హన్నా అయ్యారే అను నొక మహనీయుడు దేశమును రిపేరు చేయ దలచి, చాలా తీవ్రముగా ప్రయత్నించి సాధ్యము కాక ఉస్సురని ఉండి పోయెను. ఇక మానవ ప్రయత్నము వలన ఇది సాధ్యము కాదని తలచి, హిమాలయములకు పోయి ఘోరమైన తపస్సు చేసెను, అన్ సీజను కాబోలునేమో, దేవుడు త్వరగానే ప్రత్యక్ష మయ్యెను.
అయ్యారే కనుల ఆనంద బాష్పములు రాలుచుండ ‘‘ హే భగవన్ !నా జన్మ ధన్యమైనది. నాకొక్క వరము ప్రసాదింపుము ’’ అని వేడుకొనెను,
‘‘ భక్తా ! ఏమి నీ కోరిక ’’ అని భగవంతుడడిగెను.
‘‘ మా దేశమున అవినీతిపరుల యొక్కయు, అసత్యములాడు వారి యొక్కయు తలల తక్షణమే వేయి వ్రక్క లగునట్లు వరము నిమ్ము ’’ అని అయ్యారే అడిగెను.
అది విని భగవానుడు మిక్కిలి ఖిన్నుడయ్యెను.
‘‘ నాయనా ! నీవడిగిన వరములో రెండు క్లాజులున్నవి. అవినీతి పరులను దండింప వలెనన్న చేతులు రాకున్నవి.అన్ని కోట్ల మందిని నేనే సృజించితిని. నాచేతులతో నాశనము చేయుట ఎట్లో తెలియకున్నది.అట్లయిన ఈ జంబూ ద్వీపమున ఒకరో ఇద్దరో మాత్రమే మిగులుదురు కాబోలు. ఇక నీ వరము లోని రెండవ క్లాజు అసత్యపరులని దండించు మనుట. పొద్దున లేచినది మొదలు మీ ఖండము నంలి దురద దర్శనములందును, చిత్రికలందును ప్రతి వాడును తానే సత్యవాదినని, తాను చెప్పినదే నిజమని చెప్పు చున్పాడు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక చాలా కన్ఫ్యూజన్ లో ఉంటిని. అందు చేత ఇవి కాక వేరొక వరము వేడి కొనుము. ప్రసాదించెదను.’’ అనెను.
ఇట్టిది కదా నా భాగ్యము అని నిట్టూర్చి, ఏమి చేయుదనని చింతించి తుదకు అయ్యారే వేరొక వరమును వేడెను.
‘‘ హే భగవన్ ! ఈ వరము తప్పక ప్రసాదింపుము. ఏమనిన, స్విస్ బ్యాంకులలో ఉన్న మా వారి నల్ల ధనమంతయు తృటి కాలములో మా దేశ ఖజానాలో పడునట్లు చేయుము. దానితో మా దేశ ప్రజల దరిద్రము తీరి పోయి నీతి నియమములతో, ప్రశాంతముగా బ్రతికెదరు ’’ అని కనులు మూసుకుని వేడుకొనెను.
భగవంతుడు ‘‘ తథాస్తు ! ’’ అని పలికి వరము నిచ్చి అంతర్ధానమొందెను.
అయ్యారే కనులు తెరచి చూచెను. దేవుడు కనిపించ లేదు. అంతియ కాదు. దేశ ఖజానా కూడా ఖాళీగా ఉన్నది.
దేవుడు తనని మోసగించెనని అయ్యారే భావించి, ఆగ్రహంచెను. తిరిగి ఘోరమయిన తపము చేయ బోయెను.
,
మరుక్షణమే దేవుడు ప్రత్యక్షమయ్యెను.
‘‘ నాయనా ! తిరిగి ఏవరము కోరి తపము చేయు చున్నావు అను క్షణము నన్నిట్లు డిస్టర్బు చేయుట నీకు తగునా ? ! ? ’’ అని అడిగెను.
అయ్యారే కోపము దిగమ్రింగుకొని, ‘‘ దేవా ! నన్ను వంచించితివి. నల్లధనమంతయు దేశ ఖజానాలోకి వచ్చు నట్లు చేసెద నంటివి, కనులు తెరచి చూచు నంతలో మాయమైతివి. ఖజానా ఖాళీగా ఉన్నది, ’’ అనెను,
అందుకు దేవుడు నవ్వి ఇట్లనెను. ‘‘ నాయనా ! నీవెంత అమాయకుడవు ? నేను వరమ నిచ్చుట జరిగినది. మీ దేశ ఖజానా ఇబ్బడి ముబ్బిడిగా నిండుట కూడా జరిగినది.’’
మరి ... అడిగేడు అయ్యారే, సందేహంగా ..
‘‘ నీవు కనులు మూసి తెరచు నంత లోన మీ నాయకుల్దానిని క్షణకాలములో హోంఫట్ ! చేసినారు. నేనేమి చేయుదును ? నల్లధనమును రప్పించమనియే వరమడిగితివి. మీవాండ్లు దానిని వెంటనే చప్పరించి వేసినచో నేనేమి చేయుదును ? ఈ పాటికి అదంతయు వారలకు అరగి పోయే యుండును ... అదిగో ! ఆవురావురుమను గావు కేకలు నీ చెవిని బడుట లేదా ?’’ అని దేవుడు తన నిస్సహాయతను వెల్లడించెను.
ఫలశృతి : దేవుని నిస్సహాయత అను నామాంతరము గల హే, భగవన్ ! అను ఈ కథను చదివిన వారికి ఉన్న రోగములు అధికమగునేమో కానీ కొత్త రోగములు రావు. కుటుంబ నియంత్రణ వలన ఒక్క పుత్రుడు ఉదయించిన ఉదయించ వచ్చును. ఈతి బాధలు తగ్గక పోయిననూ వాటికి అలవాటు పడి పోయెదరు.మీ వంశమున వంద తరముల వారికి సరి పోవునట్లుగా ధన కనక వస్తు వాహన సౌభాగ్యములు అక్రమ మార్గమున యత్నించిన దక్క వచ్చును. కానీ ముందుగా చర్లపల్లి జైలులోను , మరియు తీహార్ జైలులోనూ వేకెన్సీ పొజిషను వాకబు చేయ వలెను.
స్వస్తి.
1 కామెంట్:
కలికాలం. విదేశాలనుంచి వచ్చిన సొమ్ము మాయమైన విధానం బాగా ఉంది. వరం సొమ్ము రావాలని కాని అది సద్వినియోగమవాలని అడగలేదుగా! అందుకే కళ్ళు మూసి తెరిచేలోగా గాయబ్ :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి