శ్రీ పంతుల సీతాపతి రావు పద్య రచనలో విశేష కృషి చేస్తున్నారు. గణిత శాస్ర్త ఉపాధ్యాయునిగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు నందిన వీరు తెలుగు పద్యం మీద అపార మైన మక్కువతో తరచుగా పద్య రచన చేస్తూ ఉంటారు. సుందర కాండ మొత్తం వీరు ఇటీవల పద్య రచనగా పూర్తి చేసారు. స్పందించిన ప్రతి అంశాన్ని ఛందో బద్ధం చేయడం వీరి అలవాటు. ఉద్యోగ విరమణానంతరం వీరు ప్రస్తుతం విశాఖ లో ఉంటున్నారు. వారి పుష్పావేదన మన కథా మంజరి బ్లాగర్ల కోసం. చూడండి:
:
పుష్పా వేదన
వేకువందునే మేల్గాంచి వివస మొంది,
దైవ పూజకు పూలను తేవ నెంచి,
పూల తోటకు నేగితి పూలు కోయ, 1
జాలి కురిపించు జంధ్యాల పూల కవిత
ఎచట నుండియో వినిపించె అచట నాకు
మనసు మార్చుకు కొమ్మను విడిచి పెట్టి
వట్టి చేతుల ఇంటికి పయన మైతి 2
పయన మవుతున్న నను జూచి మల్లె యొకటి
"వెళ్ళి పోబోకు మిత్రమా! వెళ్ల కనుచు "
నేల పడియున్న పూలను నెత్తి జూపి
దీన మలరగ వినిపించె వింత కధను 3
వాడి రాలిన మము జూడ వచ్చి నావ?
పూజ కొరకునే పూవులు పూయు ననుచు
భక్తి శ్రద్ధతో మమ్ముల పట్టు కెళ్ళి
పూజ చేసెడి వారు మీ పూర్వ జనులు 4
రంగు రంగుల పూవుల రాసి పోసి,
ఊలు దారాలతో మమ్ము మాల గూర్చి
స్వామి మెడలోన మము వేయు సమయ మందు,
ఎంత ఆనంద పడితిమో ఎరుక పడదు. 5
మంత్రపు నీళ్ళు జల్లి మము మంత్రము తోడనె పూజ చేసి , యా
చెంతన యున్న భక్తులకు చింతలు పోవగ ఇచ్చి నంత , వా
రంతయు పూజ పూవులని ఆత్రత తోడుగ చేత బట్ట ; మే
మెంతగ పొంగి పోయితిమొ ? ఏ తరి చేసిన పుణ్య మంచు చున్ 6
నూట ఎనిమిది పూవులు పూజ చేసి
మంత్ర మంత్రంబు కోక్కొక్క మహిమ జెప్పి,
స్వామి పాదాల చెంతన జార విడువ
ప్రభువు సేవకు ఉపయోగ పడితి మనుచు
అమిత ఆనంద పడితిమి అబ్బురముగ 7
పూజ చేసిన వాడిన పూల నన్ని
భద్ర పరిచియు మర్నాడు పదిలముగను
తులసి మొక్కల నడుమున తురిమి యుంచి
జలము నర్పణ చేసియు జార విడరె ! 8
గోళెముల లోన మట్టిని గుమ్మ రించి,
మొక్కలను నాటి ప్రతి రోజు మొద మలర,
నీరు పోయుచు ప్రాణాలు నిలుపు మీకు ,
పూల నిచ్చెడి సంతృప్తి పొంది నాము ! 9
పెండ్లి కూతురు అందంబు వెల్లి విరియ
మల్లె జాజులు జడలోన మాల తురిమి
బంధు హితులంత మెచ్చుతూ పరవ సించ
జన్మ ధన్యత అయినంత సంభ్రమొందె ! 10
సభల యందున సత్కవుల్ సత్క రించ
పుష్ప గుచ్చము లిచ్చుచు ప్రోత్స హించ
వారి గౌరవ మంతయు మాదె అనుచు
గొప్పగా మేము చప్పట్లు కొట్టి నాము 11
హరికధను చెప్పు హరిదాసు హార మందు,
పూల దండయే దాసుకు ప్రోత్స హమ్ము;
హరియు నామమె ప్రజలకు హర్ష మనుచు
బ్రతుకు చున్నాము ఇన్నాళ్ళు పరువు తోడ 12
సిగను ముడుచు కొనెడి చిరు పూల దండయే,
భార తీయ స్త్రీకి గౌర వమ్ము ;
పెళ్లి రోజు తెచ్చు మల్లె పూదండయే
ప్రియుడు సఖికి ఇచ్చు ప్రేమ గుర్తు ! 13
ప్రకృతికె కాదు జనులకు బహు విధాల
అందము తొ బాటు ఆహ్లాద మంద చేయు
మమ్ము వెలి వెయ మీ కెట్లు భావ్య మయ్య?
ప్రజల కుపయోగ పడ నట్టి బ్రతుకు లేల? 14
అడవి కాచిన పూలలా అంత రించ
పుట్టి గిట్టిన మా కెట్లు పుణ్య మబ్బు?
ప్రభువు సేవకు ఉప యోగ పడుయు నటుల
సాయ మొందించి మా పట్ల జాలి గొనుమ? 15
అనుచు పూలన్ని నా మీద ఆగ్ర హించ
పూజ సరిపడ పూలను ప్రోగు చేసి
పూల నర్పించి దైవాన్ని పూజ చేయ
పరుగు పరుగున ఇంటికి పయన మైతి ! 16
1 కామెంట్:
ముక్కులు మూసుకొంచు,తపముల్ పచరించెడి రీతి కన్న పెన్
మక్కువ జీవసేవయు సమత్వ మహింసయు సాధనమ్ములై
నెక్కొను మానవత్వ మహనీయతకై సమకట్టు నీతియే
యెక్కువ యంచు తెల్పు పువులెంతటి పున్నెపు బువ్వలానెనో?
శహబాస్ కవీంద్రా!కరుణశ్రీని మీ కవిత రూపంలో మరోమారు గుర్తు చేసినందుకు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి