13, మార్చి 2016, ఆదివారం

మా తమిళ నాడు యాత్రా విశేషాలు ...Day 5 (2-3-2016)

మా తమిళ నాడు యాత్రా విశేషాలు  ...Day 5 (2-3-2016)

ఉదయాన్నే తయారయి పోయేం. నిన్నఫెర్రీ సర్వీసులు రద్దు అయి పోవడం వల్ల వివేకా
నంద మెమోరియల్ రాక్ టెంపుల్ దగ్గరకు వెళ్ళ లేక పోయాం. ఇవాళయినా వీలవుతుందో లేదో
అనుకుంటూ,  సముద్రం మీద సూర్యోదయాన్ని చూడడానికి  నేనూ, మా ఆవిడా,
మురళీ కృష్ణ గారూ, రాధ గారూ, విజయ లక్ష్మి గారూ బయలు దేరాము.అప్పటికి ఉదయం
 ఐదవుతోంది.
ఇవాళ సూర్యోదయం 6.20కి జరుగుతుందని అక్కడ చెప్పేరు.  నేటి ఉదయం చూడ వలసి ఉన్న
 సుచీంద్రం నిన్న సాయంత్రమే చూసి రావడం వల్ల మా మధురై ప్రయాణానికి ఏమంత తొందర లేదు.
సూర్యోదయ సూర్యాస్తమయాలు చూడడానికి కట్టిన వలయాకారపు మెట్లున్న వ్యూపాయింట్
కట్టడం మా హొటల్ గదికి ఎదురుగా నడక దూరంలోనే ఉంది. అక్కడికి వెళ్తూ, దారిలో కాఫీలు
దొరికితే కావలసిన వాళ్ళం త్రాగేం. వ్యూపాయింట్ టిక్కెట్టు మనిషికి పది రూపాయలు.
టిక్కెట్లు తీసుకుని మీద అంతస్తుకి చేరు కున్నాం. అక్కడి నుండి మూడు వేపులా
సముద్రం అందంగా కనిపిస్తోంది. ఆ ఉదయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సముద్రపు గాలి
 మనసును ఉల్లాస పరుస్తోంది. మా దృష్టి అంతా  తూర్పు దిక్కు వేపే సారిచి ఆనందామృతాన్ని
 జుర్రు కోవాలని ఆసక్తిగా చూస్తున్నాం. చీకట్లు విడి పోయి, తెల తెలవారుతోంది. ఆకాశం క్రమేపీ రాగ
 రంజిత మవడం  చూదామనుకుంటున్న మాకు అవేళ ఆ కోరిక తీర లేదు! మబ్బులు అడ్డొచ్చాయి.
సూర్యోదయం చూడ లేక పోయేము.అయ్యో ! అనుకున్నాం. సూర్యోదయ వేళ దాటి పోయి,
అప్పటికే పావుగంట పైగా అయింది.మబ్బు రుమాలు ముఖాన కప్పుకుని మాతో దోబూచు
లాడడం తగునా ? ఎంత పని చేసావయ్యా, దినకరా !అనుకుంటూ వ్యూపాయింట్  నుండి దిగి
క్రిందకి వచ్చేము. ఇక ఫెర్రీ సర్వీసులు ఇవాళ ఉదయం ఉంటాయో, నిన్నటి  సాయంత్రంలాగే
 రద్దవుతాయో అనే శంకతో ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచించేము. హొటల్ రూముకి వెళ్ళే
పని లేదు కనుక, నేరుగా ఫెర్రీలు బయలుదేరే చోటికే వెళ్ళి వెయిట్ చేద్దాం అనుకున్నాం.
మేం అయిదుగురం ఫెర్రీలు బయలుదేరే చోటే ఉంటామని మా గైడ్ కి  ఫోన్ చేసి చెప్పేము.
మొదటి  ట్రిప్పు ఫెర్రీ 8.15 గంటలకి బయలు దేరుతుందిట. ఇకా చాలా టైముంది. అక్కడికి  చేరు
కున్నాము. అక్కడ ఫెర్రీ ఎక్కేందుకు క్యూ కనిపించి హమ్మయ్య! అనుకున్నాం. మురళీ కృష్ణ
గారు హిందూ పేపరు కొనుక్కుని వో షాపు మెట్ల మీద కూర్చుని పేపరు  చదువుకుంటూ గడిపేరు.
ఆడవాళ్ళు ముగ్గురూ అక్కడే వో షాపులో కుర్చీలు ఆక్రమించి కబుర్లు చెప్పుకుంటూ గడిపేరు.
నేను మరో కప్పు కాఫీ సేవించి అటూ యిటూ తచ్చాడుతూ గడిపేను. ఎనిమిదవుతూ ఉంటే మా
గైడ్ మిగిలిన వారిని వెంట పెట్టుకుని వచ్చేడు. ఫెర్రీ టిక్కెట్ల ఖర్చు టూరిజమ్ వారిదే కనుక
టిక్కెట్లుకొని మమ్మల్ని రాక్ టెంపుల్ దగ్గరకి బయలుదేర దీసాడు.

అందరం ఫెర్రీ ఎక్కేము. మురికి పట్టిన లైఫ్ జాకెట్లు వేసు కోవడం ఈ సారి కూడా తప్ప లేదు!
పది నిముషాల లోపే రాక్ టెంపుల్ కి చేరుకున్నాం. తిరువళ్ళవూర్ భారీ విగ్రహాన్ని దూరం నుండే
చూసేము. ఈ తమిళ కవి విగ్రహం133 అడుగుల ఎత్తుతో,ఏడున్నర టన్నుల బరువుతో
ఆసియాలోనే భారీ విగ్రహ మని చెబుతారు.
స్వామి వివేకానంద 1892 ప్రాంతంలో బారలు వేసుకుంటూ సముద్రాన్ని ఈది వెళ్ళి అక్కడి కొండ మీద
 ధ్యానం చేసుకునే వాడని నిన్నటి కథనంలోనే చెప్పేను కదా. స్వామి స్మృత్యర్ధంనిర్మించిన
ఈ రాక్ టెంపుల్ అందాలు  చూసి తీర వలసినదే. సముద్రపు హోరు, విసురు గాలి సమ్మోహన
 పరుస్తాయి. స్వామి ధ్యానం చేసిన చోటుని దర్శించు కున్నాము. మంద్ర స్వరంలో ఓంకారం
తప్ప మరే ధ్వను లూ విని పించని ఆ ధ్యాన మందిరంలో కొద్ది సేపు కళ్ళు మూసుకుని కూర్చున్నాము.
  ధ్యానం కుదరక పోయినా, అలా కూచోడం వల్ల వొక ప్రశాంత మయిన అలౌకికానుభూతి కలిగి మనసు
తేట పడిన భావన కలిగి నట్టనిపిస్తుంది.
రాక్ టెంపుల్ మీద స్వామి సాహిత్య గ్రంథాలు విక్రయించే షాపులు ఐదారు వరకూ ఉన్నాయి.
హాయి గొలిపే ఆ వాతా వరణాన్ని వదిలి రావాలనిపించక పోయినా, యింకా బ్రేక్ ఫాస్టు చేసి
మధురై వెళ్ళ వలసి ఉంది కనుక హొటల్ గదులకు చేరుకుని లగేజీలను బస్ డిక్కీలో చేర్పించి హొటల్
 లో టిఫిన్లు కానిచ్చేము. ఈ రోజు చూడ వలసిన సుచీద్రం నిన్ననే చూసి
రావడం వల్ల సమయం కలిసి వొచ్చి, టిఫిన్లయ్యేక తీరికగా 10 గంటలకి బస్ ఎక్కి మధురై బయలు
దేరాము.
2 గంటల ప్రాంతంలో తిరుమంగళమ్ అనే చోట లంచ్ చేసాము. ఈ ఖర్చు మాదే. లంచ్ తర్వాత
బయలు దేరి 3 గంటలకి మధురై చేరు కున్నాము.

అక్కడ ముందుగా నాయక రాజుల రాజ మహల్ చూసేము. మేం చూసిన మహలు అసలు
మహలులో నాలుగో వంతు మాత్రమేననీ తక్కిన రాజప్రాసాదాలు శిధిలం కావడంతో పర్యాటకులకు
అనుమతి లేదనీ తెలిసింది. మేం చూసినంత మట్టుకే రాచ మహలు చాలా గొప్పగా విశాలంగా ఉంది.
ఆ నిర్మాణ కౌశల్యం అధ్భుతం నిపిస్తుంది. పెద్ద పెద్దహాళ్ళూ, ప్రాసాదాలూ, సభా భవనాలూ, యక్ష గాన
 ప్రదర్శనల  వేదికలూ చక్కని వర్ణ చిత్రాలతో కనుల పండువు చేస్తూ ఉంటాయి.
ఇక్కడ ఒక్కో స్తంభమూ ముగ్గురు వ్యక్తులు చేతులు బారచాపి కొలిచినా చాలనంత చుట్టు కొలత
కలవి. రాజులు ఉపయోగించిన కొన్ని వస్తువులూ, కొన్ని శిల్పాలూ కూడా ప్రదర్శనకి ఉంచారు.
రాచ ప్రాసాదాలు చూసేక, మధురై లోని  మీనాక్షీ అమ్మ వారి దర్శనానికి బయలు దేరాము.

కంచి కామాక్షి తల్లిని లోగడ మూడు పర్యాయాలు దర్శించు కున్నాం, కానీ  మధుర మీనాక్షి అమ్మ
వారి దర్శనం ఇదే  మాకు మొదటి సారి. దీనితో కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి అమ్మ
వార్లను మేం దర్శించుకున్నట్టయింది. ఈ మూడూ అష్టాదశ శక్తి పీఠాలలోనివే.


మధురైలో మీనాక్షి అమ్మ వారి కోవెల భారత దేశం లోనే వొక అపూర్వ మైన కట్టడమని చెప్ప వచ్చును.
ఇక్కడి శిల్ప కళ, ఎత్తయిన గోపురాలూ వర్ణ శోభితమై లరారుతూ ఉంటాయి.
1600 ప్రాంతంలో కుల శేఖర పాండ్యుడనే పాండ్య రాజు దీనిని నభూతో న భవిష్యసి అనే రీతిలో
నిర్మిచాడు. 45 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ 14 గోపురాలతో ఈ ఆలయ నిర్మాణం ఉంది.  ఈ గోపురాలలో
ఎత్తయినది 170 అడుగులు కావడం విశేషం. ఇందులో రెండు గోపురాలకు బంగారు తాపడం చేసారు.
పసిడి వర్ణంతో అవి మెరిసి పోతూ ఉన్నాయి.
ఇక్కడ పరమ శివుడు సుందరేశ్వర స్వామి గానూ, పార్వతీ అమ్మ వారు మీనాక్షీ అమ్మ వారి గానూ
కొలవబడుతున్నారు.  ఆలయంలో గోడల మీద ఎక్కడా కొద్ది పాటి ఖాళీ కూడా లేకుండా చక్కని
శిల్పాలు,  వర్ణ చిత్రాలు ఉన్నాయి. తనివి తీరా ఆలయ దర్శనం చేసు కున్నాక, 6.30కి మధురై
లోని హొటల్ కి చేరు కున్నాము. లగేజీ హొటల్ గదులలో చేర్చుకుని, కాస్త విశ్రమించి, రాత్రి 8 గటలకి
టూరిజమ్ వారి హొటల్ లోనే డిన్నరు కానిచ్చేము.

మర్నాడు మా  6వ రోజు యాత్రలో భాగంగా విహార స్థల మయిన కొడైకెనాల్ కి ప్రయాణం.
ఆ ముచ్చట్లు చెప్పు కునే ముందు ఇప్పటికి శలవ్.



































  





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి