3, ఆగస్టు 2013, శనివారం

కళ్ళున్న కబోదులూ ... చెవులున్న బధిరులూ ...



పదవీ లాలస, పెదవీ లాలస పట్టు కుంటే వొక పట్టాన వొదిలేవి కావు.లోకంలో ప్రతి మనిషికీ ఆహార నిద్రా భయ మైధునాలతో పాటూ అమిత జీవితేచ్ఛగా ఉండేది ఏదో ఒక ఉన్నతమైన పదవి పొందాలని ఉంటుంది. ఎదుటి వాడి కంటె వొక మెట్టు అధికంగా ఉండాలని ఉంటుంది. ఏదో వొక పదవి కాలవాలని తాపత్రయ పడతాడు. అందులో ఆక్షేపించడానికి ఏమీ లేదు కానీ, ఆ కోరిక దురాశగా మారి పోతేనే ప్రమాదం. అదే అన్ని అనర్ధాలకూ హేతువవుతుంది.
ఈ దురాశ ఎలాంటిదంటే ..
ఇచ్ఛతి శతీ సహస్రం, సహస్రీ లక్షమీమతే
లక్షాథిపస్తథా రాజ్యం. రాజ్యస్థ: స్వర్గ మీహతే

అంటే ... వంద ఉన్న వాడు వెయ్యి కావాలను కుంటాడు. వెయ్యి ఉన్న వాడు లక్ష కోరు కుంటాడు. లక్షాథికారి
 ( ఇప్పుడు ఎన్ని లక్షలూ చాలవను కోండి, అది వేరే మాట) ప్రభుత్వం, పదవి కావాలను కుంటాడు. రాజు స్వర్గాన్నీ, స్వర్గ సుఖాలనూ ఆశిస్తాడు ...

కానీ, కవి ... కారే రాజులు రాజ్యముల్ కలుగవే ... అంటూ గర్వించిన వారంతా సిరి మూట కట్టుకుని పోగలిగేరా ? అని నిలదీసాడు.... కానీ ఆశాపాశము కడున్ నిడుపు .. లేదంతంబు రాజేంద్ర !

ఎప్పటికయినా సుకవి ప్రజల నాలుకల మీద నిలిస్తే, రాజు శిలా ప్రతిమలా ఉండాల్సందే కదా ...


ధూర్జటి  పదవీ కాంక్ష ఎలాంటిదో చెప్పాడు కదా ... .

ఒకరిం జంపి పదస్థులై బ్రదుక  తా మొక్కొక్కరూహింతు రే
లకొ ? తామెన్నడు జావరో ? తమకుఁబోవో సంపదల్ ? పుత్ర మి
త్ర ళత్రాదుల తోడ నిత్య సుఖముంగందురో ? ఉన్న వా
రికి లేదో మృతి ? యెన్నఁడుం కటకటా శ్రీకాళ హస్తీశ్వరా !

భావం: ఎవడినో ఒకడిని తుదముట్టించి, తాము వాడి పదవిని దక్కించు కోవాలని కొందరు చూస్తూ ఉంటారు. ఏమీ, తాము మాత్రం ఎప్పుడూ చావరా ? తమకు సంపదలు పోవా ? భార్యా పిల్లలూ, స్నేహితులతో ఎల్లకాలం సుఖంగా ఉంటారా ? బతికి ఉన్న వారికి  చావు రాదా ?

కానీ వారికి అదేమీ పట్టదు, ఒక్క రోజు రాజు చెయ్యి గణనాథా ! అంటూ తహతహలాడి పోతూ ఉంటారు.

రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు ... అనికూడా కవి చెప్పాడు. అంతే కాదు. ఒక సారి . పదవి అంటూ లభించేక వాడెలా మారి పోతోడా కూడా విపులంగానే వివరించాడు:

చూడండి:
రాజన్నంతనె బోవునా కృపయు, ధర్మం బాభిజాత్యంబు,వి
ద్యాజాత క్షమ, సత్యభాషణము, విద్వన్మిత్ర సంరక్షయున్
సౌజన్యంబు, కృతం బెఱుంగుటయు,విశ్వాసంబుగాకున్న దు
ర్భీత శ్రేష్ఠులు గాఁ కతంబు కలదే శ్రీకాళ హస్తీశ్వరా !

రాజు అయ్యాడంటే చాలు, దయావిహీనుడైపోతాడు. ధర్మం మరచి పోతాడు. ఆభిజాత్యం పెరిగి పోతుంది, పండితులంటే లెక్క చేయడు. సత్యం పలుకడు, మంచి వారిని కాపాడడు, మంచి తనం అసలే ఉండదు, చేసిన మేలు మరచి పోతాడు, విశ్వాసహీనుడవుతాడు. ఏం కారణమో కదా ...

