11, డిసెంబర్ 2011, ఆదివారం

కవి గారి రీజనింగు !


మన కవులు వాడే కవి సమయాలు బోలెడు.
స్త్రీలను వర్ణించేటప్పుడు ... అందమైన ముఖాన్ని చంద మామతోనూ, అరవిందం తోనూ పోలిక తెస్తారు.
వారి కురులు మేఘ మాలికలు
నేత్రాలు బేడిస చేపలు. చూపులు తూపులు. కనుబొమలు ధనుస్సులు . నడుము ఆకాశం. దంతాలు తారకలు. తొడలు అరటి బోదెలు. పాలిండ్లు పూర్ణ కుంభాలు. వేణి ఫణి. అధరాలు మధుశాలలు. పెదవులు దొండ పండ్లు. నాసిక సంపెంగ. ఇలా చాలా ఉన్నాయి లెండి. అంగాంగాలకూ ఎవరికి తోచిన పోలికలు వారు చెబుతారు.

ఆ సంగతి అలా ఉంచితే మనం కూడా నిత్య వ్యవహారంలో చాలా పోలికలను వింటూ ఉంటాం.
పొడుగ్గా ఉండే వారిని గెడ కర్రలా ఉన్నాడంటారు. తెలివి హీనుడిని మొద్దు రాచ్చిప్ప అంటారు. లంచాలడిగే వారిని జెలగలంటారు. కష్టపడి పని చేస్తే గాడిద చాకిరీ అంటారు. కష్టాలను కొండలంటారు. నీచులను పాములంటారు.
చక్కని జంటను రతీ మన్మథులంటారు. ముసలి ముత్తయిదవుల జంటను పార్వతీ పరమేశ్వరులాంటారు.
అతి వాగుడిని సుత్తి దెబ్బలంటారు. అందమైన భార్యకు అందవిహీనుడయిన భర్తను చూసి, కాకి ముక్కుకి దొండ పండు అంటూ ఎద్దేవా చేస్తారు. నచ్చని తిను బండారాన్ని ఒట్టి గడ్డి అంటారు. నాయకుల దృష్టిలో జనాలు గొర్రెలు.
చదువూ సంధ్యా లేని వారు అడ్డ గాడిదలు. గయ్యాళి పెళ్ళాలు చుప్పనాతి శూర్పణఖలు. చలి పులిలా మీద పడుతోందంటారు. ధారాపాత వర్షాన్ని కుంభపోత అంటారు. కదలని ఫైళ్ళవి నత్త నడకలంటారు. కొందరు ఆఫీసర్లని అగ్గి రాఁవుళ్ళంటారు అబద్ధాలాడే వారిని అబద్ధాల పుట్ట అంటారు. దీర్ఘ కోపిది పాము పగ అంటారు. పేరు గొప్పా ఊరు దిబ్బా అయితే నేతి బీర కాయ చందం అంటారు. ఎప్పుడూ తన లోకం తనదేలా ఉండే వాడిని నూతి లోని కప్ప అంటారు. నిరక్షర కుక్షిని పశువంటారు. వాచాలుని వస పిట్టతో పోలుస్తారు. మౌనంగా ఉండే వాడిని ముని అనో, ముంగి ముషాణమనో అంటారు.

ఇలా చెబుతూ పోతే, చాలా ఉంటుంది. చెప్పడానికి చేంతాడంత !

ఇంత వరకూ రాసిన టపాని ఎప్పటి లాగే నా వెనుక వంగుని చూస్తున్న మా తింగరి బుచ్చి‘ బాగుందిరా ! ’అని మెచ్చుకున్నాడు. మా యింట కాఫీ టిపిన్లు సేవించి కబుర్లు చెప్పే వాడి నోట మొదటి సారి మెచ్చుకోలు మాట విని నేను ఆనంద పరవశుడి నయ్యాను. ఇంత లోనే,‘‘ అవును ! మన వాళ్ళు భలే పోలికలు తెస్తార్లే. కవులను ఎద్దులతో పోలుస్తారు కదా ! ’’ అని తనవిఙ్ఞాన భాండారంలో నుండి ఒక అమూల్యమైన విషయాన్ని ప్రస్తావించేడు. నా తల తిరిగి పోయింది.

‘‘ ఏఁవిటీ, కవులను ఎద్దులంటారా! ’’ అన్నాను, కంగారుగా.

‘‘ మరే, కవి వృషభులనే మాట నువ్వు విన లేదా ! ’’ అని నా తెలివి తక్కువ తనం మీద జాలి చూపించాడు.

కథా మంజిరి (ఏకైక నస బ్లాగు) బ్లాగుని మూసెయ్యా లన్నంత విరక్తి కలిగింది నాకు !

మా తింగరి బుచ్చి గాడి గొడవ ఎప్పుడూ ఉండేదే కానీ, ఒక కవి గారు ఒక శ్లోకంలో ఎలాంటి రీజనింగు తీసారో చూడండి:

మనం లోకంలో మంచి వారి మనసు వెన్నతో సమానం అంటూ ఉంటాం కదూ. ఆ కవి కాదు పొమ్మంటున్నాడు.

కవి గారి రీజనింగు ఏమిటో మీరే చూడండి:


సజ్జనస్య హృదయం నవనీతం యద్వదంతి కవయ స్తదళీకమ్.

దీని అర్ధం : మంచి వారి మనస్సు వెన్న లాంటిదని కవులు చెబుతూ ఉంటారు. ఆ మాట అబద్ధం !
ఎందు కంటే, ఇతరుల మనో దుఃఖానికి మంచి వారి మనసు కరిగి పోతుంది. కానీ, కానీ, వెన్న కరుగదు కదా !

ఈ రీజనింగు చూసి ఈ కవి గారు మా తింగరి బుచ్చికి తమ్ముడనుకునేరు ! కాదు సుమా !

ఇది వినోక్త్యలంకార భేద మనుకుంటాను.