10, మార్చి 2016, గురువారం

మా తమిళ నాడు యాత్రావిశేషాలు ... Day 01

మా తమిళ నాడు యాత్రా విశేషాలు ...  Day 01

చెన్నై లోని టూరిజమ్ వారి ఆఫీసు నుండి  27-02-2016 శనివారం ఉదయంబస్ 7.45 గం.లకి
బయలు దేరాక, గంట ప్రయాణం తరువాత TTDC  వారి హొటల్ దగ్గర బస్ ఆగింది.
టిఫిన్ లు అయ్యేక, తిరిగి బయలు దేరింది. పాండిచ్చేరికి ప్రయాణం. పాండిచ్చేరి పది పన్నెండు
కి.మీ దూరంలో ఉందనగా, మా గైడ్  బస్సు లోనుంచే 2004లో వచ్చిన పెను ఉప్పెనకు
గురయిన ప్రాంతాలను చూపించేడు. అవన్నీ మొత్తం ధ్వంస మయ్యాయిట. కానీ ఆ ఆనవాళ్ళేమీ
ఇప్పుడు కనిపించవు. ప్రజల సహకారంతో ప్రభుత్వం నిర్మించిన కొత్త కాలనీలు, వందలాది యిళ్ళు
కనిపిస్తాయి. వొక శ్మశాన వాటికలాంటి ప్రదేశాన్ని అనతి కాలంలోనే నందనోద్యానంగా మార్చిన
ప్రభుత్వం వారి కృషి, చిత్త శుద్ధి ఆనందం  కలిగిస్తుంది.

బస్ 9గటలకి పాండిచ్చేరి చేరింది. దీనినే పుదుచ్చేరి అని కూడా వ్యవహరిస్తారని తెలిసినదే కదా.
 పుదుచ్చేరి చాలా అంద మయిన పట్టణం. ఇది కేంద్ర పాలిత  ప్రాంతం. పుదుచ్చేరి వైశాల్యం 293 కి.మీ.లు.
 బంగాళా ఖాత తీరంలో తమిళ నాడు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉంది. మన ఆంధ్ర ప్రదేశ్ లో అతర్భాగంగా
 కేంద్ర  పాలిత ప్రాంత మయిన యానాం ఉంది. వొకటి రెండు పర్యాయాలు వెళ్ళాను. అది కూడా పాండిచ్చేరి
లాగే అంద మయిన ప్రాంతం. పాండిచ్చేరిలో విశాల మయిన అంద మయిన బీచ్ కనుల పండువు చేస్తుంది.
1673లో ఫ్రెంచి వారు ఇక్కడ ఈస్టిండియా కంపెనీ అనే వర్తక స్థావరం ఏర్పాటు చేసుకుని ఈ ప్రాతాన్ని
స్వాధీన పరుచు కున్నారు.
మాతృ భాష తమిళంగా కలిగి, ఇప్పటికీ ఫ్రెంచి వారసత్వం కలిగిన  చాలా మంది ఇక్కడ ఉంటున్నారు.
పూర్వం ఇక్కడ అగస్త్య ముని ఆశ్రమం ఉండేదిట. అరవిందుడు, ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి
నడయాడిన చోటు యిది.
పుదుచ్చేరిలోసముద్రపు అలలు నగరం లోనికి చొచ్చుకు రాకుండా  27 అడుగుల కరకట్ట నిర్మించారు.
 2004 లో వచ్చిన పెను ఉప్పెన నుండి పుదుచ్చేరి నగరాన్ని కాపాడినది ఈ కరకట్టేనట! ఆఉప్పెనలో
దాదాపు 24 అడుగుల ఎత్తు వరకూ అలలు విరుచుకు పడ్డాయిట.ఈ కరకట్టే కనుక లేక పోతే, ఆ రోజు
పాండిచ్చేరి సముద్ర గర్భం లో కలిసి పోయి ఉండేది!

పుదుచ్చేరిలో మొదట వినాయక గుడిని దర్శించు కున్నాం. ఆ విధంగా మా యాత్ర వినాయకుని
 దర్శనంతో మొదలయిందని చెప్పాలి! తదనంతరం ఏ విఘ్నాలూ లేకుండా యాత్ర పూర్తవడానికి ఇది
దోహద పడిందనవచ్చు. ఈ వినాయక గుడి పాతదే అయినా, ఇటీవల కాలంలో ఆధునీకరించి చాలా
అందంగా రూపొందించినట్టు కనబడుతోంది.విశాలంగా ఉంది. ఇక్కడ అందమయిన  రంగులతో  లెక్క లేనన్ని
 భంగిమలతో వినాయకుని బొమ్మలు ఉన్నాయి. తరువాత అరవిందాశ్రమం చూసాం. అరవిందుని
స్మృత్యర్థం నిర్మించిన వొక పవిత్ర మయిన, ప్రశాంత మయిన ఆధ్యాత్మిక అధ్యయన కేద్రం అది.
అక్కడ అరవిందుని పుస్తక భాండాగారం, వారు వినియోగించిన వస్తువులు, స్వాతంత్ర్య సమర ఘట్టానికి
చెందిన ఫొటోలు మొదలయినవి భద్ర పరిచేరు.
అరవిందాశ్రమం చూసాక కొంత సేపు బీచ్  లో గడిపేం. చాలా పొడవయిన బీచ్ ఇది. కనుచూపు
మేర  సముద్రమే.కరకట్ట అవతల అలలు కనుల పండువుగా ఉంటాయి.ఉత్సాహం ఉంటే, కరకట్ట
అవతల బండ రాళ్ళను దాటుకుంటూ అలల వరకూ వెళ్ళ వచ్చును.
 పాండిచ్చేరిలో వీధులన్నీ ఎక్కడా వంపులు లేకుండా తిన్నగా తీర్చి దిద్దినట్టు ఉన్నాయి.
ఇళ్ళు కూడా ఫ్రెంచి వారి కట్టడాల శైలిలో అందంగా  కనిపిస్తాయి. పరిశుభ్ర మయిన ప్రశాంత
 మయిన నగరం.
సరే, పాండిచ్చేరి అందాలనుమనసు పొరలలో నిక్షిప్తం చేసు కుంటూ బస్ ఎక్కాము.
మధ్యాహ్నం  1.30 అవుతూ ఉండగా కడలూరు అనే చోట భోజనాలకి బస్ ఆగింది. ఈ భోజనాల
ఖర్చు  మాదే, భోజనం  చాలా బాగుది. 95 రూ.లకి అంత మంచి భోజనం దొరకడం అదృష్టమే.
అందరం లంచ్ తీసు కోవడం అయ్యాక తిరిగి బస్ బయలు దేరింది. సాయంత్రం 2.30 గంటలకి
పిచ్చవరం చేరింది. ఇదొక అంద మయిన టూరిష్టు ప్లేసు.ఇక్కడ ఎన్నో తమిళ, తెలుగు చిత్రాల
చిత్రీకరణ జరుగుతూ ఉంటుందిట. ఈ బ్యాక్ వాటర్స్ లో తెడ్డు వేసి నడిపే పడవలో వెళ్ళి రావాలి.
మర పడవలు కూడా ఉంటాయి, గంట, రెండు గంటలు, మూడు గంటలు ఇలా మనకి నచ్చిన
సమయం పడవలలో గడిపి రావచ్చును. ఒక్కో దానికీ ఒక్కో రేటు. మేమూ, మురళీ కృష్ణ
కుటుబ సభ్యులు ముగ్గురూ కలిసి మొత్తం ఐదుగురం వొక గంట తిరిగి రావడానికి టిక్కెట్లు
తీసు కున్నాము. ఒక్కొక్కరికీ రూ 63 చొ.నఅయిది. వారిచ్చిన  లైఫ్ జాకెట్ లు తప్పకుండా వేసు
కోవాలి. అవే మంత పరిశుభ్రంగా లేవనుకోండి. అయినా వేసుకోక తప్ప లేదు.ఆ ప్రాంతమంతా
బ్యాక్ వాటర్స్ లో మేంగ్రూ చెట్ల పొదలతో నిడి పోయి ఉంటుంది. అవి ఔషధ మొక్కలు.
గుబురుగా ఉండే ఆ చెట్లను దూరంగా చూస్తూ,వాటి ప్రక్కల నుండీ, క్రింద నుండీ పడవలో వెళ్ళి
 రావడంవొక అందమయిన అనుభవం!  దట్టమయిన ఆ అటవీ వృక్షాల వల్లనే ఆ ప్రాంతం
ఎన్నో తుఫానులనీ, ఉప్పెనలనీ ఎదుర్కొన గలిగినదని  చెబుతారు.
ఈ బోటు షికారుతో మాతొలిరోజు యాత్ర ముగియ లేదు. అక్కడి నుండి  బయలు దేరి సాయంత్రం
కోవెల తెరిచే వేళకి నాలుగు గంటలకి చిదంబరం చేరు కున్నాం.
చిదంబరం కడలూరు జిల్లాలో ఉంది. ప్రసిద్ధ శైవ క్షేత్రం. శివుడు ఆనంద తాడవం చేస్తూ నట రాజ
రూపంలో దర్శన మిస్తాడు. నేల, నీరు, నింగి,గాలి,అగ్ని అనే పంచ భూత లింగాలలో ఇక్కడ శివుడు
 ఆకాశ లింగ రూపంలో ఉంటాడు. ఆకాశం అంటే అంతటా వ్యాపించి ఉండేది కనుక ఆ ఆకాశ లింగం
లింగ రూపంలో ఖాళీ జాగాలో తెర మాత్రమే చూడ గలుగుతాం. శివుడు ప్రక్కన నటరాజ రూపంలో
 మాత్రమే  దర్శన మిస్తాడు.  అదే చిదంబర రహస్యం అని అంటారు. స్వామితో పాటు, శక్తి రూపిణి
 అయిన శివగామిని ప్రతిరూపగా డబల్లెని చూడగలం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ శైవ
క్షేత్రంలో గోవింద రాజ పెరియాళ్ కూడ తన దేవేరి పుడరీక వల్లీ సహితుడై కొలువై ఉండడం ! నూట ఎనిమిది విష్ణు క్షేత్రాలో ఇది ఒకటిట. స్థితి కారుడినీ, లయ కారుడినీ ఒకే  ఆలయంలో దర్శించు కోవడం చిదంబరం ప్రత్యేకతలలో ఒకటి.

పంచ భూత లింగాలు ఇవి:
1.        చిదంబరం  ...  నటరాజ స్వామి రూపంలో ...ఆకాశ లింగం
2.        కంచి ... ఏకాంబరేశ్వరుడు  ..  భూ లింగం
3.        జంబుకేశ్వరం  ... జల లింగం
4.        తిరువణ్ణామలై  ( అరుణాచలం)  .. అగ్ని లింగం
5.        శ్రీకాళహస్తి ... వాయు లింగం.
చిదంబరంలో మొత్తం 9 పెద్ద గాలి గోపురాలతో విశాల మయిన ప్రాకారంలో కట్టబడిన అతి ప్రాచీన మయిన శైవాలయం. అయితే ఇందులో నాలుగు గాలి గోపురాలు మరీ ప్రత్యేక మయినవి. వాడుకలో ఉన్నవి. ఇక్కడ రాతి గొలుసులు,పెద్ద పెద్ద స్తంభాలు  వారి శిల్ప కళా నిర్మితికి వొక చక్కని ఉదాహరణ.
చిదంబరం నటరాజ స్వామి దర్శనం చేసుకున్నాక, వో గంట సేపు అక్కడ గడిపి మా తొలి రోజు యాత్రలో చివరిదయిన వైథీశ్వరన్ కోయిల్ చేరు కున్నాం.

వైథీశ్వరన్ కోయల్ . చిదంబరం నుండి 27 కి.మీ. దూరంలో ఉంది.శివుడు వైథీశ్వరునిగా అవతరించాడు. పూర్వం వొక రాజు  కుష్ఠు రోగ పీడితుడై అంగారక పూజలు జరిపించగా రోగ విముక్తు డయ్యాడని ఐతిహ్యం. అతడే ఈ దేవాయం నిర్మించినట్టు చెబుతారు.
ఇక్కడ వెలిసిన వైథీశ్వరుడు ఆరోగ్య ప్రదాత అని అంటారు. ఈ ప్రాంతంలో
నాడీ వైద్యం ప్రముఖంగా చేస్తూ ఉంటారుట.
దీనితో మా 8 రోజుల తమిళ నాడు యాత్రలో మొదటి రోజు యాత్ర  సంతృప్తికరంగా ముగిసింది. బస్ టూరిజమ్ వారి హొటల్ కి చేరు కుంది. అక్కడే రాత్రి డిన్నర్ చేసాం.
హొటల్ వారి ఆతిథ్యం గురించీ, భోజనాల గురించీ చెప్పడం చర్విత చర్వణమే అవుతుంది.

మా రెండో  రోజుయాత్రా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. శలవ్.





















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి