18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

కప్పల కథ !ఎన్నికల వేళ దేశంలో, మరీ ముఖ్యంగా మన   రాష్ట్రంలో రాజకీయాలు చూస్తూ ఉంటే, కప్పల కథ రాయాలనిపించడం యాదృచ్ఛికమేమీ కాదని మనవి చేస్తున్నాను.
లోగడ కథా మంజరిలో చెప్పుల కథ రాశానా ? ఇప్పుడు కప్పల కథ రాస్తే తప్పేఁవిటని అనిపించి రాస్తున్నాను. 
ముందుగా మన ఆనవాయితీ ప్రకారం కప్ప అనే అర్ధాన్నిచ్చే పదాలు ఇంకా ఏమేం ఉన్నాయో చూదాం ...
అజంభము, అజిరము, అజిహ్వము,అనిమకము,అనూపము, అలిమకము,కృతాలయము,
చలికాపు, సూచకము, దుర్దురలము,దాటరి. ప్లవము, భుకము,మండూకము లాంటి చాలా ఉన్నాయి కానీ అంత ఆయాసం మనకొద్దు.  అన్నట్టు హరి అనే పదానికి విష్ణువు అనే అర్ధంతో పాటూ కప్ప  అనే అర్ధం కూడా ఉందండోయి !
కప్పల్లో బావురు కప్ప, బాండ్రు కప్పచిరు కప్ప అని   చాలా రకాలు  కనిపిస్తాయి.
తెలుగు సాహిత్యంలో కప్పల గురించిన ప్రస్తావన వచ్చిన తావులు ఒకటి రెండు విన్నవిస్తాను ...
ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడు బంధువులు వత్తు రది ఎట్లన్నన్
తెప్పలుగ చెఱువు నిండిన
కప్పలు పది వేలు చేరు కదరా సుమతీ !
అంటాడు సుమతీ శతకకారుడు బద్దెన. మరంతే ... మన దగ్గర సొమ్ముంటే ఎక్కడెక్కడి వాళ్ళూ బంధువుల మంటూ వచ్చి చేరుతారు. చెఱువు నీటితో కళకళలాడుతూ ఉంటే వేలాదిగా కప్పలు వచ్చి చేరుతాయి కదా, అలాగన్నమాట.

మరో పద్యం చూడండి ...
సరసుని మానసంబు సరస ఙ్ఞుఁడెఱుంగును, ముష్కరాధముం
డెరిఁగి గ్రహించు వాఁడె ? కొలనేక నివాసముగాఁగ దుర్దురం
బరయఁగ నేర్చు నెట్లు వికజాబ్జమరంద సౌరభో
త్కరము మిళింద మొందు క్రియ దాశరథీ ! కరుణాపయోనిథీ !

ఈ పద్యం కంచెర్ల గోపన్న రచించిన దాశరథీ శతకం లోనిది.   దుర్దురము (కప్ప ) ఉండేదీ, కమలం ఉండేదీ కూడా కొలను లోనే ! కానీ, ఆ కమలంలో ఉండే తేనెని  తుమ్మెద మాత్రమే ఆస్వాదిస్తుంది కానీ ప్రక్కనే ఉండే కప్పకి దాని మాధుర్యం తెలయదు కదా !అలాగే సరసుని మనసు పరసుడే తెలిసికో గలుగుతాడు అని దీని భావం. ఇందులో కప్ప ప్రస్తావన వచ్చి నప్పటికీ ఆ ప్రస్తావన దాని గౌరవం ఇనుమడించేలా మాత్రం లేదు పాపం ...

వెనుకటికి ఓ అవధాని గారికి  ‘‘ కప్పని చూచి పాము గడగడ వణికెన్ !’’ అని వో సమస్య నిచ్చేరుట. దానిని అవధాని   తెలివిగా, కిర్రు చెప్పులు వేసుకుని,  కర్ర పట్టుకుని, పొలం కాపునకు వచ్చిన రైతు     వెంకప్ప  (వెం –కప్ప) ను చూచి అక్కడ  వో పాము గడగడా వణికిందని  సమస్యాపూరణం చేసారు. మేకల్ని చూసి పులులూ , కప్పల్ని చూసి పాములూ ఎక్కడయినా భయ పడతాయా, మన వెర్రి గానీ !

నిజఁవే ... కప్పని చూస్తే జాలేస్తుంది. పరిశోధనల పేరిటా, పరీక్షల పేరిటా రోజూ కళాశాలల్లో ఎన్ని కప్పలు దారుణంగా చంపి వేయ బడుతున్నాయో కదా ... ఇలా కప్పలకి మనుష్య జాతి వలన పీడ  ఉండగా సర్ప జాతి వలన ప్రాణగండం ఎలానూ ఉంది. పాములు కప్పలు దొరికితే మహదానందంగా చప్పసరించేస్తాయి మరి ... కడుపు నిండి కప్పలు తిన్న పాము కదలకుండా నిబ్బరంగా పడుంటుందిట. కప్ప తిన్న పాములా కదలకుండా   ఎలా ఉన్నాడో చూడూ అనడం  లోకంలో వొక వాడుక.

శ్రీ.శ్రీ గారు వో గేయంలో ఘూకం కేకా ,,, భేకం బాకా అన్నారు. ఈ విధంగా ఆధునిక కవిత్వం లో కూడా కప్ప ప్రస్తావన వొచ్చిందని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

ఆత్రేయ గారయితే ఏకంగా కప్పలు అనే వొక ప్రసిద్ధమయిన నాటికనే రాసి పడీసేరు.
నూతి లోని కప్పలు అనే దానికి లోకం తెలియని మూర్ఖులు అని అర్ధం,
కప్పదాట్లు అంటే  తెలుసు కదా ?  నడకలోనో, పరుగులోనో మధ్యలో ఓ దాటు వదిలేసి అడుగులెయ్యడం. కొంత మంది తమ ప్రసంగంలో ఎంతకీ అవసరమయిన విషయాన్ని చెప్పకుండా  తప్పించు కోడానికి ప్రసంగంలో కప్పదాట్లు వేయడం కద్దు.  సమయం వచ్చి నప్పుడు వాడి బండారమంతా బయట పెడతాను ! అని అప్పటికా ప్రస్తావనని దాట వేసే కప్ప దాట్ల రాజకీయ నాయకులని చూసేం కదా ... కప్ప గెంతులు అనే ఆట ఆడపిల్లలకి చాలా ఇష్టమయిన ఆట వెనుకటి రోజుల్లో. ఇవాళ మన చిన్నారి పాపలకి ఈ ఆట ఆడుకోడానికి కంప్యూటర్ లో కప్పగెంతులు ఆట ఉందో లేదో నాకు తెలియదు.

కప్పదాట్లనే సంస్కృతీకరిస్తే మండూక ప్లుతి న్యాయం  అవుతుంది.

సంగీత రాగాలలో కూడా దాటు గతి   అని వొకటుందని చెబుతారు. ఇలాంటిదే కాబోలు. కానయితే దానికి మంచి గౌరవస్థానం ఉంది.

ఉపనిషత్తులలో మండూకోపనషత్తు ఉంది. దాని వివరాలు తెలిసిన పెద్దలు చెప్పాలి. నా లాంటి అల్పఙ్ఞుడికేం తెలుస్తుంది చెప్పండి ?

కప్పల తక్కెడ అని ఓ జాతీయం. తక్కెడలో కప్పలని ఉంచి తూకం వేయడం ఎవరి తరమూ కాదు. అవి వొక చోట స్థిరంగా ఉంటే కదా ?  ( మన రాజకీయ పార్టీ నాయకుల్లాగ ! )

అప్పాలు కప్పలుగా మారిన వైనం వెనుటి రోజులలో ఓ తెలుగు సినిమాలో చూసి తెగ నవ్వుకున్నాం గుర్తుందాండీ ?
‘‘కరవమంటే   కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం ’’అనే మాట విన్నారు కదూ ? కప్ప కరవడమేఁవిటి పాపం ... అందుకే కదా, ‘‘కప్ప కాటు లేదు, బాపన పోటు లేదు ’’అనే సామెత పుట్టిందీ ?
‘‘కప్పలు అరుస్తూనే ఉంటాయి, దరులు ( గట్లు) పడుతూనే ఉంటాయి ’’అనేది మరో సామెత.
‘‘కప్పలు ఎఱుగునా కడలి లోతు’’ అని కూడా మరో సామెత ఉంది.

వీటి మాటకేంగానీ,‘‘ కప్పలు అరిస్తే కుప్పలుగా వాన పడతుంది’’ అని వో సామెత ఉంది.
కప్పల పెళ్ళి చేస్తే జోరుగా వానలు పడతాయని మన వారిలో వో నమ్మకం ఉంది.
కప్పల బెక బెకలు పుష్కలమైన నీటి తావులకి చక్కని సంకేతాలు.  ( ట ! )
తాళం కప్పలో కప్పకీ మనం చెప్పు కుంటున్న కప్పకీ ఏఁవయినా సమ్మంధం ఉందో, లేదో ఆలోచించాలి ...

బాల సాహిత్యం లోనూ. జానపద సాహిత్యం లోనూ చాలా కప్పల కథలు కనిపిస్తూ ఉంటాయి.  కప్పలు అందమైన రాజకుమారిగా మారి పోవడమో, లేదా యువరాణి ముని శాపం చేత కప్పగా మారి పోవడమో  ... ....ఇలాంటి కల్పిత కథలు  చాలానే కనిపిస్తాయి.
ఇంతటితో కప్పల కథకి స్వస్తి !

బెక !  బెక !!  బెక !!!