10, జులై 2012, మంగళవారం

అయ్యో, చచ్చి పోయింది...


కష్టే ఫలే ... శర్మ కాలక్షేపం కబుర్లు  బ్లాగులో అమ్మయ్య బతికేడు టపా చదివాక ఇది రాస్తున్నాను.
గుండెలు పిండేసే ఆ టపా ఇక్కడ చూడ వచ్చును.  వారి టపాకి కామెంటుగా ఈ మాటలు రాయడం కన్నా, నేరుగా ఒక టపాగా ఉంచితే మరింత మందికి అందుబాటులో ఉంటుందని తలచి, ఇది రాస్తున్నాను.



ఆ టపా నన్ను అమితంగా కదిలించి వేసింది.. ఎలాగయితే నేం ఒక నిండు ప్రాణాన్ని కాపాడ గలిగేరు. ఆ భాగ్యం వారికి  కలిగింది. నా బాల్యంలో, అంటే, నాకు పదేళ్ళు ఉండే రోజులలో  నేనూ, నా మిత్రులూ కూడా కళ్ళారా చూస్తూనే ఒక మరణాన్ని నివారించ లేక పోయాం. ఆ సంఘటన తలచుకొని ఇప్పటికీ మేమంతా విచారిస్తూ ఉంటాం.

వివరాలలోకి వెళ్తే ...

మా బాల్యంలో నేనూ, నామిత్రులూ కలిసి రైల్వే కట్ట ప్రక్కగా నడుస్తూ, ఊరికి  దూరంగా ఓ చోట ఏడు కానాలు అని పిలువబడే ఒక చిన్న కానా గట్టున కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గడిపే వాళ్ళం కానా అంటే  రైల్వే పట్టాలకి అడ్డంగా కట్టిన చిన్న బ్రిడ్జి. ఓ రోజు అలా చాలా సేపు గడిపేక  చీకట్లు అలుము కుంటున్న వేళ ఇంటికి పోదాం అని అందరం లేచాం. సరిగ్గా అదే సమయంలో గూడ్సు ట్రయిన్ ఏదో  , ఒక వేపునుండి రావడం  గమనించాం. అదే సమయంలో రైలు పట్టాల మీద నెత్తి మీద మూటతో పట్టాల నడుమ నుండి నడుచుకు పోతున్న ఒకావిడ మా కంట పడింది.  వెనుక నుండి వస్తున్న రైలు శబ్దం విన బడ లేదో, పరాకుగా ఉందో తెలియదు. అలా పట్టాల నడుమ నుండి నిర్లక్ష్యంగా నడుస్తూ ఉండడం మా ప్రాంతంలో ఆ రోజుల్లో ఒక దురలవాటుగా అందరికీ ఉండేది. కారణం, మా వెనుక బడిన ప్రాంతంలో రోజులో  మూడో నాలుగో రానీ తరుచుగా  పాసింజరు ట్రయిన్లు కానీ, గూడ్సు బళ్ళు కానీ వచ్చేవి కావు.

సరే, అదే ధీమాతో పరాకుగా  పట్టాల నడుమ నడుచు కుంటూ పోతున్న ఆమెను హెచ్చరించడానికి  గాభరాగా అందరం ఒకేసారి ప్రయత్నించాం. ఆ భయాందోళనల వల్ల అనుకుంటాము, మాలో ఒక్కరికి గొంతు పెగల లేదు. ఎంత ప్రయత్నించినా, మా నోట శబ్ధం రాలేదు.ఒకే సారి అందరకీ గొంతులు పూడ్చుకు పోయాయి. ఇంతలో జరుగ వలసిన ఘోరం జరిగి పోయింది. మా కళ్ళెదుటే ఆమెను గూడ్సు బండి చాలా దూరం ఈడ్చుకొని పోయింది. కొంత దూరంలో బండి ఆగింది. మా దుఃఖం అంతా ఇంతా కాదు. పరుగు పరుగున  అక్కడకి చేరు కున్నాం. రైలు పట్టాల మధ్య తునాతునకలై పడి ఉన్న ఆ శరీరాన్ని చూసి వణికి పోయాం.
చాలా రోజులు, కాదు, చాలా ఏళ్ళ పాటు ఆ బీభత్స దృశ్యం మమ్మల్ని వెంటాడుతూనే ఉండేది.

ఇప్పుడు చెప్పండి,  వారు తమ  ఉద్యోగిని కాపాడు కోవడంలోనూ, మేము ఆమెను కాపాడ లేక పోవడంలోనూ మన ప్రమేయం ఏమైనా ఉందంటారా ? అదే దైవేచ్ఛ అంటే అనుకుంటాను. కదూ

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

శివాజ్ఞ లేనిదే చీమయినా కుట్టదని మన నానుడి. మనం నిమిత్త మాత్రులం. అంతా అమ్మ దయ. నా టపా మీ చేత టపా రాయించేటంతగా కదిలించిందంటే ధన్యుడను.

మీ కోసం చెప్పారు...

మీరు చెప్పింది నిజం గురువు గారు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

అది ఒక దుర్ఘటన.మీది బాల్యం అయినా నివారించాడానికి మీరు ప్రయత్నించినా ఒక్కరికీ నోరు పెగలకపోతే ఏంచేస్తారు..ఏదయినా మన చేతిలో లేదు. శర్మగారు చెప్పిన వృత్తాంతంలో కూడా లైన్ మాన్ ఒక్కనిమిషం ముందుగా అక్కడికి చేరుకున్నా శర్మ గారు అక్కడికి ఒక నిమిషం ఆలస్యమైనా ఏం జరిగేది?. అందుకే మన ప్రయత్నాలెన్ని చేసినా దైవం అనుకూలించక పోతే పనులు జరగవు.ఏదీ మన గొప్ప అని విర్రవీగడానికి లేదు.

అజ్ఞాత చెప్పారు...

painful memory.

Meraj Fathima చెప్పారు...

సర్, చదివిన నాకు మనస్సు బాదగా అనిపించింది.
మీలో మానవత్వం మెండుగా ఉంది కనకనే ఆ సంఘటన ఇంకా వెంటాడుతుంది.
అయినా చావు బతుకులు మన చేతిలో లేవు కదా.

కామెంట్‌ను పోస్ట్ చేయండి