానలంచేత దగ్ధమైన వాడు. అశరీరుడు. మరి, ఇక్కడ సశరీరుడైన అంద గాడు కూర్చుని ఉన్నాడు. ఎవరో తెలుసా ? ఈతడు మన విజయ రాఘవ నాయకుడే, చెలీ !

( ప్రభువులు మన్మధాకారులని భావం)

1 కామెంట్‌:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పంతుల జోగరావు! వర భావ ప్రపూర్ణుఁడ! మిత్ర పుంగవా!
పంతము పట్టి నేర్చితవొ? భాగ్యముగా వర గాన మాధురిన్!
సాంతము గంటినయ్య మనసార. మహాద్భుతమయ్య. నీకు ర
వ్వంతయు తోచలేదె కనులార కనుంగొన నాకు తెల్పగన్?

కామెంట్‌ను పోస్ట్ చేయండి