నిజమే ఓ సారి పదవి లభించేక చాలా మందిలో లేని కొమ్ములు మొలుస్తాయి. తామేదో దైవాంశ సంభూతుల మనుకుంటారు. కన్నూ మిన్నూ కానరు. యుక్తా యుక్త విచక్షణా ఙ్ఞానం నశించి పోతుంది. లభించిన పదవిని నిలుపు  కోడానికి ఎంత కయినా తెగిస్తారు. లోకంలో చూడ్డం లేదూ ?
రాజ్యపాలన అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
.
కాళిదాస మహా కవి అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకంలో రాజ్యం గురించి చెబుతూ ...

నాతి శ్రమాపనయనాయ, నచ శ్రమాయ
రాజ్యం స్వ హస్త ధృత దండ మివాతపత్రమ్.  ... అంటాడు.

రాజ్య సుఖం ఎలాంటి దంటే, తన చేత్తో స్వయంగా పట్టుకున్న గొడుగులాంటిది. అంతగా శ్రమను పోగోట్టదు, అలాగని శ్రమని కలిగించదు.

అయితే, రాజుకి నిజమైన ప్రజాభి మానం అంటూ ఉంటే, అది చేతి గొడుగు లాంటిదని మరో కవి చెబుతున్నాడు చూడండి:

ప్రజాగుప్త శరీరస్య కిం కరిష్యతి సంహతా:
హస్త న్యస్తాతపత్రస్య వారిధారాఇవారయా.

ప్రజాభిమానం చేతి గొడుగులాంటిది. వర్షం ఏం చేయ గలదు ?

అందు చేత రాజైన వాడు ప్రజాభిమానం సత్య మార్గంలో పొందాలి. అలాంటి నాయకులను ప్రజలు ఎన్నటికీ మరచి పోరు. అలాంటి ప్రభువులే   ప్రాత: స్మరణీయులు.

పాలకుడైన రాజు పూలు కోసి, దండలు కట్టే తోటమాలిలా ఉండాలి. కానీ, చెట్లు నరికి బొగ్గులు చేసే వాడిలా ఉండ కూడదని శ్లోక కారుడు చెబుతున్నాడు. చూడండి:

పుష్పమాత్రంవిచినియాత్
మూలచ్ఛేదం నకారయేత్
మాలాకారయివారామే
న యథాంగార కారక:.

మహా భారతంలో రాజనీతి ధర్మాలు విదురుడూ, ధౌమ్యుడూ , నారదుడూ,  భీష్ముడూ వంటి  పెద్దలు చాలానే చెప్పారు
.
ధౌమ్యుడు  పాండవులకు చెప్పిన సేవా ధర్మాలు ఇక్కడ నొక్కి చదవొచ్చును.

 నారదుడు చెప్పిన రాజధర్మాలు ఇక్కడ నొక్కి చదవొచ్చును.

భీష్ముడు  ధర్మ రాజుకి చెప్పిన  మంచి మాటలు కొన్ని ఇక్కడ నొక్కి చదవొచ్చును.

రాజు నడచిన బాటలోనే ప్రజలూ నడుస్తారని యథా రాజా తథా ప్రజా: అనే నీతి వాక్యం కూడా  బోధిస్తోంది.


పదవి కాస్త ఊడిపోయేక ప్రభువు పని ఏమవుతుందో తెలుసా ?

పద్యం చూడండి:

విధి సంకల్పముచే నొకానొకఁడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ, చూపు తక్కువ, సదాభాషల్ దురుక్తుల్ మనో
వ్యథతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధికారాంతము నందు చూడ వలెగదా నయగారి భాగ్యముల్ !

అదృష్ట వశావ్న అధికారం లభించి, రాజ్య పాలన చేయడం మొదలెడితే, చెవిటి వాడవుతాడు. అంటే మంచి మాటలు చెవికెక్కవు, కన్నూమిన్నూ కానడు. మదం పెరిగి పోతుంది. అన్ని వ్యసనాలూ అలవడతాయి. మాట్లాడితే అన్నీ చెడ్డ మాటలే. పదవి ఊడేక వాడి సౌభాగ్యం చూడాలి మరి ...


మరి, ఇప్పుడున్న వారిలో పలువురు ప్రజా సేవకులా ? ప్రజా కంటకులా ?

కాలమే నిర్ణయిస్తుంది కదూ ...

నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలి దాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే ...

స్వస్తి.











1 కామెంట్‌:

www.apuroopam.blogspot.com చెప్పారు...

చాలా శ్రమ తీసుకుని మంచి మాటలు చాలా చెప్పారు.కాని అధికారం ఇచ్చే మత్తు మరేదీ ఇవ్వదు.అందుకే అందరికీ ఈ తహతహ.అధికారాంతమునందు చూడవలదే ఆ అయ్య సౌభాగ్యముల్ అన్నాడు కవి.వినిపించుకునే నాయకుడేడీ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి