10, జులై 2015, శుక్రవారం

మీకెప్పుడయినా ఇలాంటి ( పీడ ) కల వచ్చిందాండీ ? !


కింవాససైవం న విచారణీయం ,
వాస: ప్రధానం ఖలు యోగ్యతాయా:
పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం
దిగంబరం వీక్ష్య విషం సముద్ర:

‘నాకు బట్టల మీద అంత శ్రద్ధ లేదండీ, అయామ్ వెరీ సింపుల్. ’ అంటారు కొందరు కించిద్గర్వంగా. మేచింగుల కోసం , బట్టల సెలక్షన్ కోసం ఆడవాళ్ళు వెచ్చించే సమయం అంతా యింతా కాదు. గణితం వేస్తే గుండె

తరుక్కు పోతుంది. కొందరు మగవాళ్ళూ దీనికి మినహాయింపు కాదు. ఈ శ్లోకం గురించి చెప్పుకునే ముందు ఆ మధ్య నా కొచ్చిన గమ్మత్తయిన కల గురించి చెబుతాను వినండి. ఆ కల రావడం నిఝ్ఝంగా నిఝం సుమండీ ...
ఏదో ఓ మహా పట్టణంలో రోడ్డు మీద నడుస్తున్నాను. ఓ బట్టల షాపు ముందు పేద్ధ బోర్డొకటి కనిపించింది. దానిమీద ఏం రాసుందో నాకు మెళకువ వచ్చేక కూడా అక్షరం పొల్లు పోకుండా గుర్తుంది. చూడండి ...

రండి ! రండి !
యువకులారా ! యువతుల్లారా !

దయ చేయండి. మా వద్ద చిరిగినవీ, లెక్క లేనన్ని మాసికలు వేసినవీ, అట్ట కట్టి అలుగ్గుడ్డలా ఉన్నవీ, వెలిసి పోయినవీ, చీకి పోయినవీ, మీరే లెక్క పెట్టడానికి విసుక్కునేటన్ని జేబులు కలవీ అయిన రక రకాల కొత్త జీన్ ఫేంట్లు సరి కొత్త స్టాక్ వచ్చింది. త్వర పడండి. జీబురు గడ్డం వాళ్ళకీ, తల మాసిన వాళ్ళకీ , నిక్క బొడుచుకున్న తల వెండ్రుకలు కలవారికీ ప్రత్యేక డిస్కౌంటు కలదు. ఆలసించిన ఆశా భంగం ...

మరో క్షణంలో అక్కడ చేరిన వేలాది మంది కుర్రాళ్ళని కంట్రోలు చేయ లేక పోలీసులు లాఠీ చార్జి చేయడం జరిగింది. బాష్పవాయు ప్రయోగం కూడా జరిగింది. కుమ్ములాటలో అంతా కకావికలై పోయేరు. చాలా మందికి గాయాలయ్యాయి. నానా  గలాభా  జరిగిందక్కడ. ఆ వింత చూస్తున్న నా నుదుటి మీద కూడా ఓ దెబ్బపడడంతో మెళకువ వచ్చింది. ( మెలకువ వచ్చేక తెలిసింది. తలకి మంచం కోడు తగిలిందని )

ఇది సరదాకి రాసింది కాదు. నమ్మక పోతే నేనేం చేయను ? త్వరలో ఇలాంటి (పీడ) కలలు
మీకూ రావాలని ఉడుకుమోతుతనంతో శపించడం తప్ప ?

ఇక, శ్లోకం చూదాం ...

ఎలాంటి బట్టలు కట్టుకుంటేనేం అని అనుకోడం తగదు సుమా అని కవి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే, లోకం లో ఒక మనిషి యోగ్యతను అతను వేసుకున్న బట్టలను బట్టే నిర్ణయించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

క్షీర సాగర మథనం జరిగేటప్పుడు శ్రీ మహా లక్ప్మితో పాటు, కాలకూట విషం కూడా పుట్టిందని తెలిసిన విషయమే కదా ? అయితే, సముద్రుడేం చేసాడో చూడండి ...
పీతాంబరధారికి ( మహా విష్ణువుకి ) తన కూతురు రమని ఇచ్చేడు. దిగంబరుని (శివుడిని ) చూసి ఈ మొఖానికిది చాలునులే అన్నట్టుగా కాలకూట విషాన్ని ఇచ్చేడు.

లోకం ఇలా ఉందండీ బాబూ , ఏం చేస్తాం !

మహాత్మా గాంధీ ఓ సారి రౌండ్ టేబిలు సమావేశానికి గావంచా కట్టుకుని పై మీది కండువాతో వెళ్తే అక్కడ వాళ్ళతనిని పోల్చుకో లేక లోపలకి పోనివ్వకుండా తరిమేసారుట.
అప్పుడు గాంధీజీ మంచి సూటు బూటు వేసుకుని వస్తే ఆదరంగా లోపలికి పంపించేరుట. సరే, లోపలికి వెళ్ళాక, విందు మొదలయితే, గాంధీజీ ఆహార పదార్ధాలను తినడం మానేసి తొడుక్కున్న ఖరీదయిన కోటు మీద వేసుకోడం మొదలెట్టారుట. ఇదేం పిచ్చి పని అని అందరూ విస్తుపోతే  ఇక్కడికి రమ్మని ఆహ్వానం పంపింది నా కోటుకే కాని, నాకు కాదు కదా ! దాని విందు నేనెలా తింటాను ? అనడిగారట. అక్కడి అధికారులకి కొంచెం ఆలస్యంగా ట్యూబు లైటు వెలిగి, మహాత్ముని క్షమాపణలు వేడుకున్నారుట. ఈ కథ నిజమో కాదో కాని, చిన్నప్పుడు మా డ్రిల్లు మాష్టరు (ఆటలాడించడం మానీసి మరీ ) కథలు కాకరకాయలు చెప్పేటప్పుడు దీనిని మాకు చెప్పారు. 

ఈ కథలో గాంధీకి బదులు ఈశ్వర చంద్ర విద్యా సాగర్ అని సరిచేసుకోవాలని మిత్రులు  శ్రీ ఫణీంద్ర రామ కుమార్ వ్యాఖ్యలో చెబుతున్నారు. వారికి నా ధన్యవాదాలు !
  శ్లోక సందర్భానికి సరి పోతుందనిపించి చెప్పానంతే ...
(ఇక్కడ పొందుపరచిన కార్టూన్ గీసిన  వ్యంగ్య చిత్రకారునికి వందనాలు. పాపం, అతనికీ ఇలాంటి పీడ కల ఏదో వచ్చి ఉంటుంది ! )


కామెంట్‌లు లేవు: