అమ్మ కథలు చెబుతుంది. అమ్మమ్మ కథలు చెబుతుంది. తాతయ్య కథలు చెప్పడమే కాదు చక్కని చిన్న చిన్న పద్యాలూ, శ్లోకాలూ కూడా చెబుతాడు. నాన్న కథలు చెప్పరు, కానీ, కథలు రాస్తారుట ! నేను చదవ లేదనుకోండి ... పెద్దయితే చదువుతానులే.
అంచేత, నాకూ కథ రాయాలనిపించింది. వెంఠనే పెన్సిలు తీసుకుని నోటు పుస్తకంలో గబగబా రాసీసేను.
కథ పేరు : దొంగ గారు
అనగనగనగా నేమో ఒక ఇల్లు. అందులో అమ్మా, నాన్నా, అక్కా, నేనూనూ.
ఒక రాత్రేమో అమ్మా వాళ్ళింటికి, అంటే మా ఇంటికే లెండి ఒక దొంగ గారు వచ్చేరు. అంతా బజ్జుని ఉన్నాం.
దొంగ గారు మా ఇంటిలో డబ్బూ బంగారఁవూ అదీ పట్టుకు పోడానికి వచ్చేరన్న మాట.
అందరం లేచి దొంగ గారిని చూసేం. దొంగ గారు కూడా మమ్మల్ని చూసేరు.
‘‘ దొంగ గారూ, దొంగ గారూ ! మా ఇంటిలో కొంచెమే డబ్బు లున్నాయి. మా చిట్టికి పుస్తకాలూ, రంగు పెన్సిళ్ళూ అవీ కొనాలి. మా డబ్బులు పట్టుకు పోవద్దండీ ’’ అని, నాన్న దొంగ గారితో అన్నారు.
అమ్మేమో, ‘‘ చిట్టి పాపకి బోర్నవిటా, నూడిల్సూ, పుట్టిన రోజుకి బుట్టల గవునూ అవీ కొనాలి. మా కొంచెం డబ్బుని మీరు పట్టుకు పోవద్దూ ’’ అనంది.
అక్కేమో,‘‘ చిట్టి పాపకి రిబ్బన్లూ, జడ పిన్నులూ కొనాలి. మా ఇంట్లో కొంచెమే డబ్బులున్నాయి. తీసుకు పోవద్దూ, ప్లీజ్ !’’ అంది.
దొంగ గారు విన లేదు. ‘‘ మా చిన్నబ్బాయికి బువ్వ పెట్టాలి. నా దగ్గర డబ్బుల్లేవు. అందుకే మీ కొంచెం డబ్బుని తీసుకు పోతాను’’ అన్నాడు కోపంగా.
అప్పుడు నేనేమా ధైర్యంగా దొంగ గారి దగ్గరకి వెళ్ళి, ‘‘ దొంగ గారూ, దొంగ గారూ ! మరేమో, మా అమ్మ రోజూ దేవుడికి పూజలు చేస్తే, దేవుడు మాకు కొంచెం డబ్బులు యిచ్చేడు. ఇంకా ఎక్కువ పూజలు చేస్తే యింకా ఎక్కువ డబ్బులు యిస్తాడన్న మాట.
మరందు చేత మీరు కూడా ఆంటీకి చెప్పి దేవుడికి ఎక్కువ పూజలు చేయమని చెప్పండి. దేవుడు మీకూ బోలెడు డబ్బులు ఇస్తాడు. మా కొంచెం డబ్బులు ఇప్పుడు తీసుకు పోకండేం ... దేవుడు మీకు చాలా డబ్బులు యిచ్చేక ఆంటీకీ,తమ్ముడికి మంచి బువ్వ పెట్టొచ్చును. మీరు కూడా ఈ మురికి బట్టలు మానీసి మంచి బట్టలు కుట్టించుకో వచ్చును...’’ అన్నాను.
దొంగ గారు నాముఖంలోకి చూసి, నా దగ్గరకొచ్చి. నాబుగ్గ మీద ముద్దు పెట్టీసుకున్నారు.
మరింక మా కొంచెం డబ్బులు తీసుకు పోకుండానే వెళ్ళి పోయేరు.
****** ***** ***** ***** ***** ***** *****
నాన్న నేను రాసిన ఈ కథ చదివి, అమ్మకు చూపించేరు. అమ్మ కూడా చదివింది. ఇద్దరూ ఎందుకో చాలా సేపు పడి పడి నవ్వేరు.
తరవాత నాన్న అన్నారూ : ‘‘ కథ బావుందమ్మా ,,, కానీ దొంగని దొంగ గారూ, దొంగ గారూ అని ఎందుకు రాసేవు. దొంగ అనో, దొంగ వెధవ అనో రాయొచ్చు కదా ? అలా రాయలేదేం ?’’ అనడిగేరు.
అందుకు నేను చెప్పేనూ : ‘‘అమ్మో ! నాకు బయ్యం ! ...’’
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి