8, మార్చి 2012, గురువారం

అదయినా ఉండాలి ... ఇదయినా ఉండాలి !


విద్వాంసుడు సర్వత్రా పూజ్యనీయుడే కదా.

స్వగృహే పూజ్యతే మూర్ఖ : స్వగ్రామే పూజ్యతే ప్రభు:
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

మూర్ఖుడికి ఇంటి లోనే గౌరవం. అధికారికి అతని గ్రామంలోనే గౌరవ మర్యాదలు లభిస్తాయి. రాజు పూజించ బడేది అతని దేశం లోనే. కానీ, పండితుడు అంతటా పూజింప బడతాడు.

దీనికి ఉపబలకంగా ఉండే ఒకటి రెండు విషయాలు ఇక్కడ ముచ్చటించు కుందాం.

శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు హరి కథా పితామహులు. పువ్వు పుట్టగానేపరిమళించి నట్టుగా వారి ప్రతిభ అతి బాల్యం లోనే ద్యోతకమయిందిట.

ఒక సారి దాసు గారు తమ తల్లి దండ్రులతో కలసి అజ్జాడ అగ్రహారం నుండి పార్వతీపురం మీదుగా గుంప క్షేత్రంలో జరిగే తిరుణాలకి వెళుతున్నారుట. వంశధార, నాగావళి నదుల సంగమ ప్రదేశంలో జరిగే గుంప తిరుణాలు చాలా ప్రసిద్ధమైనవి. అక్కడ వెలసిన స్వామి సోమేశ్వరుడు. దాసు గారి వయసు అప్పటికి నాలుగైదు ఏండ్లు మించవట !
త్రోవలో ఒక పుస్తకాల అంగడి దాసు గారికి కనిపించిందిట. వెంటనే ఆ దుకాణంలో ఉండే పుస్తకాలను పరీక్షగా చూస్తూ ఉంటే బాల దాసు గారి కంట పోతన గారి శ్రీమదాంధ్ర మహా భాగవతం పడింది. వెంటనే అది తనకు కొని పెట్టమని దాసు గారు మాతాపితలను అడిగి, వారు స్పందించక పోవడంతో మారాం చేయ సాగేరుట. అది చూసి దుకాణదారు బాల దాసుతో ఇలా అన్నాడుట: ‘‘ అబ్బాయీ ! ఇంత మహా గ్రంధం నీకెందుకయ్యా ! ఇది పెద్దలు చదివే పుస్తకం’’

దాసు గారు తన పట్టు విడువ లేదు. నాకదే కావాలని ఏడుపుకి లంకించు కున్నారుట.

చాలా రకాలుగా చెప్పి చూసిన దుకాణదారు ‘‘ సరే, అసలు నీకీ పుస్తకంలో ఏముందో కూడా తెలిసి నట్టుగా లేదు. ఇందులో ఉన్న పద్యాలలో కనీసం ఏ ఒక్కటి చదివినా ఈ పుస్తకాన్ని నీకు ఉచితంగా ఇస్తాను ! ’’ అన్నాడుట.

వెంటనే బాల దాసు ఆ పుస్తకాన్ని చూడకుండానే భాగవత పద్యాలను రాగయుక్తంగా ఒప్పగించడం మొదలు పెట్టారుట ! ఒకటీ రెండూ కాదు ! ఏకంగా భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టమంతా గడగడా చదివేసారుట !
ఆ బాల మేధావి మేథా శక్తికి దుకాణదారు నివ్వెర పోయాడుట !

వెంటనే ఆ బాలుడిని అక్కున చేర్చుకొని, భాగవతం పుస్తకాన్ని వానికి ఉచితంగా ఇవ్వడమే కాక, కొంత రొక్కం కూడా వాని చేతిలో ఉంచి ఉచిత రీతిని సత్కరించాడుట !

ఇది చదువుతూ ఉంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే వాక్కులో ఎంత సత్యం ఉందో కదా అనిపిస్తుంది కదూ ?

మా నాన్నగారు నా చిన్నప్పుడు ఒక ముచ్చట చెబుతూ ఉండే వారు. అది :

మా ఊళ్ళో మెయిన్ రోడ్ లో ఒక అయ్యరు హొటల్ ఉండేదిట. ఆ హొటలు యజమానికి సంగీతం అంటే ఎన లేని ఇష్టంట. హొటల్ కి వచ్చిన వాళ్ళలో ఎవరయినా ఏదేనా ఒక కృతి ఆలపించడమో, లేదా, కనీసం ఒక చక్కని ఆలాపన చేయడమో చేస్తే. ఇక, ఆ పూట ఆ వ్యక్తికి తన హొటల్ లో ఉచితంగా కాఫీ, టిఫిన్లు, భోజనం దగ్గరుండి వడ్డించే వాడుట !
ఇది తెలిసిన వాళ్ళుకొందరునిత్యం వచ్చి తమగాత్రంతో అయ్యరుని మెప్పించడానికి ప్రయత్నాలు చేసే వారుట. ఈ క్రమంలో ఒకరిద్దరు ఏమాత్రం గాత్ర శుద్ధి లేని వారు కూడా వచ్చి ఏదో పాడి వినిపించడానికి నానా తంటాలూ పడే వారుట. చిత్రం ఏమంటే, అలాంటి వారికికి కూడా అయ్యరు లేదు పొమ్మనకుండా ఓ నాలుగు ఇడ్డెనులు తినమని పెట్టించే వాడుట ! ఇది చూసి పెద్ద లెవరో ‘‘ ఇలా అయితే నీ వ్యాపారం ఎలాగయ్యా అయ్యరూ ! ’’ అని కసిరే వారుట. దానికి ఆ అయ్యరు చెప్పిన జవాబు : ‘‘ అయ్యా ! వానికి పొట్టలో ఏమీ సంగీతంలేదు. కానీ రొంబ ఆకలి ఉండాది. పాపం, తిననీండి సారూ !’’ ఈ ముచ్చట విన్నప్పుడల్లా కదిలి పోయేవాడిని. ఒక గొప్ప కథకి ఇంతకన్నా మంచి ముగింపు ఏం ఉంటుంది చెప్పండి ?

మరో ముచ్చట. ఇది కూడా హొటల్ యజమాని గురించినదే. విజయ నగరంలో నేను చదువుకునే రోజులలో ప్రత్యక్షంగా చూసేను.

ఒకాయన ( పేరు చెప్పడం అంత బాగుండదేమో) విజయ నగరం వీధులలో తిరుగుతూ తరుచుగా కనబడుతూ ఉండే వారు. ఆయన ఆహార్యం విచిత్రంగా ఉండేది. పంచె, పొడవాటి మాసిన జుబ్బా, గుబురుగా పెరిగిన గడ్డం. ఎప్పుడూ అంతర్ముఖునిగా కనిపించే వారు. వారి కుడి భుజాన పొడవాటి ఖాకీ సంచీ ఒకటి వ్రేలాడుతూ ఉండేది. అది చాలా బరువుగా కూడా ఉన్నట్టు కనిపించేది. అందులో ఏయే వస్తువులు ఉన్నాయో అని నాకు కుతూహలంగా ఉండేది.
ధ్యాన మగ్నుడయిన ఒక గొప్ప యోగిలా ఆయన విజయ నగరం వీధులలో తిరుగుతూ ఉండే వారు. విడీ విడని పెదవులు సన్నని సంగీతమేదో ఆలపిస్తూ ఉండేది. కోవెల గట్టూ, కోనేటి గట్టూ వారి విశ్రమ ప్రదేశాలు.

అలా తిరుగుతూ,తిరుగుతూ మిట్ట మధ్యాహ్నం భోజనం వేళకి విజయ నగరంలో ఏ హొటలు కనిపిస్తే ఆ హొటలు ముందు ఆగేవారు. వెంటనే హొటలు యజమాని చప్పున లేచి వచ్చి, సగౌరవంగా అతనిని లోనికి తోడ్చుకొని పోయి దగ్గరుండి కొసరి కొసరి వడ్డిస్తూ ఆతిథ్యమిచ్చే వాడు. అంతే గౌరవంగా వీడ్కోలు పలికే వాడు. డబ్బులు తీసుకోవడమంటూ ఉండేది కాదు. అంతా ఉచితమే.

తర్వాతి రోజులలో వారి గురించి తెలిసింది. వారు ఒక గొప్ప సంగీత వేత్త. బాగా బతికిన రోజులలో గొప్ప కచేరీలు ఎన్నో చేసి ఖ్యాతి గడించిన వ్యక్తి. అందరూ ఉన్నా, ఒక వైరాగ్య భావంతో, సర్వ సంగ పరిత్యాగిలా అందరినీ కాదనుకొని ఇల్లు చేరకుండా తిరిగే వారుట. సరే, ఇంతకీ అతని ఖాకీ జోలెలో ఏముండే దంటే, ఎవరో ఇచ్చిన అరటి పళ్ళూ, ఇతర ఫలాలూ, తిండి పదార్ధాలూనూ ... వీటిని వీధులలో సేకరించి అతనేం చేసే వారంటే, ఎక్కడ గోవు కనిపించినా , వాటి నోటికి వాటిని అందిస్తూ ఉండే వారు ! ఈ విధంగా గోసంరక్షణ చేస్తూ ఉండే వారన్నమాట.

ఇట్టి విశిష్ఠ వ్యక్తిని తగు రీతిని గౌరవించే ఆ హొటలు యజమానుల సంస్కారం ఎంత గొప్పదో కదా. ( ఈ నేపథ్యంలోనే నేనొక కథ రాసేను. దాని పేరు చెమ్మ మిగిలిన నేల. ఈ కథకు స్వాతి పత్రిక లో బహుమతి లభించింది. )

మా పితా మహులు తరుచుగా ఒక ముచ్చట చెబుతూ ఉండే వారు. మా బంధువులలో ఒకాయన ( పేరెందుకు లెండి. వారిని పేకాట ... గారని పిలిచే వారుట. ) పేక ముక్కలతో భలే తమాషాలు చేసే వారుట. వారొక సారి ఏదో దేశంవెళ్ళారు. డబ్బు చాలక పోవడమో, లేదా, డబ్బు పోవడమో జరిగిందిట. వెంటనే ఆ దేశంలో ఒక చోట నలుగురూ తిరిగే చోట రకరకాల పేక మేజిక్కు ప్రదర్శించి అందరినీ ఆకట్టు కున్నారుట. దాంతో కొంత మొత్తం డబ్బు అతనికి సమ కూడిందిట.

ఈ పేకాట ... గారే మరో సారి ఏదో దేశంలో పట్టు పంచె, లాల్చీ ధరించి, నొసట విబూది రాసుకుని , మెడలో రుద్రాక్ష తావళాలు ధరించి, చేతిలో ఏవో పుస్తకాల కవిలె కట్టలతో జనాలను ఆకర్షంచి, జాతకాలు చెప్పి, అందరినీ ఇట్టే ఆకర్షించేరుట. ఇది కూడా వారు ఆ దేశంలో డబ్బుకి అవస్థ పడుతున్నప్పుడే చేసారని మా తాత గారు చెబుతూ ఉండే వారు. ఏతావాతా తేలిందేమిటంటే, విద్వాన్ సర్వత్ర పూజ్యతే ! అన్న మాట నూటికి నూరు పాళ్ళూ నిజం !

ఇదిలా ఉంటే,

విద్వత్తు ఉన్నా, లేక పోయినా రవంత లౌక్యం, తెలివి తేటలు వ్యవహార దక్షత ఉంటే ఎక్క డయినా నెగ్గుకు రావచ్చును.

విజయ నగరం దివాణంలో ఒకాయన పని చేసే వాడుట. వాడు పరమ లంచగొండి అని తెలిసి ప్రభువుల వారికి కోపం వచ్చింది. అయితే, తాతల కాలం నుండీ పని చేస్తున్న ఆ వంశీకులలో మనిషిని తొలగించ లేక, వాడికి కోట గుమ్మం దగ్గర కాపాలా పని అప్పగించారుట ప్రభువులు.

సరే, అంటూ వాడు అక్కడ నౌకరీకి కుదురుకొని, అక్కడా తన చేతి వాటం చూపించడం మొదలు పెట్టాడుట.
ఎలాగంటారా ? కోట లోనికీ ఏవో పనుల మీద వెళ్ళే వారి మహజరుల మీద చివరలో ఒక చిన్న సంతకం గిలికి, సంతకానికి ఒక కాణీ ( ఆ నాటి నాణెం) వసూలు చేసే వాడుట. తన సంతకం లేనిదే ఏ కాగితానికీ విలువ లేదని అవి ప్రభువుల ఉత్తర్వులని బొంకే వాడుట.కామోసు అనుకొని అంతా తలో కాణీ ఇచ్చి, అతని చేత ఎగబడి మరీ సంతకాలు పెట్టించుకునే వారుట.

ఇలా ఉండగా, ఒక సారి సాక్షాత్తు ప్రభువు వారు సంతకం చేసి, దివాను గారి చేత బ్యాంకుకి డబ్బు కోసం పంపిన ఒక చెక్కు చెల్లదంటూ బ్యాంక్ అధికారులు వెనుకకు తిరిగి పంపించి వేసారుట .

కారణం - దాని మీద ఓ చివర ఉండ వలసిన చిన్న సంతకమేదో లేక పోవడం చేతనట ! దివాణం అంతా బిత్తర పోయి మొత్తం విషయం గురించి వాకబు చేసారుట. చివరికి చెక్కుల మీద ఆ పొట్టి సంతకానికి బ్యాంకు అధికారులు అంతగా అలవాటు పడి పోయేరన్నమాట !

తెలివయిన వాడిని అడవిలో పడేస్తే చింత పండునీ, సముద్రపొడ్డున పడేస్తే ఉప్పునీ సేకరించి, ఊరగాయ పెట్టి,
ఊళ్ళో అమ్మేస్తాడు ! అని మా నాన్న గారు అంటూ ఉండే వారు.

అంచేత అదయినా ఉండాలి. లేదా ఇదయినా ఉండాలి. అంటే విద్వత్తయినా ఉండాలి, లౌక్యమయినా ఉండాలి. లేక పోతే నెగ్గుకు రాలేం బాబూ !

మరింక శలవ్.





2 కామెంట్‌లు:

Lakshman .M. V. చెప్పారు...

చాలా బాగుంది, సూక్ష్మంలో చెప్పేశారు, జీవిత సూత్రం. తలలో గుజ్జు ఐన ఉండాలి, లేదా తలలు మార్చే లౌక్యమైన ఉండాలి. ఐతే ఈ లోక్యం ఉంది చూసారూ కొంచం అటూ ఇటూ గా ఉంటుంది. 'నమ్మిన చోట చేసేది మోసం, నమ్మని చోట చేసేది లౌక్యం' అని రామప్ప పంతులు చేత చెప్పించారు అప్పారావు గారు. పంచ తంత్రం లో మూడు చేపల కథ మనం విన్నాం, అందునా ఇదే సూత్రం. విజయులైన వారి లో ఈ రెండిటిలో ఒక లక్షణం చూస్తాము, రెండూ ఉంటే ఇహ చెప్పేదేముంది! ఈ రెండూ కాక, మూడవది అదృష్టం, కాని ఇది ఏక్కడో ఒకర్ని మాత్రమే వరిస్తుంది, ఏప్పుడు దర్శనం ఇస్తుందో తెలియదు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

చాలా మంచి సంగతులు చెప్పారు.చిన్న ఊళ్లోని ఆ హోటల్ యజమానులకున్న సంస్కారం చాలా గొప్పది.ఇటువంటి విషయాలకి రావలసిన ప్రచారం వస్తే మరికొంత మందైనా విద్వత్తుని ఆదరించేవారుగా మారుతారని నా ఆశ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి