ఎర్రగా బుర్రగా, కొంచెం కుదమట్టంగా ఉన్న నేను మీకు తెలుసు కదూ?
నగరాల్లో, పట్నాలలో, పల్లెల్లో నేను అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాను. నన్ను ఆంగ్లంలో ఫొస్ట్ బాక్స్ అనిపిలుస్తారు. తెలుగు వాళ్ళు నన్ను పోస్టు డొక్కు అనీ, తపాల పెట్టె అనీ, ఎర్ర డబ్బా అనీ ముద్దుగా పిలుస్తూ ఉంటారు.
ఒకప్పుడు నా కడుపు నిత్యం నిండుగా ఆకలి బాధ ఎరుగ కుండా ఉండేది. కార్డులు, కవర్లు, ఇన్ లేండ్ కవర్లతో నా కడుపు పొద్దస్తమానం నిండి పోయి ఉండేది. మా తపాల అన్నయ్య ప్రతి రోజు ఠంచనుగా వేళకి వచ్చి, నా నడుం ప్రక్క ఉన్న తాళం తీసి వాటిని సేకరించుకుని వెళ్ళి పోయేవాడు. ఆ తరువాత అవి పోష్టు ఆఫీసుకి చేరి, అక్కడ ముద్రలు వేయించుకుని, ఊర్ల వారీగా వేరు చేయబడి రైళ్ళలో, బస్సుల్లో ఎంచక్కా ప్రయాణం చేసి వెళ్ళి పోయేవి. వెళ్ళి, అవి ఎవరికి చేరాలో వారింట అడుగు పెట్టేవి. ఒకప్పుడు ఆ ఉత్తరాలు తెచ్చే పోస్టు మేన్ కోసం జనాలు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే వారు.
ఉత్తరాలలో ఎన్ని రకాలో ! కుశలాలు అడిగేవి, కబుర్లు చెప్పేవి, నిష్టూరాలు పలికేవి, నిందలు వేసేవి, సాయం కోరేవి, అభయం యిచ్చేవి, ధైర్యం చెప్పేవి, బెంగలు, బాధలు, చికాకులు, కష్టాలు కలబోసుకునేవి, కన్నీళ్ళు కార్చేవి, నవ్వుతూ కళకళ లాడేవి ... ...
కొన్ని మృదువుగా, కొన్ని కఠినంగా, కొన్ని క్లుప్తంగా, కొన్ని సుదీర్ఘంగా, మరి కొన్ని పెళుసుగా, కుండ బద్దలు కొట్టి నట్టుగా, హెచ్చరికలు, ఓదార్పులు, మంతనాలు, హిత వచనాలు, వేడికోళ్ళు, వెక్కిరింతలు ... ...
శుభ వార్తలను మొసుకొచ్చేవి, దుర్వార్తలను చెప్పేవి. మొదటి వాటికి పసుపు నాలుగు చివర్ల పెట్టే ఆచారం ఉంది. రెండో రకం వాటికి నాలుగు చివర్ల నల్ల సిరా పూసే అలవాటూ ఉంది .
కొన్ని ముత్యాల కోవ వంటి అక్షరాలతో రాసినవి. కొన్ని గొలుసు కట్టు రాతతో చదవడానికే చికాకు పరిచేవి.
కొన్నింట చక్కని కవిత్వం. మరి కొన్నింట అక్షర దోషాలతో ఎంత చదివినా ఏం రాశారో అర్ధం కానట్టు ఉండే వాక్య విన్యాసంతో కూడినవి ...
ఇచ్చట అంతా క్షేమం. అచ్చట మీరంతా క్షేమంగా ఉన్నారని తలస్తాము. లాంటి వాక్యాలతో మొదలై, చిత్త గించ వలెను, తో పూర్తి చేసే వారు.
మహా రాజశ్రీ, అనో, బ్రహ్మశ్రీ వేదమూర్తులయిన అనో, గంగా భాగీరథీ సమానురాలైన ... అనో సంబోధనలు ఉండేవి.
ఇప్పుడా ఉత్తరాలూ లేవు, ఆ రాతలూ లేవు. ఉత్తరాలు రాయాలంటేనే బోర్. సెల్ ఫోన్ లు వచ్చేక మరీనూ. గంటల తరబడి అందులోనే కబుర్లు చెప్పు కోవడం, లేదా ఆకుకీ పోకకీ అతకనట్టు ఎస్సెమ్మస్ లు ఇచ్చు కోవడం. నా పాలిట కొరియర్ సర్వీసులొకటి వచ్చి పడ్డాయి. ఇంక నా ఊసెవరికి పడుతుంది ?
లేఖా రచన గొప్పతనం ఇప్పుడెవరికీ పట్టడం లేదు. సాహిత్యంలో లేఖా సాహిత్యానికి ప్రత్యేకమైన, ఉన్నతమైన స్థానం ఉంది. ప్రముఖుల లేఖలు చదవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.
విశ్వ కవి రవీంద్రుడు మా ఆఫీసు గురించి పోస్టాఫీసు అనే ఒక గొప్ప కథ రాసిన విషయం మీకు తెలిసిందే కదా ?
నా ఉత్తరాల గురించి బాల గంగాధర తిలక్ పైనికుని ఉత్తరం, తపాల బంట్రోతు లాంటి గొప్ప వచన కవితలు రాసేడు. ఇంకా చాలా మంది నా గురించి , ఉత్తరాల గురించిరాసేరు. అపురూపమైన లేఖా సాహిత్యాన్ని సృజించేరు. అవన్నీ మరో మారు చెప్పుకుందాం.
ఆ మధ్య ఏదో తెలుగు సినిమాలో ఓ కమేడియన్ నా నోట్లో చెయ్యి పెట్టి ఎంతకీ ఊడి రాక గింజుకుంటూ విలవిలలాడుతూ ఊరంతా తిరగడం లాంటి కామెడీ కూడా ఏదో చేసాట్ట. నేను చూడ లేదను కోండి. ...
ఇప్పడు చాల మంది ఉత్తరాలు రాయడానికి బద్ధకం చేతనో, అశక్తత చేతనో, అయిష్టం వల్లనో, చేత కాని తనం చేతనో పూను కోక పోవడం చేత తరుచుగా నా కడుపు అర్ధాకలితో దహించుకు పోతోంది.
సంభాషణలో విప్పి చెప్ప లేని విషయాలను, పరిచి చూప లేని హృదయ స్పందనలను అక్షరం ఆవిష్కరించ గలదనే సత్యాన్ని విస్మరిస్తున్నాం మనం.
అందుకే ఒకప్పుడు ఉత్తరాలతో నిండుగా ఉండే నేను, ఇప్పుడు ఒకటీ అరా ఉత్తరాలతో బోసి పోయి ఉంటున్నాను..
అర్ధాకలితో అలమటించి పోతున్నాను. మరెందుకు లెమ్మని నాకు కొన్ని చోట్ల మా తపాల శాఖ వారు తాళాలు వెయ్యడం కూడా మానుకున్నారు. నన్ను పట్టించు కోవడం మానేసేరు.
చాలా వరకు ఇప్పుడు నేను దుమ్ము పట్టి ఉంటున్నాను. ఫాక్సులూ, ఇంటర్నెట్ లూ వచ్చేక నా పరిస్థితి మరింతగా దిగజారి పోయింది.
నా కేడుపు వస్తోంది. నన్ను పట్టించు కోరూ? ఉత్తరాలతో నా కడుపు నింపరూ? నా ఆకలి కేకలు చెవిని పెట్టరూ?
9 కామెంట్‌లు:
ఇలాంటి పోస్టుల కోసమే బ్లాగులని చూసేది.
చక్కటి పోస్టు రాసారండీ.
మనం కొన్ని కొన్ని భావాలని కేవలం రాయడం ద్వారానే బాగా అభివ్యక్తీకరించగలం.
మా మామయ్య ఉత్తరాలని ఎంత అద్భుతం గా రాసేవాడంటే ఆ ఉత్తరాలు రాసి ఇరవయ్ సంవత్సరాలైనా ఇంకా ఆ ఉత్తరాలని దాచుకుని చదువుకుంటారు.
నేను ఈ మధ్యనే మా మామయ్యకి ఉత్తరాలని రాయడం మొదలుపెట్టాను. ఆయన ఇచ్చిన రిప్లై చదివితే ఎంత ఆనందం గా ఉందొ చెప్పలేను.
జీవితాన్ని ఇలా ఆనందించవచ్చు అని నాకు తెలిసింది అయన ఉత్తరాలతోనే.
మా ఫ్రెండ్స్ కి నేను ఇలా ఉత్తరాలు రాస్తున్నాను అని చెబితే ఇప్పుడు ఎంటబ్బా ఉత్తరాలూ ఈమెయిల్సు ఎస్సెమ్మెస్లు ఫోన్లు వచ్చేసాకా అన్నారు కొంతమంది.
నేను అనుకున్నదే వాళ్ళకి చెప్పాను. చేతితో రాసిన ఉత్తరం ఫీలింగే వేరు. అనుకున్నప్పుడల్లా తీసి చదువుకోవచ్చు అని.
మా మామయ్య అయితే ఏమంటాడంటే ఫోన్ అంటే ఏదో చేసేసి మాట్లాడేస్తాం అదే ఉత్తరం రాయాలంటే ముందునుండే చాలా అనుకుంటే గానీ రాయలేం అంటారు.
రేపో ఎల్లుండో ఇంకో ఉత్తరం వస్తుంది. దాని కోసం ఎదురుచూస్తూ ఉన్నా.
ఇంటికి వచ్చేటపుడు నా కోసం ఒక ఉత్తరం వచ్చి ఉంటుందోచ్ అనుకుంటూ రావడం హ్యాపీ గా ఉంటుంది.
బాగున్నాయి మీ "తీపి గుర్తులు". కాని ఒక్క విషయం చెప్పాలి. ముఖ్యంగా ఆఫీసుల్లో, ఈ కోరియర్లు రాకముందే హాయిగా ఉండేది. రోజుకి రెండుసార్లు పోస్ట్ మాన్ వచ్చి ఉత్తరాలు ఇచ్చేవాడు. ఇక ఆ ఉత్తరాలు చూసుకుంటే సరిపొయ్యేది. ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ఏదో ఒక కొరియర్ వాడు ఒక కవరు పుచ్చుకుని ఐదు నిమిషాలకోకసారి మన ముందు పెడతాడు. రోజల్ల ఇలా ఉత్తరాలు వస్తే, వాటిని చూసేదేన్నడూ, జవాబు వ్రాసేది ఎప్పుడు. ఆపైన, ఈ కొరియర్ బాయ్స్ ఎవరో ఏమిటో తెలియదు. ముఖ్యమైన ఆఫీసుల్లోకి కూడా జోరబడిపోతూ ఉంటారు. ఇది తప్పనిసరిగా సెక్యూరిటీ రిస్కే. ఈ విషయంలో ఎక్కడన్నా ఎమన్నా జరిగితెకాని మనవాళ్ళు కళ్ళు తెరవరు.
శివ గారూ, ఈ టపాలో నేను వదిలేసిన కోణాన్ని గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలండీ.
శరత్ గారూ, ధన్యవాదాలు. మీరు చెప్పిన గొప్ప ఫీలింగ్ ని జీవితంలో మిస్ అవుతున్నాం కదా, అనేదే నా బాధ.మీ మామయ్య గారి వంటి పెద్దలు రాసే ఉత్తరాలు పదే పదే చదువుకో తగ్గవిగా ఉంటాయి.
Ramana Rao Muddu మీకు ఒక బ్లాగుకు లింక్‌ను పంపారు:
దీన్నే నొస్టాల్జియ అంటారు.కాలప్రవాహంలో ఎన్నో కొట్టూకొని పోతున్నయి. అందులోను టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ రోజుల్లో .18,ఇ9,శతాబ్దుల్లో లేఖారచన ఒకకళ .చార్లెస్లాంబ్ ,జె.బి.ప్రీస్ట్లీ ,మొ/వారి లెటెర్స్ నాండితైల్డ్ టెక్స్త్లో అదంత వుండేవి.అదంతా గతం. . రమణారావు.ముద్దు.
బ్లాగు: కథా మంజరి
పోస్ట్: ఎర్ర డబ్బా ఆకలి కేకలు
@రమణారావు ముద్దు
నోస్టాల్జియా కాదండి. ఈ మెయిలులో పంపిన వాటికి లీగల్ గా అనుమతి ఉన్నదా? లేదు. మనం ఒకరికొకరు వ్రాసుకునే కార్డ్ అయినా సరే అందుకున్నప్పుడు కలిగే ఆనందం ఈ మెయిలు వస్తే ఉంటుందా?? ఆ పైన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కొరియర్ వాళ్ళు చెయ్యగలిగినది ఏమున్నది, పెద్ద పెద్ద ఆఫీసులకి కవర్లు అందించటం తప్ప. ఒక్క పెర్సనల్ లెటర్ వాళ్లకి ఇచ్చి చూడండి డెలివర్ చెయ్యగలరేమో? వాళ్ళ వల్ల కాదు.అందరికీ తెలిసిన లాండ్ మార్క్ చిరునామాలకే వాళ్ళు డెలివర్ చెయ్యగలరు. కాని మన పోస్టాఫీసు వాళ్ళు ఎక్కడికైనా ఏ చిరునామాకైనా సరే డెలివర్ చెయ్యగలరు. ఒక అర్ధరూపాయి పెట్టి కార్డ్ కొని వ్రాస్తే దేశంలో ఎ మారుమూలకైనా సరే అతి తక్కువ సమయంలో జాగ్రత్తగా తీసుకెళ్ళి చిరునామాదారుకి అందిస్తారు, అవసరమైతే వారికి చదివి వినిపిస్తారు కూడా. ఈ ఆవకాశం మనం కొత్త అనుకుంటున్న సాంకేతిక కలిగిన వ్యవస్థలో ఏది. కొత్త అయినంత మాత్రాన గొప్ప అవ్వవలసిన పనిలేదు, పాత అయినంత మాత్రాన రోతా పడకూడదు, పాత వాటి గురించి వ్రాసినప్పుడు దానికేదో పడికట్టు మాటొకటి పడేసి కొట్టిపారెయ్యకూడదు అని నా అభిప్రాయం.
సివగారు,మీ తో ఏకీభవిస్తున్నాను. కానీ మన చిన్నప్పటికీ ,ఇప్పటికీ విపరీతంగా మార్పులు వచ్చాయి .ఇంకా వస్తాయి.వాటికి మనం సర్దుకు పోవాలిసిందే .కొన్ని మాత్రం రక్షించు కావచ్చును.ఉదా'"సిమ్లా,ఊటీ రైళ్ళు ,కొన్నిఅందమైన పాత కట్టడాలు మొ;హెరిటేజివి. అంతే నా ఉద్దేశం. ramaneeyam
Tappakunda.... eduruga unde vyaktikaina maatalo telapaleni sangatulanu lekha lo teliya paracha vachu ani nenu nammutaanu..anduke neninka uttaraalanu vrastunna Pratyuttaram gurinchi adagakandi...
శిరీష గారూ, చాలా కాలం క్రిందటి టపాను చూసి స్పందించి నందుకు మీకు నా ధన్యవాదాలు.
సంభాషణలో విప్పి చెప్ప లేని విషయాలను, పరిచి చూప లేని హృదయ స్పందనలను అక్షరం ఆవిష్కరించ గలదనే సత్యాన్ని విస్మరిస్తున్నాం మనం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి