ప్రస్తుతం మనం తిరుగలికి చెందిన కబుర్లు చెప్పు కుందాం.
మీదో రాయీ, కిందో రాయీ ఉండే విసురు సాధనం తిరుగలి. కింద రాయి స్థిరంగా ఉంటే, మీద రాయి చేత్తో త్రిప్పడానికి అనువుగా ఉంటుంది. మీద రాతిని చేత్తో త్రిప్పడానికి అనువుగా ఒక కర్రతో చేసిన పిడి ఉంటుంది. విసర వలసిన గింజలను మీద రాయి మధ్యలో ఉండే ఖాళీ లోంచి పోసి, ఇంక త్రిప్పడం ( అంటే విసరడం) మొదలు పెట్టే వారు. విసరగా విసరగా మెత్తని పిండి రెండు రాళ్ళ మధ్యా ఉండే ఖాళీ ప్రదేశం నుండి కింద పడేది. ఇదీ తిరుగలి పని చేసే తీరు.
ఈ తిరుగలికే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి !
అంజి, అనఘట్టము,కణలాభము, ఘరట్టము,జిక్కి,యంత్రపేషిణి,యంత్రము, రాగల్రాయి, విసుర్రాయి ... ఇవండీ తిరుగలికి ఉన్న మరో పేర్లు !
ఇంత ఆయాసపడి పోవడం ఎందుకు కానీ, హాయిగా మనం తిరుగలి అనో, విసుర్రాయి అనో తెలిసిన పేర్లతో ప్రస్తుతానికి ముద్దుగా పిలుచు కుందాం ! ప్రాణానికి సుఖంగా ఉంటుంది.
తిరుగలి ఊసెత్తితే సాయి భక్తులకి సాయి బాబా షిర్దీలో తిరుగలి విసరడం గుర్తుకు వస్తుంది. కదూ !
ఆ కథ ఇక్కడ మరొక్క సారి గుర్తుకు తెచ్చు కుందాం.
అన్నా సాహెబ్ ధబోల్కర్ అనే ఒక పెద్ద మనిషి బాబా కీర్తి గురించి విని ఆయన దర్శనం కోసం షిరిడీ రావాలనుకున్నాడు. అతడు వచ్చిన రోజు ప్రొద్దున సాయి బాబా మసీదులో ఒక తిరగలి ముందర కూర్చుని గోధుమలు విసురుతున్నారు. బాబాకు ఇల్లు సంసారం లేవు. వారు భిక్షాటనంతో జీవిస్తారు గదా! మరి ఈ గోధుమ పిండి ఎందుకు? అని అతడు వచ్చి ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. అంతలో నలుగురు ఆడవాళ్ళు బాబాను తిరగలి ముందు నుంచి లేపి, పాటలు పాడుతూ పిండి విసిరారు. తరువాత దాన్ని నాలుగు భాగాలుగా చేసి తీసుకు పోబోయారు. అపుడు బాబా వాళ్ళను కోప్పడి "ఈ పిండి మీకు కాదు. దిన్ని తీసుకువెళ్ళి ఊరి సరిహద్దులలో చల్లండి" అని ఆజ్ఞాపించారు. ఇదంతా చూస్తున్న అన్నా సాహెబ్ ఆ ఊరి వాళ్ళను అడిగాడు - అలా పిండి ఊరు చుట్టూ చల్లటం దేనికి? అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం: "షిరిడీ గ్రామంలో కలరా వ్యాధి ఉంది. దాన్ని పోగొట్టడానికి బాబా యిలా చేసారు. ఆయన విసిరింది గోధుమలు కావు, వ్యాధినే" అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే మరునాటికి కలరా వ్యాధి తగ్గు ముఖం పట్టింది. అన్నా సాహెబ్ బాబా శక్తికి ఆశ్చర్యపోయాడు. ఇక ఆయన దగ్గరే ఉంది పోయాడు. బాబా కూడా అంతర్నేత్రంతో ప్రేమగా చూచేవారు. అతని "హేమాడ్పంత్" అని పిలిచేవారు. అతని మనసులో ఏ సందేహం వచ్చినా, బాబా తీర్చే వారు
తిరుగలి గురించి ఇంత పవిత్రమూ, ప్రశస్తమూ, ప్రఖ్యాతమూ అయిన కథలూ, విశేషాలూ ఉండగా ఓ సారి మా తింగరి బుచ్చి గాడు ఒక మహిళామణుల సభలో తిరుగలి గురించి అవాకులూ చవాకులూ ఉపన్యసించి మెడ మీదకి ( పీక మీదకి అని ఎందుకు అన లేదో మొత్తం ఆ వృత్తాంతం చదివితే గానీ మీకు తెలియదు) తెచ్చు కున్నాడు.
ఇంతకీ, మా తింగరి బుచ్చి గాడి గురించి మీకు చెప్పనే లేదు కదూ ! సన్నగా రివట వలె గాలికి తూలి పోవు రీతిని ఒప్పు వాడు. అడపాదడపా సభలలో సందడి చేయు వాడు. పిలిచిననూ, పిలువక పోయిననూ సభా ప్రాంగణము నందు తిరుగాడు వాడు. వీలు చిక్కించు కుని వేదిక నెక్కి తన ధోరణిలో ఉపన్యాసము లిచ్చు వాడు. మిక్కిలి తరుచుగా ఉపన్యాసము పూర్తి చేయక ముందే బలవంతముగా వేదిక నుండి నిర్దాక్షిణ్యముగా దింపి వేయ బడు వాడు. అంతియ కాక, లోకములో ఏ విషయము తనకు తెలియదను మాట లేని వాడు. సమస్త విషయముల గూర్చిన సమగ్ర సమాచారము తన వద్ద మాత్రమే కలదని అహంకరించు వాడు ...
మా తింగరి బుచ్చిగాడి ఘనత గురించి చెబుతూ పోతే తరిగేది కాదు కానీ , ఇప్పుడు వాడిచ్చిన తిరుగలి గురించిన ఉపన్యాసం గురించి మాత్రం చెబుతాను వినండి:
‘‘ మన వాళ్ళుట్టి వెధవలోయ్‘‘ అని గురజాడ ఊరికే అన లేదు. గురజాడకి అసలు మన వారి గురించిన ఆ గ్రహింపు మా ముత్తాత బ్రహ్మశ్రీ తింగరి హనుమాన్లు శాస్త్రుల వారి వలన కలిగిందని మీలో ఎవరికీ తెలిసి ఉండక పోవచ్చును. సరే ఈ విషయం కాస్సేపు ప్రక్కన పెడదాం ! మన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాక పోతే, ఆలు మగల సంసారాన్ని బండి చక్రాలతోనా పోలుస్తారూ ! చక్రాల సంగతి అలా ఉంచితే, బండిని లాగేవి ఎద్దులు కదా ? ఆ రెండున్నూ పుంలింగములు కదా ? మరి ఆలు మగలలో ఒకరు పురుషుడున్నూ, వేరొకరు స్త్రీయున్నూ అయి ఉన్నారు కదా !
అందు చేత ఈ పోలిక శుద్ద చవటలు చేసిన పోలికగా నేను ఈ వేదిక మీద నుండి ధృవీకరిస్తున్నాను.... ’’ మా తింగరి బుచ్చి గాడి ఉపన్యసం ఈ వరకూ వచ్చే సరికి సభలో కొంత అలజడి బయలు దేరింది. అసహనం పురులు విప్పింది. హాహాకారాలు చెలరేగాయి. అదంతా తనఉపన్యాస ధోరణికి ప్రశంసారూపమయిన శబ్ద ఘోషగా ఎంచి, మా తింగరి బుచ్చి తన ఉపన్యాసాన్ని ఇంకా ఇలా కొన సాగించాడు:
‘‘ అందు చేత నా మట్టుకు నాకు భార్యా భర్తలను తిరుగలితో పోల్చడం సరైనదని పిస్తుంది. కింద ఉండే రాయి భార్య అయితే, పైనుండే రాయి భర్త. కింద రాయి అంగుళం కదలదు. అంటే, ఏమిటంటా, ఆడది గడప దాటకుండా ఇంట్లోనే పడి ఉండాలన్నమాట ! ఇక మగాడు పైన ఉండే రాయిలాగా సదా తిరుగుతూ డబ్బులు సంపాదించాలన్నమాట!అంతే కాకుండా మీది రాయి తిరుగుతూ ఉంటే, కింది రాయి ఆ రాపిడిని తట్టు కుంటూ ఉంటుంది. అంటఏ ఏమిటంటా ? భర్త పెట్టు నసను భార్య సదా భరిస్తూ ఉండడమే సృష్టి ధర్మం. అంతే కానీ నేటి ఆధునిక తుచ్ఛ వనిత వలె తిరుగబడుట అవివేకమూ, అనాగరికమూ ... ఇక, తిరుగలి తిరిగి నప్పుడే మెత్తని పిండి అనే సంసార సుఖాలు లభిస్తాయి. అయితే, సంసారం అనే ఈ తిరుగలి త్రిప్పేది ఎవరని మీకు ఆలోచన రావచ్చును. తిరుగలి పిడి అనే కాలం పట్టుకుని విధాత తిరుగలిని విసురుతూ ఉంటాడు....’’
ఇహ విన లేక సభలోని మహిళామణులంతా ఏక కంఠంతో దిగు ! దిగు !! ధ్వానాలు పలికి, మైకు లాక్కుని, చొక్కా గుంజుతూ, వేదిక మీద నుండి అర్ధాంతరంగా ఇవతలకి లాగి, సభాప్రాంగణం నుండి బయటకు ఎప్పటి వలె గెంటి వేసారట.
మా తింగరి బుచ్చి గాడు అందుకు నొచ్చు కోలేదు కానీ, తన గభీరమైన ఉపన్యాసం ఇంకా పూర్తి కాకుండానే అవాంతరం ఏర్పడింది కదా ! అని చింతించాడుట. ఆ రాత్రి అతనికి ఇంట అన్నం కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా లభించ లేదని నమ్మకమైన సమాచారం కథామంజరి వద్ద ఉంది.
ఇదీ మా తింగరి బుచ్చిగాడి తిరుగలి మీద ఉపన్యాసం. వీలు చూసుకుని తింగిరోపన్యాసాలు అనే లేబిల్ క్రింద వాని ఉపన్యాసాలు మును ముందు మీముందు ఉంచగలను.
ఇక, తిరుగలి గురించి లోగడ కవిగారు ఒకరు చెప్పిన ఆశువు చూడండి
ఏడిచెదవేలనోయిక ఘరట్టమ ! త్రిప్పల బెట్టుచుందురే
చేడెలు నన్నటంచు కడు చిత్రముగా కడగంటి చూడ్కి చే
రేడులనైన ద్రిప్పెదరు రేలు పవళ్ళిక కేలుబట్ట నె
వ్వాడు పరిభ్రమింపడు సుమా ! సుదతీమణి త్రిప్పు చేతలన్ !!
దీని భావం:
ఓ తిరుగలీ ! ‘‘ఆడవాళ్ళు నన్ను స్థిరంగా ఉండనివ్వ కుండా అరిగి పోయేలాగున తెగ త్రిప్పుతూ ఉంటారు ’’
అని ఎందుకే ఏడుస్తావు ? స్త్రీలంటే ఏమిటను కున్నావ్ ! ఓర చూపులతో ప్రభువులనయినా గిర్రున తమ వెంట రేయింబవళ్ళు త్రిప్పుకో గలరు. ఒక తూరి చేయి అందుకుంటే, ఆ చేతిని వదలకుండా ఆవిడగారి కనుసన్నలలోతిరుగాడుతూ ఉండ వలసినదే కదా !
అన్నట్టు మాతింగిరి బుచ్చిగాడికి తెలుసో, లేదో, తిరుగలి మాహాత్మ్యం గురించిన ఓ విషయం వాడి చెవిని వెంటనే వేయాలి. అవపరమయితే ఏదో చోట తన ఉపన్యాసంలో ఉపయోగించుకుంటాడు కదా.
అదేమిటంటే, కోదాడ దగ్గర ఒక నరసింహస్వామి దేవాలయంలో ఒక తిరుగలి ఉంది. దానిని కౌగలించుకుని వేడుకుంటే ఎలాంటి కోరికలనయినా తీరుస్తుందని భక్త జనుల విశ్వాసం ! ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే తిరుగలి అదిట ! కావాలంటే ఈ క్రింది ఫొటో మీరే చూడండి: :
ఈ భక్తాగ్రేసరి ఇప్పట్లో లేవదు కానీ, ఇక శెలవ్.
ఇతి తిరుగలి ఉపాఖ్యానమ్ సర్వం ప్రస్తుతానికి సమాప్తమ్
2 కామెంట్‌లు:
అదరగొట్టేశారు!
నిత్యమూ సరికొత్తపాళీ అదరగొట్టారని కామెంటినతరువాత వేరే సర్టిఫికెట్ ఇవ్వ వలసిన పనే లేదు.
చాలా అద్భుతంగా ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి