కన్యా శుల్కం రెండో అంకం లో మొదటి
సారిగా బుచ్చమ్మని చూస్తాడు గిరీశం. బచ్చమ్మ ప్రవేశిస్తూనే తమ్ముడు
వెంకటేశంతో, ‘‘ తమ్ముడూ,
అమ్మ కాళ్ళు
కడుక్కోమంచూందిరా’’ అంటుంది.
అదే మొదటి సారి గిరీశం బుచ్చమ్మని చూడడం.
ఆమెని చూస్తూనే గిరీశానికి మతి పోతుంది. తనలో ‘హౌ
బ్యూటి ఫుల్ ! క్వైటనస్సెక్టెడ్ !’ అనుకుంటాడు. బస్తీలో మధుర వాణిని విడిచి
వచ్చేక ఇక్కడ కృష్ణా రాయ పురం అగ్రహారంలో ఇంత అందం ఉంటుందని అతను
అనుకో లేదు. అందుకే, ‘‘ పల్లెటూర్లో వూసు
పోదనుకున్నాను కానీ, పెద్ద
కాంపేసుకి అవకాశం యిక్కడ కూడా దొరకడం నా అదృష్టం ’’ అనుకుంటాడు.
బుచ్చమ్మ గిరీశాన్ని ‘‘ అయ్యా, మీరు చల్ది వణ్ణం తించారా?’’ అనడుగుతుంది.గిరీశం తడుము
కోకుండా ‘‘ నాట్ది
స్లైటస్టబ్జక్షన్ ’’ అని
తలూపుతాడు. అంతే కాదు, ‘‘ అనగా,
యంత మాత్రం అభ్యంతరం
లేదు.’’ అని
అనువాదం కూడా వెలగ బెడతాడు. అంతటితో ఆగ కుండా ‘‘ వడ్డించండిదిగో వస్తున్నాను.’’ అని చెప్పి,
‘‘ తోవలో యేటి దగ్గర సంధ్యావందనం అదీ
చేసుకున్నాను’’ అని
కూడా బుకాయిస్తాడు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆ రోజుల్లో పిల్లలూ, పెద్దలూ అనే తేడా లేకుండా ఇళ్ళలో
అంతా ఉదయాన్నే చల్ది అన్నాలు తినేవారు. టిఫిన్లూ గిఫిన్లూ
తెలియవు.
చల్ది , చల్లంది , చల్దన్నం ఈ పేర్లతో పిలిచే ఆ
తరవాణీ అన్నం మహా రుచిగా ఉంటుంది. గ్రామీణులు సల్లంది అని అంటారు.
చలి + అది = చల్ది. చల్లనిది అని అర్ధం. చల్లని అన్నం
అన్నమాట. ఇక్కడ చకారం తాలవ్య చకారం. దంత్య చకారం కాదు. ఈ చల్దన్నం కోసం ప్రతి
ఇంట తరవాణి కుండలు
ఉండేవి. తరవాణి అంటే పుల్లని నీళ్ళు అని నైఘంటికార్ధం. ఏతావాతా తేలిందేమిటంటే,
చల్లంది అంటే,
పులిసిన అన్నం అని
అర్ధం !
మా ఇళ్ళలో పిల్లలందరకీ ఉదయాన్నే చల్దన్నాలు
పెట్టే వారు. తెల్ల వారకుండానే లేచి స్నానాలు చేసి, మడి కోసం ప్రత్యేకంగా కుట్టించిన పట్టు
లాగులు (చెడ్డీలు)
తొడుక్కుని మరీ పిల్లలం ఒక పంక్తిని కూచుంటే కానీ మాకు చల్దన్నాలు వడ్డంచే వారు కాదు.
మా ఊర్లో ఉదయాన్నే వీధుల్లోకి తామరాకులు
అమ్మకానికి వచ్చేవి. నూకలో, బియ్యమో యిచ్చి
మా నాయనమ్మ ఆ తామరాకుల కట్టలని కొనేది. వాటిలో వడ్డించిన చల్దన్నం ఎంత
రుచిగా ఉండేదో మాటల్లో వర్ణించడం కష్టం. ఆ తర్వాత రోజుల్లో అరిటాకులూ,
తర్వాత తెల్లని
పింగాణీ కంచాలూ వచ్చేయి. స్టీలు కంచాలు వచ్చే వేళకి ఇంట్లో చల్దన్నాల స్థానాన్ని టిఫిన్లు
ఆక్రమించాయి.
ఉదయాన్నే ఆ తరవాణితో కూడిన చల్దన్నం తింటే ఎండ
పొద్దెక్కాక ఎంత వేళకీ కానీ అసలు ఆకలనేదే తెలిసేది కాదు. ఆ రుచికరమయిన
చల్దన్నం తినడానికి కమ్మగా ఉండడమే కాక, కడుపులో హాయిగా తేలిగ్గా ఉన్నట్టుండేది.
అన్న సారం వొంట బట్టేక, కొంచెం
మత్తుగా కూడా ఉండేది. నిద్ర ముంచు కొచ్చేది.
మా ఇంట్లో కాఫీల యుగం ప్రారంభ మయేక,
అప్పుడప్పుడు ఆ కాఫీ
రుచి మరిగి, మా
పిల్లలం మాకూ కాఫీలు కావాలని గోల చేసే వాళ్ళం.
మా నరసింహం బాబాయి మాకు నడ్డి మీద
ఒక్కటిచ్చుకుని, ‘‘ అన్నాలు
తినే వాళ్ళకి కాఫీలు
లేవర్రా !’’ అని
ఓ తిరుగు లేని అలిఖిత శాసనం వినిపించే వాడు. నేను ఓ సారి అతనా మాట అనగానే ఉడుక్కుని,
‘‘ అక్కడికి, కాఫీలు త్రాగే వారంతా అన్నాలు
మానేస్తున్నట్టు !’’ అని
గొణిగాను. నా సణుగుడు వినిపించి మా నరసింహం బాబాయి నా నడ్డి
ఫెడీల్మనిపించడం జరిగింది లెండి.
సరే, ఇంత రుచికరమయిన చల్ది అన్నం గురించి,
అంతే రుచికరమయిన ఒక
శ్లోకం మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. చూడండి:
వసంత నవ మల్లికా కుసుమపుంజవ న్మంజులం,
ససర్షపరసాలకం లికుచనీర వృగ్నార్ధకం,
వరాంగ్యుపరికేళిజ శ్రమ నివారణే కారణం,
జలోదన ముపాస్మహే జలజ బాంధవ ప్యోదయే.
వసంత కాలంలోని క్రొత్త మల్లి పువ్వు లాగ
మంజులంగా ఉంటుంది. ఆవ తోడి మామిడి కాయ నంజుడుతో, అంటే, ఆవకాయ నంచుకుంటూ, లేదా, నిమ్మ రసంలో ఊరబెట్టిన అల్లపు ముక్కలతో,
అంటే అల్లం పచ్చడితో
నంచుకుంటూ చల్ది అన్నాన్ని ఉదయాన్నే తింటున్నాను. (మనోజ కేళి వలన కలిగిన) నా శ్రమ అంతా
నివారించ బుడుతోంది కదా ! అని
దీని భావం.ఆవకాయ, లేదా,
అల్లం పచ్చడి మొదలయినవి
నంచుకుంటూ తెలతెల వారుతూ ఉండే తరవాణి లోంచి తీసి పెట్టిన చల్దన్నం తినడం కన్న స్వర్గం
మరొకటి లేదని తెలుసుకోవాలి.
చల్దన్నం గురించి చెప్పుకుంటూ
శ్రీకృష్ణుడు బాల్యంలో గోపాలురతో కూడి చల్దులారగించిన మధుర ఘట్టాన్ని తలుచు కోకుండా ఉండ లేం కదా !
చూడండి, భాగవతంలో బమ్మెర పోతన శ్రీకృష్ణుని
బాల్య చేష్టలు వర్ణిస్తూ, పశువులను మేపుకుంటూ,
నెచ్చెలి కాండ్రతో
చల్దులు ఆరగించే సన్నివేశాన్ని మనోహరంగా రచించాడు.
గోపాలురు బాల కృష్ణునితో పాటు
ఊరి చివర పచ్చిక బయళ్ళలో పశువులను మేపుకుంటున్నారు. మిట్ట మధ్యాహ్నమయింది. ఎండ మాడ్చి వేస్తోంది.
అందరకీ ఆకలి వేస్తోంది. ఇక రండర్రా, చల్దులు తిందాం, అని గోపాలుడు గోపాలురను కేకేసి ఎలా పిలుస్తున్నాడో చూడండి
:
ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా
విలంబింపఁగా
రండో బాలకులార ! చల్ది గుడువన్ రమ్య
స్థలంబిక్కడీ
దండన్ తేగలు నీరు ద్రావి యిరువందం
బచ్చికల్ మేయుచుం
దండబై విహరించు చుండగ నమంద ప్రీతి
భక్షింతమే
ఎండలో మ్రగ్గి పోయారు. ఆకలితో ఉన్నారు. ఇంకా
ఆలస్యం చేయడమెందుకు? ఓ
బాలకులారా, రండి
! మనం
చల్దులు తినడానికి ఇక్కడ ఈ చోటు చాలా మనోహరంగా ఉంది. ఇక్కడ లేగ దూడలు
నీళ్ళు త్రాగి, ఈ
చుట్టు ప్రక్కల గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. ఈ అందమయిన స్థలంలో చల్దులు
తిందామా?
గోపాలుని పిలుపుతో గోపాలురంతా బిలబిలా
అక్కడికి చేరారు. కృష్ణుని చుట్టూ వలయంగా కూర్చుని చల్దులు ఎలా తిన్నారో చూడండి:
జలజాంత స్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై
యున్న రే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁగూర్చుండి
వీక్షింపుచున్శిలలుం బల్లవముల్ దృణంబులు, లతల్ , చిక్కంబులున్,
బువ్వు లాకులు
కంచంబులుగాభుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా !
పద్మంలో ఉండే కర్ణిక (బొడ్డు) చుట్టూ ఉండే రేకుల
లాగ, కృష్ణుని చుట్టూ
వలయాకారంగా అతనినే
చూస్తూ కూర్చున్నారు గోపాలురు. తర్వాత, ఇళ్ళ నుంచి తెచ్చుకున్న చిక్కాలు విప్పి, చల్దులు తినడం మొదలెట్టారు. శిలలు,
చిగుళ్ళు, గడ్డి, లతలు, చిక్కాలు, పువ్వులు, ఆకులు మొదలయిన వాటిని కంచాలుగా చేసుకుని గోపార్భకులు
చల్దులు ఆరగించారు.
ఇలా చల్దులు తినే ఆ పిలకాయల సరదాలూ,
కోణంగితనాలూ పోతన ఎంత
మనోఙ్ఞంగా వర్ణించాడో చూడండి:
మాటి మాటికి వ్రేలు మడచి యూరించుచు
నూరు గాయలు దినుచుండు నొక్క
డొకని కంచము లోని దొడిసి చయ్యన మ్రింగి
చూడు లేదని నోరు సూపు నొక్క
డేగురార్గుర చల్దు లెలమిఁబన్నిదమాడి
కూర్కొని కూర్కొని కుడుచు నొక్కొక
డిన్నియునుఁదగ బంచి యిడుట నెచ్చెలి
తనమనుచు బంతెన గుండు లాడు నొకడు
కృష్ణుఁజూడు మనుచుఁగికురించి పరు మోల
మేలి భక్ష్య రాశి మెసఁగు నొకఁడు
నవ్వు నొకఁడు సఖుల నవ్వించు నొక్కడు
ముచ్చటాడు నొకఁడు మురియు నొకడు
మాటి మాటికి వేలు ముడిచి ప్రక్క వారిని
ఊరిస్తూ ఒకడు ఊరగాయలు తింటూ ఉంటాడు.ప్రక్క వాడి కంచం లోనుండి కొంత చల్ది లాక్కుని
గుటుక్కున మ్రింగి వేసి, అబ్బే,
నేను తిన లేదు
కావాలంటే చూసుకో ! అని, నోరు
చూపిస్తాడు ఒకడు.
పందెం కట్టి ఐదారుగురి చల్దులను
కూరుకుని కూరుకుని మరొకడు తింటున్నాడు.ఇంకొక గోప బాలకుడు, ఒకరిదొకరం పంచుకుని తినడం స్నేహ
లక్షణం అంటూ నచ్చ చెబుతూ తింటున్నాడు.అదిగో, చూడు ! కృష్ణుడు, అంటూ చూపు మరలించి, ప్రక్క వాని కంచం లోని చల్దులలో మేలైన
భక్ష్య రాశిని వాడు చూడకుండా లాక్కుని తింటున్నాడు వేరొకడు .ఒకడు నవ్వుతాడు. మరొకడు నేస్తులను నవ్విస్తున్నాడు.
ఇంకొకడు ఏవో ముచ్చటలు చెబుతున్నాడు. మరొకడు మురిసి
పోతున్నాడు.
ఇలా నెచ్చెలి కాండ్రతో చల్దులు కుడిచే
గోపాలుడు ఎలా ఉన్నాడంటే,
కడుపున దిండుగాఁగట్టిన వలువలో
లాలిత వంశ నాళంబుఁజొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును
జాఱి రానీక డా చంక నిఱికి
మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద
డాపలి చేత మొనయ నునిచి.
చెల రేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు
వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి
సంగిడీల నడుమఁజక్కనఁగూర్చుండి నర్మ
భాషణముల నగవు నెఱపి,
యాగ భోక్త కృష్ణుఁడమరులు వెఱగంద శైశవంబు
మెఱసి చల్ది గుడిచె.
కృష్ణుడు నడుము చుట్టూ దట్టీ కట్టు కున్నాడు.
దానిలో తన వేణువును ఏటవాలుగా దూర్చాడు. కొమ్ము బూరా, చేతి కర్ర - ఈ రెండింటినీ జారి పోకుండా
ఎడమ చంకలో ఇరికించి
పట్టు కున్నాడు. మీగడ పెరుగుతో కలిసిన చల్ది ముద్ద ఎడమ చేతిలో పట్టు
కున్నాడు. ఇంటి దగ్గర అల్లరి చేసి కొసరి కొసరి కట్టించు కొని, వచ్చిన ఊరుగాయ ముక్కలను కుడి చేతి వ్రేళ్ళ
సందులో ఇరికించి పట్టుకున్నాడు.సంగడీల నడుమ కూర్చున్నాడు. చక్కగా వారినందరినీ
నవ్విస్తున్నాడు. అతడు యాగ భోక్త. అట్టి నల్లనయ్య బాల్య క్రీడలతో ఒప్పుతూ నెచ్చెలి కాండ్ర
మధ్య కూర్చుని చల్దులు ఆరగిస్తూ ఉంటే, నింగిని దేవతలందరూ నివ్వెర పోయారు. ఆ
దేవ దేవుని శైశవ
క్రీడలను తన్మయులై చూస్తున్నారు.
ఇదీ చల్ది కథ. చల్దన్నం గురించి ఇంత ఉందా చెప్ప డానికి
?! అంటే, ఉంది మరి !
తవ్విన కొద్దీ తరగని నిధి కదా, మన సాహితీ సంపద !
స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి